అమెరికాలో పీహెచ్‌డీ చేసిన ఈ తెలంగాణ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా దిల్లీ బాబా దగ్గరికి ఎందుకొచ్చారు?

వీరేంద్ర దేవ్ దీక్షిత్
ఫొటో క్యాప్షన్, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్.. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సీబీఐ ఇప్పటికీ ఈయనను పట్టుకోలేకపోయింది
    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఇప్పుడే మేము ఏం చెప్పలేం. సోమవారం కోర్టు నిర్ణయం వస్తుంది. అప్పుడు మాత్రమే మేము ఏమైనా చెప్పగలం".

సంతోష్ రూప తండ్రి రాంరెడ్డి చెప్పిన మాటలివి. వీరిది తెలంగాణ. సంతోష్ రూప తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చదువుకున్నారు.

రూప.. ఏడేళ్ల క్రితం ఇంట్లో చెప్పకుండా అమెరికా నుంచి నేరుగా దిల్లీకి వచ్చారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమంలో ఉండటం మొదలుపెట్టారు.

వీరేంద్ర దేవ్ దీక్షిత్ చాలా సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్నారు.

దిల్లీలోని రోహిణిలో ఉన్న ఐదు అంతస్తుల భవనంలో ఉంటున్న చాలామంది మహిళల్లో 38 సంవత్సరాల రూప ఒకరు.

రాంరెడ్డిలాగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను వివాదాస్పద ఆ ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు పోరాడుతున్నారు.

ఈ ఆశ్రమం వివాదం కోర్టు వరకు రావడం ఇదే మొదటిసారి కాదు.

వీడియో క్యాప్షన్, అత్యాచార బాధితులు: "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"

41 మంది బాలికలను కాపాడినవేళ..

2017లో సీబీఐ, పోలీసులు ఆ వివాదాస్పద భవనంలో సోదాలు చేశారు. 41 మంది మైనర్ అమ్మాయిలను అక్కడి నుంచి రక్షించారు.

ఈ వివాదంలో 75 సంవత్సరాల బాబా వీరేంద్ర దేవ్ దీక్షిత్ కేంద్ర బిందువుగా ఉన్నారు.

తనను తాను శివుడి అవతారమని ఆయన చెప్పుకుంటున్నారు. వేర్వేరు పోలీస్ స్టేషన్లపై ఆయనపై అనేక కేసులు ఉన్నాయి.

అక్కడ ఉంటున్న అమ్మాయిలతో మసాజ్, వారితో సెక్స్‌, వారిపై అత్యాచారం వంటి ఎన్నో ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.

ఈ విషయంలో ఎన్జీవోకు చెందిన లాయర్ కోర్టులో కేసు వేశారు.

"వీరేంద్ర దేవ్ దీక్షిత్ తనను తాను శివుడి అవతారంగా చెప్పుకునేవారు. శివలింగం మాదిరిగా ఆయన తన లింగాన్ని పూజించేవారని చెబుతారు" అని ఆ లాయర్ చెప్పారు.

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆయనపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. కానీ ఐదేళ్లు గడిచినప్పటికీ వీరేంద్ర దేవ్ దీక్షిత్‌ను పట్టుకోలేకపోయారు.

ఇంత జరిగినా కూడా వివాదాస్పద ఆశ్రయం ఈరోజుకు కూడా నడుస్తూనే ఉంది. అక్కడ ఇంకా సుమారు 150 మంది అమ్మాయిలు ఉన్నారు. వారిని జంతువుల్లా బంధించారని చెబుతున్నారు.

ఆశ్రమం
ఫొటో క్యాప్షన్, ఆశ్రమం

దిల్లీ హైకోర్టు ఏమందంటే..

దిల్లీ హైకోర్టులో మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. దేశ రాజధానిలో ఇదంతా ఎలా జరుగుతోందని కోర్టు ఆశ్యర్యం వ్యక్తం చేసింది.

ఆ ఆశ్రమాన్ని తన నియంత్రణలోకి తీసుకునే విషయాన్ని దిల్లీ ప్రభుత్వం పరిశీలించాలని విచారణ సందర్భంగా గురువారం దిల్లీ హైకోర్టు సూచించింది.

"ఆ ఆశ్రమంలో ఉన్న బాత్‌రూంలకు తలుపులు కూడా లేవు. ఇదంతా దేశ రాజధానిలో జరుగుతోంది. ఇది షాకింగ్‌గా ఉంది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కాబోతోంది" అని దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లా అన్నారని లైవ్ లా వెబ్‌సైట్ పేర్కొంది.

ఈ కేసు తదుపరి విచారణ వచ్చే సోమవారం జరగనుంది. ఆ తర్వాత దిల్లీ ప్రభుత్వం ఆ ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకుంటుందా లేదా అన్న దానిపై స్పష్టత వస్తుంది.

సోమవారం వెలవడనున్న కోర్టు తీర్పు కోసం సంతోష్ రూప తండ్రి రాంరెడ్డి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమం
ఫొటో క్యాప్షన్, వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమం

సంతోష్ రూప ఎవరు?

రాంరెడ్డి, మీనావతి దంతుల కుమార్తె సంతోషి రూప. అమెరికాలోని ప్రముఖ లూసివిల్లే యూనివర్శిటీ నుంచి నానో టెక్నాలజీలో ఆమె పీహెచ్‌డీ చేశారు.

అంతకుముందు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఆమె డిగ్రీ చేశారు. కానీ 2015కు ముందు రూపాకు తీవ్రంగా నడుంనొప్పి ఉండేది.

"ప్రకృతివైద్యంలో ఆమెకు ఉపశమనం లభించడంతో ఆమె ధ్యానం వంటివి మొదలుపెట్టారు. ఆ సమయంలోనే యూట్యూబ్‌ ద్వారా ఆమెకు వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమం గురించి తెలిసింది. 2015లో రూపా అమెరికా నుంచి నేరుగా వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమానికి వెళ్లారు" అని రాంరెడ్డి లాయర్ శ్రవణ్ కుమార్ చెప్పారు.

"యూట్యూబ్‌లో వీడియో చూసిన తర్వాత రూపా తల్లిదండ్రులకు చెప్పకుండా అమెరికా నుంచి నేరుగా ఆశ్రమానికి వచ్చారు. ఆ తర్వాత ఆమె తన కుటుంబంతో పాటు చాలా ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాశారు. తాను తన ఇష్టప్రకారమే ఆశ్రమంలో ఉంటున్నానని ఆమె లేఖలు రాశారు" అని శ్రవణ్ కుమార్ వివరించారు.

ఆ వివాదాస్పద ఆశ్రమంలో ఉన్న మహిళలు రాసిన అలాంటి లేఖలు గతంలో కూడా పెద్ద సంఖ్యలో బహిర్గతం అయ్యాయి.

"2007లో అలాంటి వందలాది లేఖలు కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ దృష్టికి కూడా వచ్చాయి. ఆ లేఖలపై అక్కడ ఉంటున్న మహిళలందరీ సంతకాలు ఉన్నాయి. ఆ లేఖలన్నీ ఒకేలా ఉన్నాయి. అక్కడ ఉంటున్న మహిళలతో అలాంటి లేఖలు రాయించి ఆశ్రమమే వాటిని వివిధ ప్రభుత్వ విభాగాలకు పంపించింది. తల్లిదండ్రుల నుంచి ఆ మహిళలను రక్షించేందుకు అలా చేశారు" అని శ్రవణ్ కుమార్ చెప్పారు.

రూపా
ఫొటో క్యాప్షన్, తెలంగాణకు సంతోష్ రూప చదువుల్లో టాపర్. అమెరికాలో నానో టెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు

సంతోష్ రూప న్యాయవాదులు ఏం చెబుతున్నారు..

సంతోష్ రూప, ఆశ్రమం తరఫున లాయర్ అమోల్ కోక్నే వాదిస్తున్నారు. రూప వాదనను ఆయన బీబీసీకి వివరించారు.

"రూపాను వదిలిపెట్టాలని ఆమె తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. రూప మేజర్ కావడంతో ఈ కేసు ఆమెకు అనుకూలంగా ఉంది. ఆమె వయసు 38 సంవత్సరాలు. ఆమె ఆ ఆశ్రమంలో ఉంటున్నారు. ఆమె తన ఇష్టప్రకారమే అక్కడ ఉంటున్నారు. కోర్టులో కూడా ఆమె తన వాంగ్మూలం ఇచ్చారు. ఆమె రికార్డులన్నీ కోర్టు ముందు ఉన్నాయి. అందుకే తీర్పు రూపాకు అనుకూలంగా వస్తుంది. ఆమెను ఆమె తల్లిదండ్రులకు అప్పగించే పరిస్థితి ఉండదు" అని అమోల్ వివరించారు.

కానీ రూప కేసుకు ముందే ఆ ఆశ్రమంలో మైనర్ అమ్మాయిలను అక్కడ ఉంచినట్లు రిపోర్టులు వచ్చాయి.

ఈ విషయంపై సీబీఐతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ సీబీఐ స్పందించలేదు. సీబీఐ స్పందిస్తే వాళ్లు చెప్పిన వివరాలను కూడా ఈ కథనానికి జత చేస్తాం.

వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమం
ఫొటో క్యాప్షన్, వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆశ్రమం

'హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది'

ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే స్థానిక ప్రజలు ఆ ఆశ్రమంలో ఏం జరుగుతోందో వివరించారు. తమ పేరు వెల్లడించొద్దని వారు విజ్ఞప్తి చేశారు.

"గతంలో 11, 12 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలు ఇక్కడికి వచ్చేవారు. ఆ తర్వాత వాళ్లను భట్టీ వేడుకకోసం మౌంట్ అబుకు తీసుకెళ్లేవారు. 20 - 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అమ్మాయిలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నారు. కొందరి వయసు ఇంకా ఎక్కువే ఉంటుంది. వాళ్లు ఆదివారాల్లో ఎక్కడికో వెళ్తారు. ఇరుగుపొరుగు వారితో అస్సలు మాట్లాడరు. చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు ఇక్కడికి వస్తుంటారు. తమ పిల్లలను పంపించాలని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ల పిల్లలను కలిసేందుకు వాళ్లు (ఆశ్రమం వాళ్లు) తలుపులు కూడా తీయరు. తల్లిదండ్రులు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూస్తూ రోడ్డు మీదే కూర్చుంటారు. కానీ వాళ్ల బాధను ఎవరూ పట్టించుకోరు" అని స్థానికురాలు ఒకరు బీబీసీతో చెప్పారు.

పక్కనే ఉండి ఈ మాటలు వింటున్న ఒక వ్యక్తి.. "పోలీసుల అమ్మాయిలు కూడా చాలాసార్లు ఇక్కడ చిక్కుకుపోయారు. వారిని కూడా బయటకు తీసుకురాలేకపోయారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి" అని ప్రశ్నించారు.

అయితే, ఈ ఆరోపణలను బీబీసీ స్వయంగా వెరిఫై చేయలేకపోయింది. రూప తల్లిదండ్రుల కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది.

వీడియో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్: 'నా బిడ్డను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు'

కూతురు కోసం తండ్రి పోరాటం

తన కూతుర్ని ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రూప తండ్రి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ దిల్లీ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే ఆమెను కలవడం సాధ్యమైంది.

న్యాయవాది శ్రవణ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు వాళ్ల కూతుర్ని కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని దిల్లీ హైకోర్టు స్థానిక డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది.

అయితే, కేసు ఉపసంహరించుకుంటామంటేనే తాను కలుస్తానని వారి కూతురు షరతు పెట్టారు.

రూప కుటుంబ సభ్యులు ఆమెను కలిసేందుకు ఆశ్రమం భవనం దగ్గరకు వెళ్లినప్పడు ఆశ్రమం సిబ్బంది వారిని చుట్టుముట్టారు. బౌన్సర్లలా ఉన్న మహిళలు రూపను కలవకుండా ఆమె తల్లిదండ్రులను అడ్డుకున్నారు. వాళ్లు తమ కూతుర్ని కనీసం తాకను కూడా లేదు.

దిల్లీ హైకోర్టు జోక్యంతో రూపను కలిసిన ఆమె దల్లిదండ్రులు ఆమె పరిస్థితి చూసి చాలా బాధపడ్డారు.

ఆమె ఆరోగ్యంపై రూప తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందారని న్యాయవాది శ్రవణ్ కుమార్ చెప్పారు.

"తన ఆరోగ్యం ఏమాత్రం బాలేదు. అమెరికాలో ఉన్నప్పుడు తను చాలా ఆరోగ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె దంతాలు నల్లగా మారిపోయాయి. ఆమెకు ఏవో మందులు ఇచ్చారు. ఊరికే ఎవరి పళ్లు నల్లగా మారవు" అని రాంరెడ్డి దంపతులు చెప్పినట్లు శ్రవణ్ కుమార్ తెలిపారు.

తమ కుమార్తెకు చికిత్స అందించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

"కానీ ఆమెకు బ్రెయిన్ వాష్ చేశారు. ఈ ప్రపంచం అంతం కాబోతోందని, తాము మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని ఆమె మనసులో బలమైన ముద్ర వేశారు" అని చెప్పారు.

2017లో సీబీఐ ఈ ఆశ్రమంలో సోదాలు చేసింది. ఆశ్రమంలో పరిస్థితి ఎలా ఉందో దిల్లీ మహిళా సంఘం అధ్యక్షురాలు స్వాతి మలివాల చెప్పారు.

"లోపలికి వెళ్లగానే బాబా గురించి అభ్యంతరకరమైన విషయాలపై అమ్మాయిలు రాసిన లేఖలు కనిపించాయి. చాలా రకాల మందులు, ఇంజెక్షన్లు, వాడిన నీడిల్స్ ఆశ్రమం నుంచి స్వాధీనం చేసుకున్నారు" అని ఆమె తెలిపారు.

ఆశ్రమంలో సోదాలు
ఫొటో క్యాప్షన్, ఆశ్రమంలో సోదాలు

2017లో ఏం జరిగింది?

2017లో సీబీఐ, దిల్లీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి ఆశ్రమం నుంచి 41 మంది బాలికలకు విముక్తి కలిగించారు.

బీబీసీ ప్రతినిధి సర్వప్రియ గతంలో రాసిన కథనం ప్రకారం.. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో వీరేంద్ర దేవ్ దీక్షిత్‌ మీద 10 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువగా అత్యాచారం కేసులే ఉన్నాయి.

ఒక మహిళ ఆత్మహత్య కేసు కూడా ఉంది. ఒక మహిళ ఆశ్రమంపై నుంచి దూకి చనిపోయారని 2016 డిసెంబర్ 7న జీటీబీ ఆస్పత్రి ఫిర్యాదు చేసింది.

ఒక మహిళ ఆశ్రమంలో ఉరేసుకున్నారన్న ఘటన 2017 మార్చి 4న వెలుగులోకి వచ్చింది. తనను దెయ్యాలు వెంటాడుతున్నాయని ఆ తర్వాత విచారణలో ఆమె చెప్పింది.

ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంపవర్‌మెంట్ అనే ఎన్జీవో ఈ విషయంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. వీరేంద్ర దేవ్ దీక్షిత్ తనను తాను శివుడి అవతారంగా చెప్పుకుంటారని ఎన్జీవో తరఫున వాదిస్తున్న లాయర్ చెప్పారు.

"శివలింగాన్ని పూజించినట్లే, వీరేంద్ర దేవ్ దీక్షిత్ తన లింగాన్ని పూజిస్తారని చెబుతారు. అక్కడ ఉండే అమ్మాయిలు మత్తు పదార్థాలు తీసుకునేలా చేస్తారు. మొదట్లో ఈ ఆచారాలన్నీ అమ్మాయిలు చేసేవాళ్లు. దాన్ని 'భట్టీ' అని వాళ్లు పిలిచేవారు. ఈ ఆచారం ప్రకారం అమ్మాయిలను ఏడు రోజుల పాటు ఏకాంతంగా ఉంచుతారు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న వారిని కూడా కలిసేందుకు వారిని అనుమతించరు. ఈ భట్టీ చేసిన తర్వాత అమ్మాయిలను ఇతర నగరాలకు పంపిస్తారు. ఆశ్రమానికి పంపిస్తారు. గోపికలుగా ఉండేలా బాలికలను ప్రలోభ పెడతారు. లైంగిక వేధింపులకు అనుమతించే అమ్మాయిలతో 16వేల గోపికలలో మీరు ఒకరని చెబుతారు" అని ఎన్జీవో తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాది వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఇంకా పరారీలోనే బాబా

"బాలికలతో సెక్స్‌ చేయడం కోసం హార్మోన్లను పెంచే మెడిసిన్లను వారికి ఇచ్చేవారు. బాబా వారికి మసాజ్‌లు చేయించేవారు. స్నానం చేసి, తనతో శృంగారంలో పాల్గొనమని బాబా వారిని కోరేవారు" అని ఆశ్రమం నుంచి తప్పించుకున్న కొందరు అమ్మాయిలు తనతో చెప్పినట్లు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సుష్మా సాహు గతంలో అన్నారు.

"రాజస్థాన్‌ను తీసుకెళ్లి తనను లైంగికంగా వేధించారని, ప్రతిఘటించినందుకు తనను కొట్టారని కాన్పూర్‌కు చెందిన 13 సంవత్సరాల అమ్మాయి ఒకరు తనకు చెప్పార"ని సుష్మా సాహు వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ తన నివేదికను కోర్టుకు సమర్పించింది. కానీ ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు పెద్దగా బయటకు రాలేదు.

దీనితో పాటు వీరేంద్ర దేవ్ దీక్షిత్‌పై సీబీఐ బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఆయన గురించి సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల నజరానా ఇస్తామని కూడా ప్రకటించింది.

ఇన్నీ చర్యలు తీసుకున్నప్పటికీ.. వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. కానీ ఆయన ఆడియో, వీడియోలను స్పిరిచువల్ యూనివర్శిటి యూట్యూబ్‌ చానల్‌లో విడుదల చేశారు. ఆయన చివరి వీడియో ఏప్రిల్ 19న విడుదలైంది.

సంతోష్ రూప కేసులో తర్వాత ఏం జరుగుతుందన్నది దిల్లీ హైకోర్టు సోమవారం నిర్ణయిస్తుంది. కోర్టు తీర్పు కోసం ఆమె తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

వీడియో క్యాప్షన్, అత్యాచారం తరువాత అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)