తాన్‌సేన్ సమాధి మీద మొలిచిన బెర్రీ చెట్టు ఆకులు తింటే గొంతు మధురంగా మారుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అకీల్ అబ్బాస్ జాఫ్రీ, చరిత్రకారుడు
- హోదా, బీబీసీ కోసం
భారతదేశంలో ఓ సుప్రసిద్ధ సంగీతకారుడు ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిపై ఒక బెర్రీ మొక్క పెరిగింది. తర్వాత అది పెద్ద చెట్టుగా మారింది. సంగీతం నేర్చుకునే వారు చాలామంది ఆయన సమాధిని దర్శిస్తారు. ఆ బెర్రీ చెట్టు ఆకును తింటారు. ఆయన సమాధిపై పెరిగిన ఈ చెట్టు ఆకు తింటే, ఆయనలాగే తమ గొంతు కూడా మధురంగా మారుతుందని వారు భావిస్తారు.
ఆ సంగీత విద్వాంసుడు మరెవరో కాదు....తాన్‌సేన్.
'గ్వాలియర్ ఘరానా' అనే శైలికి శాస్త్రీయ సంగీతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది మొదట్లో 'ధ్రుపద్ గాయకి' శైలిపై లోతైన ముద్ర వేసింది. తర్వాత గ్వాలియర్ సంస్థానానికి చెందిన వారు 'ఖయాల్ గాయకీ' శైలిని ఆశ్రయించారు. తర్వాత వారు తమ సంస్థానం పేరు కలిసి వచ్చేలా 'గ్వాలియర్ ఘరానా' శైలి పేరుతో పిలుచుకోవడం ప్రారంభించారు.
మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో గ్వాలియర్‌ను సంగీత కళకు ప్రధాన కేంద్రంగా పరిగణిస్తారు. అక్కడ రాజా మాన్ సింగ్ తోమర్ ( 1486-1516) ఒక అకాడమీని స్థాపించారు. ఇందులో సంగీత కళను బోధించడానికి నాయక్ బక్షు వంటి విశిష్ట పండితులను నియమించారు.
నాయక్ బక్షు 'ధ్రుపద' శైలిలో గొప్ప నిపుణుడు. షాజహాన్ కాలం వరకు ఉత్తర భారతదేశంలోని సంగీతకారులపై ధృపద శైలి ప్రభావం ఉంది. మాన్ సింగ్ తోమర్, నాయక్ బక్షు, సుల్తాన్ ఆదిల్ షా సూరి, హజ్రత్ మొహమ్మద్ గౌస్ గ్వాలియోరి వంటి వారి కృషితో గ్వాలియర్ సంస్థానం సంగీతానికి ముఖ్యమైన కేంద్రాలలో ఒకటిగా మారింది.
అక్బర్ ఆస్థానంలోని 18 మంది గాయకులలో పదకొండు మంది గ్వాలియర్ కు సంబంధించినవారు కావడం గమనించాల్సిన విషయం. అక్బర్ ఆస్థానంతో అనుబంధం ఉన్న గ్వాలియర్ గాయకులలో ప్రముఖుడు ఉస్తాద్ తాన్‌సేన్.
''తాన్‌సేన్ పేరు వినగానే గ్వాలియర్ సమీపంలోని ప్రజలు చెవులు కోసుకుంటారు'' అని ప్రొఫెసర్ మహమ్మద్ అస్లాం తన రచనలు 'సలాతిన్-ఎ-దెహ్లీ, షహాన్-ఎ-ముగిలియా కా జౌక్-ఎ-మౌసికి'లో రాశారు.

ఫొటో సోర్స్, DEPARTMENT OF POST/INDIA
తాన్‌సేన్ తండ్రి మకరంద్ పాండే గౌర్ బ్రాహ్మణుడు. హజ్రత్ మొహమ్మద్ గౌస్ గ్వాలియోరి నుంచి మన్ననలు పొందారు. మకరంద్ పాండేకి సంతానం లేదు. తనకు పిల్లలను ప్రసాదించాల్సిందిగా దేవుడిని ప్రార్ధించాలని ఆయన ఒకసారి హజ్రత్ మొహమ్మద్ గౌస్‌ను కోరారు.
''హజ్రత్ మొహమ్మద్ గౌస్ ప్రార్థనలతో తాన్‌సేన్ జన్మించాడు. తాన్‌సేన్ కు ఐదేళ్లు నిండినప్పుడు, మకరంద్ పాండే ఆయన్ను మొహమ్మద్ గౌస్ దగ్గరకు తీసుకెళ్లారు. సంగీతంలో మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా తాన్‌సేన్‌ను ఆశీర్వదించమని అభ్యర్థించారు. ఆ సమయంలో హజ్రత్ మొహమ్మద్ గౌస్ పాన్ నములుతున్నారు. అతను తన లాలాజలాన్ని తాన్‌సేన్ నోటిలో ఉమ్మారు. వెంటనే మకరంద్ పాండే, నా కొడుకు మా మతానికి దూరమయ్యాడని, కాబట్టి మీ దగ్గరే ఉంచండని తాన్‌సేన్ ను అక్కడే వదిలిపెట్టి వెళ్లారు'' అని ప్రొఫెసర్ అస్లాం అన్నారు.
హజ్రత్ మొహమ్మద్ గౌస్ తన కుమారుల మాదిరిగానే తాన్‌సేన్ ను పెంచడం ప్రారంభించారు. ఆయన గ్వాలియర్ లోని సుప్రసిద్ధ సంగీతకారుల పర్యవేక్షణలో సంగీతం నేర్చుకున్నారు. కొంతకాలం తాన్‌సేన్ సుల్తాన్ ఆదిల్ షా ఆస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత దక్షిణాదికి వెళ్లి నాయక్ బక్షు కుమార్తె నుంచి సంగీతం నేర్చుకున్నారు. తాన్‌సేన్ బాబా హరిదాస్ దగ్గర కూడా సంగీతాన్ని అభ్యసించారని కూడా కొన్నిచోట్ల ప్రస్తావన ఉంది.
తన జీవితం యావత్తు ఆయన హజ్రత్ మొహమ్మద్ గౌస్ పట్ల వినయ విధేయతలతో మెలిగారు. ఆయన ప్రభావంతోనే ముస్లింగా మారారు. తాన్‌సేన్ సమాధి కూడా హజ్రత్ మొహమ్మద్ గౌస్ సమాధి ప్రాంగణంలోనే ఉంటుంది.
తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, తాన్‌సేన్ రాజా రామచంద్ర వద్ద ఉద్యోగంలో చేరారు. రాజా రామచంద్ర తాన్‌సేన్ కు వీరాభిమాని. ఒకసారి తాన్‌సేన్ పాటను విని ఆయనకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చారని అంటారు.
తాన్‌సేన్ పాండిత్యం అక్బర్ ఆస్థానం దాకా చేరింది. తాన్‌సేన్ ను ఆగ్రాకు పంపాల్సిందిగా రాజారామచంద్రను కోరారు అక్బర్. అక్బర్ ఆస్థానంలో కూడా తాన్‌సేన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చక్రవర్తికి ఇష్టులైన వ్యక్తులలో తాన్‌సేన్ ఒకరు.

ఫొటో సోర్స్, FILM POSTER/ TANSEN
అక్బర్ కోరినట్లుగా తాన్‌సేన్ దర్బారీ కన్హార, దర్బార్ కళ్యాణ్, దర్బారీ అసావరీ, షహానా వంటి రాగాలను స్వరపరిచారు. 'మియాన్ కి మల్హర్', 'మియాన్ కి తోడి','మియాన్ కి సారంగ్'లు కూడా తాన్‌సేన్ స్వరపరిచిన రాగాలే. ఆయన రూపొందించిన రాగాల మాన్యుస్క్రిప్ట్‌లు రాంపూర్‌లోని రజా లైబ్రరీలో నేటికీ భద్రంగా ఉన్నాయి.
"శాస్త్రీయ సంగీతానికి కొత్త రసాన్ని, కొత్త మాధుర్యాన్ని అందించాడు తాన్‌సేన్. రాగాలతో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆయన స్వరపరిచిన రాగాలు ఇప్పటికీ ఆ పేర్లతోనే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు మియాన్ కి తోడి, మియాన్ కి మల్హర్. ఈ రాగాలతో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది'' అని సయ్యద్ అబిద్ అలీ రాశారు.
అక్బర్ అభిప్రాయం ప్రకారం ''తాన్‌సేన్ రాగాలు వినడం వల్ల హృదయంలో నిద్రపోతున్న కోరికలు మేల్కొంటాయి. పెద్ద పనులు చేయాలనే కోరిక కలుగుతుంది''
నన్ను మించిన వారు లేరు అని చెప్పుకనే అబుల్ ఫజల్ కూడా తాన్‌సేన్ ఘనతను గుర్తించి ''గత వెయ్యి సంవత్సరాలలో అతనిలాంటి గాయకుడు ఈ భూమిపై పుట్టలేదు''అని రాశారు.
''తాన్‌సేన్ దక్షిణానికి వెళ్లి నాయక్ బక్షు కుమార్తె దగ్గర అనేక రాగాలు నేర్చుకున్నారు'' అని ప్రొఫెసర్ మహమ్మద్ అస్లాం రాశారు.
1532లో రాజా మాన్ గ్వాలియర్‌లో స్థాపించిన గాన విద్యాలయలో తాన్‌సేన్‌ను చేర్పించారు హజ్రత్ మొహమ్మద్ గౌస్. ఆ సమయంలో అక్కడ ముచ్చు, భన్వర్ అనే ఇద్దరు గొప్ప కళాకారులు ఉండేవారు. కానీ, అప్పటికే ఉస్తాద్ బక్షు అనే సంగీత విద్వాంసుడు మరణించారు. ఆయన రాజా మాన్ సింగ్ తోమర్ కు సన్నిహితుడు.

ఫొటో సోర్స్, Getty Images
రాజా మాన్ సింగ్ ఈ గాన విద్యాలయాన్ని తన రాణి మృగనయని పేరు మీద స్థాపించారు. ఆమె కూడా గొప్ప సంగీత విద్వాంసురాలు. గానంలో ప్రవీణ.
నాలుగు-ఐదు సంవత్సరాలు ఆ విద్యాలయంలో ఉన్నా, తనకు ఉస్తాద్ బక్షూకు కలుసుకునే అదృష్టం కలగనందుకు తాన్‌సేన్ చాలా చింతించేవారు. బక్షు కుమార్తె తన భర్తతో దక్షిణాదిలో ఉండేవారు. ఉస్తాద్ బక్షూ తన జ్ఞానాన్నంతా కుమార్తెకు నేర్పించారు. అందువల్ల తాన్‌సేన్ ఆమెకు సేవ చేయడం ద్వారా బక్షు సంగీత జ్ఞానాన్ని సంపాదించాలని, ఆమె శిష్యుడి అనుమతితో దక్షిణాదికి చేరుకున్నారు.
తాన్‌సేన్ పాటలు విన్నప్పటికీ, ఉస్తాద్ బక్షు కుమార్తె ఎలాంటి భావాన్ని వ్యక్తీకరించ లేదు. 'నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి బేటా' అని మాత్రం అన్నారు. దీంతో తాన్‌సేన్ ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఉస్తాద్ బక్షు శిష్యుడికి అక్కడి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన ఓదార్చారు. భయపడవద్దని, ఆమె ఎప్పటికైనా నిన్ను గుర్తిస్తుందని చెప్పారు.
తాన్‌సేన్ ఘనత ఏంటంటే, అతను అక్బర్ ఆదేశానుసారం 16 వేల రాగాలు, 360 తాళాలను అధ్యయనం చేశారు. విస్తృతమైన పరిశీలిన తర్వాత 200 అసలైన రాగాలు, 95 అసలైన తాళాలను గుర్తించి, మిగిలిన వాటిని తొలగించారు.
''తాన్‌సేన్ పాత రాగాలకు కొత్త రూపాన్ని ఇవ్వడమే కాకుండా, తన పేరుతో ప్రసిద్ధి చెందిన అనేక రాగాలను సృష్టించారు. మియాన్ కీ తోడి, మియాన్ కా సారంగ్, మియాన్ కా మల్హర్ మొదలైనవి ఇలాంటి వాటిలో కొన్ని. ఈ రాగాలను అక్బర్ తన ఆస్థానంలో వినడానికి ఆసక్తి చూపించేవారు'' అని మహమ్మద్ అస్లాం రాశారు.

ఫొటో సోర్స్, TANSEN/BOOK TITLE/AMAZON
ధృపద్ సంగీతంలో గ్వాలియర్ ఘరానా శైలికి తాన్‌సేన్ ప్రతినిధిగా మారారు. ఆయనను గ్వాలియర్ ఘరానా వ్యవస్థాపకుడిగా చాలామంది చరిత్రకారులు పరిగణిస్తారు.
తాన్‌సేన్ కాలంలో, ధృపద్ భారతీయ సంగీతంలో శాస్త్రీయ శైలిగా గుర్తింపు పొందింది. తర్వాత దీనిని గౌహర్, ఖందర్, నౌహర్, డాగర్ అనే నాలుగు విభాగాలు చేశారు. వీటిలో రెండు నేటికీ ఆచరణలో ఉన్నాయి. భారత ఉపఖండంలో తాన్‌సేన్ జీవితంపై చాలా సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా 1943లో వచ్చింది. ఇందులో కె.ఎల్.సెహగల్ తాన్‌సేన్ పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు జయంత్ దేశాయ్.
1990లో, పాకిస్తాన్ టెలివిజన్ తాన్‌సేన్ జీవితంలో ఒక సీరియల్ నిర్మించింది. దీనిని ఖ్వాజా నజ్ముల్ హసన్, రచయిత్రి హసీనా మోయిన్ నిర్మించారు. ఆ టీవీ సీరియల్‌లో ఆసిఫ్ రజా మీర్, జెబా భక్తియార్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి:
- సర్కారు వారి పాట: ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ - మహేశ్ బాబు నోట వైఎస్ జగన్ డైలాగ్పై సోషల్ మీడియాలో చర్చ
- భారత్‌లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- ఏపీ: ‘సీఎంఓ నుంచి అంటూ ఎమ్మెల్యేలకు టోకరా.. 80 లక్షలతో గాజువాకలో ప్రియురాలికి ఇల్లు’
- హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
- నాన్న ఆఫీస్‌కు వెళ్లాడని అమ్మ కారు తాళాలు తీసుకుని ఈ నాలుగేళ్ల పిల్లాడు ఏం చేశాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











