‘‘కొత్త మాక్స్ వెర్స్టాపెన్ దొరికాడు'' - కారు నడుపుతూ షికారు కెళ్లిన నాలుగేళ్ల బుడతడు

ఫొటో సోర్స్, POLICE UTRECHT NORTH
ఈ నాలుగేళ్ల బాలుడు భవిష్యత్తులో ఫార్ములా వన్ కార్ల రేసింగ్ పోటీల్లో బాగా రాణిస్తాడేమో. ఎందుకంటే ఈ బుడతడు నాలుగేళ్ల వయసులో ఒక్కడే తన తల్లి కారు నడుపుతూ షికారుకెళ్లాడు మరి.
ఈ చిన్నారిది నెదర్లాండ్స్. ఉత్రెచ్ నగరంలో నివసిస్తుంటాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం తన తల్లి కారు నడుపుకుంటూ రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. కొంత దూరం వెళ్లాక రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న మరో రెండు కార్లను తన కారుతో ఢీకొట్టాడు.
ఆ తర్వాత కారు దిగి నడుచుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. అప్పుడతడి ఒంటి మీద నైట్ డ్రెస్ ఉంది. కాళ్లకు చెప్పులు కూడా లేవు.
ఈ పిల్లాడు అంత చలిలో సరైన దుస్తులు, చెప్పులు లేకుండా ఒంటరిగా రోడ్డు మీద నడిచివెళుతుండగా అటుగా వెళుతున్న వాళ్లు చూసి ఆందోళన చెందారు. పోలీసులకు ఫోన్ చేశారు. ఈ కుర్రాడి కారు యాత్రలో ఎవరూ గాయపడలేదు.
''మాకు కొత్త మాక్స్ వెర్స్టాపెన్ దొరికాడు'' అని పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. శనివారం ఉదయం పిల్లాడు నిద్ర లేచేటప్పటికి వాళ్ల నాన్న ఆఫీసుకు వెళ్లిపోయాడని, అమ్మ కారు తాళాలు తీసుకుని 'కారులో షికారుకి' వెళ్దామని ఈ బుడతడు బయలుదేరాడని పోలీసులు రాశారు.
రోడ్డు మీద ఓ పిల్లాడు ఒంటరిగా తిరుగుతున్నాడు, పట్టుకెళ్లండి అంటూ పోలీసులకు ఫోన్ వచ్చాక.. ఆ సమీపంలోనే ఎవరో కారును రోడ్డు మీద వదిలేశారు, అది పార్క్ చేసి ఉన్న రెండు కార్లను ఢీకొట్టినట్టుగా ఉందనే ఫిర్యాదు కూడా పోలీసులకు అందింది.
ఆ కారు ఆ పిల్లాడి తల్లి పేరుతో రిజిస్టరై ఉందని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్‌ను పిల్లాడికి ఇచ్చినపుడు ఆ పిల్లాడు డ్రైవింగ్ చేస్తున్నట్లుగా అభినయించాడు. కారు స్టీరింగ్ వీల్ తిప్పుతున్నట్టు చేతులతో చూపాడు.
''దీంతో ఆ పిల్లాడే ఆ కారును డ్రైవ్ చేసి ఉంటాడని మాకు అర్థమైంది'' అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, POLICE UTRECHT NORTH
ఈ బుడతడికి పోలీస్ స్టేషన్‌లో హాట్ చాకొలెట్ పానీయం తాపించి, ఒక టెడ్డీ బేర్ చేతికిచ్చి మర్యాదలు చేశారు. ఆ తర్వాత అతడి తల్లికి అప్పగించారు.
అందరూ కలిసి కారు ఢీకొన్న స్థలానికి వెళ్లారు. కారు ఎలా పనిచేసిందో చూపుతావా అని ఆ పిల్లాడిని అడిగారు. బుడతడు కారు కీ తీసుకుని దానితో డోర్ ఓపెన్ చేసి, ఇగ్నిషన్‌లో కీ పెట్టి తిప్పి, కాళ్లను క్లచ్ మీద, యాక్సిలేటర్ మీద పెట్టాడని పోలీసులు వివరించారు.
ఇకపై మీ కారు తాళాలు జాగ్రత్తగా దాచిపెట్టండి అని ఆ పిల్లాడి తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు.
నెదర్లాండ్స్‌కు చెందిన ప్రస్తుత ప్రపంచ ఫార్ములా వన్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్‌ను ప్రస్తావిస్తూ.. ''ఉట్రెచ్‌లో కొత్త మాక్స్ వెర్స్టాపెన్ దొరికాడు'' అని పోలీసులు సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.
''అదృష్టవశాత్తూ ఈ చిన్నారి డ్రైవర్ సాహసయాత్ర సంతోషంగా ముగిసింది'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనాతో భారత్ వ్యాపారం సరిహద్దు ఉద్రిక్తతలో సంబంధం లేకుండా ఎందుకు పెరుగుతోంది?
- గోబెల్స్ దంపతులు తమ ఆరుగురు పిల్లలతో పాటు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
- ఉద్యోగానికి వెళ్లిన తొలి రోజునే గ్యాంగ్ రేప్‌కు గురైన నర్స్
- వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం, రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి, అసలు తగ్గించాల్సింది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










