యుక్రెయిన్-రష్యా-బెలారస్: మూడు దేశాల మధ్య నలిగిపోతున్న చిన్న గ్రామం - ఎవరు ఎవరిపై యుద్ధం చేస్తున్నారో అర్థం కాక తోబుట్టువులతోనే తగాదా

సెంకివ్కా గ్రామం యుక్రెయిన్, రష్యా, బెలారస్ దేశాల సరిహద్దులు కలిసే చోట ఉంది.
ఒకప్పుడు ఈ మూడు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా చేసుకునే సంబరాలకు ఈ గ్రామం వేదికయ్యేది.
అదే గ్రామం ఇప్పుడు యుద్ధంలో ముందువరుసలో ఉంది.
సరిహద్దుల్లో భయంభయంగా గడుపుతూ కుటుంబాలు ఛిన్నాభిన్నమైన ఉదంతాలను అక్కడి ప్రజలు చెబుతారు.
యుద్ధం కారణంగా నిలువునా చీలిపోయిన సమాజపు దుస్థితిని బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయె అక్కడ స్వయంగా చూశారు.
ఉత్తర యుక్రెయిన్ నుంచి రష్యా బలగాలు ఏప్రిల్ మొదటి వారంలోనే వెళ్లిపోయాయి. కానీ, ఇప్పటికీ సెంకివ్కాలో మోర్టార్ల షెల్లింగ్, గ్రనేడ్ దాడులు పెద్ద ఎత్తున జరుగుతోంది.
రష్యా చొరబాటుకు ముందు సెంకివ్కాలో సుమారు 200 మంది ప్రజలు ఉండేవారు. ఇప్పుడు అక్కడ నివసించేవారి సంఖ్యను వేళ్ల మీద లెక్కించొచ్చు.
యుక్రెయిన్‌పై దండయాత్రకు రష్యా బలగాలు వాడుకున్న రోడ్డును అనుకుని నీనా మలెనాక్ ఇల్లు ఉంటుంది.
ఉత్తర యుక్రెయిన్ నగరం చెర్నెహీవ్, రాజధాని కీయెవ్‌పై దాడికి వెళ్లిన రష్య సేనలు ఈ రోడ్డు మీదుగానే యుక్రెయిన్‌లో ప్రవేశించాయి.

యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 తెల్లవారుజామున రష్యా పేల్చిన ఓ రాకెట్ శకలం నినా ఇంటి పెరట్లో ఇప్పటికీ ఉంది.
''పెరట్లో ఏదో పడిన శబ్దం వినిపించింది. చుట్టూ పొగ, మంటలు కనిపించాయి. ఇంట్లో లైట్లు ఆరిపోయాయి. వెంటనే మంచం మీద నుంచి కిందకు దూకి ఇంటి నుంచి బయటకు పరుగెత్తాను'' అని నీనా ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు.
ఆ తరువాత సెల్లార్‌లో గడిపిన ఆమె ఆకాశంలో ఎగురుతున్న విమానాలు, వీధుల్లో భారీ వాహనాలు తిరుగుతుండడం వంటివన్నీ విన్నారు.
మార్చి 8న రష్యన్ టీవీ జర్నలిస్టులు రష్యా సైనికులతో కలిసి నీనా ఇంటికి వచ్చారు.
''అక్కడ పెరట్లో కనిపించిన ప్రతిదీ వాళ్ల కెమేరాలతో షూట్ చేశారు, యుక్రెయినే దాడి చేసిందని వారు చెప్పారు. ఆ తరువాత వారు రాకెట్ శకలంపై ఉన్న నంబర్లను రష్యాలో ఎవరికో పంపించారు. అది రష్యా రాకెట్టేనని అటు నుంచి జవాబు వచ్చింది'' అని నీనా చెప్పారు.
అలాంటి చాలా రాకెట్లు ఆ ఊళ్లో ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. వాటిని పరిశీలించిన నిపుణులు కొందరు 'బీబీసీ'తో మాట్లాడారు. ఈ రాకెట్లు క్లస్టర్ బాంబులను మోసుకొచ్చి ఉంటాయని చెప్పారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో క్లస్టర్ బాంబులపై నిషేధం ఉంది. అవి కలిగించే తీవ్రమైన వినాశనాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధాల్లో వాటి వినియోగాన్ని నిషేధించారు.
కానీ, యుక్రెయిన్, రష్యా రెండూ క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
యుక్రెయిన్ ఉత్తర ప్రాంతం నుంచి రష్యా సేనలు వెళ్లిపోయినప్పటికీ నీనా మాత్రం తాను ఇంకా భద్రంగా ఉన్నట్లు భావించడం లేదు.
''ఇలాంటి జీవితం గడపడానికి భయంగా ఉంది. కానీ, నా ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్లగలను? షెల్లింగ్ శబ్దం వినిపిస్తోంది. నా ఇంటి పెరటి నుంచి రష్యా చెక్ పాయింట్ కూడా కనిపిస్తుంది'' అన్నారు నీనా.
నీనా ఇల్లు, సెంకివ్కాలోని మిగతావారి ఇళ్లు కూడా రష్యా నుంచి కనిపిస్తాయి. రష్యా బలగాలు కూడా తాము దేనిపై దాడి చేస్తున్నాయో సులభంగా చూడగలుగుతాయి.

అదే గ్రామానికి చెందిన లిదియా బిలసోవా ఇలా తన ఇంటి వరకు యుద్ధ ట్యాంకులు రావడాన్ని చూడడం ఇది రెండోసారి.
1930లో జన్మించిన లిదియా రెండో ప్రపంచ యుద్ధాన్ని, తమ గ్రామంలోని జర్మనీ సైనికులు ప్రవేశించడాన్ని గుర్తు చేసుకున్నారు.
'మా సైనికులు వెళ్లిపోతూవెళ్లిపోతూ వారు (జర్మనీ సైనికులు) వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో మేం గుడ్డ సంచుల్లో రొట్టెలు పెట్టుకుని కందకాలలో దాక్కున్నాం. వేకువజామున మా వీధుల్లో వారు ప్రవేశించారు. మెషీన్ గన్‌లు పట్టుకుని గుర్రాలు, భారీ యుద్ధ సామగ్రితో మా తోటలను దాటుకుని వెళ్లారు. కానీ, ఇప్పుడు చేస్తున్నట్లుగా షెల్లింగ్ చేయడం వంటిదేమీ లేదు'' అని లిదియా చెప్పారు.
అప్పట్లో పరుగెత్తి పారిపోగలిగేదాన్ని, కానీ, ఈ వయసులో ఎక్కడికి పారిపోతాను? అన్నారామె.
యుద్ధం వల్ల లాభం లేదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత మాకేం మిగలింది? అని ప్రశ్నించారామె.
రష్యా వైపు నుంచి జరుగుతున్న షెల్లింగ్‌కు ఆమె భయపడుతున్నారు. కానీ, జీవితమంతా గడిపిన ఆ ఇంటిని వదిలి వెళ్లేందుకు ఆమె ఇష్టపడడం లేదు.

2014లో రష్యా క్రిమియాపై దాడి చేయడానికి ముందు ఈ మూడు దేశాల సరిహద్దు తెరిచే ఉండేది. ఈ మూడు దేశాలు కలిసే చోట ఐక్యతా వేడుకలు కూడా నిర్వహించేవారు. మూడు దేశాలు కలిసేచోట ఇప్పటికీ 'త్రీ సిస్టర్స్' అనే స్మారకం ఉంది.
'ఆ ఐక్యతా వేడుకలు చాలా బాగా జరిగేవి. మేం, రష్యన్లు, బెలారష్యన్లు కలిసి వేడుక చేసుకునేవాళ్లం. అధికారులు, ముఖ్యమైన వ్యక్తులు ఈ వేడుకలకు హాజరయ్యేవారు'' అని గుర్తు చేసుకున్నారు లిదియా.
లిదియా భర్త కూడా బెలారస్‌కు చెందినవారు. ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేరు.
''ఒకప్పుడు ఈ మూడు దేశాలు మిత్రులు. ప్రజల మధ్య మంచి సంబంధాలుండేవి. ఈ దేశాల ప్రజల మధ్య పెళ్లిళ్లు కూడా జరిగేవి. ఇప్పుడు అదంతా గతం'' అన్నారామె.

ఇప్పుడు భౌతికంగానే కాదు ఈ దేశాల ప్రజల ఆలోచనల్లోనూ దూరం పెరిగింది. 2014 తరువాత సెంకివ్కా మీదుగా సరిహద్దులు దాటడం కష్టమైపోయింది. ఇప్పుడైతే ఏకంగా అసాధ్యంగా మారిపోయింది.
మైఖలో దుడ్కో ఇద్దరు సోదరులు, ఒక సోదరి, వారి పిల్లలు రష్యాలో నివసిస్తారు. ఇటీవల కొన్నేళ్లుగా ఆయన వారిని కలుసుకోలేదు.
''మేమే(యుక్రెయిన్) యుద్ధం మొదలుపెట్టామని నా సోదరి అంటోంది. కానీ, మాకు అలాంటి ఉద్దేశమేమీ లేదు. రష్యాయే దాడి ప్రారంభించింది. నా కుటుంబ సభ్యులు బుర్ర ఉపయోగించి జరుగుతున్నది అర్థం చేసుకోవాలి'' అన్నారామె.
బెలారస్‌లో నివసించే తన సోదరుడితో మాట్లాడడం మానేశానని నీనా చెప్పారు.
''యుక్రెయిన్‌పై అమెరికా దాడి చేస్తే రష్యాను నిందిస్తున్నారని నా సోదరుడు అంటున్నాడు. ఈ సరిహద్దుకు 5 మైళ్ల దూరంలో ఉంటాడు నా సోదరుడు. జరుగుతున్నది చూసి కూడా ఆయన నమ్మడు. ఆ కారణంగానే నా జీవితం నుంచి బయటకు గెంటేయాలనుకుంటున్నాను'' అన్నారు నీనా.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














