హిట్లర్‌కు సన్నిహితులైన గోబెల్స్ దంపతులు తమ ఆరుగురు పిల్లలతో పాటు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?

ఫొటో సోర్స్, PICADOR
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ కరెస్పాండెంట్
హిట్లర్ మరణవార్త, దేశ ప్రజలకు ఆయన చనిపోయిన ఒక రోజు తర్వాత మే 1వ తేదీ రాత్రి 10.26 గంటలకు అందింది.
‘‘ఈరోజు మధ్యాహ్నం రైష్ చాన్స్‌లరీలో సోవియట్ సైనికులతో పోరాడుతూ హిట్లర్ చనిపోయారు. చివరి శ్వాస వరకు ఆయన సోవియట్ సైనికులతో పోరాడారు’’ అని వార్తా నివేదికలు పేర్కొన్నాయి.
1945 ఏప్రిల్ 30న, చాన్స్‌లరీలోని తోటలో హిట్లర్ మృతదేహం ఇంకా పూర్తిగా దహనం కూడా కాలేదు. కానీ, అప్పటికే తమను సమీపిస్తోన్న సోవియట్ సైన్యంతో ఆయన సహచరులు సంబంధాలు ఏర్పరచుకోవడం ప్రారంభించారు.
సోవియట్ ఆర్మీ జనరల్ జుకోవ్ వద్దకు జనరల్ క్రెబ్స్‌ను హిట్లర్ పంపించారు. క్రెబ్స్‌ను అక్కడికి ఎందుకు పంపించారో 'హిట్లర్ బయోగ్రఫీ' అనే పుస్తకంలో ఇయాన్ కర్షా వివరించారు.
''జనరల్ క్రెబ్స్‌ను పంపించడంలో ప్రయోజనం ఏంటంటే.. ఆయనకు రష్యన్ భాష తెలిసి ఉండటం. గతంలో జర్మన్ మిలిటరీ తరఫున మాస్కోలో పనిచేసిన అనుభవం ఉండటం. క్రెబ్స్ రాత్రి 10 గంటలకు గోబెల్స్, బోర్‌మాన్ పత్రాలను తెల్లజెండాను తీసుకొని సోవియట్ క్యాంపు వైపు వెళ్లారు. ఉదయం 6 గంటలకు తిరిగి వచ్చిన ఆయన బేషరతుగా లొంగిపోవాలంటూ సోవియట్ ఆర్మీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. మే 1వ తేదీ మధ్యాహ్నం 4 గంటలలోగా మన నిర్ణయాన్ని వారికి తెలియజేయాలని కోరినట్లు చెప్పారు" అని ఆ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, PENGUIN
ఆరుగురు పిల్లలకు విషం పెట్టి చంపిన గోబెల్స్ భార్య
ఇది వినగానే గోబెల్స్‌తో పాటు ఆయన ఇతర సహచరుల ముఖాలు వాడిపోయాయి. అందరూ తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు.
కానీ, హిట్లర్‌కు సన్నిహితంగా ఉండే గోబెల్స్ మాత్రం, తాము కూడా హిట్లర్ తరహాలోనే ప్రాణాలను వదలాలని ముందే నిర్ణయించుకున్నారు.
తన భర్త, ఆరుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు గోబెల్స్ భార్య మగదా గోబెల్స్... తనకు మొదటి భర్త ద్వారా కలిగిన కుమారునికి లేఖను పంపించారు. ఏప్రిల్ 30న, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాతే ఆమె ఈ ఉత్తరం రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
గోబెల్స్‌కు నాలుగు నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్న హెల్గా, హిల్డా, హెల్మాట్, హోల్డె, హెడా, హీడె, హైడె అనే ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారంతా నిద్రపోయేలా మే 1వ తేదీ సాయంత్రం డాక్టర్ హెల్మట్ గుస్తవ్ కుంజ్ వారికి మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చారు.
జొయాచివ్ ఫెస్, తన పుస్తకం 'ఇన్‌సైడ్ హిట్లర్స్ బంకర్'లో ఇలా రాశారు. ''దీని తర్వాత, హిట్లర్ వ్యక్తిగత వైద్యుడు లడ్విగ్ స్టంపెగర్ సమక్షంలో ఎవరో ఈ పిల్లలు నోర్లు తెరవగా, మగదా వారి నోట్లో కొన్ని చుక్కల హైడ్రోజన్ సైనైడ్‌ను వేశారు. ఆమె పెద్ద కూతురు, 12 ఏళ్ల హెల్గా మాత్రమే దీన్ని ప్రతిఘటించింది. ఆమె శరీరంపై ఉన్న గాయాల కారణంగా, ఆమె విషం తాగడానికి ప్రతిఘటించినట్లుగా అర్థం చేసుకోవచ్చు. సైనైడ్ వేసిన మరుక్షణంలోనే పిల్లలంతా చనిపోయారు. ఆ తర్వాత ఆమె బంకర్‌కు వెళ్లారు. అక్కడ ఆమె రాక కోసం ఆమె భర్త వేచి చూస్తున్నారు. బంకర్‌లోకి వెళ్తూనే 'పని అయిపోయింది' అని అతనితో చెప్పి ఆమె ఏడ్వటం ప్రారంభించారు.''

ఫొటో సోర్స్, Getty Images
సైనైడ్ తీసుకున్న గోబెల్స్, మగదా
రాత్రి 8:30 గంటలకు అకస్మాత్తుగా గోబెల్స్ తన టోపీ ధరించి, చేతులకు గ్లౌజులు వేసుకున్నారు. భార్యతో కలిలసి బంకర్ మెట్లు ఎక్కడం ప్రారంభించారు. మూడు రోజుల క్రితమే హిట్లర్ తనకు ఇచ్చిన పార్టీ గోల్డెన్ బ్యాడ్జీని మగదా ధరించారు.
మెట్లూ ఎక్కుతూ గోబెల్స్, తన టెలిఫోన్ ఆపరేటర్ రోహస్ మిష్‌తో 'ఇక మీ అవసరం లేదు' అని అన్నారు.
''బంకర్ మెట్లు ఎక్కుతూ మధ్యలోనే ఆగిపోయిన గోబెల్స్ దంపతులు, సైనైడ్ క్యాప్యుల్స్‌ను నోట్లో వేసుకున్నారు. కొన్ని సెకన్లలోనే వారు మరణించారు. వారి మరణాలను ధ్రువీకరించడానికి ఎస్‌ఎస్ సైనిక బృదంలోని ఒక సైనికుడు వారి శవాలపై రెండు సార్లు చొప్పున గన్‌తో కాల్చారు. తర్వాత వారి శవాలను దహనం చేశారు'' అని 'థర్డ్ రైష్ ఎట్ వార్' అనే పుస్తకంలో రిచర్డ్ జె ఇవాస్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
హిట్లర్, ఇవా బ్రౌన్‌లను కాల్చిన తర్వాత చాలా కొద్ది మొత్తంలో పెట్రోల్ మిగిలి ఉంది. గోబెల్స్, మగదా మృతదేహాలను కాల్చడానికి అది సరిపోలేదు. దీంతో వారి శరీరాలు మొత్తం తగలబడలేదు. దీంతో మరుసటి రోజు చాన్స్‌లరీకి చేరుకున్న సోవియట్ సైనికులు చాలా సులభంగా వారి మృతదేహాలను గుర్తుపట్టారు.
సోవియట్ సైనికులు, చాన్స్‌లరీలోకి ప్రవేశించినప్పుడు అక్కడి ఒక టేబుల్‌పై కూర్చొన్న స్థితిలో జనరల్ బర్గ్‌డార్ఫ్, జనరల్ క్రెబ్స్‌ను చూశారు. వారి ముందు సగం తాగిన మద్యం సీసాలు ఉన్నాయి. అప్పటికే వారు చనిపోయారు. అంతకుముందే వారు, బంకర్‌లో ఉన్న ముఖ్యమైన పత్రాలన్నింటినీ తగులబెట్టేశారు.
ఎస్‌ఎస్ సైనికులు ఎక్కడినుంచో మరింత పెట్రోల్‌ను తీసుకొచ్చి హిట్లర్ స్టడీరూమ్‌ను తగులబెట్టారు. కానీ, వెంటిలేషన్ వ్యవస్థ మూసివేసి ఉండటంతో మంటలు ఎక్కువగా వ్యాపించలేకపోయాయి. దీంతో ఆ గదిలోకి ఫర్నీచర్ మాత్రమే కాలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
విషపూరిత క్యాప్యూల్స్ తీసుకున్న గోరింగ్
రాత్రి 11 గంటల సమయంలో, బంకర్‌లో నివసించే మిగతా వ్యక్తులు బయటకు వచ్చి ఎలాగోలా భూగర్భ రైల్వేస్టేషన్ 'ఫ్రెడరిచ్‌స్ట్రాస్' చేరుకోవడంలో సఫలమయ్యారు. అప్పటికే వారికి నలువైపులా సోవియట్ సేనలు విధ్వంసం సృష్టించాయి.
హిట్లర్ జీవిత చరిత్రలో ఇయాన్ కెర్షా ఇలా రాశారు. ''హిట్లర్ సహచరులైన బోర్‌మాన్, స్టంఫెగర్ కూడా ఎలాగోలా ఇన్వలిడ్ స్ట్రాస్ వరకు చేరుకోగలిగారు. కానీ, అక్కడ రెడ్ ఆర్మీని చూసిన వారిద్దరూ... అరెస్టును తప్పించుకోవడం కోసం విషం తాగారు. హిట్లర్ తరహాలోనే ఆయన మిత్రులందరికీ ఒకే భయం ఉండేది. సోవియట్ యూనియన్ సైనికులకు దొరికిపోతే విచారణలు, బహిరంగంగా నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ శవాలను కూడా అవమానిస్తారు అని భయపడేవారు'' అని రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
1945 మే 9వ తేదీన, హిట్లర్ మరో మిత్రుడు హర్మాన్ గోరింగ్ నివాసం 'బవేరియా'లోకి అమెరికా దళాలు చొచ్చుకెళ్లాయి. అప్పుడు, గోరింగ్ స్వయంగా వారికి లొంగిపోయారు.
''ఓటమి పాలైన ఒక రాజ్యానికి చెందిన కీలకమైన వ్యక్తిగా అమెరికన్లు తనను గుర్తిస్తారని, చర్చలు జరపడానికి తనను ఉపయోగించుకుంటారని గోరింగ్ భావించారు. అమెరికా కమాండర్, ఆయనతో కరచాలనం చేసి తినడానికి ఆహారం ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ఐసన్‌హోవర్‌కు ఈ సంగతి తెలియగానే, వెంటనే గోరింగ్‌ను జైలుకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన మత్తు పదార్థాల వ్యసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆయనపై విచారణలు జరిగాయి'' అని రిచర్డ్ జె ఇవాస్ రాశారు.
తాను చేసిన పనుల పట్ల గోరింగ్‌కు ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడంతో ఆయనకు మరణశిక్ష విధించారు. ఉరి తీయడానికి బదులుగా తనను కాల్చి చంపాలని గోరింగ్ విజ్ఞప్తి చేశారు. కానీ, ఆయన అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో ఒక గార్డు సహాయంతో విషపు క్యాప్యూల్స్‌ను తెప్పించుకున్న గోరింగ్ 1946 అక్టోబర్ 15న ఆత్మహత్య చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హిమ్లర్ ఆత్మహత్య
హెన్రిచ్ హిమ్లర్‌కు కూడా ఇదే జరిగింది. ఆయన ఎల్బే నదిని దాటిన తర్వాత బ్రిటిష్ సైనికులకు పట్టుబడ్డారు. ఆ సమయంలో హిమ్లర్ దుస్తులు చాలా మురికిగా ఉన్నాయి. తన కథ ఇక ముగిసిపోయినట్లే అని ఆయన భావించారు. ఆయనను సోదా చేయగా, ఆయన వద్ద విషపు గుళిక ఉన్న చిన్న ఫ్లాస్కు లభించింది.
అయినప్పటికీ, ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించాలని బ్రిటిష్ అధికారి ఆదేశించారు. ఈ ఘటన గురించి రిచర్డ్ ఇలా రాశారు. ''డాక్టర్, హిమ్లర్‌ను నోరు తెరవమని ఆదేశించారు. అప్పుడు ఆయన దంతాల మధ్య ఒక నల్లటి వస్తువును చూశారు. ఆయన నోరును వెలుతురు వైపుకి తిప్పారు. అప్పటికే ఆయన దంతాలతో ఆ నల్లటి వస్తువును చించేశారు. అది గ్లాస్ సైనైడ్. దీంతో కొన్ని సెకన్లలోనే ఆయన మరణించారు. ఆ సమయంలో ఆయన వయస్సు 44 సంవత్సరాలు'' అని రాశారు.

ఫొటో సోర్స్, PENGUIN PRESS
బెర్లిన్‌లో అకస్మాత్తుగా పెరిగిన ఆత్మహత్యలు
ఆయన తర్వాత మరో ఎస్‌ఎస్ అధికారి ఓడిలో గ్లోబోనిక్ కూడా విషం తీసుకున్నారు. ఎన్ట్స్ గ్రావిటెజ్ హ్యాండ్ గ్రెనెడ్‌తో తన కుటుంబంతో సహా పేల్చేసుకున్నాడు. మరో ఎస్‌ఎస్ అధికారి ఫిలిప్ బోహెలర్, తన భార్యతో సహా 1945 మే 19వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు.
దేశ సుప్రీంకోర్టు అధిపతి అర్విన్ బుమకెన్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యర్థి ముందు ఆయుధాలు వదులుకోవాలనే అవమానాన్ని తప్పించుకునేందుకు హిట్లర్ సైనికాధికారి, ఫీల్డ్ మార్షల్ వాల్టెర్ మోడల్ తనను తానే కాల్చుకొని చనిపోయారు. రూడాల్ఫ్ హెస్‌కు జీవితఖైదు పడింది. ఆయన జీవితపు చివరి కాలం జైలులోనే గడిపారు. చివరకు 1987లో 93 ఏళ్ల వయస్సులో జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
క్రిస్టియన్ గోషెల్ రాసిన 'సుసైడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ రైష్' ప్రకారం, మార్చి నెలలో బెర్లిన్‌లో 238 ఆత్మహత్యలు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఏప్రిల్ నాటికి వీటి సంఖ్య 3881కు చేరింది. ఆనాటి పరిస్థితులు, సోవియట్ యూనియన్ దాడులకు భయపడే ఈ ఆత్మహత్యలు జరిగినట్లు చాలా సూసైడ్ నోట్‌లు సూచిస్తాయి. పిల్లల ప్రాణాలు తీసిన తర్వాతే చాలామంది తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఫొటో సోర్స్, PENGUIN PRESS
అర్జెంటీనాలో ఐష్మన్ కిడ్నాప్
జర్మన్ లేబర్ ఫ్రంట్ అధిపతి రాబర్ట్ లే, టిరోల్ కొండలపై అమెరికా దళాలకు పట్టుబడ్డారు. ఆయన 1945 అక్టోబర్ 24న జైలులోని టాయ్‌లెట్ గదిలో గొంతు కోసుకొని ఆయన చనిపోయారు. మాజీ విదేశాంగ మంత్రి జొయాచిమ్ రిబెన్‌ట్రాప్, హిట్లర్ మిలిటరీ ప్రధాన సలహాదారు ఆల్ఫ్రెడ్ జోడీలను 1946 అక్టోబర్ 16న కాల్చి చంపారు. చాలా కొద్ది మంది మాత్రమే వారికి నివాళులు అర్పించారు.
మరో యుద్ధ నేరస్థుడు అడాల్ఫ్ ఐష్మన్, నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లగలిగారు. ఆయన అర్జెంటీనా చేరుకున్నారు. అక్కడ జువాన్ పెరు ప్రభుత్వం నాజీలకు, ఎస్‌ఎస్ సైనికులు ఆశ్రయం కల్పిస్తోంది.
జర్మనీకి చెందిన ఫ్రిట్జ్ బయేర్ ద్వారా ఇజ్రాయెల్ గూడాచారులకు ఐష్మన్ ఎక్కడ నివసిస్తున్నారో తెలిసింది. 1960లో ఇజ్రాయెల్ గూడాచారులు, అర్జెంటీనా నుంచి ఆయనను కిడ్నాప్ చేశారు. జెరూసలెంకు తీసుకొచ్చి మారణహోమానికి సంబంధించిన కేసులో మరణశిక్ష విధించారు. 1962 మే 31న ఉరితీశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవా బ్రౌన్ దుస్తులను తీసుకున్న సోవియట్ మహిళా సైనికులు
హిట్లర్ మరణించిన తర్వాత బెర్లిన్‌లో పోరాటాలు ఆపేయాలని ఆదేశాలు వచ్చాయి. అయినప్పటికీ వాటిని ఆపలేదు. మే 2వ తేదీన, దాని తర్వాతి రోజున కూడా పోరాటాలు జరిగాయి. మే 2వ తేదీన బంకర్‌లో ఉన్న చీఫ్ ఇంజినీర్ జోహానెస్ హంట్‌షెల్‌కు, బంకర్‌కు అనుసంధానంగా ఉన్న సొరంగం నుంచి కొంతమంది మహిళల మాటల శబ్ధాలు వినిపించాయి. కాసేపటికి రష్యన్ యూనిఫామ్‌లో ఉన్న 12 మంది మహిళలు సొరంగం నుంచి బయటకు వచ్చారు. వారు రెడ్ ఆర్మీకి చెందిన మెడికల్ టీమ్ సభ్యులు.
తన పుస్తకం 'ఇన్‌సైడ్ హిట్లర్స్ బంకర్'లో జోర్‌కిమ్ ఫెస్ట్ ఇలా రాశారు. ''ఆ మహిళల నాయకురాలు, హంట్‌షెల్‌తో జర్మన్ భాషలో 'హిట్లర్ ఎక్కడ?' అని అడిగారు. తర్వాత హిట్లర్ భార్య గురించి అడిగారు. తమను ఇవా బ్రౌన్ గదిలోకి తీసుకెళ్లాలని హంట్‌షెల్‌ను ఆమె అడిగారు. అక్కడికి వెళ్లగానే వారు ఇవా బ్రౌన్ వార్డ్‌రోబ్‌ను తెరిచి, అందులోని వస్తువులను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకున్నారు. ఇవా బ్రౌన్ గది నుంచి బయటకు వచ్చేసమయంలో వారి చేతుల్లో ఇవా బ్రౌన్ లోదుస్తులు ఉన్నాయి'' అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
హిట్లర్ ప్రారంభించిన యుద్ధంలో 5 కోట్ల మంది మృతి
1945 మే 2వ తేదీన జర్మన్ కమాండర్లు ఆయుధాలను వదిలివేయాలని తమ సైనికులను కోరారు. హిట్లర్ తనను తాను చంపుకొని, కమాండర్లను ఈ పరిస్థితుల్లో వదిలేశారని వారు భావించారు.
''హిట్లర్ మరణించిన తర్వాత జర్మనీలో సంతాపం తెలుపుతున్న దృశ్యాలు కనిపించలేదు. ఎవరూ ఏడ్చినట్లు కనిపించలేదు. కేవలం కొన్ని స్కూళ్లలో ఉదయం ప్రార్థనా సమయంలో హిట్లర్ మరణవార్తను ప్రకటించిన తర్వాత కొంతమంది విద్యార్థుల కళ్లలో కన్నీళ్లు కనిపించాయి'' అని గెహామ్ ఉమ్‌వెట్ అనే పుస్తకంలో హెన్రిక్ బ్రెలోయర్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
మానవ చరిత్రలో అంతకుముందెన్నడూ ఒక వ్యక్తితో ముడిపడి ఇంతటి విధ్వంసం జరిగిన దాఖలాలు కనిపించలేదు. హిట్లర్ ప్రారంభించిన ఈ యుద్ధంలో 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం బెర్లిన్‌ను గెలుచుకోవడానికే సోవియట్ యూనియన్ 3 లక్షల సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు 40,000 జర్మన్ సైనికులు మరణించారు. 5 లక్షల జర్మన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా మారారు.
1945 మే 2వ తేదీ ఉదయం 3 గంటలకు సోవియట్ యూనియన్ సేనలు, రైష్ ఛాన్స్‌లరీలోకి ప్రవేశించాయి. వారికి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. హిట్లర్ బంకర్‌లో అందరికన్నా ముందుగా ప్రవేశించిన సోవియట్ సైనికుడు లెఫ్టినెంట్ ఇవాన్ క్లిమెంకో. ఆయన ధైర్యసాహసాలకు గానూ 'హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్' అనే అవార్డును అందుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రశాంత్ కిశోర్: 'కొత్త పార్టీ గురించి రెండు మూడు రోజుల్లో చెబుతా' - బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ
- పోర్న్ వీడియోలను పొరపాటున ఓపెన్ చేశానన్న బ్రిటన్ ఎంపీ నీల్ పరీశ్
- వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఎవరు దాడి చేశారు? ఏలూరులో ఈ హత్యా రాజకీయాలు ఎందుకు
- ఆర్కిటిక్ ప్రాంతంపై హక్కులెవరికి ఉన్నాయి? అక్కడ ఆయిల్, గ్యాస్ ఎవరైనా తవ్వుకోవచ్చా
- ‘మా నాన్న కనీసం ఆసుపత్రిలో చనిపోయారు, వేలాది మంది రోడ్ల మీదే ప్రాణాలొదిలారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










