తాజ్ మహల్: షాజహాన్ అమర ప్రేమకథలో ట్విస్టు.. ముంతాజ్‌ మహల్‌తో నిశ్చితార్థం, మరో యువరాణితో పెళ్లి

షాజహాన్, ముంతాజ్ మహల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, లాహోర్ జర్నలిస్ట్, రీసెర్చర్

పర్షియన్ల కొత్త సంవత్సరాది 'నవ్‌రోజ్' వేడుక జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా మీనా బజార్‌ను అందంగా అలంకరించారు.

పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్యాలెస్‌లో ఉండే మహిళలు... నగలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులను అమ్ముతున్నారు. దీనిద్వారా వచ్చే ఆదాయం పేద ప్రజల కోసం వినియోగిస్తారు.

నికాబ్ (ముఖానికి ధరించే ముసుగు) లేకుండా మహిళలు అక్కడ ఉన్నారు కాబట్టి, చక్రవర్తి జహంగీర్ లేదా యువరాజు మాత్రమే అక్కడికి రాగలరు. యువరాజు ఖుర్రం అక్కడికి వచ్చారు.

ఒక దుకాణంలో విలువైన రాళ్లు, పట్టు వస్త్రాలు అమ్ముతోన్న ఒక అమ్మాయిని ఆయన చూశారు. ఆమె తన నాజూకైన చేతులతో ఒక అందమైన వస్త్రాన్ని మడతపెడుతున్నారు.

ఒక్క క్షణంలో వారిద్దరి కళ్లు కలుసుకున్నాయి. ఖుర్రం గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె గొంతు వినడం కోసమే 'ఈ రాయి ఖరీదు ఎంత?' అని అడిగారు. ఆ రాయిని చేతిలోకి తీసుకున్న ఆమె... ''జనాబ్, ఇది చాలా విలువైన వజ్రం. దీని తళుకు చూస్తే మీకు అర్థం కావట్లేదా? దీని విలువ పదివేల రూపాయలు'' అని అన్నారు.

ఖుర్రం, దాని ధర చెల్లించేందుకు సిద్ధమవడంతో ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ‘'దీనిపై మీ చేయి పడింది. ఇక దీనికి విలువ కట్టలేం'' అని వ్యాఖ్యానిస్తూ ఆ అమ్మాయి సిగ్గుతో చూపు తిప్పుకుంది.

''మరోసారి కలిసేంతవరకు దీన్ని నా హృదయానికి దగ్గరగా ఉంచుకుంటా'' అని ఖుర్రం అన్నారు.

దీంతో ఇదంతా సరదాగా చేసింది కాదని అప్పుడు ఆమెకు అర్థమైంది. వణుకుతోన్న గొంతుతో ‘మళ్లీ మనం ఎప్పుడు కలుస్తాం?’ అని అడిగింది.

షాజహాన్, ముంతాజ్ మహల్

ఫొటో సోర్స్, Getty Images

కైరోలీన్ ఆర్నాల్డ్, మెడెలీన్ కోమురా పుస్తకం

''మన మనసులు కలిసిన రోజున నేను నక్షత్రాల్లాగా తళ తళ మెరిసే నిజమైన వజ్రాలను మీకు అంకితం చేస్తాను'' అని ఖుర్రం గుసగుసగా ఆమెతో చెప్పారు.

కైరోలీన్ అర్నాల్డ్, మెడెలీన్ కోమురా అనే రచయితలు తమ పుస్తకం 'తాజ్‌మహల్'లో ఈ ఘటన గురించి వివరిస్తూ ఆ అమ్మాయి పేరు అర్జుమంద్ బానో అని చెప్పారు.

ఆమె తాత మీర్జా గయాస్ బేగ్ (ఈయననే ఎత్‌హాద్ ఉద్దౌలా అని కూడా పిలుస్తారు), మొగల్ నవాబు అక్బర్ పాలనా సమయంలో రాయల్ కోర్టులో చేరారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు.

ఆమె మేనత్త మెహర్-ఉన్-నిస్సా 1611లో బాద్షా జహంగీర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె తర్వాత నూర్జహాన్‌గా పేరు పొందారు.

అర్జుమంద్ అందం, అవగాహన, దూరదృష్టిని గమనించిన ఆమె తండ్రి, తాత.. ఆమెకు ఉన్నత స్థాయి విద్యను అందించారని ముయిన్-ఉల్-ఆసార్ అనే పుస్తకంలో రాశారు.

తల్లి పెంపకంలో ఆమె మరింత మనోహరంగా మారింది. ఆమె చదువు పూర్తి చేసినప్పుడు, ప్రతీ ఇంట్లోనూ ఆమె అందం, తెలివి, వినయం గురించే మాట్లాడుకునేవారు.

షాజహాన్

ఫొటో సోర్స్, Getty Images

'పాద్షా నామా'లో ఖుర్రం వివాహ సంగతులు

''అర్జుమంద్ ఒక ప్రతిభాశాలి, మర్యాద గల మహిళ. జ్ఞాన రంగంలో ఆమె ముందుండేవారు'' అని 'నోటబుల్ మొఘల్ అండ్ వుమెన్ ఇన్ ద సిక్స్‌టీన్త్ అండ్ సెవెన్టీన్త్ సెంచరీ' అనే పుస్తకంలో రేణుకా నాథ్ పేర్కొన్నారు.

అరబిక్, పర్షియన్ భాషల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. పద్యాలు కూడా రాయగలరు. వాల్డెమర్ హన్సన్ ప్రకారం, ఆమె వినయం, మర్యాదలకు ప్రసిద్ధి.

వీరిద్దరి గురించి జహంగీర్ ముందే విని ఉంటారు. అందుకే తన కుమారుడు షాబుద్దీన్ మొహమ్మద్ ఖుర్రం అడిగిన వెంటనే ఈ సంబంధానికి ఆయన ఒప్పుకున్నారు.

మాసర్-ఉల్-అమ్రా ప్రకారం, అర్జుమంద్ బానో బేగం, ఖుర్రంల నిశ్చితార్థాన్ని జహంగీర్ దగ్గరుండి జరిపించారు. ఆచారం ప్రకారం, స్వయంగా తన చేతితో ఉంగరాన్ని అందించారు.

యువరాజు ఖుర్రంతో తన మేనకోడలు అర్జుమంద్ బేగం వివాహ ఏర్పాట్లు చేయడంలో జహంగీర్ భార్య నూర్జహాన్ అమితాసక్తిని కనబరిచినట్లు 'పాద్షా నామా' అనే పుస్తకంలో మొహమ్మద్ అమీన్ కజ్విని రాశారు.

ముంతాజ్‌ మహల్‌

ఫొటో సోర్స్, WALKER AND CO.

నిశ్చితార్థం, పెళ్లి

ఆస్థాన జ్యోతిష్యులు నిర్ణయించిన ముహుర్తానికి పెళ్లి చేయడం కోసం నిశ్చితార్థం తర్వాత ఐదేళ్లు వేచిచూడాల్సి వచ్చింది. 1607 సంవత్సరంలో వీరి నిశ్చితార్థం జరిగింది. 1612లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుకను నిర్వహించారు.

ఈ వివాహ వేడుక గురించి ముయిన్-ఉల్-అసార్‌లో రాశారు. ''ఎతెముద్-ఉద్దౌలా మీర్జా గయాస్ ఇంట్లో ఈ వివాహ వేడుక జరిగింది. వివాహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేశారు. జహంగీర్ స్వయంగా తన చేతులతో వరుని తలపాగాకు ముత్యాల హారాన్ని అలంకరించారు. మెహర్‌గా రూ. 5 లక్షలు నిర్ణయించారు. అప్పుడు ఖుర్రం వయస్సు 20 సంవత్సరాల 38 లేదా 39 రోజులు కాగా, అర్జుమంద్ వయస్సు 19 ఏళ్లు'' అని అందులో రాసుకొచ్చారు.

''రంగు, రూపం, వ్యక్తిత్వం వంటి గుణగణాలలో ఆ కాలపు మహిళలందరిలో అత్యంత విశేషమైన మహిళగా అర్జుమంద్‌ను యువరాజు ఖుర్రం అభివర్ణించారు. ఆమెకు 'ముంతాజ్ మహల్' అనే బిరుదును ఇచ్చారు'' అని చంద్రపంత్ ప్రకారం తెలిసింది.

అర్జుమంద్‌తో నిశ్చితార్థం, పెళ్లికి మధ్య సమయంలో ఖుర్రం... యువరాణి కంధారీ బేగమ్‌ను 1610లో పెళ్లి చేసుకున్నారు. అర్జుమంద్‌తో పెళ్లి తర్వాత 1617లో ఇజ్జున్నీసా బేగమ్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ఈమె మొగల్ దర్బారుకు చెందిన ఒక వ్యక్తి కూతురు. అస్థాన చరిత్రకారుల ప్రకారం, ఈ రెండు వివాహాలు రాజకీయ సమ్మేళనాలు.

అయితే, ముంతాజ్‌ మహల్ పట్ల ఉన్న ప్రేమ, శ్రద్ధ ఆయనకు మిగిలిన భార్యలపై ఉండేది కాదని 'ఇక్బాల్‌నామా జహంగీరీ'లో మోత్‌మిద్ ఖాన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, తాజ్‌మహల్‌పైనా కరోనా ఎఫెక్ట్

షాజహాన్ బిరుదు

''ముంతాజ్ మహల్‌పై ఉన్న ప్రేమలో కనీసం వెయ్యి వంతు ప్రేమ కూడా మిగతా భార్యలపై ఖుర్రంకు లేదు. ఆయన ఆనందమంతా ముంతాజ్ మహల్‌తోనే ముడిపడి ఉండేది'' అని చరిత్రకారుడు ఇనాయత్ ఖాన్ అన్నారు.

''1628లో 36 ఏళ్ల వయస్సులో షాబుద్దీన్ మొహమ్మద్ ఖుర్రం, షాజహాన్ అనే బిరుదును స్వీకరించి సింహాసనాన్ని అధిష్టించారు. ఆసిఫ్ ఖాన్ ప్రధానమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా భారీ వేడుకను నిర్వహించారు'' అని జఫర్‌నామా షాజహాన్‌లో రాశారు.

ఈ సందర్భంగా జరిగిన వేడుకలో ముంతాజ్ మహల్... ఆభరణాలు, బంగారం, వెండితో తయారు చేసిన పూలతో ఆయనకు దిష్టి తీశారు.

చక్రవర్తి షాజహాన్, ముంతాజ్‌కు బహుమతిగా రెండు లక్షల బంగారు నాణేలు, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు. సంవత్సరానికి పది లక్షల రూపాయల భృతిని ప్రకటించారు. మరో భార్య సాహిబాకు ఒక లక్ష బంగారు నాణేలు, నాలుగు లక్షల రూపాయలు బహుమానంగా ఇచ్చి సంవత్సర భృతిగా ఆరు లక్షలు కేటాయించారు. అధిక ఆదాయం వచ్చే భూములు, ఆస్తులను కూడా ముంతాజ్ మహల్‌కే ఇచ్చారు.

జశ్వంత్ లాల్ ఇలా రాశారు. ''ముంతాజ్ మహల్‌కు షాజహాన్ 'పాద్షా బేగం (మహిళా చక్రవర్తి)', 'మలికా-ఎ-జహా (ప్రపంచ రాణి)', 'మలికా-ఎ-హింద్ (హిందుస్థాన్ రాణి)' అనే బిరుదులను ఇచ్చారు. అంతకుముందు మరే ఇతర రాణి కూడా పొందని సౌకర్యాలను ముంతాజ్‌కు షాజహాన్ ఇచ్చారు'' అని జశ్వంత్ లాల్ రాశారు.

వీడియో క్యాప్షన్, తరిగిపోతున్న తాజ్ మహల్ అందాలు. కళ్లు తెరవకపోతే కనుమరుగే.

రాజకీయ శక్తి

'ఖాస్ మహల్'ను అలంకరించినట్లుగా మరే ఇతర రాణుల మందిరాన్ని అలంకరించలేదు. ఖాస్ మహల్‌లోనే షాజహాన్, ముంతాజ్ కలిసి ఉండేవారు. దీన్ని శుద్ధమైన బంగారం, విలువైన రాళ్లతో అలంకరించారు. ఇందులో రోజ్‌వాటర్‌ ఫౌంటెన్లు ఉండేవి.

ఆమె ఎల్లప్పుడూ షాజహాన్‌కు సహచరిణిగా, నమ్మకస్థురాలిగా, సలహాదారుగా ఉన్నారు. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ రాజకీయ అధికారాన్ని కోరుకోలేదు. అకాలమరణం కారణంగా ఆమె కేవలం మూడేళ్లు మాత్రమే రాణిగా ఉన్నారు.

మాసర్-అల్-అమ్రా ప్రకారం, జాతీయ వ్యవహారాల్లో కూడా షాజహాన్‌కు ముంతాజ్ సలహాదారుగా ఉన్నారు. కానీ, నూర్జహాన్ తరహాలో బాద్షా తన మార్గంలోనే నడవాలని అనుకోలేదు.

ముంతాజ్‌ మహల్ తన మేనత్త కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన సవతి తల్లికి ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకోవాలని షాజహాన్‌కు ఆమె సలహా ఇచ్చారు.

అందుకే నూర్జహాన్‌కు ఇచ్చే వార్షిక పెన్షన్‌ను షాజహాన్ 38 లక్షలుగా నిర్ణయించారు. ముంతాజ్ మహల్ ముఖ్యంగా నైతిక విలువలను పాటించేవారు. రోజూ వందలాది వితంతువుల, వేలాది మంది పేద ప్రజలను ఆమె ఆదుకునేవారు.

తపతీ నదీ తీరంలో ముంతాజ్ మొదటి సమాధి

ఫొటో సోర్స్, PENGUIN VIKING

ఫొటో క్యాప్షన్, తపతీ నదీ తీరంలో ముంతాజ్ మొదటి సమాధి

ముంతాజ్ మహల్ కూతురు జహనారా

19 ఏళ్ల వివాహ బంధంలో వారికి 14 మంది సంతానం కలిగారు. వారిలో ఎనిమిది మంది కుమారులు, ఆరుగురు కుమార్తెలు. ఇందులో ఏడుగురు పురిట్లోనే లేదా పసిప్రాయంలోనే మరణించారు. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ముంతాజ్ మహల్ తరచుగా షాజహాన్‌కు సైనిక ప్రచార కార్యక్రమాల్లో తోడుగా ఉండేవారు.

'మానుమెంట్ ఆఫ్ లవ్ అండ్ సింబల్ ఆఫ్ మెటర్నల్ డెత్: ద స్టోరీ బిహైండ్ ద తాజ్‌మహల్' అనే పుస్తకాన్ని అనంత్ కుమార్ రాశారు. ఈ పుస్తకంలో ఆమె మరణం గురించి ఆయన తెలిపారు. '' 14వ బిడ్డను ప్రసవించే సమయంలో దాదాపు 30 గంటల పాటు పురిటి నొప్పులు భరించిన తర్వాత అధిక రక్తస్రావం కారణంగా ముంతాజ్ మహల్ మరణించారు. 1631 జూన్ 17న బుర్హాన్‌పూర్‌లో ఇది జరిగింది. ఆ సమయంలో ఆమె భర్త, దక్కన్ ప్రాంతంలో సైనిక ప్రచారంలో ఉన్నారు. బుర్హాన్‌పూర్‌లోని గార్డెన్‌లో ఆమెను తాత్కాలికంగా ఖననం చేశారు'' అని ఆయన పుస్తకంలో వివరించారు.

ముంతాజ్ మహల్ మరణంతో షాజహాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషాదం నుంచి ఆయన తేరుకొని బయటకు వచ్చినప్పుడు... చక్రవర్తి జుట్టు నెరిసిపోయి, వీపు వంగిపోయి, ముఖం కళ తప్పి కనిపించిందని వెన్ బెగ్లీ చెప్పారు.

'ద గ్రేట్ మొఘల్ ఎంపైర్: హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్' అనే పుస్తకంలో అన్నే మేరీ ష్మిల్... 'ముంతాజ్ మహల్ పెద్ద కూతురు జహనారా బేగమ్ తన తండ్రిని క్రమంగా బాధ నుంచి కోలుకునేలా చేసిందని, ఆ తర్వాత తన తల్లి స్థానాన్ని భర్తీ చేసిందని' రాశారు.

తాజ్ మహల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాజ్ మహల్

తాజ్‌మహల్ నిర్మాణం

1631 డిసెంబర్‌లో ముంతాజ్ మహల్ మృతదేహాన్ని ఆగ్రాకు తరలించారు. ఈ కార్యక్రమంలో ముంతాజ్ కుమారుడు షా షుజా, రాణి వ్యక్తిగత దాసి, వ్యక్తిగత వైద్యుడు, ఆమె కుమార్తెలు జహనారా బేగం, గోహ్రా బేగంతోపాటు దర్బారులోని సభికుడు వజీర్ ఖాన్ పాల్గొన్నారు.

యమునా నదితీరంలోని చిన్న భవనంలో ఆమెను సమాధి చేశారు. 1632 జనవరిలో సమాధి ఉన్న ప్రదేశంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారు.

దీన్ని పూర్తి చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది. ''ఇది ఇతర భవనాల మాదిరిగా ఒక వాస్తు శిల్పం కాదు. సజీవ రాళ్లలో ఉద్భవించే చక్రవర్తి గొప్ప ప్రేమకు నిదర్శనం'' అని ఇంగ్లిష్ కవి సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నారు.

ముంతాజ్ మహల్ అందానికి ప్రతీకగా తాజ్‌మహల్‌ను రూపొందించారని గిల్స్ టిల్ట్‌సన్ అంటారు.

తాజ్ మహల్ పనుల్లో షాజహాన్ బిజీగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఔరంగజేబు, తన ముగ్గురు సోదరులను చంపి 1658లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 1666లో షాజహాన్ మరణించేంత వరకు ఆగ్రాలోని ఒక కోటలో బంధించాడు.

షాజహాన్ తన చివరి రోజుల్లో ఎవరినీ కలవకుండా ముసమ్మాన్ బుర్జ్ నుంచి తాజ్ మహల్‌ను చూస్తూ గడిపారు.

ఆయన చనిపోయాక, ముంతాజ్ మహల్‌ సమాధి దగ్గరే ఖననం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)