TRS-KCR: ప్రశాంత్ కిశోర్ ఎవరికోసం పనిచేస్తున్నారు? తెలంగాణ కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?

కేసీఆర్, రేవంత్ రెడ్డి, ప్రశాంత్ కిశోర్

ఫొటో సోర్స్, Getty Images, facebook

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో వేగం పెంచింది.

వీరిద్దరి భేటీ అనేక ఊహాగానాలకు ఊతమివ్వడమే కాకుండా కొందరు నేతలనూ ఇరకాటంలో పడేస్తోంది.

దీనికి కారణం... కేసీఆర్‌తో సమావేశానికి ముందు గత కొద్ది రోజులలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ తదితరులతో భేటీ కావడమే.

కాంగ్రెస్ పెద్దలతో ప్రశాంత్ కిశోర్ భేటీలలో ఆ పార్టీలో ఆయన చేరిక అంశంతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ఏర్పాటు చేయడం ప్రధానాంశం.

ఆ క్రమంలోనే ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే వివిధ పార్టీల నేతలను కలిసి కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే దిశగా చర్చించడంతో పాటు తాజాగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌నూ కలిశారు.

అయితే, మిగతా రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులకూ తెలంగాణలో రాజకీయ సమీకరణలకు వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ విషయంలో మిగతా కొన్ని పార్టీలకు, టీఆర్ఎస్‌‌కు కూడా వ్యత్యాసం ఉంది.

KTR

ఫొటో సోర్స్, facebook/ktr

కేటీఆర్ ఏమన్నారు? కేసీఆర్ ఏం చెప్పారు?

ప్రశాంత్ కిశోర్, కేసీఆర్‌ల సమావేశంలో కాంగ్రెస్‌తో జట్టు కట్టడంపై ఏం చర్చించుకున్నారనేది టీఆర్ఎస్ అధికారికంగా వెల్లడించకపోయినా ఇద్దరి మధ్యా దీనిపై చర్చ జరిగిందనేలా ఆ పార్టీ నేతల మాటలున్నాయి.

ముఖ్యంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం వివిధ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలలో ప్రశాంత్ కిశోర్ అంశాన్ని ప్రస్తావించారు.

ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని ధ్రువీకరించారు. అదే సమయంలో ప్రశాంత్ కిశోర్ వేరు, ఐ ప్యాక్ వేరు అని చెప్పారు.

ప్రశాంత్ కిశోర్ తనకు తానుగా ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేశారని, ఆయన రాజకీయాలు ఆయన చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

కొత్త తరాన్ని ఆకట్టుకునే క్రమంలో డిజిటల్ మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకునేందుకే ఐప్యాక్ సేవలు తీసుకుంటున్నామని చెప్పారు.

కేసీఆర్ కంటే వ్యూహకర్తలు ఎవరూ లేరని, ఐప్యాక్ సేవలు డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకోవడం వరకే అని కేటీఆర్ చెప్పారు.

తమ కోసం ఐప్యాక్ మాత్రమే పనిచేస్తుంది కానీ ప్రశాంత్ కిశోర్ కాదు అన్నట్లుగా చెప్పిన కేటీఆర్ మాటలు ఆయన నుంచి ఒకింత దూరం పాటించేలా ధ్వనించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అయితే, కేసీఆర్ నుంచి ఆహ్వానం లేకుండా ప్రశాంత్ కిశోర్ వచ్చి రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించే పరిస్థితి ఉండదని, కేసీఆర్ చొరవతోనే ఇది జరిగి ఉంటుందని సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు భండారు శ్రీనివాసరావు అన్నారు.

‘‘వచ్చే ఎన్నికలు కేసీఆర్‌కు కీలకం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రెండుసార్లు వరుసగా అధికారంలో ఉన్న తరువాత మూడోసారి ప్రభుత్వ వ్యతిరేకత రావడం అనేది సర్వసాధారణం. అలాగే, కాంగ్రెస్, బీజేపీలు కూడా టీఆర్ఎస్‌తో తలపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో వ్యూహకర్తగా ఆయన సలహాలు తీసుకునేందుకు పిలిచి ఉండొచ్చు. అంతేకానీ, కాంగ్రెస్ తరఫున రాయబారం కోసం కాకపోయి ఉండొచ్చు. వ్యూహకర్త, ముఖ్యమంత్రి మధ్య చర్చలుగానే వీటిని చూడాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు తెలంగాణలో జరిగే ఎన్నికలలో తమకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని ఇటీవల కాలంలో కేటీఆర్ చెబుతూ వస్తున్నారు.

అయితే, తాజా పరిణామాల అనంతరం సోమవారం(ఏప్రిల్ 25) ఆయన కాంగ్రెస్‌తో తమకు ఎలాంటి సంబంధాలు లేవనీ చెప్పారు.

అంతేకాదు, అదో పనికిమాలిన పార్టీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘కాంగ్రెస్‌తో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. అదో అనవసరమైన పార్టీ. దేశ ప్రజలు వారికి 50 ఏళ్లకు పైగా అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పతనం చేశాయి. నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీని ప్రజలు పరీక్షించి చూసి పక్కన పడేశారు. ఆ పార్టీకి ఎలాంటి భవిష్యత్ లేదు’’ అన్నారని వార్తాసంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

ఆ ట్వీట్‌ను కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కానీ, కేటీఆర్‌కు భిన్నంగా కొద్దిరోజుల ముందు కేసీఆర్ మాత్రం ప్రశాంత్ కిశోర్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే తనకు ఏడెనిమిదేళ్లుగా మంచి మిత్రుడని, ఆయన డబ్బు తీసుకుని పనిచేయరని.. దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు.

తాజా భేటీ తరువాత కేసీఆర్ ఇంతవరకు దీనిపై పెదవి విప్పలేదు.

మరోవైపు కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ చేరిక అంశంపై ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ సోనియా గాంధీకి తమ నివేదిక సమర్పించింది.

ఈ కమిటీలో కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోనీ, రణదీప్ సుర్జేవాలా, జైరాం రమేశ్, ప్రియాంక వాద్రా ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇక ప్రశాంత్ కిశోర్ కూడా తాను ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటానని 2021 మే నెలలోనే ప్రకటించారు. తన కంపెనీ ఐప్యాక్‌లో సమర్థులైన సిబ్బంది ఉండడంతో అక్కడ వ్యవహారాలను వారే చూసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.

అప్పటికి పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కోసం ఆయన పనిచేసేవారు. అలాగే, పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు రాజకీయ సలహాదారుగానూ ఉండేవారు.

అనంతరం ఆయన కొన్నాళ్లకు ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

కేసీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2005లో కేసీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి

కాంగ్రెస్, టీఆర్ఎస్ సంబంధాలు ఎలా ఉన్నాయి

కాంగ్రెస్, టీఆర్ఎస్ సంబంధాల విషయం మాట్లాడాలంటే తెలంగాణ ఏర్పాటుకు ముందు రాజకీయాలు, అనంతర రాజకీయాలు, ప్రస్తుత పరిణామాలు కొంత ప్రస్తావించాలి.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నినాదంతో ఉద్యమ పార్టీగా ఎదిగిన టీఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన సందర్భం ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు కలిసి పోటీ చేశాయి. 294 అసెంబ్లీ సీట్లకు గాను 54 స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్ 26 చోట్ల విజయం సాధించింది.

అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కూడా టీఆర్ఎస్‌కు భాగస్వామ్యం కల్పించారు. ఆరుగురు టీఆర్ఎస్ నేతలు వైఎస్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. అయితే, 2005లో టీఆర్ఎస్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి మంత్రివర్గం నుంచి వైదొలగారు.

అక్కడితో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులు ముగిశాయి.

వీడియో క్యాప్షన్, పోచంపల్లి చీర తయారవుతుంది ఇలా

కానీ, 2014 ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారాయి. పార్లమెంటులో, బయట తెలంగాణ నేతలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటాలు చేసి ఒత్తిడి పెంచారు.

అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర వేసింది.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ, ఏర్పాటు తరువాత ఆయన మాట తప్పారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు.

2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత 119 స్థానాలు గల ఆ రాష్ట్రంలో 63 సీట్లు గెలుచుకుని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలను గెలుచుకుంది.

ఆ తరువాత పాలక టీఆర్ఎస్‌లోకి ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడింది.

Rahul Gandhi, Anumula Revanth Reddy

ఫొటో సోర్స్, facebook/AnumulaRevanthReddy

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం అయిదేళ్లు పూర్తి చేసుకోకుండానే ముందస్తుకు రావడంతో 2018లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో టీఆర్ఎస్ మరింత బలం పుంజుకుని 88 సీట్లు సాధించగా కాంగ్రెస్ 19 సీట్లకు పరిమితమైంది.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్లీ ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ తన పోరాటాలు ప్రారంభించింది.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి కొద్దికాలానికే తెలంగాణ కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత టీఆర్ఎస్‌పై పోరాటాలను మరింత తీవ్రం చేశారు.

రేవంత్ రెడ్డి సొంత పార్టీలోని కొందరు నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ టీఆర్ఎస్‌పై దూకుడును మాత్రం తగ్గించలేదు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తదితర టీఆర్ఎస్ ప్రధాన నేతలు, రేవంత్ రెడ్డి మధ్య నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ జత కడితే ఈ నేతల మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది? ఎలా కలిసి పనిచేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది.

అయితే, కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానం మాటే శిరోధార్యంగా నాయకులు పనిచేస్తారని.. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే ఆ పార్టీ తెలంగాణ నేతలు కూడా అందుకు తలూపుతారని భండారు శ్రీనివాసరావు రావు అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉండి, తెలంగాణలో వచ్చే ఎన్నికలలో అధికారం మాదే అంటూ ధీమా కనబరుస్తున్న బీజేపీని టీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల ప్రత్యర్థిగా తీసుకుంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలనే ప్రయత్నంలో కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశలూ ఉంటాయని ఆయన విశ్లేషించారు.

మాణిక్కం ఠాగోర్

ఫొటో సోర్స్, Manickam Tagore/facebook

ఫొటో క్యాప్షన్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగోర్

కాంగ్రెస్ నేతలేమంటున్నారు

తాజా పరిణామాలపై కాంగ్రెస్ నేతల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి.

రాజకీయంగా ఇది చర్చనీయం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.

టీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశారని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరిన తరువాత మరోసారి ఆయన తెలంగాణకు వచ్చి తనతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారని అన్నారు.

పార్టీ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని, మీడియా కథనాలపై తాను స్పందించలేను కానీ పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగోర్ స్పందన వేరేలా ఉంది.

''నీ శత్రువుతో స్నేహంగా ఉండే వారిని ఎన్నడూ నమ్మొద్దు'' అంటూ నర్మగర్భమైన ట్వీట్ చేశారాయన.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

నిజానికి తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కేసీఆర్ కొద్దిరోజులుగా తలపడుతున్నారు. అయితే, ఇంతకుముందు పార్లమెంటులో వివిధ బిల్లులు ఆమోదం పొందాల్సిన ప్రతిసారీ బీజేపీకి టీఆర్ఎస్ సహకరించిన నేపథ్యం ఉంది.

ఈ కారణంగానే టీఆర్ఎస్, బీజేపీలు మిత్రపక్షాలేనని.. తమ శత్రువైన బీజేపీకి సన్నిహితంగానే ఉండే టీఆర్ఎస్‌ను ఎలా నమ్ముతాం అన్న అర్థంలో ఆయన ట్వీట్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎవరికి లాభం? ఎప్పుడు తెలుస్తుంది

జోరుగా సాగుతున్న ఊహాగానాల ప్రకారమే ఒకవేళ కాంగ్రెస్, టీఆర్ఎస్‌ కలిస్తే ఆ కలయిక వల్ల ఎవరికి లాభమనేది చర్చనీయమవుతోంది.

‘‘టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసినప్పుడు అనేక అనుకూల అంశాలు ఉంటాయి వారికి. ఇద్దరికీ ప్రశాంత్ కిశోర్, ఆయనకు చెందిన ఐప్యాక్ సేవలు అందుతాయి కాబట్టి రెండు పార్టీలూ ఏక వ్యూహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కాకుండా రెండు పార్టీలు కలిసి పనిచేస్తే ఎంతోకొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కాంగ్రెస్ దీన్నుంచి జాతీయ స్థాయిలో ప్రయోజనాలు ఆశిస్తోంది’’ అన్నారు విశ్లేషకులు భండారు శ్రీనివాసరావు.

మరోవైపు ఈ నెల చివర్లో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనుంది. అలాగే, రైతు సమస్యలపై టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ మే 6న వరంగల్ వేదికగా నిర్వహించనున్న 'రైతు సంఘర్షణ సభ'కు రాహుల్ గాంధీ హాజరవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్లీనరీ వేదికగా టీఆర్ఎస్ పెద్దలు ఇవ్వనున్న సంకేతాలు పీకే, కేసీఆర్‌ల భేటీలో చర్చకొచ్చిన అంశాలను అర్థం చేసుకోవడానికి పనికిరావొచ్చు.

అలాగే, రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ రావడం, రాకపోవడం, వస్తే అక్కడ ఆయన ఏం మాట్లాడుతారు అనే భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతం కాగలదు.

వీడియో క్యాప్షన్, బండి సంజయ్: 'తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే'

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దూరం పెరగడంతోనే..

కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఒకేసారి ఏర్పడ్డాయి.

అప్పటి నుంచి కేంద్రం, తెలంగాణ మధ్య సఖ్యత కనిపించేది. అయితే, కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారం నిలబెట్టుకున్న కొద్ది కాలానికి పరిస్థితులు మారాయి.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల గురించి తరచూ మాట్లాడిన కేసీఆర్ ఆ ఎన్నికల తరువాత కాస్త నెమ్మదించారు.

అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కించుకున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ టీఆర్ఎస్ వ్యతిరేక పోరాటాన్ని తీవ్రం చేసి బీజేపీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు పెంచడం.. ఉప ఎన్నికలలో బీజేపీ విజయాలు సాధిస్తూ అసెంబ్లీలో తన సంఖ్య కొంత పెంచుకోవడం.. కేసీఆర్‌తో విభేదించి పార్టీ నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా ఆయన్ను బీజేపీ చేర్చుకోవడం, ఆ తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఆయన విజయం సాధించడం వంటివన్నీ రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య దూరం బాగా పెంచాయి.

బాయిల్డ్ రైస్ వివాదంతో మరింత పెరిగిన దూరం..

తెలంగాణలో బాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య మొదలైన వివాదం రాజకీయంగా ముదిరింది.

కేంద్రం కనుక కొనుగోలు చేయకుంటే దిల్లీలోని ఇండియా గేట్‌ను తెలంగాణ ధాన్యపు రాశులతో ముంచెత్తుతామని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నాయకులు దిల్లీ వచ్చి నిరసన తెలిపారు.

ఈ నేపథ్యంలో రెండు పార్టీల నేతలు పోటాపోటీగా ప్రదర్శనలు చేశారు.

మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వచ్చే ఎన్నికలలో తమదే అధికారం అని తరచూ చెబుతూ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతుండడంతో పాటు పాదయాత్ర చేస్తున్నారు.

టీఆర్ఎస్ నేతలూ బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు నేరుగా మోదీ, అమిత్ షాలపైనా తరచూ పదునైన విమర్శలు చేస్తున్నారు.

వీటన్నిటి నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్యా ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

ప్రశాంత్ కిశోర్, మమత బెనర్జీ, అభిషేక్ బెనర్జీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ కిశోర్, మమత బెనర్జీ, అభిషేక్ బెనర్జీ

క్లయింట్లను కాంగ్రెస్‌కు దగ్గర చేయాలని ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారా?

ఒకప్పుడు మోదీ కోసం పనిచేసి, ఆ తరువాత మోదీకి బద్ధ విరోధిగా మారిపోయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన పొలిటికల్ క్లయింట్లను కాంగ్రెస్‌కు చేరువ చేసే పనిలో పడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కేంద్రకంగా కూటమి ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తన క్లయింట్ల కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘‘కాంగ్రెస్ మళ్లీ బతకాలంటే కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ఇందుకోసం రాజకీయ వైరాలను పక్కనపెట్టి పార్టీలను కలుపుకొని పోవాలని ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి ఉండొచ్చు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు కేసీఆర్, మమత బెనర్జీ వంటివారు ఇంతకుముందు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. కానీ, ప్రశాంత్ కిశోర్ విషయం వేరు. వ్యూహకర్తగా పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించి మంచి ట్రాక్ రికార్డ్ సంపాదించుకున్న ఆయన మాటకు నేతలు విలువ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయత్నాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి’’ అన్నారు శ్రీనివాసరావు.

మోదీ టీంకి దూరమైన తరువాత ప్రశాంత్ కిశోర్ 2015లో బిహార్ ఎన్నికల్లో జనతాదళ్(యు)కి పనిచేశారు. ఆ పార్టీలో కూడా చేరారు. అయితే, ఎన్నికల అనంతర సమీకరణాలతో నితీశ్ పార్టీ మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వం నడిపిస్తోంది. ఇది నచ్చని ప్రశాంత్ కిశోర్ నితీశ్‌కు దూరం జరిగారు.

ఆ తరువాత 2017 పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం కావడానికి సాయపడ్డారు. ఆ తరువాత 2021 ప్రారంభంలో అమరీందర్‌కు ప్రధాన సలహాదారుగా కూడా నియమితులయ్యారు. కానీ, అక్కడికి కొన్ని నెలల్లోనే భారీ రాజకీయ మార్పులు జరిగి అమరీందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి బీజేపీకి చేరువయ్యారు. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్ అమరీందర్ వద్ద సలహాదారు పదవికి రాజీనామా చేసేశారు.

2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు నుంచి తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ మమతా బెనర్జీని ఆ ఎన్నికలలో గెలిపించారు. అదేసమయంలో మోదీతో సందర్భాన్ని బట్టి మాత్రమే కయ్యమాడే మమతను దేశంలోనే మోదీకి ప్రధాన శత్రువుగా మార్చగలిగారు.

ఇక 2021లో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరఫున ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. డీఎంకేది మొదటి నుంచి కాంగ్రెస్ పక్షం.

ప్రస్తుతం హిందీ భాష, మరికొన్ని అంశాలలో కేంద్రం, బీజేపీతో డీఎంకే విభేదిస్తోంది.

కొద్దికాలంగా కేంద్రంపై కేసీఆర్ దూకుడు పెంచడం వెనుకా ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ క్లయింట్ వైసీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీతో సన్నిహితంగానే ఉంది.

‘‘పీకే ఖాతాలో ఇంతవరకు అపజయం అన్నది లేదు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం ఒకటి ఉన్నప్పటికీ తాను ఆ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని ప్రశాంత్ కిషోర్ స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులలో ఎన్నికల విజయాలలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆయనకు పార్టీల నేతల్లో ఆమోదం ఉంది. నేతలు ఆయన సూచనలు పాటించే అవకాశాలు ఎక్కువే’’ అన్నారు భండారు శ్రీనివాసరావు.

కానీ, ఇప్పుడు పీకే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటే మాత్రం ఇంతకుముందులా ఆయన్ను ఎన్నికల వ్యూహకర్తగా నేతలు ఆమోదించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, 250 కోట్ల ఏళ్ల కిందటి ఖాజాగూడ రాళ్లను పరిరక్షించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)