రష్యా ఆయిల్‌, గ్యాస్‌పై నిషేధం విధించిన అమెరికా, బ్రిటన్.. యుక్రెయిన్‌లో పుతిన్ ఎన్నటికీ విజయం సాధించలేరన్న బైడెన్

రష్యా చమురు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ నిర్ణయానికి అమెరికా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అయితే, ఇది స్వేచ్ఛను రక్షించేందుకు చెల్లిస్తున్న ధర అని అభివర్ణించారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్‌లో పుతిన్ ఎప్పటికీ విజయం సాధించలేరు – జో బైడెన్

    జో బైడెన్

    ఫొటో సోర్స్, Pool

    తమ మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే రష్యా చమురు దిగుమతులపై నిషేధం విధించాలనే నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

    వైట్‌హౌస్‌లో ఆయన మాట్లాడుతూ.. తాము తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గ్యాస్ ధరలు పెరుగుతాయని, అయితే, ఆయిల్ కంపెనీలు విపరీతంగా ధరలు పెంచొద్దని కోరారు.

    ఈ నిర్ణయానికి అమెరికా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అయితే, ఇది స్వేచ్ఛను రక్షించేందుకు చెల్లిస్తున్న ధర అని అభివర్ణించారు.

    ఏది ఏమైనా తన హంతక పథంలో ముందుకెళ్లాలని పుతిన్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని, కానీ.. యుక్రెయిన్‌లో పుతిన్‌కు ఎన్నటికీ విజయం దక్కదని బైడెన్ తెలిపారు.

  2. బ్రేకింగ్ న్యూస్, రష్యా ఆయిల్‌పై అమెరికా, బ్రిటన్ నిషేధం

    రష్యా చమురు

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా చమురు, సహజవాయువు, బొగ్గు దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

    ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా ప్రజలు కొట్టిన శక్తివంతమైన ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు.

    పుతిన్ యుద్ధానికి తాము సహకరించబోమని తెలిపారు.

    రష్యా చమురు దిగుమతులను నిషేధించడం ద్వారా అమెరికాలో గ్యాస్ ధరలు పెరుగుతాయనే భయాలు ఉన్నప్పటికీ.. ఈ చర్యకు మాత్రం దేశంలో అన్ని రాజకీయ పక్షాల నుంచి మద్దతు ఉంది.

    బిడెన్ ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరింది.

    దశల వారీగా రష్యా చమురు వదిలించుకుంటామన్న బ్రిటన్

    బ్రిటన్ ప్రభుత్వం 2022 చివరికల్లా రష్యా చమురు, చమురు ఉత్పత్తులను నిషేధించాలని నిర్ణయించింది.

    బ్రిటన్ చమురు, చమురు ఉత్పత్తుల వినియోగంలో రష్యా నుంచి 8 శాతం దిగుమతి చేసుకున్నవే.

    దేశంలోని మార్కెట్, వ్యాపార, పంపిణీ వర్గాలు రష్యా చమురుకు ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషించేందుకు ఈ గడువు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

    యురోపియన్ యూనియన్ సైతం రష్యా గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది చివరికల్లా మూడింట రెండొంతులు రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని నిర్ణయించింది.

  3. రష్యా సైనికులు 2,000 నుంచి 4,000 మంది వరకూ చనిపోయారు: అమెరికా అంచనా, గోర్డన్ కొరేరా, సెక్యూరిటీ కరెస్పాండెంట్, బీబీసీ న్యూస్

    యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచీ.. ఇప్పటివరకూ 2,000 నుంచి 4,000 మంది వరకూ రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని అమెరికా రక్షణ నిఘా సంస్థ అధిపతి స్కాట్ బారియర్ చెప్పారు.

    ఆయన అమెరికా కాంగ్రెస్ ముందు తమ అంచనా వివరాలు చెప్తూ.. ‘‘వారి (రష్యా) ప్రణాళిక బాగోలేదు’’ అని వ్యాఖ్యానించారు. నిఘా సమాచారం, బయటి వర్గాలు అందించిన వివరాల ఆధారంగా రష్యా సైనికుల మరణాల సంఖ్యను అంచనా వేసినట్లు చెప్పారు.

    ఇదిలావుంటే.. ఖార్కియెవ్ నగరం శివార్లలో జరుగుతున్న యుద్ధంలో సీనియర్ రష్యా సైనిక కమాండర్ ఒకరు చనిపోయినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి.

  4. ఆపరేషన్ గంగ: ఇప్పటివరకూ 18,000 మంది భారతీయులను తీసుకొచ్చామన్న ప్రభుత్వం

    ఆపరేషన్ గంగ

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ పొరుగు దేశాల నుంచి భారతీయులను తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కింద ఇప్పటివరకూ 18 వేల మంది భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా భారతదేశానికి తీసుకొచ్చారని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.

    ఆ కథనం ప్రకారం.. మంగళవారం నాడు యుక్రెయిన్ పొరుగున సుసియేవా నుంచి రెండు ప్రత్యేక విమానాల ద్వారా 410 మంది భారతీయులను తీసుకువచ్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఒక పత్రికా ప్రకటనలో చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మొత్తంగా ఫిబ్రవరి 22 నుంచి ఇప్పటివరకూ 18 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు.

    ఆపరేషన్ గంగ కింద.. 75 ప్రత్యేక పౌర విమానాల ద్వారా 15,521 మందిని తీసుకురాగా, భారత వాయుసేనకు చెందిన 12 విమానాల ద్వారా 32 టన్నుల సహాయ సరకులును తీసుకెళ్లి, 2,467 మందిని తీసుకువచ్చినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

    పౌర విమానాల్లో బుఖారెస్ట్ నుంచి 21 విమానాల ద్వారా 4,575 మందిని, సుసియేవా నుంచి 9 విమానాల ద్వారా 1,820 మందిని, బెడాపెస్ట్ నుంచి 28 విమానాల ద్వారా 5,571 మందిని, కోసైసి నుంచి 5 విమానాల్లో 909 మందిని, ర్జెస్జో నుంచి 11 విమానాల ద్వారా 2,404 మందిని, కీయెవ్ నుంచి ఒక విమానంలో 242 మందిని తీసుకువచ్చినట్లు వివరించారు.

  5. యుక్రెయిన్‌లో యుద్ధానికి సిరియా కిరాయి సైనికులను చేర్చుకుంటున్న రష్యా: అమెరికా

    రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు గత నెలలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను కలిశారు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు గత నెలలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను కలిశారు

    యుక్రెయిన్‌లో యుద్ధం చేయటానికి సిరియా కిరాయి సైనికులను చేర్చుకోవటానికి రష్యా ప్రయత్నిస్తోందని అమెరికా రక్షణ విభాగంలోని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

    ‘‘యుక్రెయిన్‌ లోపల యుద్ధం చేయటానికి విదేశీ సైనికుల మీద ఆధారపడాల్సిన అవసరముందని (రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్) భావిస్తున్నట్లు మాకు తెలిసింది’’ అని సదరు అధికారి విలేకరులతో చెప్పారు.

    సిరియాలో ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు మద్దతుగా రష్యా 2015లో సైనిక చర్య చేపట్టింది. అది సిరియా అంతర్యుద్ధం ప్రభుత్వానికి అనుకూలంగా మారటంలో కీలక పాత్ర పోషించింది.

    రష్యా సైన్యం ఇటీవల సిరియా నుంచి కిరాయి సైనికులనుచేర్చుకుంటోందని అమెరికా అధికారులు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం ఒకకథనంలో తెలిపింది. ‘‘పట్టణ ప్రాంత యుద్ధంలో వారి నైపుణ్యం కీయెవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకోవటానికి సాయపడుతుందని రష్యా సైన్యం ఆశిస్తోంద’’ని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు వివరించింది.

    సిరియాలో ప్రభుత్వ నియంత్రణలోని ప్రాంతాల ప్రజలకు.. ఆరు నెలల పాటు ‘‘యుక్రెయిన్ వెళ్లి గార్డులుగా పనిచేస్తే’’ 200 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకూ చెల్లిస్తామని రష్యా ఆఫర్ ఇస్తున్నట్లు సిరియా ఉద్యమకారులు నడిపే డెయిర్ ఎజ్జార్ 24 న్యూస్ నెట్‌వర్క్ గత నెలలో ఒక కథనంలో తెలిపింది.

    ఇప్పటికే ఎంత మంది సిరియన్లను రష్యా రిక్రూట్ చేసుకుందనే అంచనా తాము చెప్పలేమని అమెరికా రక్షణ విభాగానికి చెందిన సీనియర్ అధికారి పేర్కొన్నారు.

  6. రష్యా నుంచి చమురు దిగుమతులపై నిషేధం ప్రకటించనున్న బైడెన్

    రష్యా నుంచి అమెరికా చేసుకునే చమురు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ రోజు ప్రకటించే అవకాశముంది.

    యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రకు ప్రతిస్పందనగా.. అమెరికా విధించబోయే తాజా ఆంక్షల్లో భాగంగా ఈ నిషేధాన్ని ప్రకటించబోతున్నట్లు చెప్తున్నారు.

    ‘‘యుక్రెయిన్ మీద నిష్కారణంగా, అన్యాయంగా చేస్తున్న యుద్ధానికి రష్యాను బాధ్యురాలిని చేస్తూ’’ జో బైడెన్వాషింగ్టన్ డీసీ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:45 గంటలకు మరిన్ని చర్యలను ప్రకటిస్తారని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది.

    రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించాలంటూ బైడెన్ ప్రభుత్వం మీద అమెరికా చట్టసభ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది.

  7. యుక్రెయిన్ సంక్షోభంలో తాజా ముఖ్యాంశాలివీ...

    సుమీ నగరంలో రష్యా బలగాల దాడుల్లో కూలిన శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్న సహాయ సిబ్బంది

    ఫొటో సోర్స్, Ukraine Ministry of Internal Affairs/Handout via REUTERS

    ఫొటో క్యాప్షన్, సుమీ నగరంలో రష్యా బలగాల దాడుల్లో కూలిన శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్న సహాయ సిబ్బంది

    యుక్రెయిన్ మీద రష్యా సైనిక దాడి మొదలుపెట్టి మంగళవారానికి 13 రోజులైంది. ఈ సంక్షోభానికి సంబంధించి మంగళవారం నాటి ముఖ్యాంశాలివీ:

    • యుక్రెయిన్ నుంచి ఇప్పటి వరకూ 20 లక్షల మంది శరణార్థులుగా పొరుగు దేశాలకు తరలిపోయారని ఐక్యరాజ్య సమితి చెప్తోంది.
    • రాజధాని కీయెవ్ సమీపంలోని ఇర్పిన్ నుంచి, ఈశాన్య నగరం సుమీ నుంచి జనం సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వీరిని తరలించే మార్గాలకు సంబంధించి ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదిరింది.
    • అయితే.. దక్షిణాది నగరం మరియుపూల్ నుంచి ప్రజలను తరలించే మార్గం మీద రష్యా షెల్లింగ్ జరుపుతోందని యుక్రెయిన్ అధికారులు అంటున్నారు.
    • పశ్చిమ దేశాల ఆంక్షలకు ప్రతిస్పందనగా యూరప్‌ గ్యాస్ సరఫరాలను కత్తిరించివేస్తామని రష్యా హెచ్చరించింది.
    • రష్యా నుంచి గత వారం ముడి చమురు కొనుగోలు చేసినందుకు ఆయిల్ దిగ్గజం షెల్ క్షమాపణ చెప్పింది. రష్యా నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తామని హామీ ఇచ్చింది.
    • యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ బ్రిటన్ పార్లమెంటులో ఆ దేశ ఎంపీలను ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా ప్రసంగించనున్నారు.
    • యుక్రెయిన్ గగనతలంలో ‘నో-ఫ్లై జోన్’ ప్రకటించే అవకాశం లేదని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ కొట్టేశారు. అయితే యుక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను, ఆయుధేతర సామాగ్రిని బ్రిటన్ సాయంగా అందిస్తుందని చెప్పారు.
  8. రష్యా, యుక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలకు చైనా అధ్యక్షుడి పిలుపు

    మాక్రాన్, ఒలాఫ్‌లతో జిన్‌పింగ్ వీడియో సమావేశం

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ అభివర్ణించారు. ‘అత్యధిక సంయమనం’ పాటించాలని పిలుపునిచ్చారు.

    ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ ష్కోల్జ్‌లతో వర్చువల్ సమావేశం సందర్భంగా జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చైనా ప్రభుత్వ టీవీ చానల్ సీసీటీవీ చెప్పింది.

    యుక్రెయిన్‌లో పరిస్థితి అదుపు తప్పిపోకుండా నిరోధించటానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. రష్యా, యుక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలకు తమ మూడు దేశాలూ ఉమ్మడిగా మద్దతివ్వాలని చెప్పారు.

    చైనా, రష్యాల మధ్య ప్రస్తుతం సన్నిహిత దౌత్య సంబంధాలున్నాయి. యుక్రెయిన్ మీద రష్యా సైనిక చర్యను చైనా ఖండించటం కానీ, ఆమోదించటం కానీ చేయలేదు. అయితే.. రష్యా దండయాత్రను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానంపై ఓటింగ్‌లో చైనా పాల్గొనలేదు.

  9. యుక్రెయిన్ శరణార్థులు ఎక్కడికి వెళుతున్నారు?

    యుక్రెయిన్ శరణార్థులు

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ విడిచి వెళుతున్న శరణార్థులు.. పశ్చిమ సరిహద్దులోని పోలండ్, రొమేనియా, స్లొవేకియా, హంగరీ, మాల్దోవా వంటి దేశాలకు చేరుకుంటున్నారు.

    కొద్ది మంది శరణార్థులు రష్యా, బెలారుస్ దేశాలకు కూడా వెళ్లారు.

    ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఇప్పటివరకూ..

    పోలండ్‌ 12,04,000 మందికి పైగా శరణార్థులను ఆహ్వానించింది.

    హంగరీ 1,91,000

    స్లొవేకియా 1,41,000

    మాల్దోవా 83,000

    రొమేనియా 82,000

    రష్యా 99,300

    బెలారుస్ 453

    మంది చొప్పున వెళ్లారు.

    ఈ దేశాల నుంచి 1,83,000 మంది శరణార్థులు ఇతర యూరప్ దేశాలకు తరలిపోయినట్లు ఐక్యరాజ్యసమితి చెప్తోంది.

  10. యుక్రెయిన్ యుద్ధం: ‘నా పులుల్ని వదిలేసి భారత్‌కు రాలేను’ అంటున్న తెలుగు డాక్టర్

    వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ యుద్ధం: ‘నా పులుల్ని వదిలేసి భారత్‌కు రాలేను’ అంటున్న తెలుగు డాక్టర్
  11. యుక్రెయిన్ నుంచి ఇప్పటికే 20 లక్షల మంది వెళ్లిపోయారు: ఐరాస

    యుక్రెయిన్‌లో యుద్ధం నుంచి పారిపోతున్న శరణార్థుల సంఖ్య 20 లక్షలు దాటిందని ఐక్యరాజ్యసమితి బీబీసీకి తెలిపింది.

    యుక్రెయిన్ ప్రజల మూకుమ్మడి వలస.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థి సంక్షోభమని యూఎన్ హైకమిషనర్ ఫర్ రెఫ్యుజీస్ ఫిలిప్పో గ్రాండీ ఇంతకుముందు అభివర్ణించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. యుక్రెయిన్ అధ్యక్షుడి భార్య ఒలేనా జెలెన్‌స్కా: తెర వెనుక ఉండి భర్తని నడిపిస్తున్న ప్రథమ మహిళ

    యుక్రెయిన్ అధ్యక్షుడి భార్య ఒలేనా జెలెన్‌స్కా

    ఫొటో సోర్స్, FACEBOOK/OLENAZELENSKA.OFFICIAL

    యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తొలిరోజుల్లో, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీకి దేశం విడిచిపెట్టి వెళ్లే ప్రతిపాదన వచ్చింది. దానికి ఆయన సూటిగా జవాబిస్తూ "నాకు ఆయుధాలు కావాలి, రవాణా కాదు" అని ఒక వీడియోలో అన్నారు.

    జెలియెన్‌స్కీ భార్య ఒలేనా జెలెన్‌స్కా, వారి పిల్లలు సాషా, సిరిల్ కూడా స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

    రష్యా, తన తరువాత తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని జెలియెన్‌స్కీ చెప్పడంతో, ఇప్పుడు అందరి చూపులు ఒలేనా వైపు మళ్లాయి.

    అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఆమె ఆచూకీని గోప్యంగా ఉంచారు. కాగా, ఒలేనా సోషల్ మీడియా ద్వారా దేశంలోని పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు.

  13. రష్యా హెచ్చరిక: ‘మా చమురుపై ఆంక్షలు విధిస్తే క్రూడాయిల్ ధర రెట్టింపు అవుతుంది’

    రష్యా చమురు, పుతిన్

    ఫొటో సోర్స్, REUTERS/Getty Images

    యుక్రెయిన్ మీద దాడితో పశ్చిమ దేశాలు రష్యా మీద అనేక ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించాయి. అయితే, అతి కీలకమైన గ్యాస్, ఆయిల్ ఇండస్ట్రీల జోలికి మాత్రం పోలేదు. రష్యా ఆర్ధిక వ్యవస్థలు, బ్యాంకింగ్ రంగం, కరెన్సీ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి.

    తన ఆయిల్ ఎగుమతులు పూర్తిగా నిలిపేస్తే క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 300 డాలర్ల (సుమారు రూ.23వేలు)కు చేరుకుంటుంది రష్యా హెచ్చరించింది. అదే సమయంలో యూరప్ దేశాలు గ్యాస్, బొగ్గు, ఆయిల్‌ల దిగుమతి కోసం వేరే మార్గాలను అన్వేషిస్తున్నాయి.

    ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌కు సరఫరా అయ్యే గ్యాస్, బొగ్గులలో సుమారు మూడింట ఒక వంతు రష్యా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ విషయంలో రష్యా మీద ఆధారపడకుండా ఉండటం ఎలా అన్న అంశంపై యూరోపియన్ యూనియన్ నేతలు గురు, శుక్రవారాల్లో సమావేశం కాబోతున్నారు.

  14. సుమీలో చిక్కుకున్న 697 మంది భారతీయ విద్యార్థుల తరలింపు.. బస్సుల్లో పోల్టావాకు పయనం

    సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు

    ఫొటో సోర్స్, Mohammed Mahtab Raza

    యుక్రెయిన్ ఈశాన్య నగరాలైన సుమీ, ఇర్పిన్‌ల నుంచి ప్రజల తరలింపు ప్రారంభమైంది.

    సుమీ నగరంలో చిక్కుకుపోయిన 694 మంది భారతీయ విద్యార్థులను అక్కడికి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోల్టావాకు బస్సుల్లో తరలిస్తున్నామని కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ చెప్పారు.

    వీరిని తరలించేందుకు సహకరించాలని రష్యా, యుక్రెయిన్ దేశాధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో కోరారు.

    రష్యా, యుక్రెయిన్ దేశాలు పరస్పర అంగీకారంతో ఈ ప్రాంతంలో మానవతా కారిడార్ ఏర్పాటైంది.

    ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    రష్యా సైన్యం సుమీ నగరాన్ని చుట్టుముట్టింది. అక్కడ సోమవారం జరిగిన కాల్పులు, బాంబు దాడుల్లో కనీసం 9 మంది చనిపోయారు.

    వీడియో క్యాప్షన్, ‘బాంబులు పడుతున్నా మేము వెళ్లిపోతున్నాం. మాకు ఏమైనా ప్రభుత్వానిదే బాధ్యత’
  15. రష్యా మిలిటరీ నాయకుడు మరణం - యుక్రెయిన్

    ఖార్కియెవ్ దగ్గర జరిగిన పోరాటంలో రష్యా సైన్యానికి చెందిన అత్యున్నత స్థాయి కమాండర్ విటలీ గెరాసిమోవ్ మరణించినట్లు యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ సర్వీస్ తెలిపింది.

    విటలీ గెరాసిమోవ్ రష్యా సెంట్రల్ మిలిటరీ డిస్ట్రిక్ట్ 41 ఆర్మీలో మేజర్ జనరల్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఫస్ట్ డిప్యూటీ కమాండర్ అని రక్షణ శాఖ ప్రకటన చెబుతోంది.

    ఈ వార్తను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. ఈ అంశం గురించి రష్యన్ అధికారులు స్పందించలేదు.

    ఈ దాడుల్లో చాలా మంది సీనియర్ రష్యన్ సైనికాధికారులు గాయాలు పాలయ్యారు. కొంత మంది మరణించారని ప్రకటన పేర్కొంది.

    రెండవ చెచెన్ యుద్ధంలోనూ, సిరియాలో రష్యా నిర్వహించిన సైనిక కార్యకలాపాల్లోనూ గెరాసిమోవ్ పాల్గొన్నట్లు యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ చెబుతోంది. క్రైమియాను తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు ఆయనకు మెడల్ కూడా లభించింది.

    గెరాసిమోవ్ అని చెబుతున్న ఒక వ్యక్తి ఫోటోను యుక్రెయిన్ అధికారులు ట్వీట్ చేశారు.

    గెరాసిమోవ్ మరణం పట్ల బీబీసీ డిప్లొమేటిక్ ప్రతినిధి పాల్ ఆడమ్స్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

    ఈ అనవసర యుద్ధం వల్ల లభించే ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఇది రష్యా మిలిటరీకి తేరుకోలేని విపత్తు. ఈ యుద్ధం వల్ల తలెత్తే ఫలితాలు విధ్వంసకరంగా ఉంటాయి. విజయం స్వరూపం చూడటం కష్టంగా మారుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. నేను దాక్కోలేదు.. నేను భయపడటం లేదు: జెలియెన్‌స్కీ

    వొలదిమీర్ జెలియెన్‌స్కీ

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ సోమవారం రాత్రి పొద్దుపోయాక తన రోజు వారీ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈసారి ఆ వీడియో కీయెవ్‌లోని అధ్యక్ష కార్యాలయం నుంచి వచ్చింది.

    ‘‘నేను దాక్కోవటం లేదు. నేను భయపడటం లేదు’’ అని జెలియెన్‌స్కీ ఆ వీడియోలో చెప్పారు.

    తాను రాజధాని నగరంలోనే ఉంటానని పౌరులను ఉద్దేశించి పేర్కొన్నారు.

    యుక్రెయిన్ అధ్యక్షుడు తను ఉన్న కచ్చితమైన ప్రాంతాన్ని ఇంత బహిరంగంగా వెల్లడించటం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఎద్దేవా చేయటమేనని పరిశీలకులు భావిస్తున్నారు.

    రష్యా సైనిక దాడి నుంచి కీయెవ్ నగరాన్ని యుక్రెయిన్ బలగాలు బలంగా సంరక్షిస్తున్నాయి.

  17. తెరుచుకున్న మానవతా కారిడార్లు.. సుమీ నుంచి జనం తరలింపు షురూ

    యుక్రెయిన్ శరణార్థులు

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్‌ రాజధాని కీయెవ్‌తో పాటు చెర్నిహియెవ్, సుమీ, ఖార్కియెవ్, మరియుపూల్ నగరాల నుంచి సాధారణ జనాన్ని తరలించటానికి మానవతా కారిడార్లను తెరిచినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది.

    ఈ కారిడార్లను తెరవటానికి ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు.. పౌరుల మీద కాల్పులు జరగటంతో విఫలమయ్యాయి.

    యుక్రెయిన్‌లో తమ బలగాలుఉదయం 9 గంటల నుంచి కాల్పులు నిలిపివేశాయని రష్యా రక్షణ శాఖ చెప్పినట్లు ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది.

    యుక్రెయిన్ ఈశాన్యంలోని సుమీ నగరం నుంచి పౌరుల తరలింపు ప్రారంభమైనట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    రష్యా దళాలు పాక్షికంగా చుట్టుముట్టిన ఈ నగరంలో సోమవారం నాడు భారీ షెల్లింగ్ వల్ల తొమ్మిది మంది చనిపోయినట్లు చెప్తున్నారు.

    పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కాల్పుల విరమణ పాటించేలా రష్యా, యుక్రెయిన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.

    పౌరులను సుమీ నుంచి దక్షిణంగా 175 కిలోమీటర్ల దూరంలోని పోల్టోవా నగరానికి తరలిస్తారు.

    ఇండియా, చైనా, ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులను కూడా సురక్షితంగా తరలించే ప్రణాళికలు ఉన్నాయని యుక్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఇరీనా వెరెష్చుక్ చెప్పారు.

  18. యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రలో ఏం జరుగుతోందంటే...

    రష్యా దండయాత్ర

    ఫొటో సోర్స్, State Emergency Services of Ukraine via REUTERS

    యుక్రెయిన్ మీద రష్యా సైనిక దాడులు 13వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం నాడు తాజా పరిణామాలివీ:

    • యుక్రెయిన్‌లోని నగరాల మీద రష్యా బలగాలు భారీ ఎత్తున షెల్లింగ్ జరుపుతున్నాయి. దీంతో పౌరులు నగరాలు విడిచి పారిపోలేకపోవటానికీ వీలు దొరకటం లేదు.
    • ఘర్షణ జరుగుతున్న ప్రాంతాల నుంచి తరలిపోవాలని భావిస్తున్న వారు క్షేమంగా వెళ్లటానికి వీలు కల్పించాలని ఐక్యరాజ్యసమితి మానవతా సాయం విభాగాధిపతి మార్టిన్ గ్రిఫిత్స్ ఇరు పక్షాలకూ విజ్ఞప్తి చేశారు.
    • యుక్రెయిన్‌లో రష్యా బలగాలు భారీ ప్రాణనష్టాన్ని చవిచూస్తున్నాయని, దీంతో రష్యా మరింతగా బరితెగిస్తోందని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలేస్ వ్యాఖ్యానించారు.
    • రష్యా చమురు దిగుమతుల మీద పశ్చిమ దేశాలు నిషేధం విధించినట్లయితే.. తమ దేశం నుంచి జర్మనీకి వెళ్లే ప్రధథాన గ్యాస్ పైప్‌లైన్‌ను తాము మూసివేయగలమని రష్యా హెచ్చరించింది.
    • యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ వీడియో లింక్ ద్వారా బ్రిటన్ పార్లమెంటులో ఆ దేశ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది చరిత్రాత్మక ఘట్టమవుతుంది.
  19. పెరుగుతున్న పౌరుల మరణాలు

    రష్యా దాడులు కొనసాగుతుండటంతో పెరుగుతున్న పౌరుల మరణాలు

    ఫొటో సోర్స్, Ukraine State Emergency Services (SES

    యుక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతుండటంతో సాధారణ పౌరుల మరణాలు పెరుగుతున్నాయని యుక్రెయిన్ ఎమెర్జెన్సీ సర్వీస్ (ఎస్ఈఎస్) పేర్కొంది.

    కీయెవ్‌కు పశ్చిమంగా ఉన్న జైటోమిర్‌తో పాటు, చెర్నయాఖివ్‌లోని ఒక చమురు డిపోలో తలెత్తిన మంటలను మంగళవారం ఉదయం ఆర్పారు.

    సుమీలో జరిగిన వైమానిక దాడుల్లో నివాస గృహాలు దెబ్బ తిన్నాయి. ఈ దాడుల్లో ఒక అపార్ట్మెంట్ భవనం మంటల్లో చిక్కుకుంది.

    ఒక మహిళకు గాయాలు కాగా 9 మంది మరణించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులూ ఉన్నారు.

    మికోలాయివ్ నగరంలో నివాస సముదాయాల్లో కూడా పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

    ఈ పేలుళ్లలో నలుగురు పౌరులు మరణించగా, శిథిలాలలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

    ఖార్కియెవ్‌లో రష్యా చేసిన బాంబు దాడుల్లో ఒక నివాస సముదాయంలో 27 అపార్టుమెంట్లు, 9 అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి.

    ఈ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. ఈ మంటల్లో చిక్కుకుని కనీసం నలుగురు మరణించారు.

  20. స్కాట్లాండ్, యుక్రెయిన్ మధ్య ఫుట్ బాల్ వరల్డ్ కప్ సెమీఫైనల్ వాయిదా

    ఫుట్ బాల్

    ఫొటో సోర్స్, Getty Images

    గ్లాస్గోలో మార్చి 24నస్కాట్లాండ్, యుక్రెయిన్ మధ్య జరగాల్సిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. ఇది మళ్లీ జూన్‌లో ఉండొచ్చని భావిస్తున్నారు.

    ఈ మేరకు గత వారం యుక్రెయిన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చేసిన అభ్యర్ధనను ఫిఫా అంగీకరించింది.

    నవంబరులో ఖతార్‌లో జరగనున్న ఫైనల్స్‌లో హ్యాంప్డెన్ పార్క్‌లో గెలుపొందిన జట్టు ఆస్ట్రియా లేదా వేల్స్ జట్టుతో తలపడుతుంది.

    యుక్రెయిన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం దృష్ట్యా దేశంలో జరగాల్సిన ఫుట్ బాల్ క్రీడలను కూడా నిలిపేశారు.

    అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడల నుంచి రష్యాను సస్పెండ్ చేయడంతో, రష్యా పోలండ్‌తో తలపడలేదు.