జమాల్ ఖషోగీ అదృశ్యం: ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సుల్ ఇంట్లోనూ సోదాలు చేస్తామన్న టర్కీ

ఫొటో సోర్స్, EPA
జమాల్ ఖషోగీ అదృశ్యానికి సంబంధించిన దర్యాప్తును టర్కీ ప్రభుత్వం మరింత విస్తరించింది. ఈ కేసులో ఆధారాల కోసం ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ జనరల్ నివాసంలో కూడా సోదాలు జరుపుతామని ప్రకటించింది.
సోమవారం నాడు టర్కీ అధికారులు మొదటిసారిగా సౌదీ కాన్సులేట్ కార్యాలయాన్ని సోదా చేశారు. ఖషోగీ అక్టోబర్ 2న ఆ కార్యాలయంలోకి అడుగుపెట్టిన తరువాతే అదృశ్యమయ్యారు.
ఖషోగీకి ఏం జరిగిందనే విషయంలో వాస్తవాలు వెల్లడించాలని సౌదీ అరేబియా మీద ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో... రియాద్ నగరంలో సౌదీ రాజు సల్మాన్‌ను కలిశారు. పాంపెయో సౌదీ పర్యటనతో ఖషోగీ విషయంలో ఏం జరిగిందో వెల్లడించాలని సౌదీ అరేబియా మీద ఒత్తిడి పెరిగినట్లయింది.

ఫొటో సోర్స్, EPA
రెండు వారాల క్రితం టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఉన్న సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో ఖషోగీ చివరిసారిగా కనిపించారు.
ఖషోగీని సౌదీ ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారని టర్కీ భావిస్తోంది. కానీ ఈ వాదనలను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఖషోగీ అదృశ్యం వెనుక కొందరు దుర్మార్గుల హస్తం ఉందని సోమవారంనాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ తన వాదనను బలపరిచే ఎలాంటి ఆధారాలనూ ట్రంప్ చూపలేదు. కానీ సౌదీ రాజు.. ఖషోగీ అదృశ్యం గురించి తమకేమీ తెలియదని తనతో ఫోన్ సంభాషణలో చెప్పినట్లు ట్రంప్ అన్నారు.
సోమవారం రాత్రి ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్యకార్యాలయంలో టర్కీ పోలీసులు ప్రారంభించిన సోదాలు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి. ఖషోగీ అదృశ్యమైన తర్వాత ఈ కార్యాలయంలోకి టర్కీ పోలీసులు ప్రవేశించడం ఇదే తొలిసారి.
మరోవైపు, 'విచారణ సమయంలో ఖషోగీ మరణించాడని, తమ అసలు ఉద్దేశం ఖషోగీని అపహరించడమే కానీ హత్య చేయడం కాదు' అని అంగీకరించేందుకు సౌదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్న అనధికారిక వార్తలు అమెరికా మీడియాలో వస్తున్నాయి.
అరబిక్ చానెల్ అల్ జజీరా ఈ విషయమై వార్తలను ప్రసారం చేస్తూ, ఖషోగీని హత్య చేశారనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ టర్కీ అటార్నీ జనరల్ కార్యాలయం ప్రకటించిందని తెలిపింది.
ఖషోగీ అదృశ్యం వ్యవహారం కొన్ని పాశ్చాత్య దేశాలకు, సౌదీకి మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ఇరుకున పెట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అసలేం జరిగింది?
సౌదీ ప్రభుత్వం మీద విమర్శనాత్మక కథనాలు రాసే జర్నలిస్ట్ ఖషోగీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ కార్యాలయంలోకి వెళ్ళిన తరువాత కనిపించకుండా పోయారు.
అయితే, సౌదీ కాన్సులేట్ కార్యాలయంలో జమాల్ ఖషోగీ హత్యకు గురయ్యారని నిరూపించటానికి తమ వద్ద ఆడియో, వీడియో సాక్ష్యాలు ఉన్నాయని టర్కీ భద్రతా వర్గాలు అంటున్నాయి. కానీ ఈ ఆరోపణలను సౌదీ తీవ్రంగా ఖండించింది.
ఈ నెలలో సౌదీ అరేబియాలో జరుగనున్న ఒక కీలకమైన అంతర్జాతీయ సదస్సును బహిష్కరించే విషయమై ఆలోచిస్తున్నామని బ్రిటన్, అమెరికా దేశాలు వెల్లడించాయి.
అయితే, ''జమాల్ హత్యకు గురైనట్లైతే కేవలం ఖండనలు మాత్రమే చాలవు'' అని ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న టర్కీ మహిళ హటీస్ చెంగిజ్ అన్నారు. చట్టపరంగా దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
సౌదీ విదేశాంగ కార్యాలయంలోకి వెళుతున్న జమాల్ ఖషోగి వీడియో
సౌదీ ప్రజలేమంటున్నారు?
ఈ విషయంలో పూర్తి వివరణ ఇవ్వాలంటూ సౌదీపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ కేసులో వెంటనే దర్యాప్తును ప్రారంభించాలని సౌదీ రాజు సల్మాన్ సోమవారంనాడు ఆదేశాలు జారీ చేశారు.
''ఇస్తాంబుల్‌లోని సంయుక్త బృందాలు అందించిన సమాచారం ఆధారంగా ఖషోగీ కేసులో అంతర్గత దర్యాప్తును సత్వరమే చేపట్టాలని రాజు సల్మాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు'' అని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఖషోగీ అదృశ్యం కేసులో టర్కీ పోలీసులతో కలిసి పని చేయడానికి గత వారం సౌదీ ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఖషోగీ కేసులో తమపై వస్తోన్న రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో సౌదీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, Reuters
విదేశాంగ కార్యాలయంలో సోదాలు ఎలా జరిగాయి?
సోమవారం మధ్యాహ్నం సౌదీ బృందం దైత్య కార్యాలయంలోకి ప్రవేశించిన ఒక గంట తర్వాత టర్కీ ఫోరెన్సిక్ పోలీసులు కార్యాలయంలోకి వెళ్లారు.
సౌదీ, టర్కీ సంయుక్త బృందాలు కార్యాలయంలో సోదాలు చేస్తాయని అధికారులు అప్పటికే ప్రకటించి ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తమ కార్యాలయంలో టర్కీ పోలీసులు పైపైన పరిశీలించడానికి సౌదీ గత వారంలోనే అంగీకరించింది కానీ సమగ్రంగా సోదాలు చేయడానికి మాత్రం నిరాకరించింది.
అయితే, రక్తపు అవశేషాలను పసిగట్టగలిగే 'ల్యుమినాల్' ద్రావకం వాడి సోదాలు చేయాలన్నది టర్కీ పోలీసుల ఆలోచన అని 'ది సాబా' దినపత్రిక తెలిపింది. కానీ ల్యుమినాల్‌తో సోదాలు చేశారో లేదో తెలియలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఊహలు, ప్రశ్నలు
మచ్చలేని పాలన సాగిస్తున్న సౌదీ ప్రభుత్వంపై నిందలు మోపడానికే ఖతర్, టర్కీ దేశాలు ఈ కుట్ర పన్ని, సౌదీని ఇరుకులోపెట్టాయన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
సౌదీకి అద్భుతమైన భవిష్యత్తును ఇవ్వగలిగిన దార్శనికుడు అని అందరూ పొగిడిన తమ 33ఏళ్ల రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్.. ఇంత పనీ చేసుంటారా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









