పుతిన్ సీక్రెట్ గర్ల్‌ఫ్రెండ్ 'అలీనా' ఎవరు... ఆమె మీద అమెరికా ఎందుకు ఆంక్షలు విధించలేకపోయింది?

పుతిన్‌తో అలీనా

ఫొటో సోర్స్, Reuters

''ప్రతీ కుటుంబానికీ ఓ యుద్ధ కథ ఉంటుంది. మనం ఆ యుద్ధ కథలను మర్చిపోకూడదు, వాటిని మనం తర్వాతి తరాలకు చెప్పాలి'' అలీనా కబయేవా చెప్పిన మాటలివి.

ఆమెను రష్యా 'రహస్య ప్రథమ మహిళ'గా పిలుస్తారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అందరి దృష్టి ఆమెపైనే నిలిచింది.

దీనికి కారణం ఏంటంటే... రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తెలతో సహా ఆయన సన్నిహితులు అందరిపై అమెరికా ఆంక్షలు విధించింది. కానీ, అలీనా మాత్రం వీటి నుంచి తప్పించుకుంది.

ద వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం, ఒలింపిక్ మాజీ జిమ్నాస్ట్ అయిన అలీనాపై నిబంధనలు విధించడానికి అమెరికా సిద్ధమైంది. కానీ, చివరి క్షణాల్లో అలా చేయలేకపోయింది.

అలీనాపై ఆంక్షలు విధిస్తే, దాన్ని పుతిన్ తనపై జరిగిన దాడిగా భావించవచ్చని, అలా జరిగితే శాంతి పునరుద్ధరణ కోసం చేస్తోన్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందనే కారణంతో వెనుకడుగు వేసినట్లు తెలిపారు.

అమెరికా, కావాలనే రష్యా అధ్యక్షుడి గర్ల్‌ ఫ్రెండ్ అలీనాపై ఆంక్షలు విధించడం లేదనే వాదనలను సోమవారం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జేన్ సాకీ ఖండించారు.

రష్యా నేత, మాజీ జిమ్నాస్ట్ అలీనాపై ఇప్పటివరకు ఎందుకు ఆంక్షలు విధించలేదని రోజూవారీ ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా ఆయనను జర్నలిస్టులు ప్రశ్నించారు.

'మేం ఆంక్షలను నిరంతరం సమీక్షిస్తున్నాం' అని సాకీ ఆ ప్రశ్నకు బదులుగా చెప్పారు.

అలీనా కబయేవా

ఫొటో సోర్స్, SASHA MORDOVETS/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అలీనా కబయేవా

అలీనా కబయేవా ఎవరు?

అలీనా ఒక జిమ్నాస్ట్. ఆమె 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుపొందారు. 13 ఏళ్ల వయస్సులోనే జిమ్నాస్టిక్స్‌లో అరంగేట్రం చేశారు. 1998లో తొలి వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నారు.

దీని తర్వాత 2001, 2002 యూరోపియన్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లలో ఆమె అనేక పతకాలను సాధించారు. 2003లో ఎన్నో వరల్డ్ టైటిళ్లను గెలుచుకున్నారు. డోపింగ్ వ్యవహారాల్లో కూడా చిక్కుకున్నారు. కానీ, దాని ప్రభావం ఆమెపై పెద్దగా పడలేదు.

2005 తర్వాత నుంచి ఆమె క్రమంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పుడే ఆమె పేరును పుతిన్‌తో ముడిపెట్టడం ప్రారంభమైంది. 'యునైటెడ్ రష్యా' పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ రష్యా దిగువ సభ అయిన 'డుమా'కు ఆమె ఎన్నికయ్యారు. 2014 సోచి ఒలింపిక్స్‌ జ్యోతిని మోసిన క్రీడాకారిణుల్లో ఆమె కూడా ఉన్నారు.

అలీనా కబయేవా

ఫొటో సోర్స్, Getty Images

ద మాస్కో టైమ్స్ ప్రకారం, క్రెమ్లిన్ అనుకూల 'ద నేషనల్ మీడియా గ్రూప్'కు అలీనా నాయకత్వం వహిస్తారు. అయితే, పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్‌లో ఆమె పేరును వెబ్‌సైట్ నుంచి తొలిగించారని ద మాస్కో టైమ్స్ పేర్కొంది.

2015లో బిడ్డకు జన్మనిచ్చేందుకు అలీనా స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు స్విట్జర్లాండ్, అమెరికా, యూరప్ దేశాల అధికారులు చెప్పినట్లు మాస్కో టైమ్స్ పేర్కొంది. దీని తర్వాత 2019లో ఆమె మాస్కోలో కవలలకు జన్మనిచ్చారు. అయితే, పుతిన్ ఎప్పుడూ దీని గురించి మాట్లాడలేదు.

అలీనా

ఫొటో సోర్స్, Getty Images

మాస్కోలో 'అలీనా ఫెస్టివల్'

గత శనివారం రష్యా రాజధాని మాస్కోలో జరిగిన 'అలీనా ఫెస్టివల్' కార్యక్రమంలో అలీనా కనిపించారని 'ద మాస్కో టైమ్స్' రిపోర్ట్ చేసింది. మే నెలలో రష్యా 'విక్టరీ డే'ను పురస్కరించుకొని ప్రసారమయ్యే 'జిమ్నాస్ట్ ఎగ్జిబిషన్' కోసం ఆమె అక్కడికి వచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ''ప్రతీ కుటుంబానికి ఒక యుద్ధ కథ ఉంటుంది. దాన్ని మనం మర్చిపోకూడదు. మన తర్వాతి తరాలను దాన్ని చెప్పాలి'' అని అన్నారు.

యుక్రెయిన్‌పై దాడితో రష్యాపై వస్తోన్న విమర్శలు, అంతర్జాతీయ పోటీల్లో రష్యా జిమ్నాస్ట్‌లు, జడ్జిలు, కోచ్‌లపై విధించిన నిషేధం గురించి మాట్లాడారు. ''మనకు ఇందులో విజయమే దక్కుతుంది'' అని అన్నారు.

ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో... స్విట్జర్లాండ్ లేదా సైబీరియాలోని బంకర్‌లో అలీనా దాక్కున్నారనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడిందని డైలీ మెయిల్ పేర్కొంది.

ఈ కార్యక్రమంలో వందలాది చిన్నారులు పాల్గొన్నారు. ఇందులో 'జడ్' సింబల్‌ను ప్రదర్శించారు. ఈ గుర్తును యుక్రెయిన్‌పై దాడికి రష్యా మద్దతుగా వాడుతున్నారు.

వీడియో క్యాప్షన్, పుతిన్‌కు ఎంతమంది పిల్లలు, వాళ్లేం చేస్తుంటారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)