Bangalore: మత రాజకీయాలు సిలికాన్ వ్యాలీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో అత్యంత ధనికులలో ఒకరైన ఓ మహిళ నుంచి కర్ణాటక ప్రభుత్వానికి అనూహ్యమైన సూచన వచ్చింది. ''పెరిగిపోతున్న మతపరమైన విభజనను అడ్డుకోండి'' అని ఆమె రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని కోరారు. ఆమె మరెవరో కాదు. బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా.
బయోకాన్ సంస్థ కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
ఇటీవల ముస్లిం ట్రేడర్లు హిందూ దేవాలయాల దగ్గర వ్యాపారాలు నిర్వహించరాదంటూ కొన్ని గ్రూపుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విజ్ఞప్తి చేశారు.
అలాగే హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే విక్రయించే ముస్లిం వ్యాపారులకు చెందిన మాంసం దుకాణాల్లో చికెన్, మటన్ కొనరాదని కూడా ఈ గ్రూపులు ప్రజలకు సూచించాయి. ఇక మసీదుల్లో మైకులు వినిపించరాదని, ముస్లిం వ్యాపారులు అమ్మే మామిడి పండ్లను బాయ్ కాట్ చేయాలని కూడా కొందరు డిమాండ్ చేశారు.
ఇటీవలే కర్ణాటకలో స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై వివాదం నడిచింది. గత ఏడాది గోమాంసాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో భగవద్గీతను ప్రవేశపెట్టడం, టిప్పు సుల్తాన్ చరిత్రను తీసేయడం సహా పలు నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది కర్ణాటక ప్రభుత్వం.
కాగా, కర్ణాటకలో 13% మంది ముస్లింలు నివసిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఇటీవల వివాదాస్పదమవుతున్న మతపరమైన అంశాల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను భయపెడుతోందని విమర్శకులు ఆరోపించగా, ఇలాంటి ముద్ర కారణంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకపై ప్రభావం పడే ప్రమాదం ఉందని మరికొందరు భయపడుతున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి సమష్టి కృషి వల్ల జరుగుతోందని.. ఐటీ, బయో టెక్నాలజీకి కేంద్రంగా మారిన బెంగళూరు నగరంలో ఇలా మతపరమైన విభజన ధోరణులు పెరిగి, ప్రపంచ నగరంగా ఉన్న ఈ సిటీ ప్రతిష్ట మసకబారుతుందంటూ తన ట్వీట్‌లో ఆందోళన వ్యక్తం చేసిన కిరణ్ మజుందార్ షా.. తన ట్వీట్‌కు ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైని ట్యాగ్ చేశారు.

ఫొటో సోర్స్, facebook/basavarajbommai
వాస్తవానికి మజుందార్ షా వ్యాఖ్యలు అర్ధం చేసుకోదగినవే. కర్ణాటక అభివృద్ధి అంతా బెంగళూరు కేంద్రంగా సాగుతుంటుంది. దాదాపు కోటిమంది జనాభా ఉన్న ఈ నగరం నుంచే కర్ణాటక రెవెన్యూలో 60% సమకూరుతుంది. సుమారు 1300 టెక్నాలజీ స్టార్టప్‌లు ఈ నగరంలోనే ఉన్నాయి.
భారతదేశంలోని 100 యూనికార్న్ కంపెనీలలో 40% ఇక్కడే ఉన్నాయి. భారతదేశపు ఇన్ఫోటెక్ ఎగుమతులలో 41% బెంగళూరు నుంచే వస్తాయి.
''బెంగళూరు నగరం భిన్న సంస్కృతుల నిలయం. గతంలో ఇక్కడ మత ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇన్ఫోటెక్ పరిశ్రమ నగరంలోని ఇలాంటి అంతర్గత ఘర్షణలకు దూరంగా ఉంటుంది. శివార్లలో తనకంటూ ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలతో పరిశ్రమ స్థిరపడింది'' అని నగరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ లో పని చేస్తున్న ప్రొఫెసర్ నరేంద్ర పాణి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు కర్ణాటక కీలకమని చాలామంది భావిస్తుంటారు. సౌత్ ఇండియాలోని ఐదు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది ఈ రాష్ట్రంలోనే. కర్ణాటక భిన్న కులాలు, మతాలు, భాషా వర్గాలకు కేంద్రం. అలాంటి రాష్ట్రంలో బీజేపీ వరసగా నాలుగుసార్లు అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకుంటూ వచ్చింది.
కర్ణాటక కోస్తా ప్రాంతంలో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంది. దీంతో అక్కడ బీజేపీ జాతీయవాద రాజకీయాలను ముమ్మరం చేసింది. బీజేపీకి సైద్ధాంతిక మాతృ సంస్థ ఆరెస్సెస్ ఇక్కడ వేళ్లూనుకుని ఉంది. గతంలో ఇక్కడ పబ్బులపై హిందూ గ్రూపులు దాడులు నిర్వహించాయి.
అలాగే, ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం యువకులు పెళ్లి చేసుకుని వారిని మతం మారుస్తున్నారని, ఇది లవ్ జిహాద్ అంటూ ఆందోళన చేశాయి.
చాలాకాలంగా కర్ణాటకలో కులరాజకీయాలే ప్రధానంగా సాగాయి. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప 2008లో లింగాయత్‌ల సహకారంతో అధికారం చేపట్టారు. రాష్ట్రంలో లింగాయత్‌ల ఓట్లు మొత్తం ఓట్లలో ఆరు శాతం ఉంటాయి.
అయితే, లింగాయత్ లలోని ఒక వర్గం మాత్రం తమను హిందూవులలో భిన్నమైన వర్గంగా పరిగణించాలని కోరుతున్నాయి. మరికొన్ని కులాలు కూడా అలాంటి డిమాండ్లే వినిపిస్తున్నాయి.
''పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా బీజేపీ జాతీయవాదంతో తన ఓటు బ్యాంకు చేజారకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తోంది'' అని సుగత శ్రీనివాసరాజు అన్నారు. ఆయన మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ జీవిత చరిత్ర రాశారు.
యెడియూరప్ప స్థానంలో కొన్ని నెలల కిందట బస్వారాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన పాలనలో రాష్ట్రం వెనకబడుతోందని విమర్శకులు అంటున్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
అంతర్గత నివేదికల్లో కూడా ఆయన పాలనలో సగం ప్రభుత్వ శాఖల పనితీరు సరిగా లేదని తేలింది. 'ది ఫైల్' అనే స్థానిక పరిశోధనాత్మక వెబ్‌సైట్ ఈ వివరాలను పేర్కొంది.
రాష్ట్రంలో అవినీతి కూడా చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది నవంబర్ లో కర్ణాటకకు చెందిన ఓ కాంట్రాక్టర్ ప్రధానమంత్రికి రాసిన లేఖ సంచలనం సృష్టించింది. ప్రాజెక్టు పనుల ఖర్చుల్లో 40% అధికారులు, మంత్రులకు లంచాలకు ఇవ్వడానికే సరిపోతోందని ఆ కాంట్రాక్టర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అభివృద్ధి నిధులు ఖర్చు పెట్టకపోవడం, రవాణా శాఖలో ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం, విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు ఇవ్వకపోవడం లాంటి ఘటనలు అనేకం జరిగాయి.

రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ''హిందూ జాతీయవాదాన్ని ప్రేరేపించడం ఒక్కటే ఇప్పుడు ప్రభుత్వం చేయగలిగిన పని. చెప్పుకోవడానికి అభివృద్ధి పనులు పెద్దగా లేవు'' అని ప్రొఫెసర్ చందన్ గౌడ అన్నారు.
ఆయన బెంగళూరు కేంద్రంగా పని చేసే ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఛేంజ్ లో పని చేస్తున్నారు.
కిరణ్ మజుందార్ షా ట్వీట్ తర్వాత రాష్ట్రంలో శాంతి సామరస్యాలను కాపాడాలంటూ ముఖ్యమంత్రి బొమ్మై ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇటు బీజేపీ లోని కొందరు నేతలు కూడా తాజా పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు.
''హిందూ ఆలయాల దగ్గర ముస్లింలను వ్యాపారం చేయనివ్వవద్దు అంటే అది ఒకరకంగా అంటరానితనంతో సమానం. ఇది అమానవీయ చర్య'' అని బీజేపీ శాసన సభ్యుడు ఏహెచ్ విశ్వనాథ్ అన్నారు. ''ముస్లింలను గుళ్ల దగ్గర వ్యాపారం చేసుకోవద్దని చెప్పలేం'' అని శాసన సభ్యుడు అనిల్ బెనకే అంటున్నారు.
వీరి వ్యాఖ్యలు కొంత వరకు ఆశావహంగా ఉన్నాయి. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
''రాజకీయాలకు మతం రంగు అద్దాలన్న ప్రయత్నాలు రెండు దశాబ్ధాలుగా జరుగుతున్నాయి. మేధావులు, ప్రతిపక్షాలు ఈ విషయంలో మౌనంగా ఉన్నాయి. వాళ్లు ధైర్యంగా ముందుకు రావాలి'' అని శ్రీనివాసరాజు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- యుక్రెయిన్: ‘రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’
- శ్రీలంక, చైనా మధ్య పెరుగుతున్న దూరం భారత్‌కు కలిసొస్తుందా
- కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమన్న రాహుల్‌గాంధీ వాదనలో నిజమెంత
- Kinder Surprise చాక్లెట్ ఎగ్స్‌ను రీకాల్ చేసిన కంపెనీ, అసలు కారణం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











