హత్య కేసులో బాబా రాంపాల్‌కు జీవిత ఖైదు

రాంపాల్ జీవిత ఖైదు

ఫొటో సోర్స్, SATLOKASHRAM @TWITTER

    • రచయిత, శశికాంతా, సత్ సింగ్
    • హోదా, బీబీసీ కోసం

సత్‌లోక్ ఆశ్రమానికి చెందిన వివాదాస్పద బాబా రాంపాల్‌కు హరియాణాలోని హిసార్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆయన అనుచరులు 15 మందిని దోషులుగా ఖరారు చేసిన కోర్టు వారికి కూడా యావజ్జీవ శిక్ష వేసింది. లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.

అక్టోబర్ 11న రాంపాల్, మరో 8 మంది నిందితులను కోర్టు రెండు కేసుల్లో దోషులుగా ఖరారు చేసింది. రాంపాల్‌ను బర్వాలాలో ఉన్న ఆయన ఆశ్రమంలో 2014 నవంబర్ 19న అరెస్టు చేశారు.

2006లో రాంపాల్‌పై హత్య కేసు నమోదైంది. ఈ కేసు కింద రాంపాల్‌ను ఆయన కరౌథా ఆశ్రమంలో అరెస్టు చేశారు. 22 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ లభించింది.

కానీ, ఆ తర్వాత ఆయన చాలాసార్లు కోర్టుకు హాజరు కాలేదు. దాంతో రాంపాల్ బెయిల్ రద్దయింది. లొంగిపోవాలని కోర్టు ఆయన్ను ఆదేశించింది. కానీ, రాంపాల్ అలా చేయలేదు.

ఇక, రాంపాల్ కోర్టుకు హాజరైన సమయంలో చాలాసార్లు ఆయన అనుచరులు వందల సంఖ్యలో కోర్టుకు వచ్చారు.

2014 జులైలో రాంపాల్ అనుచరులు హిసార్ కోర్టులో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత పంజాబ్, హరియాణా కోర్టులు ఆయన పేరు మీద సమన్లు జారీ చేశాయి. తర్వాత కూడా రాంపాల్ కోర్టుకు హాజరు కాకపోవడంతో, ఆయన్ను అరెస్టు చేయాలని ఆదేశించాయి.

"న్యాయ వ్యవస్థ చిక్కుల్లో పడింది. రాంపాల్ కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు జరిగేవి. కానీ అనుచరులు భారీగా తరలివస్తుండడంతో, హిసార్ కోర్టు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాంపాల్ కోర్టుకు హాజరు కాకపోవడంతో, ఆయన బెయిల్ రద్దు చేశారు" అని రాంపాల్ సత్‌లోక్ ఆశ్రమ్ ప్రతినిధి చాంద్ రాఠీ చెప్పారు.

రాంపాల్ జీవిత ఖైదు

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

రాంపాల్‌కు వ్యతిరేకంగా కేసులు

రాంపాల్‌కు రెండు కేసుల్లో శిక్ష వేశారు. 2014 నవంబర్ 19న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆయనకు జీవిత ఖైదు విధించారు.

2006లో నమోదైన కేసులో బెయిల్ రద్దు కావడంతో, పోలీసులు అదే ఏడాది నవంబర్లో ఆయన్ను అరెస్ట్ చేయడానికి బర్వాలా ఆశ్రమం చేరుకున్నారు. కానీ అక్కడ ఆయన అనుచరులు రాంపాల్‌ను కాపాడ్డానికి మానవ కవచాలను ఉపయోగించారు. అదే సమయంలో ఆశ్రమంలోని నలుగురు మహిళలు, 18 నెలల చిన్నారి మృతి చెందారు.

ఈ కేసులో బర్వాలా పోలీస్ స్టేషన్లో నవంబర్ 19న సెక్షన్ 302 (హత్య), సెక్షన్ 343 (అక్రమంగా నిర్బంధించడం) సెక్క్షన్ 120బి (నేరపూరిత కుట్ర) కింద రాంపాల్‌పై ఎఫ్ఐఆర్( నెంబర్-429) నమోదైంది.

రాంపాల్‌పై రెండో ఎఫ్ఐఆర్( నంబర్-430) కూడా 2014 నవంబర్ 19న బర్వాలా పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ కేసు ఆశ్రమం నుంచి లభించిన ఒక మహిళ మృతదేహానికి సంబంధించినది. 2014 నవంబర్ 18న ఆశ్రమంలో రజనీ అనే 25 ఏళ్ల యువతి మృతదేహం బయటపడింది.

ఈ కేసులో రాంపాల్ సన్నిహితులుగా భావిస్తున్న రాజేంద్ర, మహిందర్ సింగ్, రాజ్‌కుమార్‌తోపాటు ఆశ్రమంలోని మరికొంత మంది పేర్లు కూడా చేర్చారు.

అక్టోబర్ 8న హిసార్ కోర్టు రెండు కేసుల్లో వాదనలు పూర్తి చేసింది. ఈరోజు(అక్టోబర్ 16న) ఏడీజే చలియా ఈ కేసులో(ఎఫ్ఐఆర్ 429, 430) నిందితుడు రాంపాల్‌కు శిక్ష విధించారు. రెండు కేసుల్లో మొత్తం 18 మంది సాక్ష్యులను కోర్టులో హాజరుపరిచారు.

రాంపాల్ జీవిత ఖైదు

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

2006లో నమోదైన కేసు

ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామీ దయానంద్ రాసిన 'సత్య ప్రకాశ్' పుస్తకంలో కొన్ని భాగాలపై రాంపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో 2006లో ఆయన మద్దతుదారులు, ఆర్య సమాజ్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.

రాంపాల్‌ను కరౌథా ఆశ్రమం నుంచి బయటకు పంపించాలని ఆర్య సమాజ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ ఘర్ణణల్లో ఒక ఆర్య సమాజ్‌ కార్యకర్త మృతి చెందారు. మరో 59 మంది గాయపడ్డారు.

రాంపాల్‌కు వ్యతిరేకంగా హత్య, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయన కొంత కాలం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత 2008లో రోహ్తక్ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తర్వాత ఆయన హిసార్‌లోని బర్వాలాలో ఆశ్రమం ఏర్పాటు చేశారు.

రాంపాల్ జీవిత ఖైదు

ఫొటో సోర్స్, SAT SAINGH/BBC

తీర్పు ముందు భారీ ఏర్పాట్లు

రామ్ రహీమ్ ఇంసాన్ కేసులో శిక్ష విధించిన తర్వాత హరియాణాలోని సిర్సాలో డేరా అనుచరులు హింసాత్మక ఘటనలకు పాల్పడడంతో, రాంపాల్ కేసు విచారణ సందర్భంగా హిసార్ అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేసు తీవ్రత దృష్ట్యా ఐజీ, డీఐజీ, ఆరుగురు ఎస్పీలు సహా 1500 మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలను ఇక్కడ మోహరించారు. నగరంలోని 37 ప్రాంతాల్లో నిషేధం విధించారు.

హిసార్ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ మీనా నగరంలో పరిస్థితి అదుపులో ఉన్నట్టు చెప్పారు. దీనిని ఒక హై ప్రొఫైల్ కేసుగా తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

రాంపాల్ జీవిత ఖైదు

ఫొటో సోర్స్, SAT SAINGH/BBC

అసలు ఎవరీ రాంపాల్?

67 ఏళ్ల రాంపాల్ 1951లో పుట్టారు. ఆయన సోనిపత్ జిల్లాలోని ఒక జాట్ కుటుంబానికి చెందినవారు.

రాంపాల్ హనుమంతుడి భక్తుడు అని, గ్రామాలు తిరిగి భజనలు పాడేవారని సత్‌లోక్ ఆశ్రమం ప్రతినిధి చాంద్ రాఠీ చెబుతారు. అలా ఆయన చాలా పాపులర్ అయ్యారని తెలిపారు.

కబీర్ దాస్ సిద్ధాంతాలు స్వీకరించిన రంపాల్, రోహ్తక్ జిల్లాలోని కరౌథా గ్రామంలో ఆశ్రమం స్థాపించారు. ఆ ప్రయత్నంలో ఆయనకు సామాన్యుల నుంచి వీఐపీల వరకూ మద్దతు లభించింది.

రాంపాల్ ఇరిగేషన్ శాఖలో జూనియర్ ఇంజనీరుగా పనిచేసేవారని రాఠీ చెప్పారు. కానీ ఆశ్రమం ప్రారంభించే ముందు ఆయన తన ఉద్యోగం విడిచిపెట్టారన్నారు.

రాంపాల్ కావాలనే స్వామీ దయానంద్ పేరు ఉపయోగించారని, జాట్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వారిని ఆకర్షించాలనే అలా చేశారని ఆర్య సమాజం ప్రతినిధి రాంపాల్ ఆర్య చెప్పారు.

రాంపాల్ జీవిత ఖైదు

ఫొటో సోర్స్, SAT SAINGH/BBC

జాట్ ఆధికంగా ఉన్న ఈ జిల్లాల్లో ఒక పెద్ద వర్గం ఆర్య సమాజానికి అనుబంధంగా ఉంది.

మేం దానిని వ్యతిరేకిస్తున్నందుకే 2006లో ఆర్య సమాజం మద్దతుదారులు, రాంపాల్ అనుచరుల మధ్య గొడవ జరిగింది అని రాంపాల్ ఆర్య తెలిపారు.

రాంపాల్ తన మద్దతుదారులను మతం పేరుతో మోసం చేసేవారని, స్వామీ దయానంద్ సరస్వతికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో సఫలం అయ్యారని ఆర్య సమాజం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)