హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది

హీట్‌వేవ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ హీట్‌వేవ్‌లు నమోదు కావొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతోపాటు విదర్భ, తూర్పు మధ్య‌ప్రదేశ్, పశ్చిమ మధ్య‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌లకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల వరకు వెళ్లొచ్చని ఐఎండీ అంచనా వేసింది.

ఇంతకీ ఎల్లో అలర్ట్ అంటే ఏమిటి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

హీట్‌వేవ్

ఫొటో సోర్స్, Imd

గ్రీన్ నుంచి రెడ్ వరకు..

ఎండ తీవ్రతపై ప్రజలతోపాటు అధికారులకూ హెచ్చరికలు జారీచేసేందుకు భారత వాతావరణ విభాగం ఈ అలర్టులను ఉపయోగిస్తుంది.

విపత్తు ప్రతిస్పందన దళాల సిబ్బందితోపాటు అధికారులూ ఈ అలర్టుల ఆధారంగా అప్రమత్తం అవుతుంటారు. పరిస్థితుల తీవ్రత, నష్టాన్ని తగ్గించేందుకు వీరు చర్యలు తీసుకుంటుంటారు.

ప్రధానంగా పరిస్థితుల తీవ్రతపై హెచ్చరించేందుకు ఐఎండీ నాలుగు రంగులను ఉపయోగిస్తుంది. వీటిలో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఉన్నాయి.

పరిస్థితులు సాధారణంగా ఉండేటప్పుడు గ్రీన్ అలర్టును జారీచేస్తుంటారు. అంటే ముందు రోజులతో పోలిస్తే వాతావరణంలో పెద్దగా మార్పులు లేనప్పుడు, లేదా ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యేటప్పుడు గ్రీన్ అలర్టు జారీచేస్తారు.

హీట్‌వేవ్

ఫొటో సోర్స్, Getty Images

అధికారులను అప్రమత్తం చేసేందుకు ఎల్లో

వాతావరణ తీవ్రతపై అధికారులను అప్రమత్తం చేసేందుకు ఎల్లో అలర్టును జారీచేస్తుంటారు. సాధారణంగా వరుసగా రెండు రోజులకు మించి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేటప్పుడు లేదా పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్టును జారీచేస్తామని హైదరాబాద్‌లోని వాతావరణ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న నాగరత్న చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతోపాటు విదర్భ, తూర్పు మధ్య ప్రదేశ్, పశ్చిమ మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌లకు ఈ అలర్టును జారీచేశారని ఆమె వివరించారు.

చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలని సూచించేందుకు ఆరెంజ్ అలర్టును జారీచేస్తారు. ముఖ్యంగా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు (ఎక్స్‌ట్రీమ్లీ సివియర్)గా ఉండేటప్పుడు ఈ అలర్టును జారీచేస్తారు.

గత గురువారం దేశ రాజధాని దిల్లీతోపాటు పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేశారు.

పరిస్థితులు మరింత తీవ్రమైనప్పుడు రెడ్ అలర్టును జారీచేస్తారు. ఈ అలర్టును జారీచేసినప్పుడు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అలర్టును జారీచేస్తే రోడ్డు, రైలు ప్రయాణాలపై ఆంక్షలు కూడా విధించే అవకాశముంది.

గత ఏడాది మే నెలలో దిల్లీలో రెడ్ అలర్టు జారీచేశారు. దీంతో ప్రజలు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు బయట తిరగొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది.

హీట్‌వేవ్

ఫొటో సోర్స్, Getty Images

తీవ్రమైన హీట్‌వేవ్‌లు

తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లో సివియర్ హీట్‌వేవ్‌లు నమోదైనట్లు శనివారం ఐఎండీ వెల్లడించింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 44 నుంచి 47 డిగ్రీల వరకు వెళ్లినట్లు పేర్కొంది.

మరోవైపు విదర్భతోపాటు హరియాణా, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ హీట్‌వేవ్‌లు నమోదైనట్లు పేర్కొంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల వరకు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది.

మే మూడో తేదీ తర్వాత తెలంగాణతోపాటు ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వీడియో క్యాప్షన్, ఇంతలా ఉష్ణోగ్రతలు పడిపోడానికి కారణమేంటి?

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు వెళ్లే అవకాశముందని నాగరత్న చెప్పారు.

‘‘మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలవరకు బయట తిరగకూడదు. ఎల్లో అలర్టులోనూ ఒక్కోసారి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు వెళ్లొచ్చు’’అని ఆమె చెప్పారు.

వృద్ధులు, పిల్లలు ఈ హీట్‌వేవ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వీరిపై ఎండ కాస్త ఎక్కువ ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, వడగళ్లు ఎలా ఏర్పడతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?

హీట్‌వేవ్ సమయంలో వడదెబ్బ తగిలే ముప్పు ఎక్కువగా ఉంటుందని దిల్లీలోని లంగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న డాక్టర్ ఆర్ సాయిబాబా చెప్పారు.

‘‘మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని నీళ్లతో తడుపుకోవాలి. వీలైతే రెండు, మూడుసార్లు స్నానం చేయాలి’’అని ఆయన సూచించారు.

‘‘మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవాలి. కాస్త తలనొప్పిగా అనిపించినా, తల తిరుగుతున్నట్లు ఉన్నా అప్రమత్తం కావాలి’’అని ఆయన చెప్పారు.

‘‘వడదెబ్బ తగిలిందని తెలియడానికి తల తిరగడమే ప్రధాన సంకేతం. ఆ తర్వాత వాంతులు మొదలవుతాయి. తల బరువెక్కుతుంది’’అని ఆయన అన్నారు.

‘‘ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే నీడలోకి తీసుకెళ్లి మంచి నీళ్లు ఇవ్వాలి. ఐస్ నీళ్లు, కూల్ డ్రింక్స్ వెంటనే ఇవ్వకూడదు’’అని ఆయన వివరించారు.

వీలైనంతవరకు మధ్యాహ్నం ఎండలో తిరగకపోవడమే మంచిదని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే, గొడుగులు, టోపీలు లాంటివి వాడాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)