‘దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా ఏడాది క్రితం వరకు ఏర్పాటైన సీసీ కెమెరాల్లో దాదాపు 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.
2019 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ సంస్థలకు సంబంధించిన వివరాలతో పోలీన్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) 'డేటా ఆన్ పోలీన్ ఆర్గనైజేషన్స్' నివేదిక విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2019, జనవరి 1 నాటికి మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని.. ఇందులో 2,75,528 తెలంగాణలోనే ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. మొత్తం కెమెరాల్లో ఇది దాదాపు 65శాతం.


తమిళనాడు రెండో స్థానంలో ఉంది. అక్కడ సీసీ కెమెరాల సంఖ్య 40,112. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (39,587), మధ్య ప్రదేశ్ (21,206) ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 14,770 సీసీ కెమెరాలున్నాయి. మిగతా రాష్ట్రాల్లో వీటి సంఖ్య పదివేల లోపే. 19 రాష్ట్రాల్లో కనీసం వెయ్యి చొప్పునైనా సీసీ కెమెరాలు లేవు.
పోలీస్ కమిషనరేట్ల సంఖ్యపరంగా తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 63 కమిషనరేట్లుండగా.. రాష్ట్రంలో వాటి సంఖ్య తొమ్మిది.
నేరాల నియంత్రణ దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలకం కావడంతో తెలంగాణ పోలీన్‌శాఖ వీటి ఏర్పాటును అవశ్యంగా భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఫొటో సోర్స్, JanaSenaParty/twitter
ఉన్న పరిశ్రమలు పోతున్నాయి : వపన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
పరిశ్రమలు వచ్చేందుకు అనుకూల వాతావరణం నెలకొల్పాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించిందని పవన్ కల్యాణ్ అన్నారు.
ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతుంటే ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపడతాయని ప్రశ్నించారు.
కరవు ప్రాంతమైన అనంతపురంలో ఉన్న కియా పరిశ్రమలోని కొన్ని యూనిట్లు తరలిపోతున్నాయనే వార్తలు విస్మయాన్ని కలిగించాయని పవన్ చెప్పారు.
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్‌వేర్ సంస్థలను ఖాళీ చేయించడమంటే ఇక ఆ రంగం రాష్ట్రం వైపు చూడకుండా చేయడమే అవుతుందన్నారు.
రద్దులు, కూల్చివేతలు, తరలింపులకే ప్రభుత్వం పరిమితమైందని పవన్ విమర్శించారు.

ఫొటో సోర్స్, ktrtrs/twitter
‘21 రోజుల్లోపే భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలి’
భవన నిర్మాణాలకు 21 రోజుల్లోగా అనుమతులు తప్పక ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ బీపాస్‌ను తెస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారని 'వెలుగు' దినపత్రిక ఓ వార్త రాసింది.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు.
ప్రజలకు అవినీతి రహితంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకే బీపాస్‌ను తెస్తున్నామని చెప్పారు.
మున్సిపాలిటీల్లో అవినీతిని అరికట్టేందుకు కఠిన చట్టాలు, విధానాలు రూపొందిస్తున్నామని, వాటి అమల్లోనూ అంతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
మున్సిపల్ చట్టం ప్రకారం పారిశుద్ధ్యం, పచ్చదనం, ప్రజలకు అందించే సేవలు, ఆన్‌లైన్ పరిపాలన, సాంకేతికత వినియోగం, ఫిర్యాదుల పరిష్కారం, అక్రమాలకు తావులేకుండా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వంటివాటికి సర్కారు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీలైనన్ని పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని, మహిళల కోసం షీ టాయిలెట్లు నిర్మించాలని ఆదేశించారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రజల పాత్రను పెంచేందుకు కమిషనర్లు, సిబ్బంది చొరవ చూపాలని కేటీఆర్ సూచించారు. ఇందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలన్నారు.

ఫొటో సోర్స్, Twitter
రేపు తొలి 'దిశ' పోలీస్ స్టేషన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో తొలి 'దిశ' పోలీస్ స్టేషన్ శనివారం ప్రారంభమవుతున్నట్లు ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త రాసింది.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో తొలి దిశ పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్టినేటర్ తలశిల రఘురాం తెలిపారు.
ఈ కార్యక్రమ అనంతరం నన్నయ్య విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగే 'దిశ' వర్క్‌షాపులో సీఎం పాల్గొంటారని చెప్పారు.
రాష్ట్రంలోని 13 జిల్లాలతోపాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి అర్బన్ జిల్లాలను కలుపుకుని మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
దిశ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయడానికి దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో ప్రత్యేక పోలీస్ బృందాలు పనిచేస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
అత్యాచార కేసుల్లో నేరం జరిగినట్లు నిర్ధారించే కచ్చితమైన ఆధారాలు ఉంటే, దోషులకు 21 రోజుల్లోపే కోర్టులు మరణశిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చింది.

ఇవి కూడా చదవండి.
- ఆంధ్రప్రదేశ్: మెడికల్ కాలేజీల కోసం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- ‘నా కూతురి బొమ్మ టార్చిలైట్ నా ప్రాణాలు కాపాడింది’
- పోలవరం ముందుకు వెళ్తోందా, లేదా? అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









