తెలంగాణ: కేటీఆర్ సీఎం అయ్యేది ఎప్పుడు ? ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, KTR/Facebook
వరసగా జరుగుతున్న పరిణామాలు, మంత్రి ఈటల వ్యాఖ్యలతో త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నమాటకు బలం చేకూరుతోందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అంటూ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలు ఆయన సీఎం కావడానికి ముహూర్తం ఖరారైందనడానికి సంకేతమని ఈ కథనం పేర్కొంది.
ముఖ్యమంత్రి కాకపోయినా, ఆ బాధ్యతలన్నీ ప్రస్తుతం ఆయనే చూస్తున్నారని, పార్టీలో కూడా ఆయనకు ఆ స్థాయి గౌరవమర్యాదలు దక్కుతున్నాయని, వీటన్నింటినీబట్టి చూస్తే ఆయనకు సీఎం పదవి కట్టబెట్టేందుకు సమయం దగ్గర పడినట్లు అర్ధం చేసుకోవచ్చంటూ పార్టీకి చెందిన ఓ ప్రముఖుడు వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.
త్వరలో జరగబోయే పార్టీ ప్లీనరీలో కేటీఆర్‌ను సీఎంగా ప్రకటించే అవకాశమున్నట్లు కూడా ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. ఒకవేళ సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తే ఆయన మంత్రి వర్గం కూడా రాజీనామా చేయాల్సి రావచ్చని ఈ కథనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Andhrapradesh highcourt
అది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదు- సీఐడీ కేసులను కొట్టేసిన ఏపీ హైకోర్టు
రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని ఈనాడు పత్రిక కథనం ఇచ్చింది.
రాజధాని ఎక్కడ వస్తుందో ప్రభుత్వ పెద్లల నుంచి ముందుగానే తెలుసుకుని, కొందరు మోసపూరితంగా ఈ ప్రాంతంలో భూములు కొన్నారని, తద్వారా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే భావన స్టాక్ మార్కెట్‌కు సంబంధించినదని, భూ క్రయవిక్రయాలకు ఇది వర్తించదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.
ఈ కేసుల్లో ప్రభుత్వం ఊహాజనితమైన క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు ఒడిగట్టిందని, పిటిషనర్లను విచారించడానికి పోలీసులు చీకట్లో బాణం వేశారని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు ఈనాడు పేర్కొంది.
ఆస్తులు కొనడం అమ్మడం పౌరులకున్న రాజ్యాంగబద్ధమైన హక్కని, అమ్మినవారు స్వచ్ఛందంగానే అమ్మారని, ప్రైవేటు లావాదేవీలను నేరంగా పరిగణించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
భూములు కొన్న తర్వాత వాటి రేటు పెరిగితే, కొన్నవారిపై కేసులు పెట్టడం ప్రమాదకరమైన ధోరణి అని హైకోర్టు ఈ కేసు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించిందని, పిటిషనర్లపై ప్రభుత్వం పెట్టిన కేసులను కోర్టు కొట్టివేసిందని ఈనాడు కథనం వెల్లడించింది.

వికటించిన మైనర్ పెళ్లి – తాళి కట్టిన చేతితోనే యువతి హత్య
చిత్తూరు జిల్లాలో మైనర్ వివాహం ఓ యువతి ప్రాణం తీసిందని, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు ఆమె తనకు దక్కకపోయే సరికి ఆవేశంతో హత్య చేశాడని ఆంధ్రప్రభ ఓ కథనం ఇచ్చింది.
పూతలపట్టు మండలం చింతమాకులపల్లికి చెందిన ఢిల్లీబాబు (19), పెనమూలురు మండలం తూర్పుపల్లె హరిజనవాడకు చెందిన గాయత్రి ప్రేమించుకున్నారు. మూడు నెలల కిందట తిరుపతిలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు.
గాయత్రి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసు కేసు పెట్టారు. మైనర్ వివాహం కావడంతో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి, గాయత్రిని తల్లిదండ్రులతో పంపించి వేశారు.
అప్పటి నుంచి గాయత్రిపై కోపం పెంచుకున్న ఢిల్లీబాబు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. పెనమలూరు వచ్చిన ఆమెను దారి కాచి కత్తితో పొడిచి పరారయ్యాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో గాయత్రి అపస్మారక స్థితికి చేరుకుని ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరణించింది.
విషయం తెలుసుకున్న గాయత్రి బంధువులు ఢిల్లీబాబు ఇంటిపై దాడి చేసి తగలబెట్టేందుకు ప్రతయ్నించారు. నిందితుడి తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, వారిపై కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించినట్లు ఆంధ్రప్రభ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్‌లో 75% శాతం మార్కులు అవసరం లేదు
ఎన్‌ఐటి, ట్రిపుల్ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఇంటర్‌లో 75శాతం మార్కుల ఉండాలన్న నిబంధనను తొలగిస్తున్న కేంద్రం నిర్ణయం తీసుకుందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచి ఈ సడలింపు అమల్లోకి వస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపినట్లు ఈ కథనం పేర్కొంది. జేఈఈ మెయిన్స్ ఫలితాల ఆధారంగానే ఇకపై అడ్మిషన్లు ఉంటాయని మంత్రి వెల్లడించినట్లు ఈ కథనం వెల్లడిచింది.
మరోవైపు నీట్ , జేఈఈ సిలబస్‌లలో ఎలాంటి మార్పులు లేకపోయినా, పరీక్షా విధానంలో మార్పులు ఉంటాయని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఇంతకు ముందులా కాకుండా ప్రశ్నలకు ఆప్షన్లు కూడా ఇస్తారని పేర్కొంది.
గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల నుంచి ఒక్కో పేపర్ నుంచి 30 ప్రశ్నలచొప్పున 90 ప్రశ్నలుంటాయని, ప్రతి సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందని విద్యాశాఖ పేర్కొన్నట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- యశ్వంత్ మనోహర్: సరస్వతి దేవి చిత్రం వేదికపై ఉందని అవార్డు తిరస్కరించిన కవి
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏంటి గొడవ? ఆ అడ్డుగోడలు కూలేదెలా?
- విరాట్ కోహ్లీ వీడియోపై విమర్శల వెల్లువ... ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్
- ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక తమిళుడిపై తమిళుల ఆగ్రహం ఎందుకు? ఆయన బయోపిక్ నుంచి విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకున్నారు?
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








