యుక్రెయిన్: 'రష్యన్లు మమ్మల్ని చంపవచ్చు... కానీ, వారు కూడా ప్రాణాలతో మిగలరు' - బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో జెలియెన్‌స్కీ

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ
    • రచయిత, క్లైవ్ మేరీ, జోయల్ గంటర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు, కీయెవ్ నుంచి

రష్యా నుంచి యూరప్ దేశాలు చమురు కొనుగోలు చేస్తునే ఉన్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆరోపించారు. 'ఇతరుల రక్తంతో వారు డబ్బును సంపాదిస్తున్నారని' ఆయన వ్యాఖ్యానించారు.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలియెన్‌స్కీ ప్రధానంగా జర్మనీ, హంగరీలను లక్ష్యంగా చేసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను ఈ దేశాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. చమురు ఎగుమతుల ద్వారా రష్యా, ప్రతీ ఏడాది 326 బిలియన్ డాలర్ల వరకు లబ్ధి పొందగలదని చెప్పారు.

ఇటీవల జర్మనీపై యుక్రెయిన్ నాయకులకు కోపం పెరిగింది. రష్యాకు వ్యతిరేకంగా కొన్ని ఆంక్షలకు జర్మనీ మద్దతు ఇచ్చింది. అయితే, చమురు కొనుగోలు అంశంలో మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడానికి పూర్తిగా సహకరించడం లేదు.

''మా స్నేహితులు, సహచరుల్లో కొంతమంది ఇకపై ఇది ఒకేలా ఉండబోదని, ఇది డబ్బు లేదా వ్యాపారానికి సంబంధించిన అంశం కాదని, జీవనపోరాటానికి సంబంధించిన వ్యవహారమని అర్థం చేసుకున్నారు'' అని కీయెవ్‌లో గురువారం జెలియెన్‌స్కీ అన్నారు.

యుక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇవ్వాలని జెలియెన్‌స్కీ అంతర్జాతీయ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా దాడిని దీటుగా ఎదుర్కోవడానికి తమకు మరిన్ని ఆయుధాలు అవసరమని అన్నారు.

''అమెరికా, బ్రిటన్, కొన్ని యూరప్ దేశాలు మాకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వారు సహాయం కూడా చేస్తున్నారు. కానీ, మాకు వీలైనంత త్వరగా సహాయం అవసరం'' అని ఆయన చెప్పారు.

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌తో పాటు దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలను చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తోన్న రష్యా సైన్యం ఇటీవలే ఇక్కడి నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంది. యుక్రెయిన్ దేశాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను రష్యా సైన్యం విరమించుకున్నట్లుగా అందరూ భావిస్తున్నారు.

మిలిటరీ క్యాంపెయిన్ ద్వారా మరింత ఎక్కువ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం యుక్రెయిన్ తూర్పు, దక్షిణ భాగంలో ఎక్కువ కాలం కొనసాగుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

బీబీసీ ప్రతినిధి క్లయివ్ మేరీతో జెలియెన్‌స్కీ
ఫొటో క్యాప్షన్, బీబీసీ ప్రతినిధి క్లయివ్ మేరీతో జెలియెన్‌స్కీ

శాంతి చర్చల అవకాశాలు మరింత తగ్గాయి

యుక్రెయిన్‌కు దక్షిణం వైపు ఉన్న మరియుపూల్ నగరం, రష్యా పదే పదే చేసిన దాడుల కారణంగా ఘోరంగా ధ్వంసమైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నగరాన్ని వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించారు.

మరియుపూల్‌లో పదివేల మంది ప్రజలు చనిపోయి ఉండొచ్చని బీబీసీతో జెలియెన్‌స్కీ చెప్పారు.

''పదివేల మంది చనిపోయారని, ఇంకా చాలా మంది కనబడటం లేదని మా దగ్గర సమాచారం ఉంది. వారి డాక్యుమెంట్లను మార్చి ఉంటారు. వారికి రష్యా పాస్‌పోర్ట్‌లు ఇచ్చి ఎక్కడికో తీసుకెళ్లి ఉంటారు. వారికేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారో కూడా ఎవరికీ తెలియదు'' అని ఆయన వివరించారు.

మరియుపూల్, బుచా, బోర్డోయాంకా, కీయెవ్ నగర శివారల్లో రష్యా దళాలు పాల్పడిన హింసా కార్యక్రమాలు... రష్యాతో శాంతి చర్చల అవకాశాలను మరింతగా తగ్గించాయి అని ఆయన అన్నారు.

వారం క్రితం రష్యా దళాలు బుచాను వదిలి వెళ్లాయి. నగరంలో వందలాది మృతదేహాలు కనిపించాయని యుక్రెయిన్ సైనికులు చెప్పారు. వీరిలో సాధారణ పౌరులు కూడా ఉన్నారు. వారి చేతులు వెనక్కి విరిచి కట్టి తలపై కాల్చి చంపారు. వీటితో పాటు పెద్ద సంఖ్యలో లైంగిక హింసకు సంబంధించిన నివేదికలు కూడా ఉన్నాయని యుక్రెయిన్ సైనికులు తెలిపారు.

బుచా నగరంలో పర్యటిస్తోన్న జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుచా నగరంలో పర్యటిస్తోన్న జెలియెన్‌స్కీ

"బుచా పరిణామాలు శాంతి చర్చలకు దారులను మూసేస్తున్నాయి. నా గురించి కాదు. నేను రష్యా గురించి చెబుతున్నా. మాతో చర్చలు జరపడానికి రష్యాకు ఇక ఎక్కువగా అవకాశాలు ఉండకపోవచ్చు" అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అన్నారు.

గతవారం బుచాకు వెళ్ళినప్పుడు ప్రజల్లో తీవ్రమైన భావోద్వేగాలను చూశానని ఆయన చెప్పారు. రష్యా సైన్యం పట్ల అక్కడి ప్రజల్లో ఏహ్య భావం తప్ప మరోటి లేదని చెప్పిన జెలియెన్‌స్కీ, పుతిన్‌తో పాటు రష్యా సైన్యంలో పైనుంచి కింది వరకూ అందరూ యుద్ధ నేరస్థులేనన్నారు.

రష్యా ఫిబ్రవరి నెలలో దాడులు ప్రారంభించినప్పుడు శాంతంగా ఉండాలని తన దేశ ప్రజలకు పిలుపునిచ్చానని ఆయన తన నాయకత్వ శైలిని సమర్థించుకున్నారు. అదే సమయంలో ఆయుధాల సరఫరాలకు ఒప్పందాలు ఖరారు చేసుకునే పనిని తమ ప్రభుత్వం తెర వెనుక నుంచి చేస్తూ వచ్చిందని తెలిపారు. అదంతా చేస్తూ కూడా ప్రజల్లో భయాందోళనలు చెలరేగి బ్యాంకుల వద్దకు పరుగులు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థ అస్థిరం కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని కూడా చెప్పారు.

"అలాంటి సంక్షోభం మా దేశంలో వస్తుందని రష్యా ఆసించింది. కానీ, మేం అలా జరగనివ్వలేదు. అయితే, దాడులు మొదలైనప్పుడు అది పూర్తి స్థాయి యుద్దంగా మారుతుందని మేం అప్పట్లో అనుకోలేదు" అని అధ్యక్షుడు అన్నారు.

మరియుపూల్‌లోని 95 శాతం భవనాలు ధ్వంసం అయ్యాయని జెలియెన్‌స్కీ చెప్పారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మరియుపూల్‌లోని 95 శాతం భవనాలు ధ్వంసం అయ్యాయని జెలియెన్‌స్కీ చెప్పారు

రష్యా 2014లో క్రైమియాను కలిపేసుకున్న తరువాత మరింత భూభాగాన్ని దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా యుక్రెయిన్ తూర్పు, దక్షిణ ప్రాంతాల దాడులను కొత్తగా ముమ్మరం చేసిందని ఆయన చెప్పారు.

తూర్పు ప్రాంతం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పిన జెలియెన్‌స్కీ, "కానీ, అక్కడే మా శక్తిమంతమైన శ్రేణులన్నీ ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని ధ్వంసం చేయొచ్చు. కానీ, మేం దానికి తగిన సమాధానం ఇస్తాం. వాళ్లు మమ్మల్ని చంపేయవచ్చు. కానీ, వాళ్లు కూడా చనిపోతారు. వాళ్లు ఈ దాడికి ఎందుకు దిగారో మాకు అర్థం కావడం లేదు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)