Pakistan: ఇమ్రాన్ ఖాన్ పదవి పోగొట్టుకుంటారా, ప్రధానిగా కొనసాగుతారా...

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షుమైలా ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ)కి పెద్ద ఎదురుదెబ్బ.

ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు (ఏప్రిల్ 9న) ఓటింగ్ జరగబోతోంది. మరోవైపు దీని నుంచి ఇమ్రాన్ ఖాన్ గట్టెక్కడం దాదాపు అసాధ్యమే.

నేషనల్ అసెంబ్లీలో శనివారం ఏం జరుగుతుంది?

నేషనల్ అసెంబ్లీని పునరుద్ధరిస్తున్నట్లు ఏప్రిల్ 7న పాక్ సుప్రీం కోర్టు వెల్లడించింది. దీని ప్రకారం నేషనల్ అసెంబ్లీ ముందున్న అజెండా కూడా మళ్లీ అమలులోకి వస్తుంది.

అంటే ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా చెలామణీలోకి వస్తుంది.

ఒకవేళ సభ్యుల ఆధిక్యాన్ని ఇమ్రాన్ కూడగట్టగలిగితే, ఆయన ప్రధానిగా కొనసాగుతారు. లేకపోతే మరో వ్యక్తిని ప్రధాన మంత్రిగా పార్లమెంటు ఎన్నుకుంటుంది.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇమ్రాన్ ఖాన్‌కు మెజారిటీ ఉందా?

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఇప్పటికీ పార్లమెంటులో మెజారిటీ ఉంది. అయితే, ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపోదు. పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం.

2018 ఎన్నికల్లో పీటీఐకి 155 సీట్లు వచ్చాయి. దీంతో మిత్రపక్షాల సాయంతో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దాదాపు 20 మంది పార్టీ ఎంపీలపై అనర్హత వేటు పడింది.

గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన మూడు పార్టీలు ఇప్పుడు విపక్షానికి మద్దతు ప్రకటించాయి. ఈ పార్టీలకు దాదాపు 17 సీట్లు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, 75 ఏళ్లలో ఒక్క పాకిస్తాన్‌ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు, ఎందుకు?

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఎలా జరుగుతుంది?

ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఇక్కడ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రిని కూడా ఇదే విధానంలో ఎన్నుకుంటారు.

మొదట స్పీకర్ సభను రెండు గ్యాలరీలుగా విభజిస్తారు. ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇచ్చేవారు ఒక గ్యాలరీలో, ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసేవారు మరో గ్యాలరీలో ఉండాలని సూచిస్తారు.

ఒకసారి ఓటింగ్ పూర్తయిన తర్వాత, ఆ ఫలితాలపై దేశ అధ్యక్షుడికి స్పీకర్ లేఖ రాస్తారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇమ్రాన్ ఖాన్ ఓడిపోతే ఏం అవుతుంది?

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోతే, ఆయన ప్రధాన మంత్రి పదవిని కోల్పోతారు.

ఆ తర్వాత ఆయన, నేషనల్ అసెంబ్లీలో సభ్యుడిగా కొనసాగుతారు. దీంతో తమ అభ్యర్థిగా పాకిస్తాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ మరోసారి ఆయన్ను ముందుకు తీసుకొస్తుంది.

మిగతా పార్టీలు కూడా ఇలానే తమ ప్రధాని అభ్యర్థిని కూడా సూచిస్తాయి. చివరగా కొత్త ప్రధాన మంత్రిని ఎన్నుకునేందుకు ఓటింగ్ నిర్వహిస్తారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో మహిళపై అత్యాచారం... నేరస్థుడిని నపుంసకుడ్ని చేయాలని డిమాండ్

రెండోసారి ఓటింగ్ ఎందుకు జరుగుతోంది?

ఒకసారి పార్లమెంటు అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకుంటే, ప్రధాన మంత్రి అధికారాలపై కోత పడుతుంది. దీంతో జాతీయ అసెంబ్లీని రద్దుచేసే అధికారాన్ని ఆయన కోల్పోతారు. ఆయన ముందు రెండు మార్గాలు ఉంటాయి. అయితే రాజీనామా చేయాలి. లేదా ఓటింగ్‌ను ఎదుర్కోవాలి.

ఏప్రిల్ 3న డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి ఈ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో మళ్లీ ప్రధాన మంత్రికి అధికారాలు దాఖలుపడ్డాయి. దీంతో ఆయన వెంటనే పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి సిఫార్సు చేశారు. వెంటనే ఆరిఫ్ దాన్ని ఆమోదించారు.

ఈ అంశాన్ని సుప్రీం కోర్టు తమకు తాముగానే విచారణకు స్వీకరించింది. డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్మారాన్ని తిరస్కరించారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు పక్కన పెట్టేసింది. దీంతో మళ్లీ ఓటింగ్ జరిగేందుకు మార్గం సుగమమైంది.

పాక్ సైన్యం ఎటువైపు ఉంది?

ఈ సంక్షోభంలో తాము తటస్థంగా ఉంటున్నామని, దీనితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని పాకిస్తాన్ సాయుధ బలగాలకు చెందిన పీఆర్ విభాగం ఇంటర్ సర్వీసెస్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) వెల్లడించింది.

అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ చెప్పినప్పుడు ఈ విషయంలో ఐఎస్‌పీఆర్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తిఖర్ స్పందించారు. ఈ సంక్షోభంలో తమకు సంబంధంలేదని చెప్పారు.

వీడియో క్యాప్షన్, ‘ఇమ్రాన్ ఖాన్.. నువ్వు భారతీయ ముస్లింల గురించి ఆందోళన చెందకు’

నేషనల్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ ఏమిటి?

తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) తర్వాత నేషనల్ అసెంబ్లీలో పీఎంఎల్-ఎన్‌కు పార్లమెంటులో అత్యధిక స్థానాలు (84) ఉన్నాయి. అతిపెద్ద విపక్షమైన పీఎంఎల్ 2018లో షాబాజ్ షరీఫ్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకుంది.

ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు, షాబాజ్ షరీఫ్ తమ ప్రధాని అభ్యర్థని ప్రకటించాయి.

కొత్త ప్రధాన మంత్రిని ఎన్నుకుంటారా?

అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోతే, తర్వాత కొత్త ప్రధాన మంత్రిని ఎన్నుకునేందుకు పేర్లను సిఫార్సు చేయాలని పార్టీలకు సూచిస్తారు. ఆ తర్వాత 24 గంటల్లో మరోసారి నేషనల్ అసెంబ్లీ సమావేశమై ఓపెన్ బ్యాలెట్ విధానంలో కొత్త ప్రధాన మంత్రిని ఎన్నుకుంటుంది.

ఇమ్రాన్ ఖాన్‌కు బదులుగా పీటీఐ సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే, సార్వత్రిక ఎన్నికలకు బదులుగా ఉప ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలా? వద్దా అనే అంశంపై నిర్ణయం మాత్రం కొత్త ప్రధాన మంత్రిదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)