కల్వకుంట్ల తారక రామారావు: రాజ్యాంగాన్ని సవరిస్తే అంబేడ్కర్‌ను అవమానించినట్లా? - ప్రెస్ రివ్యూ

కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/KTRTRS

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికి 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించాయని, అలా సవరిస్తే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించినట్లా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.

ఎన్‌డీఏ హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2001లో రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక కమిటీని వేశారని, అప్పుడు వాజ్‌పేయి.. రాజ్యాంగాన్ని అవమానపరిచి నట్లా? ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కొత్త రాజ్యాంగం కావాలని అన్నారని, ఆయన కూడా అంబేడ్కర్‌ను అవమానించినట్లేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేడ్కర్‌ నినాదాలతోనే 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడామని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ నిజమైన అంబేడ్కర్‌వాది అని అన్నారు. రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే.. దానిని తగులబెట్టడంలో తానే ముందుంటానని రాజ్యాంగం రచించిన మూడేళ్ల తర్వాత అంబేడ్కరే అన్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

టీఎస్‌ఆర్టీసీ బస్సు

ఫొటో సోర్స్, facebook/TSRTCHQ

30 మంది ఉంటే ఇంటికే మేడారం బస్సు

మేడారం జాతరకు వెళ్లేందుకు 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు పంపిస్తామని సంస్థ ఎండీ సజ్జనార్‌ తెలిపారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

శుక్రవారం బస్‌భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ సేవలు అవసరమైన భక్తులు సమీపంలోని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలువాలని లేదా 040-30102829 టోల్‌ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఈ ఏడాది మేడారం జాతరకు ఆర్టీసీ రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి 3,845 ప్రత్యేక బస్సులు నడుపుతున్నదని ఎండీ తెలిపారు. మహారాష్ట్రలోని సిరొంచ నుంచి కూడా 45 బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. ప్రైవేటు వాహనాలు సమ్మక్క సారలమ్మ గద్దెలకు 7 నుంచి 8 కి.మీ. దూరంలో ఆగిపోతాయని, ఆర్టీసీ బస్సులు మాత్రం గద్దెలకు అతి సమీపానికి వెళ్తాయని చెప్పారు. గత జాతర సమయంలో ఉన్న చార్జీలే ఇప్పుడూ ఉంటాయని ఎండీ తెలిపారు.

మామిడాల జగదీష్‌ కుమార్‌

ఫొటో సోర్స్, facebook/osmaniauniv

యూజీసీ చైర్మన్‌గా జేఎన్‌యూ వీసీ జగదీష్‌ కుమార్‌

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)చైర్మన్‌గా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌‌యూ) వైస్‌ చాన్సలర్‌ మామిడాల జగదీష్‌ కుమార్‌ నియమితులయ్యారని ప్రజాశక్తి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన జగదీష్‌ కుమార్‌ ఐఐటీ - మద్రాస్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌, పీహెచ్‌డీ చేశారు. అనంతరం కెనడాలోని వాటర్లూ విశ్వ విద్యాలయంలో పోస్ట్‌ డాక్టొరల్‌ రీసెర్చ్‌ చేశారు. ఆయన నానోసైన్స్‌, నానో టెక్నాలజీలో కృషి చేశారు.

ఐఐటి ఢిల్లీలో ఎలక్ట్రికల్‌ ప్రొఫెసర్‌ ఉన్నారు. 2016 జనవరి నుంచి జేఎన్‌యూ వీసీగా ఉన్నారు. ఐదేళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత 2021 జనవరిలో ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలం ఈనెల 26తో ముగుస్తుంది.

గతంలో తెలుగువారైన వాసిరెడ్డి శ్రీకృష్ణ 1961లో, జి. రామిరెడ్డి 1991-95 వరకు యూజీసీ చైర్మన్లుగా పనిచేశారు.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, facebook/Asaduddinowaisi

'జడ్‌' కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్‌ వైసీ

యూపీ కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా ఆయన దాన్ని తిరస్కరించారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం లోక్‌సభలో కేంద్రాన్ని ఒవైసీ డిమాండ్‌ చేశారు. దేశంలో పెరిగిపోతున్న రాడికలిజానికి ముగింపు పలకాలన్నారు. తనపై జరిగిన బుల్లెట్‌ దాడికి యూపీ ఓట్లరు బ్యాలెట్‌తో బదులిస్తారన్న నమ్మకం తనకుందన్నారు.

''నాకు జెడ్‌ కేటగిరీ రక్షణ వద్దు. మీ అందరితో సమానంగా ఏ కేటగిరీ పౌరునిగా బతికే అవకాశం కల్పిస్తే చాలు. రెండుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీ అయిన నాపై కేవలం ఆరడుగుల దూరం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులకు భయపడను. బుల్లెట్‌ తాకినా ఇబ్బంది లేదు గానీ ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదు. స్వతంత్రుడిగా బతకాలనుకుంటున్నా'' అని ఒవైసీ అన్నారు.

ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని గౌతంబుద్ధ నగర్‌కు చెందిన సచిన్‌గా, మరొకరిని సహరన్‌పూర్‌కు చెందిన శుభంగా గుర్తించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఒవైసీ, ఆయన పార్టీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కోపంతోనే దాడికి పాల్పడ్డట్టు విచారణలో వారు చెప్పారన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)