అలెక్సీ నావల్నీ: విష ప్రయోగానికి గురైన పుతిన్ ప్రత్యర్థికి జర్మనీలో వైద్య చికిత్స

వైద్య చికిత్స కోసం నావల్సీని ప్రత్యేక ఎయిర్ అంబులెన్సులో బెర్లిన్ నగరానికి తరలించారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వైద్య చికిత్స కోసం నావల్సీని ప్రత్యేక ఎయిర్ అంబులెన్సులో బెర్లిన్ నగరానికి తరలించారు

విష ప్రయోగానికి గురైనట్లుగా భావిస్తున్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని చికిత్స కోసం జర్మనీ తరలించారు.

నావల్నీ గురువారం నుంచి కోమాలోనే ఉన్నారు. కాగా చికిత్స కోసం జర్మనీ తరలించే పరిస్థితి లేదని శుక్రవారం సైబీరియా వైద్యులు తెలిపారు. కానీ, తర్వాత ఆయన పరిస్థితి మెరుగైందని, విమానయానం చేసేందుకు అనుకూలంగా ఉన్నారని చెప్పడంతో శనివారం ఆయనను సైబీరియా నుంచి జర్మనీ తరలించారు.

మరోవైపు ఆయన శరీరంలో ఎలాంటి విషపు ఆనవాళ్లు కనిపించలేదని వైద్యులు చెప్పారు.

నావల్నీ

ఫొటో సోర్స్, Reuters

జర్మనీలోని బెర్లిన్ కేంద్రంగా పనిచేసే సినిమా ఫర్ పీస్ ఫౌండేషన్ ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసింది.

ఆ ఎయిర్ అంబులెన్స్ శుక్రవారం ఉదయమే నావల్నీ చికిత్స పొందుతున్న ఓమ్స్క్‌ నగరానికి చేరుకుంది.

శనివారం ఆయనను తీసుకుని బెర్లిన్ చేరుకుంది. బెర్లిన్ నగరంలోని ఛారిటీ ఆస్పత్రిలో నావల్నీకి వైద్య చికిత్స అందిస్తున్నారు.

యూలియా నావల్నయా

ఫొటో సోర్స్, Instagram/yulianavalnaya

ఫొటో క్యాప్షన్, యూలియా నావల్నయా

పుతిన్‌కు లేఖ రాసిన నావల్నీ భార్య

అంతకు ముందు.. తన భర్తను జర్మనీ తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలంటూ నావల్నీ భార్య యూలియా నావల్నయా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు.

పుతిన్ అధికార ప్రతినిధి గురువారం మాట్లాడినప్పుడు నావల్నీని చికిత్స కోసం విదేశాలకు తరలించేందుకు ప్రభుత్వం సహాయపడుతుందని చెప్పారు. కానీ, శుక్రవారం మాత్రం ఆయన ఇలా తరలించడం నావల్నీ ప్రాణాలకే ప్రమాదమని చెప్పుకొచ్చారు.

మరోవైపు నావల్నీకి చికిత్స చేస్తున్న ఆసుపత్రి కూడా ఈ పరిస్థితుల్లో ఆయన్ను అప్పగించబోమని చెప్పింది.

తన భర్తపై జరిగిన విషప్రయోగాన్ని కప్పిపుచ్చేందుకే ఆసుపత్రి వైద్యులు ఇలా చేస్తున్నారని యూలియా ఆరోపించారు.

నావల్నీ శరీరంలో ఉన్న విషపదార్థం పూర్తిగా కరిగిపోయేవరకు ఇలా చేస్తారని.. ఈ ఆసుపత్రిని నమ్మలేమని యూలియా అన్నారు.

విమానంలో ఉండగా కుప్పకూలిన నేత

రష్యాలోని ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగినట్లు గురువారం ఆయన అధికార ప్రతినిధి కిరా యార్మిష్ వెల్లడించారు.

విమానంలో ప్రయాణిస్తుండగా నావెల్నీ అనారోగ్యానికి గురికావడంతో ఓమ్స్క్‌లో విమానాన్ని అత్యవసరంగా దించి ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లు కిరా తెలిపారు.

ఆయనకు అందించిన టీలో ఏదో కలిపి ఉంటారని కిరా అనుమానం వ్యక్తంచేశారు.

కాగా, నావల్నీ త్వరగా కోలుకోవాలంటూ రష్యా అధ్యక్ష కార్యాలయం ఆకాంక్షించింది.

నలభై నాలుగేళ్ల అలెక్సీ నావల్నీ రష్యా అధ్యక్షుడిని తీవ్రంగా విమర్శించే నేత. ఇటీవల రష్యాలో రాజ్యాంగ సంస్కరణలపై నిర్వహించిన ఓటింగును కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ చర్య రాజ్యాంగ వ్యతిరేకం, కుట్ర అని నావెల్నీ విమర్శించారు.

కిరా యార్మిష్

ఫొటో సోర్స్, Instagram/kirayarmysh

ఫొటో క్యాప్షన్, కిరా యార్మిష్

నావల్నీ అధికార ప్రతినిధి కిరా యార్మిష్ ఏం చెప్పారు?

''ఈ రోజు ఉదయం నావెల్నీ టామ్స్క్ నుంచి మాస్కో వస్తుండగా మార్గమధ్యంలో అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఓమ్స్క్‌లో విమానాన్ని అత్యవసరంగా దించారు. నావెల్నీపై విషప్రయోగం జరిగింది'' అని కిరా ట్వీట్ చేశారు.

అలెక్సీ నావల్నీ 2011లో స్థాపించిన యాంటీ కరప్షన్ ఫౌండేషన్‌కు కిరా యార్మిష్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

ఈ రోజు ఉదయం నుంచి నావెల్నీ కేవలం టీ మాత్రమే తీసుకున్నారు.. కాబట్టి అందులోనే ఏదో కలిపి ఉంటారని అనుమానిస్తున్నాం అన్నారామె.

''వేడిగా ఉండే ద్రవపదార్థాలలో కలిసి విషం వేగంగా శరీరంలో వ్యాపిస్తుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం నావల్నీ అపస్మారక స్థితిలోనే ఉన్నార''ని కిరా ట్వీట్ చేశారు.

అనంతరం ఆమె నావల్నీ వెంటిలేటర్‌పై ఉన్నారని, కోమాలో ఉన్నారని ట్వీట్ చేశారు.

ఆసుపత్రి మొత్తం పోలీసులతో నిండిపోయిందని.. నావల్నీకి సంబంధించిన వస్తువులను వెతకాలని పోలీసులు అంటున్నారని ఆమె చెప్పారు.

డాక్టర్లు మొదట సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం టాక్సికాలజీ టెస్టుల ఫలితాలు రావడం ఆలస్యమవుతోందని చెబుతున్నారని.. వారిప్పుడు కాలయాపన చేస్తున్నారని.. సమాచారం బయటకు రానివ్వడం లేదని కిరా ఆరోపించారు.

ఆమె చివరిగా చేసిన ఓ ట్వీట్(రష్యా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.58)లో నావల్నీ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు తెలిపారు.

నావల్నీ భార్య, వ్యక్తిగత డాక్టర్ ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ వారిని అనుమతించలేదని కిరా తెలిపారు.

స్ట్రెచర్‌పై తరలిస్తున్న దృశ్యం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అస్వస్థతకు గురైన తరువాత నావల్నీని ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై స్ట్రెచర్ మీద తీసుకెళ్లి అంబులెన్సులో ఎక్కిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

ఎయిర్‌పోర్టులో టీ తాగారు

రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజెన్సీ కూడా ఓమ్స్క్‌లో నావల్నీని చేర్చిన ఆసుపత్రిని ఉటంకిస్తూ విషప్రయోగానికి గురైనట్లు తెలిపింది.

అయితే, ఆ ఆసుపత్రి డిప్యూటీ హెడ్ ఫిజిషియన్ అనతోలీ కలినిచెంకో మాత్రం నావల్నీ విషప్రయోగానికి గురైనట్లు స్పష్టంగా చెప్పలేమన్నారు.

నావల్నీని బతికించడానికి వైద్యులు కృషి చేస్తున్నారని అనతోలీ చెప్పారు.

రష్యా అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ దీనిపై మాట్లాడుతూ నావల్నీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పౌరులెవరైనా విదేశాల్లో చికిత్స చేయించుకోవాలని కోరితే అందుకు అనుమతి లభిస్తుందని అన్నారు.

కాగా అస్వస్థతకు గురైన తరువాత నావల్నీని ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై స్ట్రెచర్ మీద తీసుకెళ్లి అంబులెన్సులో ఎక్కిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

మరో వీడియోలో నావల్నీ విమానంలో బాధతో మెలితిరగడం కనిపిస్తోంది.

''నావల్నీ విమానంలోని టాయిలెట్‌కు వెళ్లారు.. అక్కడి నుంచి తిరిగి రాలేదు. అక్కడ బాధతో అరుస్తుండడంతో సిబ్బంది ఆయన్ను బయటకు తెచ్చారు'' అని అదే విమానంలో ప్రయాణిస్తున్న పావెల్ లెబెదేవ్ అనే ప్రయాణికుడు తెలిపారు.

కాగా టామ్స్క్ ఎయిర్‌పోర్టులోని కేఫ్‌లో నావల్నీ టీ తాగుతున్న ఫొటో కూడా ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది.

ఆ కేఫ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారని ఇంటర్‌ఫాక్స్ ఏజెన్సీ తెలిపింది.

మ్యాప్

నావల్నీపై గతంలోనూ విషప్రయోగం?

రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ నావల్నీ నిరసన చేపట్టడంతో 2011లో ఆయ్ను అరెస్టు చేసి 15 రోజులు జైలులో పెట్టారు.

2013 జులైలో నావల్నీని నిధుల దుర్వినియోగం ఆరోపణలపై అరెస్టు చేసి జైలులో పెట్టారు. అయితే, రాజకీయ దురుద్దేశాలతో తనను ఇరికించారంటూ నావల్నీ వాదించారు.

2018 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ప్రయత్నించారు. కానీ, అవినీతి ఆరోపణల కేసుల్లో దోషిగా తేలారంటూ ఆయనపై అనర్హత విధించారు.

అనుమతి లేకుండా నిరసనలకు పిలుపునివ్వడంతో 2019లో ఆయన్ను నెల రోజుల్లో జైలులో పెట్టారు.

అప్పుడు జైలులో ఉన్నప్పుడే ఆయన 'కాంటాక్ట్ డైర్మటైటిస్' అనే చర్మవ్యాధికి గురయ్యారు. అయితే, తనకు ఎలాంటి అలర్జీలు లేవని నావల్నీ అప్పట్లోనే చెప్పారు. జైలులో నావల్నీ విషప్రయోగానికి గురైనట్లు ఆయన, వ్యక్తిగత వైద్యుడు ఇద్దరూ అనుమానించారు.

2017లో ఆయనపై రంగు(యాంటీసెప్టిక్ డై)తో దాడి చేయగా అందులోని రసాయనాల కారణంగా ఆయన కుడి కంటి దిగువ భాగం కాలిపోయింది.

నావల్నీ స్థాపించిన యాంటీ కరప్షన్ ఫౌండేషన్‌ను రష్యా ప్రభుత్వం గత ఏడాది విదేశీ ఏజెంటుగా ప్రకటించింది.. దానివల్ల ఆ సంస్థలో ప్రభుత్వం మరిన్ని తనిఖీలు చేయడానికి వీలు కలిగింది.

పుతిన్

ఫొటో సోర్స్, EPA

గతంలోనూ పుతిన్ ప్రత్యర్థులపై కాల్పులు, విషప్రయోగాలు

నావల్నీపై విష ప్రయోగం కనుక నిజమే అయితే గతంలోనూ పుతిన్ విమర్శకులపై జరిగిన విషప్రయోగాల అంశం మరోసారి తెరపైకి రావడం ఖాయం.

రాజకీయ నాయకుడు బోరిస్ నెమ్‌త్సోవ్, జర్నలిస్ట్ అన్నా పొలిట్‌కొవాస్కయాలను తుపాకీ కాల్పుల్లో మరణించారు. ఇంటెలిజెన్స్ అధికారి అలెగ్జాండర్ లిత్వినెంకో బ్రిటన్‌లో విషప్రయోగం వల్ల చనిపోయారు. మరో జర్నలిస్టు వ్లాదిమిర్ కారా ముర్జాపై రెండు సార్లు రష్యా సెక్యూరిటీ సర్వీసు విషప్రయోగం చేసిందన్న విమర్శలున్నాయి. అయితే, ముర్జా రెండుసార్లూ ప్రాణాలతో బయటపడ్డారు.

వీటన్నిటి వెనుకా పుతిన్ హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)