మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?

మృత దేహాలను ఉచితంగా తరలించే మహాప్రస్థానం వాహనం

ఫొటో సోర్స్, ihgprojects.in

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ప్రైవేటు అంబులెన్సులు ఎక్కువ డబ్బులు అడగడంతో ఒక మృత దేహాన్ని బైక్ మీదనే ఇంటికి తరలించారనే వార్తలు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయంగా మారాయి.

ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ప్రైవేటు అంబులెన్సుల కనీస ధరలను జిల్లా కలెక్టర్ నిర్దేశించారు. రూ.10 లక్షల లోపు విలువైన వాహనాలకు అంటే మారుతీ ఓమ్ని, టాటా మ్యాజిక్, మహీంద్రా బొలెరో వంటి వాటికి బేసిక్ ఫేర్ (తొలి 10 కిలోమీటర్లకు) రూ.750గా నిర్ణయించగా రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన టాటా వింగర్, ఫోర్స్ ట్రావెలర్ వంటి వాహనాల బేసిక్ ఫేర్‌ను రూ.1,250గా నిర్ణయించారు.

బేసిక్ లైఫ్ సపోర్ట్‌(బీఎల్‌ఎస్), అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్‌(ఏల్‌ఎస్) సౌకర్యాలున్న అంబులెన్సులకు బేసిక్ ఫేర్‌ రూ.1,000 నుంచి రూ.3,000 మధ్య ఉంది.

మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్న ఆసుపత్రుల వివరాలు

ఫొటో సోర్స్, mahaprasthanamap.in

మృత దేహాలను తరలించడానికి ఉచిత వాహనాలు ఉండవా?

ఆంధ్రప్రదేశ్‌లో 'మహాప్రస్థానం' పథకం కింద మృత దేహాలను తరలించేందుకు ఉచితంగా వాహన సేవలను అందిస్తున్నారు. 2017లో నాటి ప్రభుత్వం ఈ పథకానికి 50 వాహనాలను కేటాయించింది. అప్పటికి 13 జిల్లాల్లోని 11 టీచింగ్ హాస్పిటల్స్‌తోపాటు విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లా ఆసుపత్రుల్లో కూడా మహాప్రస్థానం సేవలను ప్రారంభించారు.

ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 53 మహాప్రస్థానం వాహనాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు మహాప్రస్థానం వాహనాల ద్వారా ఇప్పటి వరకు 1,19,214 మృత దేహాలను తరలించారు. ఇందుకోసం వాహనాలు సుమారు 10 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. అత్యధికంగా కాకినాడ జనరల్ హాస్పిటల్ నుంచి 17,839 మృత దేహాలను తరలించారు.

తిరుపతి రుయా హాస్పిటల్

ఫొటో సోర్స్, Thulasi Prasad Reddy

ఉచిత సేవలు ఎలా పొందాలి?

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల ప్రాంగణంలో మహాప్రస్థానం వాహనాలుంటాయని కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మైథిలి తెలిపారు.

సేవలు అవసరమైనప్పుడు వార్డు ఇంచార్జికి సమాచారం ఇస్తే వారు మహాప్రస్థానం వాహనాలను పిలిపిస్తారని వెల్లడించారు.

అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉంటాయని ఆమె చెప్పారు.

సాయంత్రం 6 గంటల తరువాత చనిపోతే మృత దేహాలను మార్చురీలో భద్రపరిచి, ఉదయాన్నే పంపిస్తారు.

ఉచితంగా సేవలు లభించకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

మహాప్రస్థానం వాహనాల సేవలు పూర్తిగా ఉచితం.

ఎవరైనా డబ్బు డిమాండ్ చేసినా మృత దేహాన్ని తరలించడానికి నిరాకరించిన సంబంధిత ఆసుపత్రి సూపరింటెండ్‌కు లేదా జిల్లా కలెక్టర్ లేదా జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేయొచ్చని విశాఖపట్నం జిల్లా డీఎంహెచ్‌ఓ తెలిపారు.

మహాప్రస్థానం వాహనాలను ప్రారంభిస్తున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Twitter/ArogyaAndhra

108 అంబులెన్సుల్లో మృత దేహాలు తరలించే సౌకర్యం ఉందా?

మృత దేహాలను మహాప్రస్థానం వాహనాల్లో మాత్రమే తరలిస్తారని అందుకు 108 అంబులెన్సులను ఉయోగించరని విశాఖపట్నం డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మీ వెల్లడించారు.

ప్రైవేటు ఆసుపత్రిలో చనిపోతే ఎలా?

ప్రైవేటు ఆసుపత్రిలో చనిపోయినప్పటికీ మృత దేహాన్ని తరలించేందుకు మహాప్రస్థానం వాహనాల సేవలు లభిస్తాయని విశాఖపట్నం డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మీ తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మృత దేహాలకు హక్కులుంటాయ్

చనిపోయిన వ్యక్తుల హక్కుల గురించి దేశంలో ప్రత్యేకమైన చట్టాలు లేవు. రాజ్యాంగంలోని ఆర్టికల్-21 ప్రకారం మృత దేహాలకు కూడా మానవ హక్కులు ఉంటాయని ఆయా సందర్భాల్లో కోర్టులు తీర్పిచ్చాయి.

1989 నాటి ప్రేమానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇలాగే తీర్పిచ్చింది.

ఆ తరువాత అలహాబాద్ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులు కూడా ఆయా సందర్భాల్లో మృత దేహాల హక్కులు కాపాడాలంటూ ఆదేశించాయి.

ప్రధానంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృత దేహాల హక్కుల మీద చర్చ జరిగింది.

చనిపోయిన వారిని తరలించడానికి అంబులెన్సులు దొరకకపోవడం, స్మశానాలలో ఖాళీ లేక పోవడం, గంగానదిలో శవాలు తేలడం వంటి సంఘటనల మధ్య మృత దేహాల హక్కులు కాపాడాలంటూ జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

వీడియో క్యాప్షన్, సూరత్ శ్మశానంలో కరిగిపోయిన చిమ్నీ... కరోనా మృత దేహాల సంఖ్య పెరగడమే కారణం

ఎన్‌హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన మార్గదర్శకాలు

•కుటుంబ సభ్యులు అడిగితే మృత దేహాన్ని తరలించేందుకు స్థానిక అధికారులు రవాణా సౌకర్యాన్ని కల్పించాలి.

•బంధువులకు మృత దేహాన్ని గౌరవంగా అప్పగించాలి.

•మతృ దేహాల విషయంలో మతం, కులం, ప్రాంతం, లింగ వివక్ష పాటించకూడదు.

•సరైన సమయంలో గౌరవప్రదంగా అంత్యక్రియలు పొందే హక్కు చనిపోయిన వ్యక్తులకు ఉంటుంది.

వీడియో క్యాప్షన్, ప్రాణాలు తీసే, విధ్వంసం సృష్టించే వడగళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)