వద్దన్నా వినకుండా ‘సర్‌ప్రైజ్’ బర్త్‌డే పార్టీ.. కేసు పెట్టిన బాధితుడు.. నష్టపరిహారంగా రూ. 3.44 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశం

ఫొటో సోర్స్, Getty Images
వద్దన్నా వినకుండా తన బర్త్‌డే పార్టీ నిర్వహించారని కంపెనీపై కేసు నమోదు చేసిన వ్యక్తికి రూ. 3.44 కోట్లు నష్టపరిహారంగా లభించాయి.
అయితే, తన పుట్టినరోజు వేడుకను జరుపవద్దని ఆ వ్యక్తి ముందే కంపెనీ యాజమాన్యానికి చెప్పారు. పుట్టినరోజు వేడుక వల్ల తనకు ఒత్తిడి, ఆందోళన కలుగుతాయని ఆయన ముందే హెచ్చరించినప్పటికీ కంపెనీ యాజమాన్యం వేడుకను నిర్వహించింది.
2019లో 'గ్రావిటీ డయాగ్నస్టిక్స్' కంపెనీ జరిపిన పుట్టినరోజు వేడుక, తనలో వరుస 'ప్యానిక్ అటాక్స్ (తీవ్ర భయాందోళనలు)'కు కారణమైందని అమెరికాలోని కెంటకీకి చెందిన కెవిన్ బెర్లింగ్ అన్నారు.
వైకల్యం కారణంగా కంపెనీ, తనపై వివక్ష చూపించిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాము ఎలాంటి తప్పు చేయలేదని కంపెనీ వర్గాలు ఖండించాయి.
కెంటకీలోని కెంటన్ కౌంటీలో ఆయన దాఖలు చేసిన పిర్యాదు ప్రకారం... బెర్లింగ్, ఆందోళనకు సంబంధించిన రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. ఆఫీసులో తన పుట్టినరోజు వేడుకను జరుపవద్దని మేనేజర్‌ను బెర్లింగ్ కోరారు. సాధారణంగా కార్యాలయంలో అందరి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుక, తాను చిన్నతనంలో ఎదుర్కొన్న అసహ్యకరమైన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే అవకాశం ఉందని, భయాందోళనలను కలిగించవచ్చని, అందుకే తన బర్త్‌డేను నిర్వహించవద్దని బెర్లింగ్ కోరారు.
బెర్లింగ్ విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆయన కంపెనీ 2019 ఆగస్టులో సర్‌ప్రైజ్ బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేసింది. ఇది ఆయనలో ప్యానిక్ అటాక్‌కు దారి తీసింది. వెంటనే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన బెర్లింగ్, తన కారులోనే మధ్యాహ్న భోజనం చేశారు.
''మరుసటి రోజు సమావేశంలో బెర్లింగ్ నిందలు, విమర్శలు ఎదుర్కోన్నారు. సహోద్యోగుల సంతోషాన్ని అడ్డుకున్నాడని, చిన్నపిల్లాడిలా వ్యవహరించాడని బెర్లింగ్‌పై ఆరోపణలు చేశారు'' అని వ్యాజ్యం తెలుపుతోంది. ఈ ఉద్రిక్తపూరితమైన సమావేశం కారణంగా ఆయన రెండోసారి ప్యానిక్ అటాక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను ఇంటికి పంపించారు. ఆగస్టు 8, 9 తేదీల్లో ఇంటికే పరిమితమయ్యారు.
పని ప్రదేశంలో భద్రతకు సంబంధించిన ఆందోళనలను కారణంగా చూపిస్తూ ఆగస్టు 11వ తేదీన గ్రావిటీ డయాగ్నోస్టిక్స్ అయనను ఉద్యోగం నుంచి తప్పించింది.
వైకల్యం కారణంగా కంపెనీ తనపై వివక్ష చూపిందని, తన అభ్యర్థనను పరిగణించాలని అడిగినందుకు అన్యాయంగా కంపెనీ ప్రతీకారం తీర్చుకుందని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు.
మార్చిలో ఈ వ్యాజ్యంపై రెండు రోజుల విచారణ అనంతరం, జ్యూరీ ఆయనకు 4,50,000 డాలర్లు (రూ. 3.44 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇందులో ఆయన అనుభవించిన మానసిక క్షోభకు 3,00,00 డాలర్లు (రూ. 2.29 కోట్లు), కోల్పోయిన వేతనానికి 1,50,000 డాలర్లు (రూ. 1.14 కోట్లు) అని పేర్కొంది.
ఈ తీర్పుపై స్పందించాలని గ్రావిటీ డయాగ్నోస్టిక్స్‌తో పాటు ఆ కంపెనీ తరఫున వాదించిన అటార్నీని బీబీసీ సంప్రదించింది.
కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీస్, జూలీ బ్రెజిల్ స్థానిక వార్తా సంస్థ ఎన్‌వైకేతో మాట్లాడుతూ... ''బెర్లింగ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలనే కంపెనీ నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం. ఆయన పనిప్రదేశంలో హింసకు సంబంధించిన పాలసీని ఉల్లంఘించారు'' అని అన్నారు.
''ఈ కేసులో బెర్లింగ్ కాదు, నా ఉద్యోగులు అసలు బాధితులు. మా కంపెనీ తీర్పును సవాలు చేస్తోంది. అప్పీల్ చేసే విషయాన్ని పరిశీలిస్తోంది'' అని ఆమె వ్యాఖ్యానించారు.
బెర్లింగ్ అటార్నీ టోనీ బుచర్, బీబీసీతో మాట్లాడారు. ''బెర్లింగ్, కంపెనీలో ఎవరికైనా హాని కలిగించారని చెప్పడానికి కచ్చితంగా ఎలాంటి ఆధారాలు లేవు. దీన్ని కారణంగా చూపుతూ ఆయనను ఉద్యోగం నుంచి తొలిగించారు'' అని ఆయన అన్నారు.
''ఆయన తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానీ, దాన్ని గ్రావిటీ డయాగ్నోస్టిక్స్ ప్రతినిధులు అర్థం చేసుకోలేకపోయారు. పైగా ఆయన వల్ల హాని కలుగుతుందని వారు తప్పుగా ఊహించుకున్నారు. ఎలాంటి సాక్ష్యాలు, హింస జరగకుండానే మానసిక సమస్యలు ఉన్న వ్యక్తులను ప్రమాదకరంగా పరిగణించడం ఒక వివక్షపూరిత చర్యే'' అని ఆయన చెప్పారు.
మానసిక అనారోగ్యంపై నేషనల్ అలియన్స్ డేటా ప్రకారం అమెరికాలో దాదాపు 20 శాతం ప్రజలు... అంటే 4 కోట్లకు పైగా ఆందోళనకు సంబంధించిన రుగ్మతలతో బాధ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నాపై రాళ్లు విసిరినా, రక్తం కారుతున్నా నా బాధ్యతల నుంచి తప్పుకోను’ - బీబీసీ ఇంటర్వ్యూలో తెలంగాణ గవర్నర్
- పాకిస్తాన్: ప్రభుత్వాన్ని సైన్యం ఎలా గుప్పిట్లో పెట్టుకుంది?
- ఏపీ మంత్రి కాకాణి చుట్టూ మరో వివాదం, ఆ విల్లాలో యువకుడి మృతికి కారణమేంటి
- ప్రపంచం మొత్తానికి భారత్ తిండి పెట్టగలదా, బైడెన్‌తో మోదీ ఎందుకలా చెప్పారు
- ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














