యుక్రెయిన్: 'నేను చూస్తుండగానే బాంబు పేలుడుకు నా కూతురు తల ఎగిరిపోయింది'

విక్టోరియా కోవాలెంకో
ఫొటో క్యాప్షన్, విక్టోరియా కోవాలెంకో
    • రచయిత, అనా ఫోస్టర్
    • హోదా, బీబీసీ న్యూస్

విక్టోరియా కోవాలెంకోకి ఆ క్షణాలు బాగా గుర్తున్నాయి.

"అకస్మాత్తుగా పేలుళ్లు వినిపించాయి. ఒక్కసారిగా ఏమీ వినిపించలేదు. మా కారు విండ్ స్క్రీన్ పగిలిపోయింది. "కారులోంచి దిగు" అని నా భర్త అరిచారు.

ఆ రోజు ఊహించలేని భీభత్సం చోటు చేసుకుంది.

(ఈ కథనంలోని సమాచారం మిమ్మల్ని కలవరపరచవచ్చు)

అప్పటికి యుక్రెయిన్ లో యుద్ధం మొదలై తొమ్మిది రోజులైంది. పోరాటం క్రమంగా ఉధృతం అవుతోంది. అదే సమయంలో విక్టోరియా కుటుంబంతో కలిసి చెర్నిహియెవ్ వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి పిల్లలను కాపాడుకోవడమే వారి లక్ష్యం. విక్టోరియా మొదటి భర్తతో కలిగిన సంతానం వెరోనికా. ఆ చిన్నారికి 12 సంవత్సరాలు. విక్టోరియాకు సంవత్సరం వయసున్న మరో కూతురు కూడా ఉంది.

విక్టోరియా, భర్త పెట్రోతో కలిసి ఇంట్లో తమకు అవసరమైన వస్తువులు తీసుకుని బయలుదేరారు. కారు నగరం పొలిమేరల్లోకి చేరేసరికి, రోడ్డుకు అడ్డంగా పడున్న పెద్ద పెద్ద రాళ్లు వారి దారికి ఆటంకం కలిగించాయి. పెట్రో కారు దిగి ఆ రాళ్లను పక్కకు తప్పించాలని చూశారు. మరి కొన్ని క్షణాల్లోనే వారి కారు మీద బాంబు పేలింది.

"కారు అద్దం పగిలి ఆ గాజు ముక్క నా తలకు తగలడంతో రక్తం రావడం మొదలయింది. అది చూసి వెరోనికా ఏడుపు మొదలుపెట్టింది" అని విక్టోరియా చెప్పారు.

ఇలా చెబుతూ ఆమె చెంపపై ఉన్న గాయాన్ని చూపించారు.

"వెరోనికా అరవడం మొదలుపెట్టింది. తన చేతులు వణికాయి. నేను తనని నెమ్మదించాలని చూశాను. తను కారు దిగిపోయింది. నేను తన వెంటే వెళ్లాను. నేను కారు దిగి చూసేసరికి తను కింద పడిపోయింది. అప్పటికే తన తల ఎగిరిపోయింది."

మరి కొన్ని క్షణాల్లో మా కారు కూడా దగ్ధమయింది.

వెరోనికా

ఫొటో సోర్స్, Kovalenko family

ఫొటో క్యాప్షన్, వెరోనికా

"నేను ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాను. నా చేతిలో మరో చిన్నారి ఉంది. తనను కాపాడుకోవాల్సిన అవసరముంది."

ఆమెకు పెట్రో కనిపించలేదు. ఆయన కూడా మరణించి ఉంటారని విక్టోరియాకు అనిపించింది.

ఆమె ఆ మండుతున్న కారు నుంచి దూరంగా పరుగు పెట్టారు. ఆ తర్వాత 24 గంటలూ ఆమె ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగు తీశారు.

విక్టోరియాకు ఒక షెల్టర్‌లో పార్క్ చేసిన కారులో ఆశ్రయం దొరికింది. కానీ, మరి కొంత సేపట్లోనే తిరిగి కాల్పులు మొదలయ్యాయి.

దగ్గర్లోనే ఉన్న ఒక చిన్న భవనం దగ్గరకు ఆమె పరుగు పెట్టారు. ఆ భవనాన్ని సైనికులు వాడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడే దాక్కుని ఫోన్‌లో బ్యాటరీ ఆదా చేసేందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. విక్టోరియాకు తనను, బిడ్డను ఎలా కాపాడుకోవాలో అర్ధం కాలేదు.

ఆ మరుసటి రోజు వారిద్దరూ రష్యన్ సేనల కళ్ళల్లో పడ్డారు. వారిని యహీన్ లో ఒక స్కూలుకు తీసుకుని వెళ్లి అక్కడ బేస్ మెంట్ లో బంధించారు.

ఆ తర్వాత ఆ తల్లీ బిడ్డలు దారుణమైన పరిస్థితుల మధ్య 24 రోజులు అక్కడే గడిపారు. ఆమె కళ్లెదుటే సరైన వైద్యం అందక ప్రాణాలు పోతున్నవారిని చూశారు. బీబీసీ ఆ బేస్ మెంట్ కు వెళ్ళి అక్కడున్న మిగిలిన బందీలతో మాట్లాడింది. శవాలను తీసుకెళ్లేవారు లేక కొన్ని గంటలు, రోజుల పాటు అక్కడే పడున్నాయని వారు చెప్పారు.

విక్టోరియా కోవాలెంకో, పెట్రో కోవాలెంకో

ఫొటో సోర్స్, Kovalenko family

ఫొటో క్యాప్షన్, Petro, who died at the scene of the attack, and Viktoria

"ఆ గదిలో 40 మంది ఉన్నారు. అక్కడ కదలడానికి గాని, అడుగు తీసి అడుగు వేయడానికి గాని ఖాళీ లేదు. వెలుతురు లేదు.

దాంతో, కొవ్వొత్తులు, సిగరెట్ లైటర్లు వాడేవారు. చాలా ధూళితో ఉండటంతో పాటు వేడిగా ఉండేది. దాంతో, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించేది" అని విక్టోరియా చెప్పారు.

"చాలా సార్లు టాయిలెట్ కోసం కూడా బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. బకెట్లలోనే టాయిలెట్ కు వెళ్లమనేవారు".

"దీంతో చాలా మంది జబ్బుపడ్డారు. కుర్చీలోనే కూర్చుని పడుకునేవారు. కొంత మందికి నరాలు పగిలి రక్తం కూడా వచ్చేది. మేము వారికి కట్లు కట్టేవాళ్ళం" అని విక్టోరియా గుర్తు చేసుకున్నారు.

అదే సమయంలో విక్టోరియా కూడా భర్త, కూతురిని పోగొట్టుకున్న వేదనను అనుభవిస్తున్నారు. ఆమె శక్తిని పూర్తిగా తన కూతురుని కాపాడటం మీదే పెట్టి వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించారు.

కానీ, పెట్రో, వెరోనికా మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు శవాలను స్కూలు దగ్గరకు తెమ్మని ఆమె రష్యన్ సైనికులను అడిగారు.

ఆమె మొదటి భర్తను కారు దగ్గరకు పంపి అక్కడ పడున్న అవశేషాల ఫోటోలు తీయమని చెప్పారు. వారు మనుషులనే ఆనవాళ్ళేమీ లేకుండాపోయాయి. ఆ కారులో ఏమీ మిగలలేదు.

దగ్ధమైన కారు

ఫొటో సోర్స్, Kovalenko family

ఫొటో క్యాప్షన్, దగ్ధమైన కారు

ఆ కారు దగ్గర కన్నాలు పడిన వెరోనికా దుస్తులు, హృదయాకారం గుర్తు ఉన్న బ్రేస్ లెట్, మంటల వేడికి రంగు వెలిసిన రెండు కారు నంబర్ ప్లేటులు కనిపించాయి.

మార్చి 12న మృతదేహాలను అప్పగించారు. ఆ రోజు విక్టోరియాకు ఇంకా గుర్తుంది.

"శవాలెక్కడ పడి ఉన్నాయో చూడవచ్చు. మాతో రా" అని వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు.

వాళ్ళను రెండు గోతుల్లో అడవిలో పూడ్చి పెట్టారు. ఒక శవపేటిక పెద్దగా, మరొకటి చిన్నది ఉంది. దాని పై శిలువ గుర్తులున్నాయి".

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: ఒక వైపు బాంబుల మోత, మరో వైపు అండర్‌గ్రౌండ్ షెల్టర్‌లో శాంతి కోసం సంగీత కచ్చేరీ

"మేమా శవపేటికలను మట్టితో కప్పాం. ఇంతలో తిరిగి బాంబులు పడడం మొదలయింది. దాంతో, మేము వారిని పూడ్చిపెట్టడం పూర్తవ్వకుండానే పరుగు పెట్టి వెనక్కి వచ్చాం. అది చాలా భయానక స్థితి."

తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని ఏం చేస్తారని మేం వెరోనికాను అడిగాం.

"అవకాశం దొరికితే నేను పుతిన్‌ను షూట్ చేస్తాను. నా చేయి వణకదు కూడా" అని అన్నారు.

పెట్రో, వెరోనికా సమాధులు

ఫొటో సోర్స్, Kovalenko family

ఫొటో క్యాప్షన్, పెట్రో, వెరోనికా సమాధులు

ప్రస్తుతం విక్టోరియా లీయెవ్‌లో ఉన్నారు. ఆమెను బీబీసీ కలవడానికి ఒక రోజు ముందే సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లారు.

"చుట్టూ ఎవరైనా ఉన్నా, నేనేదైనా పని చేస్తున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, జరిగిన విషయాన్ని మర్చిపోతున్నాను. కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నన్ను నేను కోల్పోతున్నాను" అని అన్నారు.

అలా అంటున్నప్పుడు ఆమె కంటి నుంచి కన్నీళ్లు వచ్చాయి.

ఆమె నాకొక తాళం చెవి చూపించారు. దాని పై ఒక ఆవు, హృదయాకార గుర్తు ఉంది. తాళం చెవికి ఒక బంగారు ఉంగరం ఉంది. ఆ ఉంగరం పై కొన్ని అక్షరాలు చెక్కి ఉన్నాయి. దానిని వెరోనికా ఆమెకు బహుమతిగా ఇచ్చింది.

"ఆ తాళం చెవిని వెరోనికా చర్చిలో కొన్నారు. అదొక తాయత్తు లాంటిది. అదే నన్ను రక్షించిందని అనుకుంటున్నాను. తనే నన్ను ఎల్లవేళలా కాపాడుతోంది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ నుంచి నిండు గర్భిణి నీతూ ఎలా బయటపడ్డారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)