రష్యా ఎన్నికలు: మేయర్‌ను ఓడించిన క్లీనర్.. పుతిన్ పార్టీకి ఝలక్

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
రష్యా రాజధాని మాస్కోకు ఈశాన్య దిశగా 400 కి.మీ. దూరంలోని పొవాలిఖినో గ్రామంలో ఓ స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో క్లీనర్‌గా మరీనా ఉద్గోడ్స్‌కయా పనిచేసేవారు.
స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడటంలో ఎదరవుతున్న సాంకేతిక పరమైన ఓ అడ్డంకిని అధిగమించేందుకు ఆమెతో ఓ నామినేషన్ వేయించారు. అయితే ఆ నామినేషన్ ఆమె జీవితాన్నే మలుపుతిప్పింది.
స్థానిక చట్టాల ప్రకారం.. ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలంటే బ్యాలెట్‌పై ఇద్దరు అభ్యర్థులు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన కోసమే ఆమె నామినేషన్ వేశారు. అయితే బంపర్ మెజారిటీతో ఆమె ఎన్నికల్లో విజయం సాధించారు.
క్లీనింగ్ నుంచి మేయర్ ఆఫీస్ వరకు ఆమె ఎలా ఎదిగారో తెలుసుకొనేందుకు బీబీసీ రష్యా ప్రతినిధి పీటర్ కొజ్లోవ్.. పొవాలిఖినోకు వెళ్లారు.

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
మొబైల్ సిగ్నల్ కూడా రాదు
ఓ సరికొత్త మార్పుకు నాంది పలుకుతున్నట్లు పొవాలిఖినో ఏమీ కనిపించదు. కాస్ట్రోమా ప్రాంతంలోని కొన్ని ఇళ్ల సముదాయమే ఈ గ్రామం.
ఇక్కడ జీవనాధారం కోసం కొందరు కలప పరిశ్రమపై ఆధారపడుతుంటారు. మరికొందరు సమీపంలోని చుఖ్లోమా సరస్సుకు వచ్చే పర్యటకులు, సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఇది చాలా మారుమూల ప్రాంతం. ఇక్కడ మొబైల్ సిగ్నల్ కూడా సరిగా అందదు.
అయితే, ఇదే ప్రాంతం ఊహించని రీతిలో నామమాత్రంగా నామినేషన్ వేసిన ఓ మహిళకు భారీ విజయాన్ని అందించింది. తోటి అభ్యర్థి నామినేషన్ వేయమని (డమ్మీ నామినేషన్) అడిగినందుకు మాత్రమే సదరు మహిళ నామినేషన్ వేశారు.
మరీనా.. సేల్స్ అసిస్టెంట్‌గా శిక్షణ తీసుకున్నారు. అయితే పొవాలిఖినోలో ఆమెకు సేల్స్ విభాగంలో ఉద్యోగం దొరకలేదు. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నవి రెండే రెండు చిన్న దుకాణాలు.
డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే కుటుంబానికి మరీనా అండగా నిలిచేవారు. ఇంటితోపాటు తోట, కోళ్లు, కుందేళ్లు, బాతులు, కుక్కలు, పిల్లులు అన్నింటినీ ఆమె చూసుకొనేవారు.

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
గ్యాస్ కూడా ఉండదు
స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ఆమె క్లీనర్‌గా పనిచేసేవారు. శీతాకాలంలో మేయర్ కార్యాలయంలో ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేలా చూసేందుకు కర్రలతో మంట రాజేసేవారు. ఈ జిల్లాలో గ్యాస్ ఎవరికీ లేదు. అందరూ కర్రల పొయ్యిలపైనే వంట చేసుకుంటారు. చలికాలంలో వేడి కాచుకొనేందుకు కూడా కర్రల పొయ్యిలే ఆధారం.
ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటూ ఆమెకు సూచించిన అభ్యర్థి.. ఆమె విజయాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.
మరోవైపు మరీనాకు కూడా ఇది వింతగానే అనిపించింది. ఎందుకంటే ఆమె ప్రచారం కూడా చేయలేదు. అసలు గెలుస్తానని తనకు ఆలోచన కూడా లేదు.
ఈ వార్త విని రష్యా ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజలు ఎన్నుకున్న అత్యుత్తమ నేతగా ఆమెపై ప్రసంశల జల్లు కురుస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకుడు దిమిత్రి గుడ్‌కోవ్.. మరీనాకు శుభాకాంక్షలు తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పార్టీతో ప్రజలు విసుగు చెందారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ ఆయన తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
అనుకోని అభ్యర్థి
చట్టపరమైన అడ్డంకులను తొలగించుకుంటూ, మళ్లీ తను మేయర్ అవ్వడమే లక్ష్యంగా మరీనా పోటీ చేయాలని 53ఏళ్ల నికోలాయ్ లోక్‌తేవ్ ఆమెకు సూచించారు.
పోలీసుగా పనిచేసి పదవీ విరమణ పొందిన నికోలాయ్.. గత ఐదేళ్లుగా మేయర్‌గా పనిచేస్తున్నారు. ఆయన్ను గ్రామంలో చాలా మంది గౌరవిస్తారు. గ్రామం ఈ స్థాయికి తీసుకురావడంలో ఆయన కృషి చేశారని చెబుతారు.
''నేనే మరీనాను పోటీ చేయమని చెప్పాను. నిజానికి మరికొంత మందిని కూడా పోటీ చేయమని అడిగారు. కానీ వారు తిరస్కరించారు. వేరే మార్గం లేకపోవడంతో ఆమెతో పోటీ చేయించాను. అయితే ఆమె విజయంలో నాకు ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ప్రజలు ఆమెకు మద్దతు ఇచ్చినందుకు సంతోషం''అని నికోలావ్ వ్యాఖ్యానించారు.
తను గ్రామాన్ని వదిలిపెట్టి సమీపంలోని పట్టణంలో కొత్త ఉద్యోగం వెతుక్కుంటానని ఆయన చెప్పారు. అయితే రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యాకు ఇది ఎదురుదెబ్బ అంటూ వస్తున్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. తను లేదా మరీనాకు ఏ పార్టీతోనూ సంబంధంలేదని వ్యాఖ్యానించారు.
అయితే, ఆయన మాత్రం యునైటెడ్ రష్యా ప్రతినిధిగా బరిలోకి దిగారు.
అక్టోబరులో మేయర్‌గా మరీనా పదవీ బాధ్యతలు తీసుకొనేటప్పుడు పరిసరాల్లోని జిల్లాల నుంచి ఆమెను చూడటానికి ప్రజలు వచ్చారు. ఆమె కోసం స్థానిక జర్నలిస్టులతోపాటు మాస్కో నుంచి కూడా రిపోర్టర్లు వచ్చారు.
ఆమె ఆ రోజు పెద్దగా మాట్లాడలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ముందుకుగానే సిద్ధంచేసుకున్న సమాధానాలు ప్రశాంతంగా చెబుతున్నట్లు అనిపించింది
''నేను బాగానే ఉన్నాను. అంతా మామూలుగానే ఉంది. మొదట్లో కొంత గందరగోళంగా అనిపించింది. ఇప్పుడు ఫర్వాలేదు. ఇదే నా మేయర్ సర్టిఫికేట్. పదవిని తిరస్కరించాలని నేను అకోవడం లేదు. ఎందుకంటే పోటీ చేయాలని నాపై ఎవరూ అంత ఒత్తిడి చేయలేదు. అది నా నిర్ణయమే. ప్రజలే నన్ను ఎన్నుకున్నారు. అందుకే వారి కోసం పని చేస్తా''అని ఆమె చెప్పారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన కొంత సేపటికే ఓ స్థానికురాలిని కలిసేందుకు ఆమె తన కారులో వెళ్లారు.
కొందరు జర్నలిస్టులు ఆమె వెనుక వెళ్లారు. ఆమెతో ఫోటో తీసుకొనేందుకు చాలా మంది ప్రయత్నించారు.
''నేను మరీనాకు ఓటు వేశాను. ఆమెపై నాకు విశ్వాసముంది. ఆమె తెలివైనది. విజయం సాధిస్తుంది కూడా''అని ఓ మహిళ విలేకరులతో చెప్పారు.
స్థానిక నాయకులకు ఇచ్చే శిక్షణకు త్వరలో మరీనా వెళ్లబోతున్నారు. స్థానిక బడ్జెట్ నిర్వహణ, పరిపాలన తదితర అంశాలను ఆమె అక్కడ నేర్చుకుంటారు.

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
గ్రామం ఏం అనుకుంటోంది?
మరీనా గురించి గ్రామస్థులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు మేం పొవాలిఖినో అంతా తిరిగాం. స్థానిక దుకాణంలో పసుపు రంగు కోటు వేసుకున్న ఓ వృద్ధురాలిని కలిశాం. అయితే ఆమె మరీనాకు బంధువని అప్పుడే తెలిసింది.
''ఆమె నా కోడలు. ఆమె తన విధులు సరిగ్గానే నిర్వర్తిస్తుందని అనుకుంటున్నా. ఆమె చేయాలి. చేస్తుంది కూడా. లేకపోతే ఆమె రాజీనామా చేయాలి''అని ఆమె సూటిగా చెప్పారు.

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
గులాబీ రంగు స్కార్ఫ్ కట్టుకున్న మరో మహిళతోనూ మేం మాట్లాడాం. మరీనా విజయం సాధించిందని తెలిసి చాలా సంతోషించామని ఆమె చెప్పారు.
''మాకు కొత్త పాలకులు కావాలి. మార్పు తీసుకువచ్చేందుకు ఆమెకు ఒక అవకాశం దొరకడం చాలా సంతోషంగా ఉంది. గ్రామాన్ని మార్చేందుకు ఆమె ప్రయత్నించాలి''
ఆమెలానే మిఖాయిల్ అనే వ్యక్తి కూడా మాట్లాడారు. అతడు పొద్దుతిరుగుడు విత్తనాలు తింటూ నాతో మాట్లాడారు.

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
''కాలమే ఆమెకు పాఠాలు నేర్పుతుంది. ఆమె అన్నీ నేర్చుకుంటారు. ఆమెకు వయసుంది. అందమైనది. సరదాగా కూడా ఉంటుంది''
అదే సమయంలో నికోలాయ్ కూడా మంచివాడేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవాన్ అనే మరో వ్యక్తి కూడా మాతో మాట్లాడారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు. ఇదివరకటి మేయర్ పనితీరు తనకు నచ్చలేదని చెప్పారు. తను ఓటు వేయలేదనీ వివరించారు.
''గ్రామంలో వీధి దీపాలు వెలిగేలా ఆయన చేయలేకపోయాడు''.
ఎందుకు ఓటు వేయలేదు? అని ఆయన్ని అడగ్గా.. ఓడ్కా ధరలు తగ్గేలా చూస్తామని ఇచ్చిన హామీపై 1990ల్లో ఒక పార్టీకి తను ఓటు వేశానని చెప్పారు.
''కానీ అప్పుడు ధరలు తగ్గలేదు. దీంతో అప్పటి నుంచి ఓటు వేయాలని అనిపించలేదు''అంటూ అసంతృప్తితో ఆయన తల ఊపారు.
అయితే, అప్పటి నుంచీ ఆల్కహాల్ మానేశానని ఆయన వివరించారు. ఆన్‌లైన్ వీడియోలు చేయడం, బోట్ల తయారీపై తాను దృష్టి పెట్టానని చెప్పారు.

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
పుతిన్ పార్టీపై ఏమైనా..
మరీనా విజయాన్ని రష్యాలోని అధికార పుతిన్ పార్టీకి ఓటమిగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి.
పుతిన్ పార్టీ తనఫున బరిలోకి దిగిన మేయర్‌ను ఎలాంటి రాజకీయ నేపథ్యమూలేని మహిళ ఓడించారంటే కచ్చితంగా ఇది ఒకరకమైన ఎదురుదెబ్బే. ఎందుకంటే ఆమె కనీసం ప్రచారం కూడా చేపట్టలేదు.
మరీనా కథ మాస్కోకు కూడా చేరింది. రష్యా సెంట్రల్ ఎలక్టోరల్ కమిషన్ (సీఈసీ) కూడా దీనిపై స్పందించారు.
''సాంకేతిక పరమైన అడ్డంకులను తొలగించేందుకు మరీనా బరిలోకి దిగారు. అందులో తప్పేమీలేదు. ఆమెకు స్థానికులు మద్దతు పలికారు. ఒక క్లీనింగ్ చేసే మహిళగా ఆమె ఈ విజయాన్ని ఊహించి ఉండరు''అని సీఈసీ ఛైర్‌వుమన్ ఎల్లా పమాఫిలోవా వ్యాఖ్యానించారు.
అయితే, ఊహించని రీతిలో మరీనా విజయం సాధించినప్పటికీ తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని యునైటెడ్ రష్యా ప్రాంతీయ విభాగం అధిపతి గెలనీ పలియాకోవా.. బీబీసీ రష్యా సేవలతో చెప్పారు.
''ఇతర జిల్లా పరిపాలకుల్లానే మరీనాకు కూడా ఒకరు మార్గనిర్దేశం చేస్తారు. అవును ఇది ఊహించని పరిణామమే. కానీ ప్రమాదం అయితే కాదు''అని పలియాకోవా వ్యాఖ్యానించారు.
''యునైటెడ్ రష్యా అభ్యర్థి ఓడిపోవడంలో తప్పేముంది. కొన్నిసార్లు వేరే పార్టీ అభ్యర్థులకూ ప్రజలు ఓట్లు వేస్తారు. బహుశా ఆమె మంచి వక్త అయ్యుండొచ్చు. ఆమెకు మంచి వ్యాపార నైపుణ్యాలు ఉండి ఉండొచ్చు. ఆ మేయర్‌కు అలాంటి నైపుణ్యాలు కొరవడి ఉండొచ్చు''.

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
వ్యూహాత్మక ఓటింగ్
యునైటెడ్ రష్యా పార్టీకి కాకుండా వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయడాన్ని వ్యూహాత్మక, భారీ మార్పుగా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ చెబుతున్నారు.
సైబీరియా గరం టోమస్క్ పర్యటనలో ఆయన ఈ విషయంపై ప్రచారం చేపట్టాలని భావించారు. అయితే అక్కడ ఆయనపై విష ప్రయోగం జరిగింది.
దీని వెనుక పుతిన్ ఉన్నారని నావల్నీ ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Yevgeny Zhuravlev / BBC
కోస్ట్రోమా ప్రాంతంలోని పొవాలిఖినో ఓ మారుమూల గ్రామీణ ప్రాంతం. ఇక్కడివారు అలెక్సీ నావల్నీ, ఆయన రాజకీయాలకు మద్దతు పలకొచ్చు. పలకకపోనూవచ్చు.
అయితే, ఈ చిన్న నగరం ఊహించని రీతిలో ఒక కొత్త అభ్యర్థికి పట్టం కట్టింది. ఈ మార్గాన్ని మరికొన్ని రష్యా గ్రామాలు, పట్టణాలు, నగరాలూ అనుసరించొచ్చు.
ఇవి కూడా చదవండి:
- సరిహద్దుల్లో విధులకు వెళుతూ చైనా సైనికులు ఏడ్చేశారా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏంటి? వీటికి పరిష్కారాలు ఏంటి?
- కరోనావైరస్ వల్ల కంటి సమస్యలు వస్తున్నాయా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









