కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'

ఫొటో సోర్స్, facebook.com/KTRTRS
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో బీజేపీ, టీఆరెస్‌ల మధ్య మాటల యుద్ధం ఇటీవల జోరందుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధించాలని బీజేపీ చూస్తుంటే, టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాల వైపు దృష్టి మళ్లిస్తోంది.
ఇదిలా ఉండగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో వేగం పెంచింది.
ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధ్రువీకరించారు.
ఈ అంశాలన్నింటిపై బీబీసీ, కేటీఆర్‌తో సంభాషించింది.
రాష్ట్రంలో నాలుగు పాదయాత్రలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా యాత్ర చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు సంబంధించి ఐప్యాక్ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. మీ వ్యూహం ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 21 ఏళ్లు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెట్టబోతోంది. ఆ సందర్భంగా మా ప్లీనరీ (పార్టీ సమావేశం) జరుగుతోంది. సహజంగానే, రాజకీయ పార్టీలకు ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఒకరు పాదయాత్ర చేస్తున్నారు. ఇంకొకరు సభ పెడుతున్నారు. మా పార్టీ ప్లీనరీ నిర్వహిస్తోంది.
ఏది ఏమైనా ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. వారు ఎవరిని ఎన్నుకుంటే వారే ప్రభుత్వాన్ని నడుపుతారు.
ఐప్యాక్‌తో టీఆర్ఎస్ఒప్పందం చేసుకుంది. కేసీఆర్, ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయ్యారు. అంతకు ముందు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఐప్యాక్.. వీటి మధ్య సమీకరణలు ఎలా ఉన్నాయి?
అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత బలంతోనే ఎన్నికల్లో గెలుస్తుంది. 2014, 2018లలో మాకు వ్యూహకర్తలు ఎవరూ లేరు. కేసీఆర్‌ను మించిన వ్యూహకర్తలు లేరు.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొత్త తరానికి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని చేరవేయడానికి ఐప్యాక్ లాంటి సంస్థలు సహకరిస్తాయి. ఆ దిశలో కొంత బలాన్ని చేకూర్చగలవు. అంతే తప్ప, ఎన్నికల్లో గెలుపు ఓటములు నిర్దేశించే స్థాయిలో ఏ వ్యూహకర్త లేదా సంస్థ ఒక పార్టీకి తోడ్పాటునివ్వలేవు.
ఈ రకమైన సంస్థల సహాయం అవసరమని అనుకుంటున్నారా?
ప్రస్తుత సమాజంలో 18 నుంచి 35 ఏళ్ల పిల్లలకు, సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగిస్తున్న యువతరానికి మా పార్టీని దగ్గరగా తీసుకెళ్లడానికి, వారి మధ్య బలం పుంజుకోవడానికి, మా సిద్ధాంతాలను వారికి అర్థమయ్యేలా చెప్పడానికి కచ్చితంగా ఈ సంస్థల సహాయం అవసరం.
టీఆర్ఎస్ కూడా డిజిటల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయినా కూడా టీఆర్ఎస్ చేయలేనిది, ఐప్యాక్ చేయగలిగేది ఏమిటి?
అలా అని కాదు. ఎప్పుడూ మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశం ఉంటూనే ఉంటుంది. జీవితంలోనైనా, పార్టీలోనైనా మెరుగుదల ముఖ్యం. ఒక్కోసారి మనం చూడలేనివి బయటవాళ్లకు కనబడవచ్చు. మనకు తోచనివి వాళ్లు సూచించే అవకాశం ఉంది. ఫలనా విధంగా చేస్తే బావుంటుంది అని సలహాలివ్వవచ్చు. అదొక కొత్త విధానం.
నిజానికి, టీఆర్ఎస్ పాలన బాగాలేదు అని ప్రజలు భావిస్తే మమ్మల్ని ఎవరూ కాపాడలేరు. టీఆర్ఎస్ పాలన బాగానే ఉంది, మరో ఒకటి, రెండు పనులు చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటే, అప్పుడు సలహాలివ్వడానికి, చిన్న చిన్న కరెక్షన్లు చేసుకోవడానికి ఇలాంటి సంస్థలు సహకరించగలవు.
ఐప్యాక్ వ్యూహం రాష్ట్ర స్థాయిలో ఒకలాగ, జాతీయ స్థాయిలో మరొకలాగ ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ రాహుల్ గాంధీతో మాట్లాడడం వేరు, తెలంగాణకు వచ్చి మాట్లాడడం వేరని కూడా చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
ప్రశాంత్ కిశోర్ అనే కాదు, నాకు తెలిసినంతవరకు దేశంలో కాంగ్రెస్‌ను కాపాడగలిగేవారు ఎవరూ లేరు. స్వయంగా రాహుల్ గాంధీ ఆయన సీటు గెలవలేరు. ఆయన నియోజక వర్గం అమేధీలోనే ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేరు. నేనొక అంతర్జాతీయ నాయకుడని ఆయన అనుకున్నా, ఆయనకు ఈయన తోడైనా ఏం లాభం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా, టీఆర్ఎస్‌ను ఓడించాలని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అదే విధంగా కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్న తరువాత ఎవరూ ఏం చేయలేరు. ఎవరూ ఎవరినీ ఎన్నికల్లో గెలిపించలేరు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అనే కాదు, ఏ పార్టీనైనా ఎవరూ ఎన్నికల్లో గెలిపించలేరు. వాళ్లే గెలవాలి. ఐప్యాక్ లాంటి సంస్థలు మనకు కొంత బలాన్ని చేకూర్చగలవు తప్పితే ఎన్నికల్లో గెలిపించలేవు.
ప్రజలకు చేరువ కావడం, తమ సిద్ధాంతాలు, వ్యూహాలతో వాళ్ల నమ్మకం సాధించడం పార్టీల బాధ్యత. అలాగే ఓట్లు పడతాయి. కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. స్వతంత్ర భారతదేశంలో వాళ్లకి 65 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌కు అవకాశాలు ఇవ్వడం, పరీక్షించడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఎవరూ ఆ పార్టీని పట్టించుకోవట్లేదు. ప్రశాంత్ కిశోర్ కాదు కదా ఎవరూ వారిని కాపాడలేరు. ఇక్కడ ముఖ్యంగా, ప్రశాంత్ కిశోర్ వేరు, ఐప్యాక్ వేరు. ఆయనకు ఇప్పుడు ఐప్యాక్‌తో సంబంధం లేదు. కాబట్టి వివాదమే లేదు.
రాష్ట్ర రాజకీయాలకొస్తే, ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
2023లో ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే, నెలకో, ఏడాదికో ఎన్నికలు వచ్చినా, నిన్న, మొన్న జరిగినా మళ్లీ మొత్తంగా ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా రాజకీయాల్లో భాగం. ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి, సన్నాహలు చేసుకుంటూ ఉండాలి.
గత రెండు ఎన్నికలకు, ఇప్పటికీ వాతావరణం కొంత మారినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు బలం పుంజుకుంటున్నాయి. నంబర్లూ పెరిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యర్థి ఎవరు?
టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యర్థి మజ్లీసే అవుతుంది. అసెంబ్లీలో కూడా మజ్లీస్ బలం పుంజుకుంటోంది. కేఏ పాల్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిల, బండి సంజయ్.. ఇలా చాలామంది ఉన్నారు లైన్‌లో.
మజ్లీస్‌కు టీఆర్ఎస్ పార్టీకి స్నేహం ఉందని అనుకుంటున్నారు?
మాకందరూ స్నేహితులే. ఇందాక ఎవరో మాకు కాంగ్రెస్ ఫ్రెండు అన్నారు. బీజేపీ కూడా ఫ్రెండే అన్నారు. నిజానికి మాకెవరూ ఫ్రెండ్స్ కారు. మాకు తెలంగాణ ప్రజలతో మాత్రమే పొత్తు ఉంది. అది కొనసాగుతుంది.
బీజేపీ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎదగడానికి ప్రయత్నిస్తోంది. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?
అదొక నిరాశాజనకమైన పార్టీ. దానివల్ల ఏ ఉపయోగమూ లేదూ. మతతత్వం ఆధారంగా ప్రజలను వేరు చేయడమే దాని పని.
తెలంగాణ గవర్నరు గురించి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీపైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఆమెకు వీఐపీ ట్రీట్‌మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు.
ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే, రాష్ట్ర రాజకీయాల్లోకి గవర్నరును వాళ్లు లాగారు కాబట్టే ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చింది. కావాలంటే నేను ప్రభుత్వాన్ని కూలదోయగలను అని గవర్నరు అనడం, లేని మెడికల్ కాలేజీ మోదీ గారు ఇచ్చినట్టు చెప్పడం.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను గవర్నరులుగా నియమించి, రాజ్యాంగబద్ధమైన సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే కపట ఆలోచనలు మానేసి, ఎవరి పని వారు చేసుకుంటే ఏ గొడవ ఉండదు.
అవన్నీ కాకుండా, గిల్లికజ్జాలు పెట్టుకోవడం, పనికిమాలిన పంచాయితీలు పెట్టుకోవడం, కేంద్రం ఆడించినట్టు ఆడడం చేస్తే అప్పుడప్పుడూ స్పర్థ వస్తుంది. కానీ, మాకు రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం ఉంది. ఒకరినొకరు గౌరవించుకోవాలి. చిన్న చిన్న లోపాలు, స్పర్థలు ఉంటే సర్దుకుంటాయి.
టిట్ ఫర్ టాట్ లాంటి పరిస్థితి ఉందా?
గవర్నరు పదవి రాజ్యాంగబద్ధమైనది. గవర్నరును దిల్లీ నుంచి నియమిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వమే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కన్నా నేనే పెద్ద అని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వం అవుతుంది. అవివేకం అవుతుంది.
ఎన్నికల్లో మీరు కేంద్రం వైపు అడుగులేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. కానీ, ఫలితాలేమిటో తెలియట్లేదు. ఏం జరుగుతోంది?
అన్నీ ఒకేసారి చెప్పేస్తే ఏం బావుంటుంది (నవ్వుతూ). అన్నీ చెప్పాల్సిన సమయంలో చెప్తాం.
అసలు థర్డ్ ఫ్రంట్ అనేది వస్తుందా? మమతా బెనర్జీ వేరే రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. అలా టీఆర్ఎస్ కూడా వేరే రాష్ట్రాల్లో పోటీకి దిగుతుందా?
మీవన్నీ 24X7 న్యూస్ ఛానల్స్. మీకు వార్తలు నడవాలి కదా.. అన్నీ ఒకేసారి చెప్పేస్తే ఎలా? సరైన సమయం బట్టి మా గౌరవ పార్టీ అధ్యక్షులు ప్లీనరీలో అన్నీ విశదీకరిస్తారు.
కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి నేరుగా ప్రవేశిస్తున్నట్టు కనబడుతోంది. దేశ రాజకీయాలు నడిపేటంత సత్తా కేసీఆర్‌కు ఉందని మీరు భావిస్తున్నారా?
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ లేరని మీరెలా అనగలరు? దేశంలోని కీలకమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి, ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు దేశం మొత్తానికే దిక్సూచిగా మారినప్పుడు.. రైతు బంధును కాపీ కొట్టి మోదీ పీఎం కిసాన్ పెట్టుకున్నప్పుడు, మిషన్ భగీరథ కాపీ కొట్టి, హర్ ఘర్ జల్ అని పెట్టుకున్నప్పుడు కేసీఆర్ పాత్ర లేదా? ఆయన ముద్ర జాతీయ రాజకీయాల్లో లేదని ఎలా అనుకుంటారు?
మన దేశంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. జాతీయ రాజకీయాల్లో ఉండాలంటే పార్లమెంటుకు పోటీ చేయాలి, దేశమంతా పోటీ చేయాలని అనుకుంటారు. జాతీయ రాజకీయాలను ఎన్నో రకాలుగా ప్రభావితం చేయవచ్చు. ఆ రకంగా కేసీఆర్ ఎన్నో కోణాల నుంచి ప్రభావితం చేశారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ నమూనా ఉంటుంది.
2014 ముందు నరేంద్ర మోదీ ఎవరో దేశానికి తెలీదు. గుజరాత్ నమూనా అని చెప్పి దేశానికి ఏదో చేస్తానని చెప్పి ఆయన ప్రధాని అయ్యారు. ఇప్పుడు దేశం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, ఈ ఎనిమిదేళ్లల్లో మోదీ చేసింది ఏంటి? సాధించింది ఏంటి? రైతు ఆదాయం రెట్టింపు అన్నారు. అయిందా? రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. ఇచ్చారా? నల్లధనం బయటకు తెస్తాను, 15 లక్షలు అకౌంట్లో వేస్తాను అన్నారు. వేశారా? ఇలా చెబుతూ పోతే అన్ని రంగాల్లోనూ వైఫల్యమే. గ్యాసు, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే గతంలో మన్మోహన్ సింగ్‌ను నిందించారు.
అందుకే ఈ గోల్‌మాల్ గుజరాత్ మోడల్ కాదు, నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని విజయవంతమైన తెలంగాణ మోడల్ ఎంచుకుంటే దేశానికి మంచిది. అలాంటి చర్చ దేశం మొత్తం జరగాలని కోరుకుంటున్నాం. దేశానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. రాజకీయాలు, పార్లమెంటు పదవులు కాదు. తెలంగాణ నమూనాను దేశం ముందు ఆవిష్కరించాలి. అది చూసి ప్రజలే ఆలోచించుకుంటారు.
థర్డ్ ఫ్రంట్‌కి ఎవరు నాయకత్వం వహించబోతున్నారు?
కచ్చితంగా ఎవరు లీడ్ చేయాలో వాళ్లే చేస్తారు. ఇవన్నీ ఇప్పుడే చెప్పేస్తే బీబీసీకి ఇంక న్యూస్ ఉండదు (నవ్వుతూ).
పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి?
మేము మా పొరుగు రాష్ట్రాలతో ఎప్పుడూ సఖ్యంగానే ఉన్నాం. చంద్రబాబు గారితో సఖ్యంగానే ఉన్నాం. ఇప్పుడు జగన్ గారితోనూ అదే స్నేహం. మనవి సోదర రాష్ట్రాలు. తెలుగు మాట్లాడే రాష్ట్రాలు. అక్కడవారంతా మా సహోదరులే.
థర్డ్ ఫ్రంట్‌లో వారిని కూడా కలుపుకుంటారా?
అప్పుడే నిర్ణయాలకు వచ్చేయొద్దు. రాజకీయాల్లో ఎవరి ఆలోచన వారిది. ఎవరి నిర్ణయాలు వారివి.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంలో బతకాలంటే ఆహారం ఎక్కడినుంచి వస్తుంది? చెట్లు మొలుస్తాయా? మాంసం తయారు చేయొచ్చా?
- కూమా జైలు: స్వలింగ సంపర్కులకు మాత్రమే
- డాట్సన్ కార్లు 'గుడ్ బై' చెబుతున్నాయి... ఎంతో చరిత్ర ఉన్న ఈ బ్రాండ్ ఎందుకు కనుమరుగవుతోంది?
- అక్కడ దెయ్యాన్ని పావురంలో పెట్టి బయటకు వెళ్లగొడతారట
- ఆపరేషన్ మిన్స్మీట్: రెండవ ప్రపంచ యుద్ధంలో అడాల్ఫ్ హిట్లర్‌ను ఒక అనాధ శవం ఎలా మోసం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















