ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక తమిళుడిపై తమిళుల ఆగ్రహం ఎందుకు? ఆయన బయోపిక్ నుంచి విజయ్‌ సేతుపతి ఎందుకు తప్పుకున్నారు?

800 సినిమా పోస్టర్
ఫొటో క్యాప్షన్, 800 సినిమా పోస్టర్

టెస్టులు, వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తన జీవితంపై తీసే సినిమాను అనుకున్నట్లే కచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పాడు.

దక్షిణాదిన ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

బీబీసీ ప్రతినిధి నళిని శివదాసన్ ముత్తయ్య మురళీధరన్‌తో మాట్లాడారు. ఈ సినిమా గురించి కొనసాగుతున్న వివాదంపై అతడిని ప్రశ్నించారు.

"నేను నా జీవితంలో ఎన్నో వివాదాలు ఎదుర్కున్నాను. క్రికెట్‌ ఒక్కటే కాదు, ఇంకా చాలా వివాదాలు ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి" అన్నాడు మురళీధరన్.

శ్రీలంకలో తమిళ వేర్పాటువాదులు, సింహళ భద్రతాదళాల మధ్య చాలా కాలం పాటు హింసాత్మక అంతర్యుద్ధం జరిగిన సమయంలో మైనారిటీ తమిళ సమాజానికి చెందిన మురళీధరన్ చాలా కష్టపడి దేశ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు.

బౌలింగ్ గురించి అతడు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఒక మ్యాచ్‌లో తను వేసిన బంతిని 'చకింగ్' అంటూ అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించారు.

క్రికెట్‌లో చేతిని ఒక ప్రత్యేక కోణంలో తిప్పుతూ బంతి విసరడానికి అనుమతిస్తారు. కానీ మురళీధరన్ చేయి కాస్త ఎక్కువ వంగుతుంది. దాంతో అతడు విసిరిన బంతి శైలిని చకింగ్ అన్నారు. అప్పట్లో ఐసీసీ నియమాల ప్రకారం చకింగ్‌ చెల్లదు.

కానీ, ఈ వివాదం ముగిసిన తర్వాత అతడు ప్రపంచంలోని అత్యద్భుత బౌలర్లలో ఒకడయ్యాడు. కానీ, అతడి జీవితంపై వస్తున్న సినిమాను అతడి టెస్ట్ మ్యాచ్ వికెట్ల రికార్డు మీద తీస్తున్నారు. అందుకే సినిమాకు '800' అనే టైటిల్ పెట్టారు.

మహిద రాజపక్షతో ముత్తయ్య మురళీధరన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2009లో శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన సమయంలో మహింద రాజపక్ష దేశ అధ్యక్షుడుగా ఉన్నారు.

సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. కానీ, దాని పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. అందులో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్ర పోషిస్తున్నట్లు కనిపించారు.

తర్వాత నుంచి ఈ సినిమాపై వ్యతిరేకతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో సోషల్ మీడియాలో #ShameOnVijaySethupathi హాష్‌టాగ్ ట్రెండ్ అయ్యింది. విజయ్ ఆ పాత్ర పోషించకూడదని చాలా మంది జనం డిమాండ్ చేశారు.

ఈ సినిమా క్రికెట్ బయోగ్రఫీ అని నిర్మాతలు చెప్పారు. యువతకు ఇది స్ఫూర్తిని ఇస్తుందన్నారు.

కానీ, విమర్శకులు మాత్రం రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా మారిన ఒక పాత్రను ఈ సినిమాతో గొప్పవాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

గత ఏడాద శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న మురళీధరన్ వ్యాఖ్యలతో జనం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. ఆ కార్యక్రమంలో 2009లో ముగిసిన శ్రీలంక అంతర్యుద్ధం గురించి మురళీధరన్ సంతోషం వ్యక్తం చేశారు. రాజపక్షను సమర్థించారు.

అంతర్యుద్ధం సమయంలో శ్రీలంక దళాలు తమిళ వేర్పాటువాదులపై క్రూర అణచివేత చర్యలకు దిగినప్పుడు రాజపక్ష రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆ ఆపరేషన్‌లో కొన్ని వేల మంది చనిపోయారు.

ఎన్నికల సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మురళీధరన్ "నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు 2009లో వచ్చింది. ఆ రోజున దేశానికి ఏ భయం లేకుండా పోయింది" అన్నారు.

ఒక అంచనా ప్రకారం శ్రీలంక అంతర్యుద్ధం చివరి రోజుల్లో దాదాపు 40 వేల మంది సాధారణ తమిళ పౌరులు చనిపోయారు. తమిళ ప్రజలు శ్రీలంకలోని మైనారిటీ తమిళులను తమవారుగా భావిస్తారు. అందుకే వారికి ఇది చాలా సున్నితమైన అంశం.

"మురళీధరన్ తమిళుడే అయినా, అతడు తమిళుడులా ప్రవర్తించడం లేదు. సినిమాల ద్వారా అయినా, వ్యక్తిగతంగా అయినా తను తమిళనాడులోకి రావడం మేం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం" అని చెన్నైలోని ప్రభ అన్నారు.

"శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో మురళీధరన్ చేయరాని పనులు చాలా చేశాడు. తమిళ సమాజంలో అతడిని హీరోలా చూపించడం మాకు ఇష్టం లేదు" అన్నారు.

కానీ, మురళీధరన్ మాత్రం తన మాటలను పదే పదే వక్రీకరిస్తున్నారని చెబుతున్నాడు.

"నేను 2009 తర్వాత దేశంలో శాంతి పునరుద్ధరణ జరిగిందని చెప్పాలనుకున్నాను. నాకు యుద్ధం ముగిసిన రోజు అత్యంత సంతోషమైన రోజు. ఎందుకంటే, ఆ రోజు అన్ని ప్రాంతాల్లో శాంతి స్థాపన జరిగింది. అంతే కానీ, అక్కడ తమిళులు చనిపోయారని కాద "ని ఐపీఎల్ కోసం దుబాయ్‌లో ఉన్న మురళీధరన్ అన్నారు.

మురళీధరన్ ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు.

"నేను అంతర్యుద్ధంలో ఎవరి వైపూ లేను. తటస్థంగా ఉండాలని అనుకున్నాను. అప్పుడు, శ్రీలంకలో ఏం జరిగిందో భారత్‌లో ఉన్నవారికి తెలీదు" అన్నాడు.

మురళీధరన్‌కు భారత్‌తో, ముఖ్యంగా తమిళనాడుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతడి భార్యది తమిళనాడు. 2008-2010 మధ్య అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడాడు. టీమ్ పాపులర్ ఆటగాళ్లలో ఒకడయ్యాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సినిమాపై అంత వివాదం ఎందుకు?

2010లో కూడా శ్రీలంక తమిళులకు ఏమేం జరిగాయో తమిళనాడు ప్రజలకు తెలుసని, కానీ తాము ఎప్పుడూ ఆ ఘటనలను మురళీధరన్‌కు జోడించలేదని ప్రభ చెప్పారు.

"కానీ, తను శ్రీలంక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మొదలైనప్పుడు, మేం అతడికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాం. 2013లో అతడిని, మిగతా శ్రీలంక క్రికెటర్లను బాన్ చేయించడంలో సక్సెస్ అయ్యాం" అన్నారు.

"ముత్తయ్య మురళీధరన్ జీవితంపై తీసే సినిమాపై ఇంత వ్యతిరేకత రావడానికి, అందులో ప్రధాన పాత్ర పోషించిన విజయ్ సేతుపతి కారణం" అన్నారు చెన్నై జర్నలిస్ట్ కవితా మురళీధరన్.

"విజయ్‌ను ఒక మంచి నటుడుగా చూస్తారు. సామాజిక అంశాలపై ఆయన తన గళం వినిపిస్తుంటాడు. అలాంటి నటుడిని మత్తయ్య మురళీధరన్‌ పాత్రలో చూడడం జనాలకు ఇష్టం లేదు" అన్నారు.

"తమిళనాట జనం సినిమాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇక్కడ సినిమా ఒక కథ కంటే చాలా ఎక్కువ. తమిళ సినిమాకు, రాజకీయాలకు పరస్పర సంబంధం ఉంటుంది" అన్నారు కవిత.

కోలీవుడ్‌ను తమిళులకు గుర్తింపు ఇచ్చిందిగా కూడా చెబుతుంటారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలామంది సినీ పరిశ్రమ నుంచే వచ్చారు.

దాంతో, విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చింది. కానీ, చివరకు మురళీధరన్ జోక్యం చేసుకుని ఈ సినిమా నుంచి తప్పుకోవాలని విజయ్‌ను కోరిన తర్వాత, అతడు తన తుది నిర్ణయం ప్రకటించాడు.

"ఈ సినిమా వల్ల సేతుపతికి ఎందుకు ఇబ్బందులు రావాలి. నా వల్ల ఆయన సమస్యల్లో చిక్కుకోవడం ఎందుకు? ఇది నా యుద్ధం, దీన్ని చేయడం నా బాధ్యత" అన్నారు మురళీధరన్.

ముత్తయ్య మురళీధరన్

ఫొటో సోర్స్, DEAN TREML

శ్రీలంకలో మురళీధరన్‌ను ఒక హీరోలా చూస్తారు. అక్కడ ఈ సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

నేను అతడిపై వచ్చే సినిమా చూడాలనే అనుకుంటున్నా. తను గొప్ప ఆటగాడని కాదు, క్లిష్టంగా ఉండే మురళీధరన్ వ్యక్తిత్వం గురించి నాకు తెలుసుకోవాలని ఉంద"ని కొలంబోలోని స్పోర్ట్స్ రచయిత ఆండ్రూ ఫిడెల్ ఫెర్నాడో చెప్పారు.

"ఈ సినిమాపై వెంటనే వచ్చిన స్పందనలు నాకు వింతగా అనిపించాయి. అది ఎలా ఉంటుందో కూడా మనకు ఇంకా తెలీదు కదా" అన్నారు.

కానీ అంతర్యుద్ధంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన శ్రీలంకలోని తమిళులు ఈ సినిమా గురించి చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా మంది ఈ సినిమా తీయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

అలాంటి కుటుంబాల కోసం పనిచేస్తున్న గ్రూప్ ప్రతినిధి గోపాలకృష్ణన్ రాజకుమార్ "మురళీధరన్ తన జీవితంలో 2009లో అత్యంత సంతోషకరమైన రోజు వచ్చిందన్నాడు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తమిళులను అత్యంత ప్రభావితం చేసింది కూడా అదే" అన్నారు .

"తను ఒక తమిళుడు, అందుకే చాలా పాపులర్ అయ్యాడు. కానీ అతడు ఇక్కడ తమిళుల కోసం ఏం చేయలేదు" అన్నారు.

ఈ సినిమాను నిర్మిస్తున్న డార్ మోషన్ పిక్చర్స్, మూవీ ట్రెయిన్ మోషన్ పిక్చర్స్ బాలీవుడ్‌లో ఎన్నో పెద్ద సినిమాలు తీశారు.

వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నామని, కానీ ప్రధాన నటుడు తప్పుకోవడంతో తాము చాల కష్టాల్లో పడిపోయామని వారు చెప్పారు.

కానీ, మురళీధరన్ మాత్రం ప్రపచం ఎప్పుడో ఒకప్పుడు తన కథను చూస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

"ఈ సినిమా కచ్చితంగా అవుతుంది. ఇది తమిళంలోనే కాదు. ఈ సినిమా నిర్మాతలు ముంబయి వారు. చాలా భాషల్లో దీనిని నిర్మించాలనుకుంటున్నారు. వాళ్లు దీన్ని తమిళం, హిందీ, బంగ్లా, సింహళ, తెలుగు, మలయాళం, ఇంగ్లిష్‌లో సబ్ టైటిల్స్ తో విడుదల చేయాలనుకుంటున్నారు" అని మురళీధరన్ చెప్పాడు.

"ఈ సినిమా క్రికెట్ గురించి. ఇది ఇంత పెద్ద వివాదం ఎందుకు అవుతుంది " అంటాడు మురళీధరన్.

కానీ, ఇన్ని జరిగిన తర్వాత 800 సినిమా గురించి తలెత్తిన వివాదంతో ఒకటి మాత్ర స్పష్టంగా తెలుస్తోంది. క్రికెట్-రాజకీయాలను ఒకదాన్నుంచి ఇంకోదాన్ని విడదీయడం చాలా కష్టం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)