యుక్రెయిన్, రష్యా యుద్ధం: ఆఫ్రికాలో ఫైటర్లకు పుతిన్ శిక్షణనిచ్చారా?

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, పీటర్ మవాయి
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దక్షిణ ఆఫ్రికాలో లిబరేషన్ మూవ్‌మెంట్‌ ఫైటర్లకు శిక్షణ ఇస్తున్నట్లుగా చెబుతున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో విరివిగా షేర్ అవుతోంది.

యుక్రెయిన్ యుద్ధంలో ఆఫ్రికన్ దేశాలు రష్యాకు మద్దతివ్వాలనే వాదనను సమర్ధించేందుకు కొంతమంది ఈ ఫోటోను వాడుకుంటున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ఫోటోను యుగాండా అధ్యక్షుడి కుమారుడు యోవేరి ముసెవెని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

కానీ, ఆ ఫొటోలో పుతిన్ ఆఫ్రికాలో ఉన్నారా లేదోనన్న విషయం తెలియడం లేదు. ఆ ఫోటో తీసినట్లు చెబుతున్న సమయం కూడా తప్పుగానే చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ టీనేజర్లు

'పుతిన్ టాంజానియాలో లేరు'

2018 చివర్లో ఈ ఫోటో జింబాబ్వేకు చెందిన బ్లాగ్స్‌లో ప్రచురితమైన తర్వాత ఆన్‌లైన్‌లో విరివిగా షేర్ అయింది.

1973లో దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర ఉద్యమాల కోసం జరిగిన టాంజానియా సైనిక శిక్షణ శిబిరాల్లో పుతిన్ ఉన్నట్లు ఈ పోస్టులు చెబుతున్నాయి.

మొజాంబిక్ మాజీ అధ్యక్షుడు సమోరా మేచెల్, ప్రస్తుత జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మెర్సన్ మనాంగాగ్వా కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

స్వాతంత్య్ర యోధులకు శిక్షణ ఇస్తూ 1973-1977 వరకు పుతిన్ టాంజానియాలో ఉన్నట్లు ఈ బ్లాగ్స్ చెబుతున్నాయి.

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్లాదిమిర్ పుతిన్

అయితే, 1952లో జన్మించిన పుతిన్ 1970లలో ఆఫ్రికాలో ఉన్నట్లు ఆఫ్రికాలో కానీ, రష్యాలో కానీ అధికారిక రికార్డులు లేవు.

ఆ సమయంలో పుతిన్ లెనిన్‌గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు క్రెమ్లిన్ వెబ్‌సైటు సూచిస్తోంది. ఆయన 1975లో పట్టభద్రులయ్యారు.

"ఈ వాదన అర్థరహితంగా ఉంది" అని కొన్ని దశాబ్దాల పాటు మొజాంబిక్‌లో నివసించిన విలేఖరి పాల్ ఫావెట్ చెప్పారు.

టాంజానియా సైనిక శిబిరాల్లో మొజాంబిక్ స్వాతంత్య్ర యోధులకు చైనా ఇన్స్ట్రక్టర్లు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.

అప్పటి దక్షిణ రొడేషియాలో అధికారంలో ఉన్న మైనారిటీ శ్వేత ప్రభుత్వం 1965లో మనాంగాగ్వాను అరెస్ట్ చేసి 10ఏళ్ల పాటు జైలులో ఉంచింది.

దీంతో, ఆ సమయంలో ఆయన టాంజానియాలో ఉండే అవకాశమే లేదు.

సమోరా మేచెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సమోరా మేచెల్

1980ల మధ్యలో మొజాంబిక్ రాజధాని మపుటో దగ్గర్లో ఉన్న ఒక సైనిక కేంద్రంలో పర్యటనకు విచ్చేసిన సోవియెట్ మిలిటరీ సలహాదారులతో మొజాంబిక్ మాజీ అధ్యక్షుడు సమోరా మేచెల్ ఉన్నట్లుగా ఉన్న ఒక ఫోటోను జింబాబ్వే రచయిత రెనాటో మాటుసే 2018లో రాసిన పుస్తకంలో ప్రచురించారు.

అయితే, ఆ ఫొటోలో ఉన్నది కచ్చితంగా పుతిన్ కాదని ఆయన అన్నారు.

పుతిన్ 1985-1990 మధ్యలో తూర్పు జర్మనీలో కేజీబీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. అప్పట్లో ఆయన కింది స్థాయి ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. దీంతో, ఆయన ఒక అత్యున్నత స్థాయి బృందానికి నేతృత్వం వహించే అవకాశం లేదు.

పుతిన్ జీవిత చరిత్రలో కాని, మరో చోట కానీ ఆయన మొజాంబిక్‌కు వెళ్లినట్లు ప్రస్తావన ఎక్కడా లేదు.

ఆ ఫొటోలో కనిపిస్తున్నది దక్షిణాఫ్రికాలో పని చేసిన మరొక సోవియెట్ వ్యక్తి అని చరిత్రకారుడు, విలేఖరి హోసే మిల్‌హాజెస్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ అనాథ పిల్లలు: ‘మమ్మల్ని కాపాడండి ప్లీజ్’’

"వారిద్దరూ ఒకేలా ఉండటం కేవలం యాదృచ్చికం" అని అన్నారు.

"ఆ ఫొటోలో ఉన్నది పుతిన్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది" అని న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జార్జీ డెర్ లూగియన్ అన్నారు.

ఫొటోలో ఉన్న వ్యక్తి ధరించిన బూట్లను చూస్తే ఆయన మిలిటరీ వ్యక్తిలా అనిపిస్తున్నారని, కానీ పుతిన్ ఇంటెలిజెన్స్ అధికారిగా పని చేశారని చెప్పారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వయసు పెరిగినప్పటి పుతిన్‌‌ను పోలి ఉన్నారని అన్నారు.

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎడమ చేతికి వాచీ ధరించారు. కానీ, సాధారణంగా పుతిన్ వాచీని కుడి చేతికి ధరించి కనిపిస్తూ ఉంటారు.

Reality Check branding

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)