Investment: భారత్‌లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని ప్రకటన.. కానీ, ఆ కార్యాలయమే లేదు: బీబీసీ పరిశోధన

కంపెనీ ప్రకటన

ఫొటో సోర్స్, SCREENSHOT OF ADVT

    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వార్తా పత్రిక ‘‘టైమ్స్ ఆఫ్ ఇండియా’’, వాణిజ్య వార్తల పత్రిక ‘‘ద ఎకనామిక్ టైమ్స్’’ల మొదటి పేజీల్లో గత సోమవారం ఒక ప్రకటన ప్రచురితమైంది. ఇది ఎన్నో అనుమానాలు, సందేహాలకు తావిస్తోంది.

ఈ ప్రకటనను నేరుగా ప్రధాన మంత్రిని సంబోధిస్తూ ప్రచురించారు. తాము భారత్‌లో 500 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని భావిస్తున్నట్లు దీని వెనకున్న సంస్థ తెలిపింది. అంటే భారత కరెన్సీలో రూ.36 లక్షల కోట్లు.

గతేడాది అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన మొత్తం మూలధన పెట్టుబడులు 7 బిలియన్ డాలర్లు. ఇప్పుడు ఎవరికీ పెద్దగా పరిచయంలేని ఒక కంపెనీ దీని కంటే 71 రెట్లు ఎక్కువ పెట్టుబడులు పెడతామని అంటోంది. అంటే ఈ మొత్తం ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు.

ఈ పత్రికల మొదటి పేజీలో ప్రకటన ఇచ్చిన ఆ సంస్థ పేరు ‘‘ల్యాండమస్ రియాలిటీ వెంచర్స్’’. ల్యాండమస్ గ్రూప్ చైర్మన్ ఎస్.ప్రదీప్ కుమార్ ఈ ప్రకటన ఇచ్చారు.

నేరుగా ప్రధాన మంత్రిని సంబోధిస్తూ ప్రకటన ఇవ్వడం, ఇంత భారీ మొత్తం పెట్టుబడి పెడతామని చెప్పడంతో నెటిజన్లలో చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. వీటిపై బీబీసీ పరిశోధన చేపట్టింది.

అమెరికా డాలర్

ఫొటో సోర్స్, ADEK BERRY/AFP/GETTYIMAGES

పరిశోధనలో ఏం తేలింది?

బీబీసీ మొదట కంపెనీ వెబ్‌సైట్( https://landomus.com )ను పరిశీలించింది. ఇది కేవలం ఒక పేజీ వెబ్‌సైట్. సోమవారంనాటి ప్రకటనలో ఉన్న వివరాలే ఇక్కడా కనిపిస్తున్నాయి.

సాధారణంగా చిన్న కంపెనీల వెబ్‌సైట్లలో కూడా ‘‘ఎబౌట్ అస్’’, ‘‘ఫుల్ డీటెయిల్స్’’ లాంటి ఆప్షన్లు ఉంటాయి. వీటిపై క్లిక్‌చేస్తే కంపెనీ పూర్తి సమాచారం వస్తుంది. కంపెనీ ఏయే రంగాల్లో పనిచేస్తుంది? గత సంవత్సరంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది? లాంటి సమాచారం ఇక్కడ దొరుకుతుంది. కానీ ల్యాండమస్ వెబ్‌సైట్‌లో ఇలాంటి వివరాలేమీ లేవు.

కంపెనీ వెబ్‌సైట్ కవర్ ఇమేజ్‌గా న్యూయార్క్‌లోని భారీ భవనం ఫోటో పెట్టారు. సంస్థ కోసం పనిచేస్తున్న పది మంది పేర్లు, వారి ఫోటోలను కూడా వెబ్‌సైట్లో పెట్టారు. అంతకుమించి ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.

ప్రదీప్ కుమార్ సత్యప్రకాశ్(చైర్మన్, సీఈవో), హెచ్‌ఎన్ మమత (డైరెక్టర్), యశస్ ప్రదీప్ (డైరెక్టర్), రక్షిత్ గంగాధర్ (డైరెక్టర్), గుణశ్రీ ప్రదీప్ కుమార్‌ల పేర్లు కంపెనీ డైరెక్టర్లుగా వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

పమేలా కియో, ప్రవీణ్ ఆస్కార్ శ్రీ, ప్రవీణ్ మురళీధరణ్, ఏవీవీ భాస్కర్, నవీన్ సజ్జన్ పేర్లను అడ్వైజర్ల జాబితాలో పెట్టారు.

కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఫోన్ నంబరు ఇవ్వలేదు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు, కంపెనీ లక్ష్యాల గురించి కూడా ఎక్కడా చెప్పలేదు.

న్యూజెర్సీలో సంస్థ చెప్పిన చిరునామా ఇది
ఫొటో క్యాప్షన్, న్యూజెర్సీలో సంస్థ చెప్పిన చిరునామా ఇది

ఆఫీస్ అక్కడ లేదు..

ఆ వెబ్‌సైట్‌లో వెల్లడించిన ముఖ్యమైన సమాచారం చిరునామా మాత్రమే. దీన్ని అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

‘‘ల్యాండమస్ రియాలిటీ వెంచర్స్, 6453, రివర్‌సైడ్ స్టేషన్, న్యూజెర్సీ, 07094, అమెరికా’’గా చిరునామా వెల్లడించారు.

ఈ చిరునామాకు బీబీసీ ప్రతినిధి సలీం రిజ్వి వెళ్లారు. ఇది ఒక ‘‘రెసిడెన్సియల్ బిల్డింగ్’’ చిరునామా. ఇక్కడ ల్యాండమస్ కంపెనీ కార్యాలయం ఉన్నట్లు ఎలాంటి బోర్డూ లేదు.

ఇక్కడ పనిచేస్తున్న ఓ మహిళతో బీబీసీ ప్రతినిధి మాట్లాడారు. ల్యాండమస్ పేరుతో ఏదైనా సంస్థ ఇక్కడ ఉండేదా? అని ప్రశ్నించారు. అయితే, ఇక్కడ అలాంటి సంస్థేమీలేదని ఆమె బదులిచ్చారు.

ఇంట్లోవారి భద్రత దృష్ట్యా.. అక్కడ ఎవరు ఉంటున్నారు? వారి పేర్లేమిటి? తదితర సమాచారం ఆమె వెల్లడించలేదు.

అయితే, ఒక విషయం మాత్రం సుస్పష్టం. కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న చిరునామాలో ఎలాంటి కార్యాలయమూ లేదు.

బెంగళూరులో సంస్థ ఇచ్చిన చిరునామా ఇది
ఫొటో క్యాప్షన్, బెంగళూరులో సంస్థ ఇచ్చిన చిరునామా ఇది

అద్దెకు ఇల్లు

వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఈ-మెయిల్ ఐడీకి బీబీసీ ప్రశ్నావళిని పంపించింది. దీనికి కంపెనీ సీఈవో ప్రదీప్ కుమార్ సత్యప్రకాశ్ చాలా చిన్న ప్రత్యుత్తరం ఇచ్చారు.

‘‘మేం మా వివరాలను భారత ప్రభుత్వానికి పంపించాం. ప్రత్యుత్తరం కోసం ఎదురుచూస్తున్నాం. మాకు సమాధానం వచ్చిన వెంటనే, పూర్తి వివరాలను మీకు పంపిస్తాం’’అని ప్రదీప్ కుమార్ ప్రత్యుత్తరం ఇచ్చారు.

భారీ పెట్టుబడి పెడతామని బహిరంగంగా ల్యాండమస్ ఇచ్చిన ప్రతిపాదనకు భారత ప్రభుత్వం స్పందించలేదు.

కంపెనీ చిరునామా గురించి అడిగిన ప్రశ్నకు ప్రదీప్ కుమార్ స్పందించారు. ‘‘మేం న్యూజెర్సీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. దాన్నే కార్యాలయంగా మార్చుకున్నాం’’అని ఆయన బదులిచ్చారు.

బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చిన కంపెనీకి, సొంత కార్యాలయం ఉండకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే.

మనిపాల్ సెంటర్

బ్యాలెన్స్ షీట్ అప్‌డేట్ చేయలేదు...

కంపెనీ వెబ్‌సైట్ గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. దీంతో 2015 సెప్టెంబరులో కర్ణాటకలో ‘‘యునైటెడ్ ల్యాండ్ బ్యాంక్’’ పేరుతో ఈ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసినట్లు వెల్లడైంది.

ఆ తర్వాత ‘‘ల్యాండమస్ రియాలిటీ వెంచర్స్’’ సమాచారం కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను బీబీసీ సంప్రదించింది.

దీంతో 2015లో బెంగళూరులో ల్యాండమస్ రియాలిటీ వెంచర్స్ ప్రైవేటెడ్ లిమిటెడ్ పేరుతో సంస్థను రిజిస్టర్ చేయించినట్లు తేలింది.

ఈ సంస్థ ‘‘పెయిడ్ అప్ క్యాపిటల్’’ లక్ష రూపాయలుగా తేలింది. అంటే షేర్లను అమ్మడం ద్వారా కంపెనీ ఆర్జించిన మొత్తం ఇది. దీని బట్టి ఈ కంపెనీ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.

కంపెనీ వార్షిక సర్వ ప్రతినిధుల సమావేశం సెప్టెంబరు 2018లో జరిగినట్లు కార్పొరేట్ శాఖ రికార్డులో ఉంది. అయితే, 31 మార్చి 2018 తర్వాత, కంపెనీ తన బ్యాలెన్స్ షీట్‌ను అప్‌డేట్ చేయలేదు.

బెంగళూరులో సంస్థ ఇచ్చిన చిరునామా ఇది
ఫొటో క్యాప్షన్, బెంగళూరులో సంస్థ ఇచ్చిన చిరునామా ఇది

భారత్‌లో కార్యాలయం కూడా లేదు..

భారత్ కార్యాలయం బెంగళూరులో ఉన్నట్లు కంపెనీ పత్రాల్లో పేర్కొంది. కంపెనీ పేరును.. ‘‘ల్యాండమస్ రియాలిటీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’’గా.. చిరునామాను ‘‘ఎస్-145, 4వ అంతస్తు, మణిపాల్ సెంటర్, డిక్సన్ రోడ్, బెంగళూరు’’గా వివరించింది.

ఈ చిరునామాకు బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీ వెళ్లారు. అయితే, అక్కడ సంస్థ పేరుతో ఎలాంటి కార్యాలయమూ లేదు.

ఓ టెక్నాలజీ సంస్థ కార్యాలయం ఇక్కడ ఉంది. ఈ నాలుగో అంతస్తులో ఎక్కడా ల్యాండమస్ కార్యాలయం ఉన్నట్లు ఆధారాలు లేవు.

అంటే.. అటు న్యూజెర్సీ, ఇటు బెంగళూరు.. రెండు చోట్లా కంపెనీ చెప్పిన చిరునామాల్లో కార్యాలయాలు లేవు. దీంతో కంపెనీ వెబ్‌సైట్‌లోని వ్యక్తుల పేర్లపై బీబీసీ దృష్టి సారించింది.

కంపెనీ వెబ్‌సైట్‌లో పది మంది పేర్లు, ఫోటోలు ఉన్నాయి. వీటిలో ఒక భారతీయేతర మహిళ పమేలా కియోను కంపెనీ అడ్వైజర్‌గా పేర్కొన్నారు.

ఆమె పేరుతో సెర్చ్ చేస్తే, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ దొరికింది. అమెరికాలోని కనెక్టికట్‌లో ‘‘మేక్ ఎ విష్ ఫౌండేషన్’’ సంస్థ సీఈవో, అధ్యక్షురాలిగా ఆమె ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ఆమె లింక్డ్‌ఇన్ ఫోటో, ల్యాండమస్ వెబ్‌సైట్ ఫోటో దాదాపు ఒకేలా ఉన్నాయి.

ల్యాండమస్ వివరాలపై పమేలాకు బీబీసీ మెయిల్ చేసింది. అయితే, ఈ వార్త రాసే సమయానికి ఎలాంటి ప్రత్యుత్తరమూ రాలేదు. ఆమె సమాధానం వస్తే, ఈ వార్తను అప్‌డేట్ చేస్తాం.

ల్యాండమస్‌ రియాలిటీకి చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లు రక్షిత్ గంగాధర్, గుణశ్రీ ప్రదీప్‌ల లింక్డ్‌ఇన్‌ల ప్రొఫైల్స్ కూడా దొరికాయి. కానీ ఈ ప్రొఫైల్స్‌లో ఎలాంటి పోస్టులూ లేవు.

ల్యాండమస్ ఇచ్చిన ప్రకటనను ఓ జోక్‌గా ఆర్థిక వ్యవహారాల నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)