రష్యాలో ప్రభుత్వ విమర్శకులపై ఎన్నెన్నో విష ప్రయోగాలు... చేసేదెవరు? ఆ రహస్యాలు ఎందుకు బయటకు రావు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, లారెన్స్ పీటర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యాలో గత రెండు దశాబ్దాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే ప్రముఖ నాయకులు, పాత్రికేయులు, మాజీ గూఢచారుల్లో చాలా మందిపై విషప్రయోగాలు జరిగాయి.
రష్యా గూఢచర్య సంస్థలో ఇదివరకు పనిచేసిన ఇద్దరిపై బ్రిటన్‌లో ఇలాంటి దాడులు జరిగాయి. 2006లో అలెగ్జాండర్ లిత్వినెంకోపై రేడియోధార్మిక పొలోనియం-210తో దాడి జరిగింది. ఆయన చనిపోయారు. 2018లో సెర్జీ స్క్రిపాల్‌పై నోవిచోక్ అనే నర్వ్ ఏజెంట్‌తో దాడి జరిగింది. ఈ రెండు ఘటనల్లో తమ పాత్ర గురించి వచ్చిన ఆరోపణలను రష్యా ప్రభుత్వం ఖండించింది.
ఇటీవల రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీపైనా విష ప్రయోగం జరిగింది. అయితే, ఈ వ్యవహారం గురించి వివరాలు ఎక్కువగా బయటకు రావడం లేదు.
రష్యా పాత్ర ఉందని అనుమానమున్న విష ప్రయోగ ఘటనల్లో చాలావరకూ రహస్యాలు బయటకురాకుండా పోతాయి.
మామూలుగా హత్య చేయడం కన్నా, విష ప్రయోగంతో అంతమొందిస్తే... హంతకులు చేతులు దులుపుకునేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి.
‘‘తమ పాత్ర బయటపడకుండా విష ప్రయోగం చేయడం చాలా తేలిక. దీనిలో దోషులు ఎవరో తేల్చడం చాలా కష్టం. విషం పనిచేసేందుకు కాస్త సమయం తీసుకుంటుంది. బాధితులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. సూత్రధారులు తాము చేయలేదని చెబుతూనే, పంపాలనుకున్న సంకేతాన్ని పంపవచ్చు’’ అని బ్రిటన్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లోని రష్యా వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ మార్క్ గెలియోట్టీ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అంతుచిక్కని విష ప్రయోగాలు
నలభై నాలుగేళ్ల అలెక్సీ నావల్నీ రష్యా అధ్యక్షుడిని తీవ్రంగా విమర్శిస్తుంటారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశారు.
ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తూ ఆయన చేసే ప్రసంగాల వీడియోలకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇటీవల రష్యాలో రాజ్యాంగ సంస్కరణలపై నిర్వహించిన ఓటింగును కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ చర్య రాజ్యాంగ వ్యతిరేకం, కుట్ర అని నావల్నీ విమర్శించారు.
ఆగస్టు 20న విమానంలో ప్రయాణిస్తుండగా నావల్నీ అనారోగ్యానికి గురికావడంతో ఓమ్స్క్‌లో విమానాన్ని అత్యవసరంగా దించి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన తీసుకున్న టీలో విషం కలిపి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
నావల్నీ అనుచరులు, ఉద్యమకారులు కొందరు ఇప్పటికే జైళ్లలో ఉన్నారు. కొందరి మీద దాడులు జరిగాయి. చంపేస్తామనే బెదిరింపులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం నావల్నీ బెర్లిన్ ఆస్పత్రిలో కోమాలో ఉన్నారు. ఇది ఆయనపై జరిగిన రాజకీయ దాడే అని సన్నిహితులు బలంగా చెబుతున్నారు.
2006లో రష్యాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, పుతిన్ విమర్శకురాలు అన్నా పొలిట్కోవస్కాయాను కొందరు కాల్చి చంపారు. అంతకుముందు 2004లో ఓసారి విమానంలో ప్రయాణిస్తుండగా ఆమెపై విషప్రయోగం జరిగినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి.
ఇదే తరహాలో లిత్వినెంకోపై పొలోనియం-210 విషప్రయోగం జరిగింది. తీవ్ర యాతన అనుభవిస్తూ ఆయన చనిపోయారు. పొలోనియం-210 నెమ్మదిగా పనిచేసే విషం. రేడియా ధార్మికతను కొలిచేందుకు ఉపయోగించే గీజర్ కౌంటర్ పొలోనియం-210 రేడియా ధార్మికతను గుర్తించలేదు. లిత్వినెంకో చనిపోయిన కొన్ని వారాలకు పొలోనియం-210తో ఆయన చనిపోయినట్లు గుర్తించారు.
కానీ, అప్పటికే దేశం దాటి పారిపోయేందుకు హంతకులకు కావాల్సినంత సమయం దొరికింది.
ఈ హత్యలో ఇద్దరు రష్యన్ హంతకుల పాత్ర ఉందని, వారు రష్యా ప్రభుత్వం కోసం పనిచేశారని ఆ తర్వాత బ్రిటన్ విచారణలో తేలింది.
ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో లండన్‌లో 1978లో బల్గేరియాకు చెందిన కమ్యూనిస్టు వ్యతిరేక జర్నలిస్ట్ జార్జీ మార్కోవ్‌ను ఓ గొడుగు సాయంతో అంతమొందించారు. రిసిన్ అనే విషపదార్థమున్న చిన్న బిల్లను, గొడుగుతో పొడిచి నేరుగా జార్జీ శరీరంలోకి ఎక్కించారు. బల్గేరియా అప్పట్లో సోవియట్ యూనియన్ మిత్ర దేశంగా ఉండేది.

ఫొటో సోర్స్, EPA
రష్యా ప్రభుత్వానికి పక్కలో బళ్లెం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యాను ‘‘దొంగలు, దోపిడీదారుల పార్టీ’’ అని నావల్నీ దూషిస్తుంటారు. పుతిన్ మద్దతురాలే కాకుండా, నావాల్నీకి రష్యాలో చాలా మంది శత్రువులు ఉన్నారు.
‘‘నావల్నీపై విషప్రయోగం విషయంలో రష్యా ప్రభుత్వం కాస్త అయోమయానికి గురైంది. దీన్ని బట్టి ఇది కేంద్ర స్థాయిలో ప్రణాళిక వేసి, రచించిన ఆపరేషన్ కాకపోవచ్చని అనిపిస్తోంది. దీని వెనుక ప్రభుత్వమే ఉండనక్కర్లేదు, రష్యాలో శక్తిమంతమైన వ్యక్తి ఎవరైనా చేసి ఉండొచ్చు’’ అని గెలియోట్టీ అభిప్రాయపడ్డారు.
బెర్లిన్‌లోని ఓ ఆసుపత్రిలో ఇప్పుడు నావల్నీ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఆయన ఇప్పుడు కోమాలో ఉన్నారు.
నావల్నీపై ఏ విష పదార్థాలు ప్రయోగించారన్నది ఇంకా గుర్తించలేదని, అందుకోసం ఇంకా పరీక్షలు చేస్తున్నామని ఆ ఆసుపత్రి తెలిపింది.
ఆ విషం మాత్రం శరీరంలో నాడీకణాలకు సంబంధించిన కోలినైస్టెరేస్ ఎంజైమ్‌పై ప్రభావం చూపుతోందని కొన్ని స్వతంత్ర ప్రయోగశాలలు తేల్చాయి.
సరిన్, వీఎక్స్, నోవిచోక్ లాంటి నాడీవ్యవస్థపై ప్రభావం చూపే నర్వ్ ఏజెంట్లు ఇలాంటి ప్రభావాలు చూపిస్తాయి. మెదడు పంపే రసాయన సంకేతాలను మార్చి... కండరాలు, ఊపిరితిత్తులు, గుండె పనితీరును దెబ్బతీస్తాయి.
పుతిన్ విమర్శకుల్లో ఒకరైన వ్లాదిమిర్ కారా ముర్జా కూడా 2015, 2017ల్లో తాను ఇలాంటి లక్షణాలే ఎదుర్కొన్నానని బీబీసీతో చెప్పారు.
‘‘రష్యన్ గూఢచార సంస్థలు విషప్రయోగాన్ని ఓ పైశాచిక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయి. తొలిసారి విషప్రయోగానికి గురైనప్పడు, నేను నడవడం కూడా మళ్లీ నేర్చుకోవాల్సి వచ్చింది. తీవ్ర యాతన అనుభవించా’’ అని ముర్జా అన్నారు.

ఫొటో సోర్స్, PA Media
జాప్యం ఎందుకు?
నావల్నీపై విషప్రయోగం జరిగినట్లు ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు ఇంకా నిర్ధారణకు రాలేదని, ఈ విషయమై ఇప్పుడే అధికారిక విచారణ మొదలుపెట్టలేమని పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.
నావల్నీని ఓమ్స్క్ నుంచి బెర్లిన్‌కు తరలించేందుకు అనుమతి ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేసింది. నావల్నీ శరీరంలో విషపు ఆనవాళ్లు లేకుండా చేసేందుకే ఇలా చేశారని ఆరోపణలు వచ్చాయి.
నావల్నీ రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడం వల్ల అనారోగ్యం పాలై ఉండొచ్చని ఓమ్స్క్ వైద్యులు అభిప్రాయపడటం విమర్శలకు దారితీసింది.
ఓమ్స్క్‌లో నావల్నీకి విషానికి విరుగుడుగా ఆట్రోపిన్‌ను ఇచ్చినట్లు వెల్లడైంది.
‘‘ఇలాంటి విషప్రయోగ కేసుల్లో ఆట్రోపిన్‌ను సుదీర్ఘ సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఓమ్స్క్‌లో అలా ఇవ్వలేదు’’ అని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన మాజీ నిపుణుడు మికాయిల్ ఫ్రెమ్డర్మన్ అన్నారు.
రకరకాల రసాయనాలు
నావల్నీపై ప్రభావం చూపిస్తున్న విష పదార్థం తరహాలో పనిచేసే పదార్థాలు చాలా ఉంటాయని, అందుకే దాన్ని గుర్తించడం చాలా కష్టం అవుతుందని బ్రిటన్‌కు చెందిన రసాయనిక ఆయుధాల నిపుణుడు ప్రొఫెసర్ అలస్టేర్ హే అన్నారు.
‘‘ఓక వ్యక్తిని చంపడానికి చిన్న మోతాదు చాలు. ఏదైనా డ్రింక్‌లో దీన్ని కలిపి ఇవ్వడం చాలా తేలిక. సాధారణ రక్త పరీక్షల్లో ఈ విష పదార్థం ఏంటన్నది తేలదు. చాలా అధునాతన పరీక్షలు అవసరం. చాలా ఆసుపత్రుల్లో అలాంటి ప్రయోగశాలలు గానీ, నిపుణులు గానీ ఉండరు’’ అని బీబీసీతో హే అన్నారు.
రసాయనిక ఆయుధాల ఉత్పత్తి, వినియోగం చేయకుండా 190 దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందంపై రష్యా కూడా సంతకం చేసింది.
ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అంతర్జాతీయ పర్యవేక్షణ నడుమ 40 వేల టన్నుల రసాయనిక ఆయుధాలను రష్యా నాశనం చేసిందని ప్రొఫెసర్ హే గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి:
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- హైదరాబాద్‌లో 6 లక్షల మందికి కరోనా సోకిందని సీసీఎంబీ అంచనా
- రూ. 2.55 కోట్లకు అమ్ముడుపోయిన మహాత్మాగాంధీ బంగారు కళ్లద్దాలు
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








