యుక్రెయిన్‌పై రష్యా దాడి: ఎనిమిదవ రోజు ఏం జరిగిందంటే..
గురువారం ఏం జరిగిందో క్లుప్తంగా చూద్దాం..
- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నేరుగా చర్చలు జరపడమే ‘‘ఈ యుద్ధం ఆగేందుకు ఉన్న ఏకైక మార్గం’’ అని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.
- బెలారుస్‌లో రష్యా, యుక్రెయిన్ ప్రతినిధులు రెండో విడత చర్చలు జరుపుతున్నారు.
- యుక్రెయిన్ నిస్సైనికీకరణ సాధించడమే తమ లక్ష్యమని.. అది సాధిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు.
- యుక్రెయిన్‌లోని దక్షిణ ప్రాంతంలో అత్యంత కీలకమైన రేవు నగరం ఖేర్సన్ రష్యా బలగాల ఆధీనంలోకి వెళ్లింది. తాజాగా ఈ నగరంలోని ప్రాంతీయ పరిపాలనా భవనం రష్యా బలగాల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు రష్యా ఆధీనంలోకి వెళ్లిన అతిపెద్ద నగరం ఇదే.
- యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందంటూ అందిన ఫిర్యాదులపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) విచారణ ప్రారంభించింది.
- మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది ‘అణు యుద్ధమే’ అవుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ వ్యాఖ్యానించారు. అయితే, దాని గురించి రష్యా ఆలోచించడంలేదని ఆయన అన్నారు.
- మరియుపోల్ సహా పలు నగరాలపై తీవ్రస్థాయిలో షెల్లింగ్ జరుగుతోంది. గాయపడిన వారిని కాపాడే అవకాశం కూడా లేనంతగా షెల్లింగ్ జరుగుతోందని మరియుపోల్ నగర మేయర్ తెలిపారు.
- చైనాలోని బీజింగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్లో బెలారుస్, రష్యా అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ పారాలింపిక్స్ కమిటీ ప్రకటించింది.
- యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానంలో ఓటింగుకు భారత్ దూరంగా ఉంది.
- కీయెవ్ దిశగా వెళుతున్న రష్యాకు చెందిన భారీ సాయుధ వాహనశ్రేణి తాత్కాలికంగా ఆగిందని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.
- యుక్రెయిన్ నుంచి 10 లక్షల మంది ప్రజలు పొరుగుదేశాలకు చేరుకున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
- యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో గురువారం వేకువజామున వరుస పేలుళ్లు జరిగాయి.
ఇవీ ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.

















