మహిళలకు పీరియడ్స్ లీవ్ ఇవ్వాలా వద్దా.... దీని చుట్టూ ఉన్న వివాదమేంటి?

పీరియడ్స్ సమయంలో మహిళలకు సెలవులు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీరియడ్స్ సమయంలో మహిళలకు సెలవులు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది
    • రచయిత, ఆలమూరు సౌమ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ కంపెనీలో పనిచేసే మహిళలకు పీరియడ్స్ లీవ్ పాలసీ ప్రకటించింది.

"తమ సంస్థలో పనిచేసే మహిళలు నెలకు ఒకరోజు సెలవు తీసుకోవచ్చు అని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. సంస్థలో సమానత్వం, సహకారం పెంపొందించేందుకు ఫ్లిప్‌కార్ట్ పీరియడ్స్ లీవ్ పాలసీ ప్రవేశపెట్టింది. మార్చి 1 నుంచి ఇది అమలులోకొస్తుంది" అంటూ అవతార్ సంస్థ వెల్లడించింది. అవతార్ సంస్థ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అంశాల్లో వివిధ కంపెనీలకు సలహాలు, సూచనలు అందిస్తుంది.

దీనికి ముందే మూడు భారతీయ సంస్థలు కూడా మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ లీవ్ ప్రకటించాయి.

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 2020లో మహిళలకు పీరియడ్స్ లీవ్ ప్రకటించింది. 2021లో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ మహిళలకు నెలకు 2 రోజులు "టైమ ఆఫ్"ను ప్రకటించింది. ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ కూడా మహిళా ఉద్యోగులకు నెలకొక పీరియడ్స్ లీవ్ ప్రకటించింది.

జొమాటో సంస్థ ఫౌండర్ & సీఈఓ దీపిందర్ తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు ఒక లేఖ జారీ చేస్తూ, "కడుపు నొప్పనో, ఒంట్లో బాగాలేదనో చెప్పక్కర్లేకుండా 'నాకు పీరియడ్స్ మొదలయ్యాయి, రెస్ట్ కావాలి' అని నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పగలిగే అవకాశం మీకు ఉండాలి. అందుకే జొమాటో సంవత్సరానికి 10 పీరియడ్స్ సెలవులు ప్రకటిస్తోంది. పీరియడ్ సెలవులకు అప్లై చేసుకోవడానికి సిగ్గుపడాల్సిన, మొహమాటపడాల్సిన పనిలేదు. ఈ విషయంలో మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే మా దృష్టికి తీసుకు రావచ్చు" అని రాశారు.

నెలసరికి సెలవులు ఇవ్వడం మహిళల పట్ల వివక్షకు దారి తీస్తుందని కొందరు వాదిస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నెలసరికి సెలవులు ఇవ్వడం మహిళల పట్ల వివక్షకు దారి తీస్తుందని కొందరు వాదిస్తున్నారు

పీరియడ్స్ లీవ్ ఎందుకు?

నెల నెలా పీరియడ్స్ వచ్చినప్పుడు శరీరంలో వచ్చే మార్పులు ఒక్కో మహిళకూ ఒక్కోలా ఉంటాయని వివరించారు డాక్టర్ శిరీష. ఆమె హైదరాబాదులో నీలోఫర్ ఆస్పత్రిలో వైద్యురాలు.

"కొంతమందికి కేవలం అసౌకర్యం మాత్రమే ఉండవచ్చు. కానీ కొంతమందికి విపరెతమైన నొప్పి ఉంటుంది, కళ్లు తిరుగుతాయి. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్ లేదా ప్రీమెన్‌స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్ (పీఎండీడీ) లాంటివి ఉంటే ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. ఆ సమయంలో మహిళలకు విశ్రాంతి చాలా అవసరం" అని ఆమె అన్నారు.

అయితే, మన దేశంలో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితులు ఇప్పటికీ లేవు. బట్టలకు మరకలు అంటుతాయనే భయం, శానిటరీ నాప్కిన్స్ కొనుక్కోవడానికి మొహమాటం, అదొక రహస్యమన్నట్టు మెడికల్ షాపుల్లో వాటిని నల్లటి కవర్‌లో చుట్టి ఇవ్వడం, పీరియడ్స్‌ సమయంలో నొప్పి అని చెబితే ఎక్కడ బలహీనులుగా పరిగణిస్తారోననే భయం, ఆ సమయంలో సాంఘిక, మత పరమైన కార్యక్రమాలకు అనుమతించకపోవడం.. ఇవన్నీ మహిళలను ఎదుర్కొంటున్న సమస్యలు.

ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో 71 శాతం యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలకు రుతుక్రమం వచ్చే వరకు దాని గురించి తెలియదు.

"మా స్కూల్లో అమ్మాయిలు పీరియడ్స్ వస్తే, చాలా రహస్యంగా వచ్చి చెబుతారు. చాలామంది అమ్మాయిలకు ఒక వయసులో ప్యూబర్టీ వస్తుందన్న సంగతి కూడా తెలీదు. బట్టలకు మరకలు అంటుకుంటే చాలా సిగ్గుపడిపోతారు. ఇక అబ్బాయిలు అదొక అంతర్జాతీయ సమస్యలాగ, దాని గురించి మాట్లాడుకుంటారు. ఆడపిల్లలు మగ టీచర్లకు తమ సమస్యలు చెప్పలేరు. భయం, సిగ్గు’’ అని ఒక కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచరు భరణి చిత్రలేఖ వాపోయారు.

‘‘మా టీచర్ల సంగతి వేరే చెప్పక్కర్లేదు. సరైన బాత్‌రూంలు ఉండవు. ప్యాడ్స్ మార్చుకోవడానికి సౌకర్యాలు ఉండవు. రోజంతా నిలబడి పాఠాలు చెప్పాలి. నడుం లాగేసినా, కళ్లు తిరిగినా పాఠాలు చెప్పాల్సిందే. ఆ ఒక్కరోజు సెలవు తీసుకుని ఇంటికెళిపోతే బావుండును అని ఎన్నిసార్లు అనిపించిందో. కానీ, మాకు ఆ అవకాశం లేదు. నేను పనిచేసిన స్కూళ్లల్లో చాలావరకు మగ ప్రిన్సిపాల్ ఉంటారు. ఒంట్లో బాగాలేదు అని చెప్తే మనం అబద్దం చెబుతున్నట్టు చూస్తారు" అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, "తల్లిదండ్రులు మమ్మల్ని ట్రాన్స్‌జెండర్లుగా గుర్తిస్తే, మేం ఇలా వీధిన పడం"

పీరియడ్స్ సెలవు ఎప్పుడు, ఎక్కడ మొదలైంది?

పీరియడ్స్ లీవ్ లేదా మెనుస్ట్రువల్ లీవ్ అనేది ఇప్పుడు కొత్తగా చర్చల్లోకి వచ్చిన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక శతాబ్ద కాలంగా దీనిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

1922లో సోవియట్ యూనియన్, 1947లో జపాన్, 1953లో సౌత్ కొరియా తమ జాతీయ విధానాల్లో భాగంగా పీరియడ్స్ లీవ్‌ను ప్రవేశపెట్టాయి. అలాగే, ఇండోనేషియా, జాంబియా, తైవాన్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పీరియడ్స్ లీవ్‌ను జాతీయ విధానాల్లో జతచేశాయి.

అయితే, అమెరికా, యూరప్‌లోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఇప్పటికీ అరుదే.

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సు, మెరుగైన పనితీరు కోసం, అలాగే నెలసరి చుట్టూ ఉన్న అపోహలు, ఆంక్షలు, భయాలను పోగొట్టడం కోసం అన్ని దేశాల్లో పీరియడ్స్ లీవ్ ప్రవేశపెట్టడం ఉత్తమమని ప్రపంచవ్యాప్తంగా మహిళా యాక్టివిస్టులు, హక్కుల ఉద్యమకారులు వాదిస్తున్నారు.

పని చేసే ప్రాంతంలో నెలసరి సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పని చేసే ప్రాంతంలో నెలసరి సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు

భారతదేశంలో పీరియడ్స్ లీవ్ పాలసీ ఉందా?

అరుణాచల్ ప్రదేశ్ నుంచి లోక్‌సభ మాజీ పార్లమెంటు సభ్యుడు నినోంగ్ ఎరింగ్, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేసే మహిళలకు నెలలో రెండు రోజులు పీరియడ్స్ లీవ్ కేటాయించాలని 2017లో 'మెన్స్ట్రువేషన్ బెనిఫిట్ బిల్లు'ను ప్రవేశపెట్టారు. దీన్ని ప్రైవేట్ మెంబెర్స్ బిల్లుగా ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లు పాస్ అవ్వలేదు. అప్పటి నుంచి పార్లమెంటులో ఆ అంశం చర్చకు రాలేదు కూడా.

కానీ, ఈ బిల్లు, ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చను లేవదీసింది. ఉద్యోగులకు, ముఖ్యంగా ఆడవారికి మెరుగైన పని వాతావరణాన్ని కల్పించేందుకు దేశంలో మెరుగైన కార్మిక చట్టాలను తీసుకురావాలనే డిమాండ్ భారతదేశంలో ఊపందుకుంది.

కాగా, గత ముప్పయి ఏళ్లుగా దేశంలో పీరియడ్స్ లీవ్ విధానాన్ని అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం బిహార్. 1992లో మహిళా ఉద్యోగులకు నెలకు రెండు రోజుల పీరియడ్స్ లీవ్ మంజూరు చేశారు అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.

ఇదిలా ఉండగా, మన దేశంలో పీరియడ్స్ లీవ్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై అనేక వాదోపవాదాలు ఉన్నాయి. దీనికి మద్దతు ఇచ్చేవారు అధిక సంఖ్యలో ఉన్నా, వ్యతిరేకించేవారూ ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పీరియడ్స్ లీవ్‌కు వ్యతిరేకంగా వాదనలేమిటి?

మహిళలకు ప్రత్యేకంగా పీరియడ్స్ లీవ్ కేటాయించడం వర్క్‌ప్లేస్‌లో వివక్షకు దారి తీస్తుందని కొందరు వాదిస్తున్నారు.

అంతే కాకుండా, పీరియడ్స్ లీవ్ అమలులోకొస్తే కంపెనీలు మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడానికి వెనుకాడతాయని అంటున్నారు. ఇప్పటికే, శ్రామికశక్తిలో మహిళల శాతం చాలా తక్కువ. పలు కారణాలతో మహిళలను ఉద్యోగాల్లో పెట్టుకోవడానికి కంపెనీలు వెనుకడుగేస్తాయి. ఇప్పుడు పీరియడ్స్ లీవ్ కూడా తోడైతే, మహిళల సాధికారత మరింత క్లిష్టమవుతుందన్నది వీరి వాదన.

మరోవైపు, నెలసరి సమయంలో సెలవులు తీసుకోవడమంటే మహిళలు బలహీనులని ఒప్పుకోవడమేనంటూ మరికొందరు వాదిస్తున్నారు. 2020లో జొమాటో పీరియడ్స్ లీవ్ ప్రకటించినప్పుడు జర్నలిస్ట్ బర్ఖా దత్ తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇలాంటి సెలవులు మహిళలకు ఇవ్వడం బయలాజికల్ వ్యత్యాసాలను బలపరచడమేనని, మహిళలు బలహీనులని నిరూపించడమేనని ఆమె వాదించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"సారీ, జొమాటో..మీ నిర్ణయం మంచి ఉద్దేశంతో తీసుకున్నదే అయినా, మహిళలను వేరుపరుస్తుంది. బయలాజికల్‌గా స్త్రీలు బలహీనులనే అంశానికి బలం చేకూరుస్తుంది. మేం ఓపక్క సైన్యంలో చేరాలి, యుద్ధాన్ని రిపోర్ట్ చేయాలి, ఫైటర్ జెట్స్ నడపాలి, అంతరిక్షంలోకి ప్రయాణించాలి అని కోరుకుంటూ, మరోపక్క పీరియడ్స్ లీవ్ కావాలి అని అడగడం సబబు కాదు" అంటూ ఆమె ట్వీట్ చేశారు.

పీరియడ్స్‌లో ఉన్నప్పుడే కార్గిల్ యుద్ధం గురించి రిపోర్ట్ చేశానని ఆమె మరొక ట్వీట్‌లో అన్నారు.

"నాకు రుతుస్రావం అవుతున్నప్పుడే కార్గిల్ యుద్ధాన్ని రిపోర్ట్ చేయడానికి వెళ్లాను. నా దగ్గర శానిటరీ ప్యాడ్స్ కూడా లేవు. నా బ్యాగు మీద బాంబు పడింది. నొప్పికి కాంబిఫ్లాం మాత్ర తీసుకున్నా. టాయిలెట్ పేపర్ వాడుతూ పనిలో పడ్డాను. నేను పీరియడ్స్‌కు సెలవు తీసుకున్నట్లయితే, నన్ను యుద్ధం గురించి రిపోర్ట్ చేసే పనికి పంపేవారే కాదు" అని ఆమె అన్నారు.

పీరియడ్స్ ఇబ్బందుల మీద అందరికీ అవగాహన రావాలని కొందరు సూచిస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీరియడ్స్ ఇబ్బందుల మీద అందరికీ అవగాహన రావాలని కొందరు సూచిస్తున్నారు

'పీరియడ్స్ లీవ్ ఇవ్వడమంటే మహిళా ఉద్యోగులను గౌరవించడం'

పురుషుల, మహిళల మధ్య బయలాజికల్ వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించడం అవసరమని, ఇది మహిళలకు సాధికారతను చేకూరుస్తుందే తప్ప బలహీనులను చేయదని ఫ్లిప్‌కార్ట్‌లోని సీనియర్ లెర్నింగ్ అసోసియేట్ స్నేహ మురళి లింక్డ్‌ఇన్‌లో రాశారు.

మహిళలకు ఇది ఒక ఛాయిస్‌గా ఉండాలని డాక్టర్ శిరీష అభిప్రాయపడ్డారు.

"అందరూ స్త్రీలకూ ఒకే రకమైన నొప్పి, బాధ ఉంటాయని చెప్పలేం. కొంతమంది సెలవు తీసుకోకుండా, ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని విధుల్లోకి రావాలని అనుకోవచ్చు. అది వాళ్ల ఇష్టానికి వదిలేయాలి. బాధ ఉన్నవాళ్లకు సెలవు తీసుకునే అవకాశం, హక్కు ఉండాలి. పీరియడ్స్ లీవ్ విధానాన్ని స్వాగతించాలి. ఇది మహిళలకు ఇస్తున్న గౌరవంగా భావించాలి" అని ఆమె అన్నారు.

"రాష్ట్ర ప్రభుత్వం మాకు అయిదు రోజులు అదనపు కాజువల్ లీవ్స్ (సీఎల్) ఇచ్చింది. దానికన్నా కూడా ఓపెన్‌గా పీరియడ్స్ లీవ్ అని పేరు పెట్టి మాకు సెలవులు ఇస్తే ఎంతో మేలు. అప్పుడు మేం సెలవులు పెట్టుకుంటే, ఎవరూ తోసిపుచ్చలేరు. నెలసరి చుట్టూ ఉన్న అపోహలను తొలగించడానికి కూడా వీలుపడుతుంది.

చాలామందికి తమ విధుల్లో ఎక్కువ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వెళ్లినచోట సదుపాయాలు ఉంటాయో ఉండవో తెలీదు. అలాంటివారికి పీరియడ్స్ లీవ్ చాలా అవసరం. రుతుస్రావంలో సెలవులు తీసుకుంటే మనకు మనమే బలహీనులం అని నిరూపించుకున్నట్టు కాదు. ఇదేం అభర్థన కాదు. సెలవు కావాలని మనం డిమాండ్ చేయవచ్చు. ఇది అవసరం” అని డాక్టర్ శిరీష అభిప్రాయపడ్డారు.

'మహిళా హక్కుల గురించి అవగాహన లేనివారే అలా మాట్లాడతారు'

"ప్రపంచంలో రెండే పనులు ముఖ్యం.. ఉత్పత్తి, పునరుత్పత్తి. మిగతావి ఏమున్నా లేకపోయినా ప్రపంచం నడుస్తుంది. ఈ రెండూ లేకపోతే మాత్రం నడవదు. ఉత్పత్తి అనేది ఆహారానికి సంబంధించినది. మానవుల మనుగడకు అవసరమైనది. పునరుత్పత్తి అనేది మానవ జాతిని నిలబెట్టేది, ముందుకు తీసుకెళ్లేది.

ఒకప్పుడు ఈ రెండు పనులూ మహిళల చేతుల్లోనే ఉండేవి. ఎప్పుడైతే ఆస్తి అనేది వచ్చిందో ఉత్పత్తి పురుషుల చేతుల్లోకి వెళ్లిపోయింది. పునరుత్పత్తి మహిళలకు మాత్రమే చెందిన అంశంగా మారిపోయింది. కానీ, అది న్యాయం కాదు. పునరుత్పత్తి కేవలం మహిళల బాధ్యత కాదు. అది సమాజం బాధ్యత. పునరుత్పత్తి సమాజపు అవసరం. పునరుత్పత్తి జరగాలంటే రుతుక్రమం ఉండాలి. సమాజం దాన్ని గౌరవించాలి. మానవజాతిని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ అది. సమాజం దానికి మద్దతు ఇవ్వాలి’’ అని సీనియర్ జర్నలిస్ట్ వనజ అన్నారు.

‘‘పీరియడ్స్ లీవ్ తీసుకోవడం మహిళల బలహీనత అని ఎవరైనా అంటే వాళ్లకి మహిళల సమస్యలు, హక్కుల గురించి అవగాహన లేదన్నమాట" అని ఆమె వ్యాఖ్యానించారు.

పీరియడ్స్ సెలవులపై ప్రభుత్వాలు చొరవ చూపాలన్న వాదన వినిపిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీరియడ్స్ సెలవులపై ప్రభుత్వాలు చొరవ చూపాలన్న వాదన వినిపిస్తోంది

‘పీరియడ్స్ సమస్యలపై ప్రభుత్వాలు చొరవ చూపట్లేదు’

ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి చొరవా ఉండదని దళిత మహిళా హక్కుల కార్యకర్త, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి అన్నారు.

"పీరియడ్స్‌కు సెలవులా.. అదెంతో దూరంలో ఉంది. ప్యాడ్స్ బర్నింగ్ మిషన్ కొనడానికే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. యూనివర్సిటీల్లో రిజిస్టార్లు, వీసీలు మగవాళ్లే ఉంటారు.వాళ్లకి ఎలా వివరించాలి! ఇదంతా పురుష ప్రపంచం. ఇలాంటివాటికి అనుమతులు పొందడం అంత సులువు కాదు’’ అన్నారు సుజాత.

‘‘మహిళలు గంటలు గంటలు ప్రయాణాలు చేసి ఉద్యోగాలకు వెళతారు. నొప్పి, బాధ భరిస్తూ విధులు నిర్వహిస్తారు. కానీ, ఈ అంశం గురించి ప్రభుత్వపరంగా ఎలాంటి చొరవా లేదు. దీనిపై చర్చలు జరిగిన దాఖలాలు నా దృష్టికి రాలేదు. మహిళా కమీషన్‌తో కలిసి పనిచేస్తున్నాను. మహిళలకు ప్రత్యేక అవసరాలు కల్పించాలి అనేదాని పట్ల ప్రభుత్వాలకు అసలు శ్రద్ధ లేదు. అదొక ముఖ్యమైన అంశమనే అవగాహన లేదు. రాజకీయాల్లో మహిళలు ఉన్నప్పటికీ, ఉల్లిగడ్డల ధరలు పెరిగితే, కూరగాయలు ధరలు పెరిగితే వాళ్లను తీసుకొచ్చి ముందు కూర్చోబెడతారు. మహిళలు వంటింటికే పరిమితం అని కదా వాళ్ల ఉద్దేశం. హక్కులు, సమస్యల పట్ల గొంతెత్తరు" అని ఆమె విమర్శించారు.

ఏపీఎస్ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు నెలకు మూడు రోజులు సెలవు

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో మహిళా ఉద్యోగులకు ముఖ్యంగా మహిళా కండక్టర్లకు నెలకు మూడురోజులు తప్పనిసరిగా సెలవులు ఇస్తారని ఒక డిపో మేనేజర్ బీబీసీకి చెప్పారు.

"ఏపీఎస్ఆర్టీసీ వెల్ఫేర్ అసోసియేషన్ గత అయిదేళ్లుగా ఈ విధానాన్ని అమలుచేస్తోంది. అంతకుముందు సెలవులకు వీలు ఉంటేనే ఇచ్చేవారు. కానీ, సుమారు అయిదేళ్లుగా, మహిళా కండక్టర్లు పీరియడ్స్‌కు సెలవు కావాలని అప్లికేషన్ పెడితే కచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇది రూలు. కండక్టర్లకే కాదు, ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే మహిళా ఉద్యోగులు ఎవరైనా ఈ సెలవులు తీసుకోవచ్చు. అయితే, అందరూ సెలవులు తీసుకోవాలని లేదు. కొంతమందికి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. వాళ్లు విధుల్లోకి వస్తారు. ఇది ఛాయిస్ మాత్రమే. కానీ, లేడీ కండక్టర్లకు ఆ మూడు రోజులూ చాలా కష్టం. వాళ్లకు కచ్చితంగా సెలవులు ఇవ్వాల్సిందే" అని ఆయన చెప్పారు.

అయితే, తెలంగాణ ఆర్టీసీలో తప్పనిసరి నిబంధన లేదని చెప్పారు. వీలును బట్టి సెలవులు ఇస్తారని, మహిళా కండక్టర్లు అడిగినప్పుడు చాలావరకూ సెలవు ఇవ్వడానికే ప్రయత్నిస్తారు కానీ, ఇవ్వాలన్న రూలు లేదని చెప్పారు.

ట్రాన్స్ జెండర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘ట్రాన్స్ జెండర్లకు కూడా పీరియడ్స్ ఉంటాయి’

ట్రాన్స్‌జెండర్లకూ పీరియడ్స్ లీవ్

ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ సంస్థ పీరియడ్స్ లీవ్ ప్రకటించినప్పుడు "మహిళలకూ, ట్రాన్స్‌జెండర్లకూ" ఈ పాలసీ వర్తిస్తుందని చెప్పింది. అయితే, చాలామంది 'ట్రాన్స్‌జెండర్లకు పీరియడ్స్ ఏమిటి' అంటూ అపహాస్యం చేశారు.

ట్రాన్స్ వుమెన్‌కూ పీరియడ్స్ బాధ ఉంటుందనే విషయం చాలామందికి తెలీదని ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ మీరా సంఘమిత్ర చెప్పారు. మీరా, తెలంగాణ హిజ్రా ఇంటర్‌సెక్స్ ట్రాన్స్‌జెండర్ సమితితో కలిసి పనిచేస్తారు.

"మొదటగా, ట్రాన్స్‌జెండర్లలో ఉద్యోగాలు చేస్తున్నవారి శాతం ఎంత? ముందు దీని గురించి మాట్లాడాలి. ట్రాన్స్ మెన్ అయినా, ట్రాన్స్ వుమెన్ అయినా వర్క్‌ప్లేస్‌లో తమ గుర్తింపును ధైర్యంగా బయటపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ బయటపెట్టుకుంటే వివక్షకు గురి కాకుండా ఉంటారా? ఈ మధ్య కాలంలో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది కానీ అది ఏమాత్రం చాలదు.

ఇక పీరియడ్స్ నొప్పి, బాధ విషయానికొస్తే, ట్రాన్స్ వుమెన్‌కి రుతుస్రావం ఉండదని, వారికి ఎలాంటి బాధా ఉండదని చాలామంది అనుకుంటారు. అది తప్పు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకూ పీఎంఎస్, పీఎండీడీ (రుతుక్రమానికి సంబంధించిన ఇబ్బందులు) ఉంటాయి.

ఇక్కడ రెండు విషయాలు గమనించాలి.. అమ్మాయిలుగా పుట్టి, అబ్బాయిలుగా మారిన వ్యక్తులు. వీరిని ట్రాన్స్ మెన్ అంటారు. అబ్బాయిలుగా పుట్టి అమ్మాయిలుగా మారినవారు.. వీరిని ట్రాన్స్ వుమెన్ అంటారు. ట్రాన్స్ వుమెన్ సాధారణంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ థెరపీ తీసుకుంటారు. వీరికి రుతుస్రావం ఉండకపోవచ్చు. కానీ, రుతుస్రావానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ప్రతి నెలా వారికి నొప్పి, బాధ ఉంటుంది. ఈ అంశంపై చాలా అధ్యయనాలు కూడా ఉన్నాయి.

రెండవ విషయం ట్రాన్స్ మెన్‌కు కూడా పీరియడ్స్ బాధ ఉంటుంది. వీళ్లు పుట్టుకతో అమ్మాయిలు. వాళ్లు టెస్టోస్టీరాన్ హార్మోన్లు తీసుకుంటారు. సర్జరీలు చేయించుకుంటారు. అయినప్పటికీ, వాళ్లకి బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే, పీఎంఎస్, పీఎండీడీ సమస్యలు కూడా ఉంటాయి" అని మీరా వివరించారు.

‘‘పీరియడ్స్ లీవ్ విషయానికొస్తే ట్రాన్స్ మెన్, ట్రాన్స్ వుమెన్‌కు కూడా ఈ సెలవులు ఉండాలి. రుతుస్రావం ఉంటుందా ఉండదా అని కాదు. ఇది జెండర్‌కు, ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్న’’ అన్నారు మీరా.

‘‘ఒక వ్యక్తి ట్రాన్స్ వుమన్‌గా మారినప్పుడు, తన గుర్తింపును గౌరవించాలి. సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది. ఇది గౌరవానికి, గుర్తింపుకు సంబంధించిన అంశం. అందులో వివక్ష చూపడం సరికాదు. మహిళలకు మాత్రమే పీరియడ్స్ లీవ్ ఇచ్చి, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఇవ్వకపోతే, వాళ్ల స్త్రీత్వాన్ని అవమానించినట్టు. వివక్ష చూపించినట్టు అర్థం. దీని గురించి కూడా మనం ఆలోచించాలి" అని ఆమె అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఎల్‌జీబీటీ... తేడాలేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)