రష్యా విక్టరీ డే అంటే ఏంటి, మే 9వ తేదీ ఆ దేశానికి ఎందుకంత ముఖ్యం?

ఫొటో సోర్స్, Getty Images
రెండో ప్రపంచ యుద్ధం విజయోత్సవాన్ని ప్రతియేటా మే 9న రష్యా ఘనంగా నిర్వహిస్తుంది. వేరే ఏ దేశమూ జరుపుకోనంత గొప్పగా ఈ రోజున కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఆ దేశం. ఆ రోజు రష్యన్లకు జాతీయ సెలవుదినం కూడా.
ఈ సంవత్సరం మే 9 రష్యా సైన్యానికి మరింత ముఖ్యమైన తేదీ. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధంలో తాము సాధించిన విజయాలను చెప్పుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద సాయుధ పోరాటం. 1939 సెప్టెంబర్ లో పోలాండ్ పై జర్మనీ దండయాత్రతో ప్రారంభమై (ఈ తేదీని రష్యా గుర్తించడం లేదు.) 1945లో ముగిసింది.
ఈ యుద్ధంలో పది లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది తమ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలసవెళ్లారు.
ఈ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించిన దేశాల విస్తృత కూటమిలో సోవియట్ యూనియన్ ఒకటి. పైగా రెండో ప్రపంచయుద్ధం ఎక్కువభాగం రష్యా భూభాగంలోనే జరిగినందున రష్యన్లకు ఈ యుద్ధం మరింత ప్రత్యేకం.
మే 1945లో, నాజీ జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి, లొంగిపోతున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పంద పత్రం ఈ యూరప్ ఖండంలో వివిధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది. కానీ, ఆసియాలో జపాన్ పై యుద్ధం అదే సంవత్సరం ఆగస్టు వరకు కొనసాగింది.
అధికారికంగా మే 8న బెర్లిన్ సమీపంలో ఈ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేసింది జర్మనీ. ఆ దేశస్తులు అధికారికంగా అన్ని కార్యకలాపాలను స్థానిక సమయం 23:01కి నిలిపివేశారు. అప్పటికే మాస్కోలో అర్ధరాత్రి దాటింది.

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Image
విక్టరీ డేను అమెరికాతోపాటు, యూరప్ దేశాలు కూడా మే 8న జరుపుకుంటుండగా, రష్యా, సెర్బియా , బెలారస్‌లలో మే 9న జరుపుకుంటారు. ఈ రోజు సుదీర్ఘమైన నెత్తుటి యుద్ధాన్ని ముగించింది. సోవియట్ యూనియన్‌లోని చాలా కుటుంబాలు తమ బంధువులను కోల్పోయాయి.
అయితే కాలం గడుస్తున్న కొద్దీ, రష్యాలో ఈ దినం అసలు ఉద్దేశాన్ని మరిచి జాతీయ సైద్ధాంతిక సాధనంగా మారింది.
యుద్ధం ముగిసిన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు మే 9 సోవియట్ యూనియన్‌లో జాతీయ సెలవుదినం కాదు. విక్టరీ డే భాగంగా పెద్ద ఎత్తున పండగ నిర్వహించడం, బాణాసంచా కాల్చడం లాంటివన్నీ పెద్ద నగరాల్లో మాత్రమే జరిగేవి.
1963 నుంచి అప్పటి యూఎస్ఎస్ఆర్ నేత లియోనిడ్ బ్రెజ్నెవ్ నాజీ జర్మనీకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధాన్ని జాతీయ ఆరాధన దినంగా పాటించడం ప్రారంభించారు.
దేశంలో క్షీణిస్తున్న సైద్ధాంతికవాదాన్ని బలోపేతం చేయడానికి, దేశభక్తిని పెంపొందించడానికి ఆయన ఈ చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంబరాలు, రెడ్ స్క్వేర్ సైనిక కవాతులాంటి వన్నీ మే 9 వ తేదీన జరగడం ప్రారంభించాయి.
21వ శతాబ్దపు ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విక్టరీ డే అర్థాన్ని, పరమార్ధాన్ని మరింత పెంచడానికి ప్రయత్నించారు. ఇది రష్యన్ ల జీవితంలో విడదీయరాని భాగంగా మార్చడానికి ఆయన ప్రయత్నించారు.
విక్టరీ డే వేడుకలు విస్తృత స్థాయిలో జరగడం మొదలైంది. ప్రతి సంవత్సరం జరిగే వేడుకల్లో వార్ వెటరన్స్ చాలా తక్కువమంది పాల్గొనే వారు. యుద్ధంలో పాల్గొన్నవారు చాలా తక్కువమంది జీవించి ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నాజీయిజాన్ని ఓడించడంలో రష్యా కీలక పాత్ర అన్నం అంశం 2020లో రష్యన్ రాజ్యాంగానికి చేసిన సవరణలలో కూడా పొందుపరిచారు. సంప్రదాయిక విలువలు, జాతీయ వాదాన్ని నొక్కిచెప్పే క్రమంలో, దేశంలోని పౌరులెవరూ ఈ అధికారిక చారిత్రక కథనాన్ని ప్రశ్నించకుండ నిబంధనలు ఏర్పాటు చేశారు.
''విక్టరీ డే వేడుకలు సోవియట్ రష్యాకన్నా ఎక్కువగా, 2000 ల సంవత్సరం నుంచి విస్తృతంగా నిర్వహించడం ప్రారంభించారు'' అని ఒలేగ్ బుడ్నిట్స్కీ అన్నారు. ఆయన మాస్కోలోని హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హిస్టరీ అండ్ సోషియాలజీ ఆఫ్ వరల్డ్ వార్ టూ విభాగానికి డైరక్టర్ గా పని చేస్తున్నారు.
"ఇది సానుకూల పరిణామమే. ఎందుకంటే యుద్ధ చరిత్రను అధ్యయనం చేయడంపై ఎక్కువమంది దృష్టి పెట్టారు. మిలియన్ల కొద్దీ పత్రాలు బైటికి వచ్చాయి. అవన్నీ డిజిటలైజ్ చేశారు. కానీ మరోవైపు ప్రజలను సైనికులుగా మార్చడం కూడా చూస్తున్నాం'' అని ఆయన అన్నారు.
గత దశాబ్దంలో రష్యన్ విక్టరీ డే వేడుకల్లో వినిపించిన 'వియ్ కుడ్ డూ ఇట్ ఎగైన్'( మేము దీన్ని మళ్లీ చేయగలం) అనే నినాదాలకు అర్ధం రష్యా సైన్యం 1945లో మాదిరిగానే యూరప్‌లో సగభాగాన్ని ఆక్రమించగలదని హెచ్చరిక చేయడమేనని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, EPA
సామూహిక దేశభక్తి వేడుకలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేదని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధం లేదా రష్యాలో చెప్పుకునే గ్రేట్ పేట్రియాటిక్ వార్ లో జర్మనీ దండయాత్రను ఆపడంలో సోవియట్ యూనియన్ అనుభవించిన గొప్ప మానవ నష్టాన్ని అది తగ్గించి చెప్పిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
2020లో జరిగిన ఓ పోల్ ప్రకారం, మెజారిటీ రష్యన్లకు యుద్ధ సమయంలో తమ బంధువులు ఎక్కడ ఎలా గడిపారో తెలియదు.
గ్రేట్ పేట్రియాటిక్ వార్ ఎప్పుడు ప్రారంభమైందో (జూన్ 1941లో జర్మనీ సోవియట్ యూనియన్‌పై దాడి ) 18-24 సంవత్సరాల వయస్సు గల వారిలో మూడింట ఒక వంతు కంటే తక్కువ మందికి తెలుసు.
2014 నుండి తూర్పు యుక్రెయిన్‌లో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి, నాజీలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, దేశభక్తి అంశంపై రష్యన్ మీడియా దృష్టిని కేంద్రీకరించింది.
యుక్రెయిన్‌లో రైట్ వింగ్ అధికారంలోకి వచ్చిందని రష్యా అధికారులు తప్పుడు ప్రచారం చేయడంతోపాటు, ఫాసిజంను ఓడించడంలో రష్యా చారిత్రక పాత్రను నొక్కి చెప్పడం ప్రారంభించారు.

యుద్ధంలో మరణించిన వారి స్మారకార్థం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఉదాహరణకు, 2011లో సైబీరియన్ నగరమైన టామ్స్క్ లోని స్వతంత్ర పాత్రికేయుల బృందం ఒకటి, యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దానికి "ఇమ్మోర్టల్ రెజిమెంట్" అని పేరు పెట్టింది.
యుద్ధంలో మరణించిన వారి ఛాయాచిత్రాలను పట్టుకుని విజయ దినోత్సవం రోజున ప్రజలు కవాతు చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇది తర్వాత్తర్వాత ఇతర ప్రాంతాలకు పాకి, జాతీయ అంశంగా మారింది.
2015 లో అదే పేరుతో ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేశారు. కానీ, అందులో అసలు ఉద్యమ వ్యవస్థాపకులను చేర్చలేదు. చివరకు "ఇమ్మోర్టల్ రెజిమెంట్" అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మారింది. ఇందులో ప్రభుత్వ రంగ కార్మికులు, పాఠశాల పిల్లలు, జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొంటారు.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2020లో చేయాలనుకున్న కార్యక్రమం మే నుంచి జూన్ కు మార్చాల్సి వచ్చింది. ఇది అత్యంత ఖరీదైన కార్యక్రమంగా నిలిచింది.
20,000 మందికి పైగా సిబ్బంది, వందలాది విమానాలు, సాయుధ వాహనాల ప్రదర్శన, భారీ సైనిక కవాతు వంటి కార్యక్రమాలు ఇందులో జరిగాయి. రష్యా శక్తి ప్రపంచానికి చాటాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఫొటో సోర్స్, Reuters
రెండు సంవత్సరాల లోపే ఆ దేశం యుక్రెయిన్ పై పూర్తిస్థాయి దండయాత్రకు దిగి, అదే సైనిక శక్తిని యుక్రెయిన్ పై ప్రయోగించింది.
యుక్రెయిన్ పై యుద్దంలో అనుకున్నంత వేగంగా ఫలితాలు సాధించకపోవడంతో రష్యా కమాండర్లు మరోసారి మే 9వ తేదీని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
ఆ రోజు నాటికి రష్యా గణనీయమైన ఫలితాలను సంపాదించగలిగితే, మాస్కో మరోసారి తన ప్రభుత్వ ప్రచారం కోసం విక్టరీ డే ని మళ్లీ వినియోగించుకోగలదు.
విక్టరీ డే వేడుకలో యుక్రెయిన్‌లో రష్యా ప్రత్యేక ఆపరేషన్ ను యుద్ధమో, దురాక్రమణో కాదని, నాజీయిజాన్ని నిర్మూలించే పోరాటమని అధికారులు ప్రకటించుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- LIC ఐపీఓ వచ్చేసింది... షేర్లకు ఎలా దరఖాస్తు చేయాలి, పాలసీదార్లకు రాయితీ ఎంత?
- వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?
- ఖర్చులు తగ్గించుకుని, డబ్బులు మదుపు చేయడానికి ఏడు మార్గాలు
- విదేశాంగ మంత్రి జైశంకర్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?
- కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'
- మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











