కేటీఆర్: 'ఇవ్వాళ వాళ్లకు కష్టమొచ్చిందని మేం నోర్మూసుకొని కూర్చుంటే.. రేపు మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరుంటరు?’ - ప్రెస్ రివ్యూ

కేటీఆర్

ఫొటో సోర్స్, @TRS Party

‘‘పెద్ద ఎన్నికలు వస్తే.. పాకిస్థాన్‌ బోర్డర్‌ల లొల్లి అయితది. ఇక్కడ చిన్న ఎన్నికలు వస్తే భైంసాలో లొల్లి అయితది.. ఎందుకో ఆలోచించండి! కొట్లాట పెట్టాలె.. కలిసి ఉండనివ్వొద్దు.. ఆగం చేసి విడగొట్టాలె. హిందూ, ముస్లిం భావన తెచ్చి నాలుగు ఓట్లు వేయించుకొని అవతల పడాలె! ఇదీ బీజేపీ మార్క్‌ రాజకీయం’’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

విద్యావంతులు, పట్టభద్రులు ఆలోచన చేయాలని కేటీఆర్ సూచించారు. పొరపాటున బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే.. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్ల ధరలను పరోక్షంగా ఆమోదిస్తున్నారని చెప్పి.. ఇంకా పెంచే ప్రమాదముందని హెచ్చరించారు. రూ. 1000 ఉన్న సిలిండర్‌ ధర రూ. 2000 అయినా ఆశ్చర్యం లేదన్నారు.

శుక్రవారం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ జీవితం-సామరస్య విలువలు’ అనే అంశంపై బేగంపేటలోని హోటల్‌ హరిత ప్లాజాలో నిర్వహించిన సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

‘‘మాది జాతీయవాదమని బీజేపీ నేతలు చెబుతరు. మీ జాతీయవాదంలో తెలంగాణ జాతి ప్రయోజనాలు లేవా?’’ అని ప్రశ్నించారు. కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. నిధులు, విద్యాసంస్థలను తెలంగాణకు ఇవ్వలేదన్నారు. బుల్లెట్‌ రైలు దిల్లీ నుంచి ముంబయి వరకు గుజరాత్‌ మీదుగా వెళ్తుందని, హైస్పీడ్‌ రైలు జాబితాలో హైదరాబాద్‌ ఉండదని విమర్శించారు. వీటిని ప్రశ్నిస్తే అక్బర్‌, బిన్‌ లాడెన్‌, బాబర్‌.. అని గులకరాళ్లు డబ్బాలో వేసి ఊపినట్టు అవే మాటలు మాట్లాడతారని అన్నారు.

‘‘బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని రద్దు చేసినరు. ఉన్న విశాఖ ఉక్కునే తుక్కుతుక్కు చేసి అమ్మాలని చూస్తున్నరు. అదేంటని అడిగితే ఏపీలో నీకేం పనంటరు? ఏపీ దేశంలో లేదా? మేం మాట్లాడొద్దా..? ఇవ్వాళ అక్కడమ్ముతున్నవు.. రేపు మా సింగరేణి, ఈసీఐఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ మీద పడుతవు. ఇవ్వాళ వాళ్లకు కష్టమొచ్చిందని మేం నోర్మూసుకొని కూర్చుంటే రేపు మాకు కష్టం వచ్చినప్పుడు ఎవరుంటరు? మనం తెలంగాణ బిడ్డలం. కానీ, ముందుగా భారతీయులం. దేశంలో ఎక్కడ తప్పు పని జరిగినా ప్రశ్నించాలె’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

30 రోజుల్లో 100 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ఎలా? అనే ఫార్మాట్‌ను నీతి ఆయోగ్‌ రెడీ చేసిందని ఎద్దేవా చేశారు. నగరంలో ఉన్న ఐడీపీఎల్‌ ఖతం చేశారని, హిందూస్థాన్‌ కేబుల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌లో 80 వేల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు.

‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ప్రాధాన్యాల్లో తెలంగాణ లేదని స్పష్టమైన సంకేతాలనిస్తోంది. అలాంటప్పుడు మన ప్రాధాన్య ఓటు వాళ్లకెందుకు వెయ్యాలి? ప్రశ్నించే గొంతుకను అంటున్న సిటింగ్‌ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు.. ఐటీఐఆర్‌ రద్దయినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? సిలిండర్‌ ధర పెరిగినప్పుడు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ రద్దు చేస్తానన్నప్పుడు ఆయన నోరెందుకు పెగల్లేదు?’’ అని కేటీఆర్‌ నిలదీశారని ఈ కథనంలో తెలిపారు.

line
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

'గ్రీన్‌ క్వీన్స్‌ ఆఫ్‌ ఇండియా'.. ఐఎఫ్ఎస్‌కు ఎంపికైన తొలి మహిళ రామలక్ష్మి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికైన తొలి మహిళ సీఎస్‌ రామలక్ష్మి సేవలను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ ప్రత్యేకంగా కొనియాడిందంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

1980లో మొట్టమొదట ఈ రంగంలోకి ప్రవేశించిన ముగ్గురు మహిళల్లో రామలక్ష్మి ఒకరు. అప్పట్లో పురుషులకే పరిమితమైన వృత్తిలోకి ధైర్యంగా ముందడుగు వేయడమే కాకుండా.. విధుల్లో సత్తా చాటారని ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ గుర్తు చేసింది.

మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ఉద్యోగినుల సేవలపై ‘గ్రీన్‌ క్వీన్స్‌ ఆఫ్‌ ఇండియా- నేషన్స్‌ ప్రైడ్‌’ పుస్తకం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ప్రత్యేక ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సీఎస్‌ రామలక్ష్మి ఈ సర్వీసులోకి వచ్చిన విధానం, ఉద్యోగ జీవితంపై అందులో ఇలా ప్రస్తావించింది.

‘రామలక్ష్మి గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతంగా పనిచేశారు. ఐఎఫ్‌ఎస్‌ పరీక్షలకు సరదాగా దరఖాస్తు చేసుకున్నా ఉద్యోగ జీవితంలో విజయవంతంగా రాణించారు. ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా గుంటూరులో తొలుత పని చేసినా.. కరీంనగర్‌ ఈస్ట్‌ డివిజన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు.

నక్సల్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో ఎలాంటి సదుపాయాలు లేకున్నా నెలలో 20 రోజులు రాత్రిపగలు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే అక్కడి పేదలకు ఇళ్ల నిర్మాణం, రేషన్‌ పంపిణీ, ఆదాయం కల్పించే పథకాలు అమలుచేసే అదనపు బాధ్యతలనూ చేపట్టారు.

1986లో గోదావరి నది ఆకస్మిక వరదలతో నష్టపోయిన వారికి సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టగా ఏపీ ప్రభుత్వం ఉత్తమ సేవా పథకంతో సత్కరించింది. పదవీ విరమణ తర్వాత కూడా రామలక్ష్మి క్రియాశీలకంగా ఉన్నారు.’ అని పుస్తకంలో వివరించారు.

ఐఎఫ్‌ఎస్‌లోకి 1980 సంవత్సరంలో మహిళల ప్రవేశం మొదలైంది. ఇప్పటి వరకు 284 మహిళలు పని చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8, తెలంగాణ నుంచి 11 మంది మహిళలు ఉన్నారు.

వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి సీఎస్‌ రామలక్ష్మి, ఎం.రేవతి, శాంతిప్రియ పాండే, జ్యోతి తుల్లిమెల్లి, యశోదా బాయ్‌, నందనీ సలారియా, సుమన్‌ బేనివాల్‌, నిషా కుమారి ఉన్నారు.

తెలంగాణ నుంచి ఆర్‌.శోభ, సి.సువర్ణ, సునితా జేఎం భగవత్‌, అకోయ్‌జామ్‌ సోనిబాలా దేవి, ప్రియాంకా వర్గీష్‌, ఎస్‌జే ఆశా, ఎన్‌.క్షితిజ, శివానీ డోగ్రా, అర్పణా, భూక్యా లావణ్య, బోగా నిఖిత పేర్లను పుస్తకంలో పేర్కొన్నట్లు ఈ కథనంలో తెలిపారు.

line

26న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బంద్

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కిసాన్‌ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారత్‌ బంద్‌లో భాగంగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయించిందని సాక్షిలో ఒక వార్త రాశారు.

సమితి సమావేశం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగింది. సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. 26న బంద్‌ను విజయవంతం చేయడానికి 17న విజయవాడలో సన్నాహక సమావేశం జరుపుతున్నట్లు తెలిపారు.

19న వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ముందు నిరసన వ్యక్తం చేయాలని, 15న విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని సమావేశంలో తీర్మానం చేశామన్నారు. సమావేశంలో రైతు సంఘాల నేతలు రావుల వెంకయ్య, వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)