LIC ఐపీఓ నేడే... ఈ షేర్ల కోసం దరఖాస్తు చేస్తున్నారా? అయితే, మీరిది చదవాల్సిందే

వీడియో క్యాప్షన్, ఎల్ఐసీ షేర్ల కోసం ఎలా ధరఖాస్తు చేయాలి? పాలసీదారులకు వచ్చే రాయితీలు ఎంత?
    • రచయిత, అలోక్ జోషి
    • హోదా, సీనియర్ ఎకనామిక్ జర్నలిస్ట్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఐపీఓ ఈరోజే (మే) ప్రారంభమవుతోంది. దీనికి మే 9 లోగా దరఖాస్తు పెట్టుకోవచ్చు.

మన దేశంలో ఎల్‌ఐసీ నుంచి పాలసీలు తీసుకున్నవారు లేదా అది అందించే జీవిత బీమా ద్వారా లాభం పొందినవారు అధిక సంఖ్యలో ఉంటారు. అనేకమందికి ఈ సంస్థ పరిచయమే.

ఇప్పుడు ఈ సంస్థ ఐపీఓ రాబోతుంది అంటే అర్థమేమిటి? ఇందులో విశేషం ఏంటి?

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ. ప్రపంచంలో అయిదవ అతిపెద్ద జీవిత బీమా సంస్థ.

అంతే కాకుండా, దేశంలోని అతిపెద్ద భూ యజమానులలో ఈ సంస్థ కూడా ఒకటి. అంటే దేశంలోని వివిధ నగరాల్లో అత్యంత విలువైన ఆస్తిలో ఎక్కువ భాగం ఈ కంపెనీ వద్ద ఉంది.

భారతదేశంలోని స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే అతిపెద్ద సంస్థ కూడా ఎల్ఐసీనే. దేశంలోని అన్ని మ్యూచువల్ ఫండ్‌ సంస్థల పెట్టుబడులూ కలిపినా మార్కెట్లో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడిలో సగమే ఉంటుంది.

అందుకే ఈ సంస్థ వాటాలపై స్టాక్ మార్కెట్ ప్లేయర్స్‌కు అంత ఆసక్తి. ప్రభుత్వం ఎల్ఐసీ వాటాలను విక్రయించాలని నిర్ణయిస్తే, కొనుగోలు చెయ్యడానికి పెట్టుబడిదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

ఎల్‌ఐసీలో ఐదు నుంచి పది శాతం వాటాలను విక్రయించాలని అనుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి గత ఏడాది బడ్జెట్‌లో ప్రస్తావించారు. అప్పటి నుంచి పెట్టుబడిదారుల నిరీక్షణ మరింత పెరిగింది.

ప్రభుత్వానికి కూడా ఎల్ఐసీ ఐపీఓ చాలా విలువైనది. దీని ద్వారా పొందే మొత్తాన్ని ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ (డిసిన్వెస్ట్‌మెంట్)కు ఉపయోగించుకోవచ్చు.

ఎల్ఐసీ ఐపీఓ

ఫొటో సోర్స్, Getty Images

ఎల్ఐసీ ఆస్తి విలువ ఎంత?

ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఆర్థిక మంత్రి ప్రకటన తరువాత ఐపీఓ వచ్చేవరకు సుమారు రెండేళ్లు దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ ఆస్తుల మార్కెట్ విలువను లెక్కించడానికి, అవన్నీ జోడించి ఎల్ఐసీ ధర నిర్ణయించడానికే సరిపోయింది.

దీని తరువాతే ప్రభుత్వం ఎల్‌ఐసీ వాటాను ఏ ధరకు విక్రయిస్తుందన్నది లెక్కించగలం. ఆపై ఎల్‌ఐసీ బీమా వ్యాపారం, మార్కెట్లో దాని పెట్టుబడి విలువను కూడా జోడించడం అవసరం.

ఇవన్నీ కలుపుకుని చూస్తే ఎల్ఐసీ ఆస్తి సుమారు 5.4 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణుల అంచనా.

దీనిని ఎంబెడెడ్ విలువ లేదా అంతర్లీన విలువ అని కూడా అంటారు. అయితే, కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు, తమ షేర్లను ఇదే ధరకు మార్కెట్లో ఎన్నిసార్లు విక్రయించవచ్చో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ ధర ఏ రేటులో పెరగవచ్చు అనేదానిపై పై నిర్ణయం ఆధారపడి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, నెలకు 5000తో 12 లక్షలు సంపాదించొచ్చా

కంపెనీకి ఎంత మార్కెట్ ఉంది, అంటే పోటీ ఎంత కష్టం లేదా ఎంత సులభం.. ఇలా ఇంకా చాలా విషయాలను పరిగణించాల్సి ఉంటుంది. వీటన్నిటి ఆధారంగా, ఎల్ఐసీ కంపెనీ విలువ సుమారు 13.5 లక్షల కోట్లు ఉంటుందని కన్సల్టెంట్లు లెక్క వేశారు. అంటే వీళ్లు దాదాపు రెండు రెట్లు ఎక్కువ అంచనా వేశారు.

పెట్టుబడిదారులు, కన్సల్టెంట్లతో చర్చల తరువాత, ఇప్పుడు ప్రభుత్వం, సూచించిన ధర కన్నా కేవలం 1.1 రెట్లు ఎక్కువ ధర వద్ద ఎల్ఐసీ వాటాలను విక్రయించబోతోంది.

మార్కెట్ పరిస్థితులు, యుక్రెయిన్ యుద్ధం సృష్టించిన అనిశ్చితి దీనికి ప్రధాన కారణాలు. అందుకే ఎల్‌ఐసీలో అయిదు నుంచి పది శాతం వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్టు ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ, ఇప్పుడు 3.5 శాతం వాటాలను మాత్రమే విక్రయిస్తోంది. అంటే, ఐపీఓ పరిమాణం తగ్గిపోయింది.

అయినప్పటికీ, ఇప్పటి వరకు భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన అతిపెద్ద ఐపీఓ ఇదే. ప్రభుత్వం 22,13,74,920 షేర్లను విక్రయించడం ద్వారా సుమారు రూ. 20,557 కోట్లను సమీకరించడానికి సన్నాహాలు చేస్తోంది. ఎల్ఐసీ మార్కెట్లోకి ప్రవేశించక ముందు అతిపెద్ద ఐపీఓగా పేటీఎం చెలామణి అయింది. ఇందులో రూ. 18.5 వేల కోట్లు వచ్చాయి.

ఎల్ఐసీ ఐపీఓ

ఫొటో సోర్స్, Getty Images

ఎల్ఐసీ ఐపీఓకు ఇంత సమయం ఎందుకు పట్టింది?

ఎల్‌ఐసీ ఇతర కంపెనీల్లా కాదు. 1956లో భారత ప్రభుత్వం జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసినప్పుడు ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. దీని కింద దేశంలోని అన్ని జీవిత బీమా కంపెనీల వ్యాపారాన్ని విలీనం చేస్తూ ఎల్ఐసీని ఏర్పాటు చేసింది. అందుకే ఎల్‌ఐసీ షేర్లన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి.

ఇన్నేళ్లల్లో ఈ కంపెనీ చాలా ఎదిగింది. దీని విలువను లెక్కించడానికి చాలా సమయం పట్టింది. దీని వాటాలో అయిదు లేదా పది శాతాన్ని విక్రయించినా స్టాక్ మార్కెట్‌కు దెబ్బతగిలే అవకాశం ఉందని ప్రభుత్వం అనుమానించింది.

అందుకే నిబంధనలను మారుస్తూ విదేశీ పెట్టుబడిదారులు నేరుగా ఐపీఓలో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు కూడా. దీనితో పాటు, ఎల్‌ఐసీ పాలసీదారులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేశారు. ఈ సన్నాహాల తరువాత, ఫిబ్రవరిలో ప్రభుత్వం సెబీ కి ఐపీఓ కోసం దరఖాస్తు పెట్టింది.

గత వారం సెబీ నుంచి ఆమోదం వచ్చింది. కానీ, యుక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్‌లో అనిశ్చితి ఉండడంతో ఐపీఓ పరిమణాన్ని తగ్గించారు. రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 1.5 లక్షల కోట్ల రూపాయల వరకూ సొమ్ము కూడుతుందని అనుకున్నా, ఇప్పుడు ఐపీఓ కేవలం రూ. 20 వేల కోట్లు సేకరించగలుగుతుందని అంచనా.

ఎల్ఐసీ ఐపీఓ

ఫొటో సోర్స్, Getty Images

రానున్న రోజుల్లో మరిన్ని ఎల్ఐసీ షేర్లను ప్రభుత్వం విక్రయిస్తుందా?

నిబంధనల ప్రకారం, స్టాక్ మార్కెట్‌లోని లిస్టెడ్ కంపెనీల్లో కనీసం 25 శాతం షేర్లు ప్రజల వద్ద ఉండాలి. అంటే, కంపెనీకి ప్రమోటర్లు కాని వ్యక్తుల దగ్గర ఉండాలి.

ఈ నిబంధన పాటించాలంటే ప్రభుత్వం తమ వాటాను 100 శాతం నుంచి 75 శాతానికి తగ్గించుకోవాలి.

దీన్ని అనుసరించడానికి ప్రభుత్వానికి కొంత ఎక్కువ వెసులుబాటు సమయం ఉంటుంది. అందుకే, కేవలం 3.5 శాతం షేర్లను విక్రయించడానికి కూడా అనుమతి పొందగలిగింది.

వచ్చే రెండు, మూడేళ్లలో మరో 10 శాతం నుంచి 20 శాతం వాటాలను విక్రయించే అవకాశం ఉందని ప్రభుత్వం ముందే చెప్పింది. నిబంధనల ప్రకారం అలా చేయాలి కూడా.

అయితే ఇప్పుడు ఐపీఓలో పెట్టుబడి పెట్టేవాళ్లకు ఇది కొంత నిరాశ కలిగించవచ్చు. షేర్ల ధరలు పడిపోతాయనే భయం ఉండవచ్చు. అందుకే, ఈ ఐపీఓ తరువాత కనీసం ఒక ఏడాది పాటు తమ షేర్లను మార్కెట్లో విక్రయించబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఎల్ఐసీ ఐపీఓ

ఫొటో సోర్స్, Getty Images

ఎల్‌ఐసీ పాలసీదారులకు ఎందుకు షేర్లు ఇస్తున్నారు?

ఒక కంపెనీ తన కస్టమర్లందరికీ వాటాదారులుగా మారే అవకాశం ఇవ్వడం ఇదే మొదటిసారి. దీనికి కారణం, ఎల్‌ఐసీ ఐపీఓకు ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పుడు, ఇంత పెద్ద ఐపీఓకు మార్కెట్‌లో పూర్తి డిమాండ్‌ ఉంటుందో లేదోనని భయపడింది.

అందుకే ఈ ప్రత్యేక మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎల్‌ఐసీకి దాదాపు 29 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడూ పెట్టుబడి పెట్టనివారు.

వీరిలో 10 శాతం అయినా ఎల్‌ఐసీ షేర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే రెట్టింపు ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీఓ విజయవంతమవుతుంది. అలాగే, ఇన్నాళ్లు స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉన్నవారు ఇప్పుడు ఈ విధమైన పెట్టుబడుల గురించి ఆలోచించడం మొదలుపెడతారు.

అందుకే, ఎల్ఐసీ ఐపీఓ అనగానే స్టాక్‌ మార్కెట్‌ అంతా ఉత్కంఠ రేగింది. ఎల్ఐసీ ఏజెంట్లు కూడా స్టాక్ మార్కెట్లో లాభాల గురించి పాలసీదారులకు వివరించి చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేసే మార్గాలివి

పాలసీదారులకు ఉచితంగా షేర్లు ఇస్తారా?

అలాంటిదేమీ లేదు. ఈ షేర్లను ఎవరూ ఉచితంగా పొందరు. పాలసీదారులు కూడా డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సిందే. వారి కోసం ప్రత్యేక కోటా మాత్రమే ఉంది.

ఈ ఐపీఓలో పది శాతం అంటే 2 కోట్ల 21 లక్షల షేర్లను పాలసీదారుల కోసం కేటాయించారు. దీనితో పాటు, వారికి షేరు ధరలో 60 రూపాయల తగ్గింపు ఇస్తారు. సాధారణ ఇన్వెస్టర్లకు రూ. 902 నుంచి రూ. 949 మధ్య అందుబాటులో ఉండే షేరు ధర పాలసీదారులకు రూ. 842 - 889 మధ్యలో లభిస్తుంది.

ఎల్ఐసీ ఐపీఓ

ఫొటో సోర్స్, Getty Images

ఈ షేర్లను పొందాలంటే పాలసీదారులు ఏం చేయాలి?

షేర్ల కోసం పాలసీదారులు ఏం చేయాలో ఎల్‌ఐసీ చాలా కాలంగా ఏజెంట్ల ద్వారా సలహాలు ఇస్తోంది. మీ పాలసీని మీ పాన్ కార్డ్‌తో లింక్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. తద్వారా మీరు పాలసీ హోల్డర్ కోటా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏప్రిల్ 22 వరకు పాలసీని కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ అవకాశాన్ని పొందవచ్చు. అయితే, పాత పాలసీదారులు తమ పాలసీని, పాన్‌ను అనుసంధానించే పనిని ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేసి ఉండాలి. ఆరున్నర కోట్ల మంది ప్రజలు తమ పాలసీలను పాన్‌తో అనుసంధానించారని ఎల్ఐసీ ఛైర్మన్ వెల్లడించారు.

ఇలా పాలసీ ఉన్న వ్యక్తులు ఒక్క లాట్ అంటే 15 షేర్లకు దరఖాస్తు చేసుకుంటే దాదాపు 100 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చినట్లవుతుంది. అలా వారు గరిష్టంగా 14 లాట్స్ కొనుక్కోవచ్చు.

ఐపీఓ ఫారం ఫూర్తి చేస్తున్నప్పుడు అభ్యర్ధులు తాము పాలసీ హోల్డర్ కోటా కోసం దరఖాస్తు చేసుకుంటున్నామని పేర్కొనాలి. అతను పాలసీదారు అన్నది నిరూపించడానికి పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది.

పాలసీదారులుగా మీరు షేర్లను పొందినట్లయితే, అవి మీకు రూ. 60 తక్కువగా లభిస్తాయి. ఇవి నేరుగా డీమ్యాట్ ఖాతాకు వెళ్తాయి. కాబట్టి, దరఖాస్తు దారులకు డీమ్యాట్ ఖాతా ఉండటం తప్పనిసరి. ఇప్పటి వరకు తెరవకపోతే ఈరోజు కూడా తెరవచ్చు.

వీడియో క్యాప్షన్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమేనా?

పాలసీ ఎంత పెద్దది అన్నదానిపై షేర్ల సంఖ్య ఆధారపడి ఉంటుందా?

ఎంత మాత్రం కాదు. పాలసీ ఎంత పెద్దదైనా, చిన్నదైనా అందరికీ పాలసీదారు కోటాలో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అందరినీ సమానంగా పరిగణిస్తూ షేర్ల కేటాయింపు జరుగుతుంది. కోటా కంటే ఎక్కువ షేర్ల కోసం దరఖాస్తులు వస్తే, లాటరీ ఫార్ములాను నిర్ణయించి, దాని ఆధారంగా వాటాలు ఇస్తారు.

కొనాల్సిన కనీస షేర్ల సంఖ్య ఎంత?

పాలసీదారు లేదా సాధారణ వ్యక్తి ఇద్దరికీ కనీసం ఒక లాట్ అంటే 15 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడం అవసరం. దీనికంటే తక్కువ షేర్లు కొనడం కుదరదు. పాలసీదారు కోటాలో గరిష్టంగా రెండు లక్షల రూపాయల విలువైన షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అంటే, గరిష్టంగా 14 లాట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైల్‌లో దరఖాస్తు చేసుకునే సాధారణ దరఖాస్తుదారులు కూడా అదే సంఖ్యలో కనీస లేదా గరిష్ట సంఖ్యలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుదారు రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన షేర్లు కొనుగోలు చేయాలనుకుంటే, హై నెట్‌వర్త్ ఇండివిజ్యువల్(హెచ్ఎన్ఐ) కేటగిరీ కింద తీసుకోవచ్చు. గరిష్ట మొత్తాన్ని ఆ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎల్ఐసీ ఐపీఓ

ఫొటో సోర్స్, Getty Images

ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు పెట్టుకోవచ్చా?

సాధారణంగా ఐపీఓలో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునే వీలు లేకపోయినా, ఎల్ఐసీ ఐపీఓలో తొలిసారిగా పాలసీదారులు ఒకే పాన్ కార్డును ఉపయోగించి రెండు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

పాలసీదారు కోటాలో ఒకటి, సాధారణ రిటైల్ లేదా హెచ్‌ఎన్ఐ కోటాలో ఒకటి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎల్‌ఐసీ పాలసీ లేని వ్యక్తులు లేదా తమ పాలసీని పాన్‌తో లింక్ చేయని వ్యక్తులు మాత్రం ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తు చేసుకోలేరు.

ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి?

ఎల్ఐసీ ఐపీఓ మే 4న తెరుస్తారు. మే 9న ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ఆన్ లైన్ ఫ్లాట్ ఫాట్‌ఫారమ్‌లలో, దరఖాస్తు ముగింపు సమయం కొంచెం ముందుగానే ముగుస్తుంది కాబట్టి ఆ రోజు 12 గంటలలోపు ఈ పనిని పూర్తి చేయడం మంచిదని చివరి రోజున దరఖాస్తు చేసుకునే వారు గుర్తుంచుకోవాలి.

ఎల్ఐసీ ఐపీఓ ఎంత వరకు లాభదాయకం?

ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. కంపెనీ చాలా కాలంగా లాభాలను ఆర్జించే వ్యాపారం చేస్తోంది. షేర్లు జారీ అవుతున్న ధర బాగానే కనిపిస్తోంది.

అయితే మార్కెట్‌లో అనిశ్చితి ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ప్రతి పెట్టుబడిదారుడు విశ్వసనీయ పెట్టుబడి సలహాదారులను సంప్రదించి, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)