ఒకేసారి వేల డ్రోన్లతో దాడులు చేయొచ్చా? భవిష్యత్‌లో యుద్ధాలు ఇలానే జరుగుతాయా

డ్రోన్లు

ఫొటో సోర్స్, Anadolu Agency

    • రచయిత, మానసీ దాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా వాహన శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. మరోవైపు దాడిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ కూడా సిద్ధమైంది.

యుద్ధ విమానాలు, సాయుధ ట్యాంకులు, ఇతర ఆయుధాల విషయంలో యుక్రెయిన్ సైన్యంతో పోలిస్తే రష్యా సైన్యం చాలా ముందుంటుంది. కానీ, వారాలు గడుస్తున్నా రష్యా సేనలు మాత్రం ముందుకు కదిలి వెళ్లలేకపోతున్నాయి.

ఈ యుద్ధంలో యుక్రెయిన్ శక్తిమంతమైన డ్రోన్లను ఉపయోగిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ డ్రోన్లతోనే రష్యా సైన్యాన్ని అడ్డుకోవడంలో విజయం సాధిస్తున్నారని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రష్యా సైనికులు రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతల నడుమ రైళ్లలో గడపాల్సి వస్తోంది. చలి నుంచి తమని తాము కాపాడుకోవడానికి వీరు రైళ్లు, యుద్ధ ట్యాంకుల ఇంజిన్లను ఆన్‌లో ఉంచాల్సి వస్తోంది. దీంతో వీరిని యుక్రెయిన్ డ్రోన్లు తేలిగ్గానే పసిగట్టగలుగుతున్నాయి. రష్యా సైనికులు ఎక్కడెక్కడున్నారో కనిపెట్టడంతోపాటు వారిపై డ్రోన్ల సాయంతో యుక్రెయిన్ దాడులు కూడా చేపడుతోంది.

యుద్ధ క్షేత్రాల్లో డ్రోన్ల సంఖ్య పెరుగుతుండటంతో, భవిష్యత్తులో కేవలం డ్రోన్లతోనే యుద్ధాలు జరుగుతాయా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

డ్రోన్లు

ఫొటో సోర్స్, BFI National Archive @Youtube

డ్రోన్ల చరిత్ర ఇదీ

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధంలో శత్రువులపై పైచేయి సాధించేందుకు మానవ రహిత విమానాల(యూఏవీ) వాడటం పెరిగిందని బ్రిటన్‌లోని లబ్రో యూనివర్సిటీలో వార్ స్టడీస్ ప్రొఫెసర్ కరోలిన్ కెన్నడీ చెప్పారు.

‘‘మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండు రకాల ఆవిష్కరణల గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. వీటిలో మొదటిది క్షిపణులు. ఇవి నిర్దేశిత మార్గాల్లో దూసుకెళ్తూ లక్ష్యాలపై దాడులు చేసేవి. రెండోది నిఘా సమాచారం సేకరించే, రక్షణ సామగ్రి గమ్యానికి చేర్చే వాహనాలు. వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించేలా అభివృద్ధి చేస్తున్నారు’’అని కరోలిన్ వివరించారు.

‘‘ముఖ్యంగా యుద్ధంలో సైనికులను కోల్పోయిన పశ్చిమ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాయి. శత్రువుల భూభాగాల్లో తిరుగుతూ వారిపై దాడులుచేసే విమానాల అభివృద్ధి దిశగా వారు పనులు మొదలుపెట్టారు. ముఖ్యంగా తమ సైనికుల ప్రాణాలను కాపాడటంపై వారు దృష్టిపెట్టారు’’అని ఆమె పేర్కొన్నారు.

లండన్‌లో జన్మించిన శాస్త్రవేత్త అర్చిబాల్డ్ బ్రిటన్ సైన్యంలో చేరారు. రాయల్ ఫ్లైయింగ్ కోర్‌లో ఆయన పనిచేశారు. ఆయన్ను రేడియో గైడెన్స్ సిస్టమ్ పితామహుడిగా కొనియాడేవారు. దూరం నుంచి నియంత్రించే విమానాలపై ఆయన పరిశోధనలు చేపట్టారు. 1917లో తొలిసారి మానవ రహిత వైమానిక వాహనాన్ని ఆయన పరీక్షించారు. అయితే, ఇది విఫలమైంది.

ఆ తర్వాత 1918లో శాస్త్రవేత్త చార్లెస్ కెటెరింగ్‌ను పైలట్ అవసరం లేకుండా గాల్లో తరలించగలిగే బాంబును తయారుచేయాలని అమెరికా సైన్యం కోరింది. ఆ బాంబుకు కెటెరింగ్ బగ్‌గా నామకరణం చేశారు. అది 3.8 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో సాధారణ విమానంలానే కనిపించేది. దీని సాయంతో 40 మైళ్ల దూరంలోని లక్ష్యాలపై దాడులు చేయొచ్చు.

డ్రోన్లు

ఫొటో సోర్స్, US Navy and Northrop Grumman via Reuters

వీటిని ‘‘పాయింట్‌లెస్ వెహికల్స్’’గా పిలిచేవారు. అయితే, వీటిని యుద్ధాల్లో ఉపయోగించలేదు. 1944లో విమానాలనే ఆయుధాలుగా ఉపయోగించడం మొదలుపెట్టారు.

‘‘వాటెన్, విసోర్నెస్, మిమోయెక్ ప్రాంతాల్లోని నాజీ జర్మనీ ఆయుధ స్థావరాలను ధ్వంసం చేసే మానవ రహిత వైమానిక వాహనం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ ప్రాంతాలు ప్రస్తుతం ప్రాన్స్‌లో ఉన్నాయి. అమెరికా తయారుచేసిన ఆ విమానాల్లో పేలుడు పదార్థాలను నింపి లక్ష్యాలపై దాడులు చేయించారు. నిజానికి ఇవి నిజమైన మానవ రహిత వైమానిక వాహనాలు కాదు. వీటిలో మొదట ఫ్లైట్ ఇంజినీర్లు ఉండేవారు. విమానం దాదాపు 2,000 అడుగుల ఎత్తులోకి వెళ్లిన తర్వాత పేలుడు పదార్థాల విస్ఫోటానికి అన్నీ సిద్ధంచేసి వీరు విమానం లోనుంచి బయటకు దూకేసేవారు’’అని కరోలిన్ చెప్పారు.

అలాంటి ఒక ఆపరేషన్‌లోని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ సోదరుడు జోసెఫ్ కెన్నడీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు విమానంలో ఉన్నవారు బయటకు రాకముందే పేలుడు పదార్థాలు విస్ఫోటం చెందాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

వియత్నాం యుద్ధ సమయంలోనూ నిఘా సమాచారం సేకరణతోపాటు తమకు అనుకూలంగా ప్రచారాలు చేపట్టేందుకు అమెరికా ఇలాంటి వైమానిక వాహనాలను ఉపయోగించింది.

డ్రోన్లు

ఫొటో సోర్స్, Getty Images

‘‘ముఖ్యంగా నిఘా కోసం ఆ వైమానిక వాహనాలను ఉపయోగించేవారు. వాటి నుంచి కరపత్రాలను వెదజల్లేవారు. వియత్నాంలో ఒకేసారి రెండు యుద్ధాలు జరిగేవి. ఒకటి నేరుగా యుద్ధ భూమిలో జరిగితే, రెండోది సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ప్రచారాలు చేపట్టేవారు. దీని కోసం వైమానిక వాహనాలను ఉపయోగించుకునేవారు’’అని కరోలిన్ చెప్పారు.

కాలం గడిచిన కొద్దీ ఈ సాంకేతికత అభివృద్ధి చెందింది. ‘‘1990ల్లో గల్ఫ్ యుద్ధం, కొసోవో యుద్ధాల్లో ఈ సాంకేతికతను మరింత అభివృద్ధిచేసి ఉపయోగించారు. ఇలాంటి వైమానిక వాహనాలతో పౌరుల మరణాలు కూడా తగ్గుతాయనే విశ్లేషణలు వచ్చాయి. ముఖ్యంగా శత్రువుల వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగేవి. ఫలితంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలకు గల్ఫ్ యుద్ధంలో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు’’అని కరోలిన్ వివరించారు.

ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో ఇలాంటి వైమానిక వాహనాలను ఉపయోగించారు. వీటి సాయంతో అమెరికాలో కూర్చుని అఫ్గానిస్తాన్‌లో మారుమూల ప్రాంతాలకు సంబంధించిన నిఘా సమాచారం సేకరించొచ్చు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ హయాంలో 50కిపైగా డ్రోన్ దాడులకు ఆదేశాలు జారీచేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. మరోవైపు బరాక్ ఒబామా 1,800, డోనల్డ్ ట్రంప్ 2,200 దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

‘‘ఆ తర్వాత కాలంలో డ్రోన్ల వాడకం క్రమంగా పెరుగుతూ వచ్చింది. సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలపై వీటితో దాడులు చేపట్టేవారు. అయితే, దీనికి కచ్చిమైన నిఘా సమాచారం అవసరం. లేకపోతే భారీ తప్పిదాలు జరిగే ముప్పుంటుంది. అమెరికా సైన్యంతోపాటు, గూఢచర్య సంస్థ సీఐఏ కూడా ప్రత్యేక డ్రోన్ ప్రాజెక్టులు చేపడుతోంది’’అని కరోలిన్ అన్నారు.

డ్రోన్లు

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధ క్షేత్రంలో..

అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో టెక్ పాలిసీ ల్యాబ్ డైరెక్టర్‌గా సారా క్రెప్స్ పనిచేస్తున్నారు. డ్రోన్లపై ఆమె రెండు పుస్తకాలు రాశారు. ‘‘ఇదివరకు సైన్యంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టే దేశాలు ప్రత్యర్థి దేశాల కంటే ముందు ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది’’అని సారా చెప్పారు.

‘‘ఇప్పుడు సైన్యం కోసం భారీగా డబ్బులు వెచ్చించలేకపోయినప్పటికీ, డ్రోన్లు ఉంటే పైచేయి సాధించొచ్చు. దీనితో కొన్ని ముప్పులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు? ఎటునుంచి? ఎలా దాడి జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. స్పోర్ట్స్ నుంచి ఇతర కార్యక్రమాల వరకు అన్నింటికీ డ్రోన్ దాడుల ముప్పు ఉంటుంది’’అని సారా అన్నారు.

ఇప్పుడు అమెరికాకు భద్రత అనేది చాలా సంక్లిష్టంగా మారుతోంది. ముఖ్యంగా చిన్నచిన్న డ్రోన్లు, ఐఈడీలతో దాడులను పసిగట్టేందుకు అమెరికా భద్రతా సంస్థల్లో ప్రత్యేక యూనిట్లు ఉన్నాయి.

‘‘ఐఈడీలు తయారుచేయడానికి ప్రత్యేక నైపుణ్యాలేమీ అవసరం లేదు. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్లు వీటిని తేలిగ్గానే తయారుచేస్తుంటారు. ఇలాంటి ఆయుధాలను నిర్వీర్యంచేసేందుకు అమెరికా బిలియన్ డాలర్ల డబ్బులను ఖర్చుపెడుతోంది’’అని సారా వివరించారు.

మరోవైపు పేద దేశాల్లోని మిలిటెంట్లు డ్రోన్లు, ఐఈడీలను విధ్వంసాలకు ఉపయోగించుకుంటున్నారని సారా ఆందోళన వ్యక్తంచేశారు.

డ్రోన్లతో దాడులు చేపట్టేటప్పుడు నిఘా సమాచారం పక్కాగా ఉండాలని, లేకపోతే విమర్శలను ఎదుర్కోక తప్పదని సారా అన్నారు.

‘‘అఫ్గానిస్తాన్‌లో గత ఏడాది అమెరికా చేపట్టిన ఓ డ్రోన్ దాడిపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. ఈ దాడిలో పది మంది పౌరులు మరణించారు. పొరపాటున వేరే లక్ష్యంపై డ్రోన్‌తో దాడిచేశామని అమెరికా సైనిక అధికారులు కూడా అంగీకరించారు’’అని సారా పేర్కొన్నారు.

డ్రోన్లు

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్ కూడా వీటితోనే

యుక్రెయిన్ గగన తలాన్ని తాము తేలిగ్గానే నియంత్రించగలమని తాజా యుద్ధం ప్రారంభ సమయంలో రష్యా అంచనా వేసింది. కానీ, యుక్రెయిన్ అధునాతన డ్రోన్లను ఉపయోగించడం మొదలుపెట్టింది. దీంతో యుక్రెయిన్ గగన తలంపై పట్టు సాధించడం రష్యాకు అసాధ్యంగా మారింది.

రష్యా సైన్యంపై భిన్న రకాల డ్రోన్లను యుక్రెయిన్ ఉపయోగిస్తోందని సీనియర్ జర్నలిస్టు, ‘‘స్వార్మ్ ట్రూపర్స్: హౌ స్మాల్ డ్రోన్స్ విల్ కాంక్వెర్ ద వరల్డ్’’ రచయిత డేవిడ్ హ్యాంబ్లింగ్ చెప్పారు.

‘‘రష్యా ట్యాంకులు, యాంటీ-ట్యాంక్ క్షిపణులను లక్ష్యంగా చేసుకునేందుకు యుక్రెయిన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలున్న ఈ డ్రోన్లు.. ఇంజిన్ల వేడి సాయంతో రష్యా యుద్ధ ట్యాంకులను గుర్తుపట్టేస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతల నడుమ చలి నుంచి కాపాడుకునేందుకు రష్యా సైనికులు ఇంజిన్లను ఆన్‌చేసి ఉంచుతున్నారు’’ అని డేవిడ్ చెప్పారు.

మరోవైపు బాంబులను జారవిడిచేందుకు కూడా యుక్రెయిన్ సైన్యం డ్రోన్లను ఉపయోగిస్తోంది.

డ్రోన్లు

ఫొటో సోర్స్, Getty Images

‘‘వారి దగ్గర సోవియట్ కాలం నాటి యాంటీ-ట్యాంకు గ్రెనేడ్లు ఉన్నాయి. ఇవి చాలా బరువుగా ఉంటాయి. వీటిని సైనికులు తీసుకెళ్లి ప్రయోగించడం చాల కష్టం. అందుకే వీటిని డ్రోన్ల సాయంతో రష్యా సైన్యంపై జారవిడుస్తున్నారు’’అని డేవిడ్ వివరించారు.

మరోవైపు యుక్రెయిన్ దగ్గర టర్కీ తయారుచేసిన బైరెక్టార్ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇవి విధ్వంసక దాడులను చేపట్టగలవు.

‘‘ఆ డ్రోన్లు 16 గంటలపాటు లక్ష్యాలపై ఎగరగలవు. లేజర్ గైడెడ్ క్షిపణులను కూడా ఇవి ప్రయోగించలవు’’అని డేవిడ్ చెప్పారు.

మరోవైపు యుక్రెయిన్ దగ్గర అమెరికా తయారుచేసిన స్విచ్‌బ్లేడ్ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇవి అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగలవు. ‘‘ఇవి ఒకేసారి రెండు లక్ష్యాలపై కూడా దాడులు చేయగలవు’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటి?

డ్రోన్లతో వ్యూహాలు..

‘‘డ్రోన్లను విక్రయించే చిన్నచిన్న వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు తమ డ్రోన్లను యుక్రెయిన్ సైన్యానికి అప్పగించాయి. అయితే, వీటితో నేరుగా దాడులు చేయలేకపోవచ్చు. కానీ, వీటితో రష్యా సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారో? ఏం చేస్తున్నారో? సమాచారం సేకరించొచ్చు’’అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ చెందిన వార్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ రోడ్జెర్స్ చెప్పారు.

మరోవైపు ప్రభుత్వాలతోపాటు ఇస్లామిక్ స్టేట్ లాంటి అతివాద సంస్థలు కూడా డ్రోన్లను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నాయని జేమ్స్ వివించారు.

అయితే, భవిష్యత్‌లో ఘర్షణాలు, యుద్ధాల్లో డ్రోన్లు ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఈ ప్రశ్నపై జెమ్స్ స్పందిస్తూ డ్రోన్ స్వార్మింగ్ దాడులు కూడా మొదలయ్యే అవకాశముందని అన్నారు.

‘‘స్వార్మింగ్ అంటే వేల డ్రోన్లు ఒకేసారి భిన్న ప్రాంతాలపై ప్రయోగిస్తారు. ఇవి భారీ సవాళ్లను విసురుతాయి. వీటిలో కొన్నింటిని మనం కాల్చేయొచ్చు. కానీ, కొన్ని లక్ష్యాలను చేరుకుంటాయి. ఇలాంటి వ్యూహాలు భవిష్యత్‌లో అనుసరించే అవకాశముంది’’అని ఆయన చెప్పారు.

భవిష్యత్‌లో స్వతంత్రంగా కదిలే డ్రోన్లు మరింత ఎక్కువవుతాయని ఆయన వివరించారు. ‘‘ఈ డ్రోన్లు ముందుగా ప్రోగ్రాంచేసిన అల్గారిథమ్‌ల సాయంతో ముందుకు వెళ్తాయి. లక్ష్యాలపై కచ్చితత్వంతో ఇవి దాడులు చేయగలవు. అదే సమయంలో వీటి వల్ల ప్రమాదాలు, ప్రాణనష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది’’అని ఆయన పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, నరమేధం అంటే ఏంటి?

ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో మానవ రహిత వైమాని వాహనాలు (డ్రోన్లు) కీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రువుల స్థావరాలను గుర్తించడం, సాయుధ బలగాలపై దాడులు చేయడం లాంటి పనులకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

బహుశా ఈ శతాబ్దంలో డ్రోన్లు ఇంతలా ఉపయోగించడం ఇదే మొదటిసారి కావొచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ డ్రోన్ల సామర్థ్యం మరింత పెరుగుతుంది. అయితే, ఈ డ్రోన్లకు ఎంతవరకు స్వేచ్ఛను ఇవ్వొచ్చు? ఇవి ఎంతవరకు స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోగలవు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

భవిష్యత్ యుద్ధ క్షేత్రాల్లో డ్రోన్లు తిరగడం సర్వసాధారణంగా మారొచ్చని, దాదాపు అన్ని యుద్ధాల్లోనూ వీటికి ప్రత్యేక పాత్ర ఉండే అవకాశముందని జేమ్స్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)