సిసిలీ సాగర తీరంలో బయటపడ్డ శిథిలనౌకల కంచు ముక్కులు చెప్తున్న ప్రాచీన చరిత్ర ఏమిటి?

ఫొటో సోర్స్, Soprintendenza del Mare
చరిత్రను మార్చటంలో దంతవైద్యుల పాత్ర ఉన్నట్లు మనకు ఎక్కడా కనిపించదు. కానీ యూరప్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన యుద్ధాల్లో ఒకటైన ఏగేటస్ యుద్ధం చరిత్రను తిరగరాయటంలో సిసిలీలోని ఒక దంతవైద్యుడు చిన్న పాత్ర పోషించారు.
పురావస్తు శాస్త్రవేత్త సెబాస్టియానో టూసా 2000 దశకం చివర్లో ట్రపని పట్టణంలోని ఓ దంతశస్త్రకారుడి నివాసానికి వెళ్లారు. ఆ ఇంట్లో ఓ రోమ్ నౌకకు చెందిన కంచు ముక్కు అందంగా అలంకారంగా పెట్టి ఉండటం కనిపించింది. అది ఎక్కడిదని అడిగితే.. ఓ మత్స్యకారుడు దంతాలకు చికిత్స చేయించుకుని ఫీజు కింద ఈ పురాతన నౌక ముక్కును చెల్లించాడని సదరు డెంటిస్ట్ చెప్పారు.
ఆ డెంటిస్టుకు ఈ నౌక ముక్కు ప్రాధాన్యత తెలిసి ఉండకపోవచ్చు. కానీ విఖ్యాత ఏగేటస్ యుద్ధానికి, ఈ ప్రాచీన నౌక ముక్కుకు సంబంధం ఉండవచ్చునని టుసాకు వెంటనే అనుమానం వచ్చింది.
రోమన్ రిపబ్లిక్, కార్తాజినియన్లకు మధ్య క్రీస్తు పూర్వం 241లో జరిగిన యుద్ధం అది. నిజానికి చరిత్రకారులకు తెలిసి ఆ శకంలో ట్రపని పరిసరాల్లోని సిసిలీ జలాల్లో జరిగిన ఏకైక యుద్ధం అదొక్కటే.

ఫొటో సోర్స్, Derk Remmers/Soprintendenze del Mare
మధ్యధరా ప్రాంతం మీద రోమ్ ఆధిపత్యం ఆ యుద్ధంతోనే మొదలైంది. ఆ ఆధిపత్యం దాదాపు 700 సంవత్సరాలు కొనసాగింది.
చరిత్రకారులు ఆ యుద్ధం గురించి అర్థం చేసుకోవటానికి ప్రాచీన చారిత్రక కథనాల మీద మాత్రమే ఆధారపడే వారు. భౌతిక ఆధారాలు అదృశ్యమైపోయి ఉంటాయని భావించిన పురావస్తు పరిశోధకులు అలాంటి అవశేషాల కోసం తగినంత శ్రమించి శోధించలేదు.
అయితే ఈ డెంటిస్ట్ ఇంట్లో అనుకోకుండా కనిపించిన ఓ ప్రాచీన నౌక ముక్కు, ఆ పరిసరాల్లో సాగర గర్భంలో లభించిన నిధినిక్షేపాల గురించి డైవర్లు కథలుకథలుగా చెప్పే విషయాలు.. అక్కడ చారిత్రక ఆధారాలు లభించవచ్చునని సూచించాయి. దీంతో టుసా, ఆయన సహచరులు సిసిలీ చుట్టూ సముద్రంలో పురావస్తు అన్వేషణ ప్రారంభించారు.
ఆ అన్వేషణ భారీ విజయం సాధించింది. డజన్ల కొద్దీ నౌకల శిథిలాలను వీరు వెలికితీశారు. ఆ శిథిలాలు ఆనాటి యుద్ధాన్ని సవివరంగా కళ్లకుకడుతున్నాయి.
ప్రాచీన కాలపు మరే ఇతర నౌకా యుద్ధం చరిత్రా ఇంత వివరంగా లేదు'' అంటారు పురావస్తు పరిశోధకుడు ఫెర్డినాండో మౌరీచి. సిసిలీ దీవి చుట్టూ సముద్రాల్లో ప్రాచీన సాంస్కృతిక కళాఖండాలను అన్వేషించి వెలికితీసి పరిరక్షించే డిపార్ట్‌మెంట్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఐడెంటిటీలో సోప్రింటెన్‌డెన్జా డెల్ మారి విభాగానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రోమ్ ఉథ్థానం...
మొదటి ప్యూనిక్ యుద్ధం క్రీస్తు పూర్వం 264లో మొదలైంది. దానికి ముందు కొన్ని దశాబ్దాల్లో రోమన్ రిపబ్లిక్ దూకుడుగా విస్తరిస్తూ దాదాపు ఇటలీ ద్వీపకల్పమంతా వ్యాపించింది. అయితే మిగతా మధ్యధరా ప్రాంతమంతా పెద్ద భూభాగం కార్తేజ్ నియంత్రణలో ఉంది.
ఆధునిక ట్యునీసియాలో ఒక నగర రాజ్యంగా మొదలైన కార్తేజ్ ఉత్తర ఆఫ్రికా, దక్షిణ స్పెయిన్, సార్డీనియా తీర ప్రాంతాల్లో వలస రాజ్యాలను నెలకొల్పింది. ఈ మార్గమంతటా చుట్టుపక్కల భూభాగాలతో అనేక వాణిజ్య వ్యవస్థలను తయారు చేసింది.
''ఆ ఆర్థిక ప్రయోజనాల కోసం కార్తేజ్ మరిన్ని కాలనీలను జయిస్తూ పోయింది'' అని చరిత్రకారిని ఫ్రాన్సెస్కా ఒలివెరి పేర్కొన్నారు. సోప్రింటెన్‌డెన్జా డెల్ మారి ఆర్కియాలజిస్టుల్లో ఆమె ఒకరు.
''రోమ్, కార్తేజ్ ప్రభుత్వాలు రెండూ మధ్యధరా ప్రాంతం మీద ఆధిపత్యం కోసం తలపడిన ప్రత్యర్థులు. ఈ 'సూపర్‌పవర్' దేశాలకు అవసరమైన వనరులు, పదార్థాలు మధ్యధరా బేసిన్‌లో పుష్కలంగా ఉండేవి'' అని ఆమె వివరించారు.
క్రీస్తు పూర్వం 264 నాటికి ఆ వైరానికి సిసిలీ కేంద్ర బిందువుగా మారింది. ఈ దీవిలోని పశ్చిమ ప్రాంతం అప్పటికే శతాబ్దాలుగా కార్తేజ్ నియంత్రణలో ఉండేది. తూర్పు ప్రాంతం గ్రీకు సమాజాల ఆక్రమణలో ఉండేది.

ఫొటో సోర్స్, Salvo Emma/Soprintendenza del Mare
మెస్సానా (ఆధునిక మెస్సీనా నగరం) నగరం మామెర్టైన్లు అనే కిరాయి సైనికుల బృందం ఆధీనంలో ఉండేది. వీరికి గ్రీకులతో వివాదం తలెత్తటంతో వీరు కార్తేజ్, రోమ్ రాజ్యాలను సాయం కోరారు. ఆ రెండూ అంగీకరించాయి. దీంతో ఈ ప్రాంతంలో సున్నితమైన బలాల సంతులనం దెబ్బతిన్నది. అది 23 ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి దారితీసింది.
''రోమ్‌కు బలమైన సైనిక శక్తి ఉండేది. వారు ప్రధానంగా భూతల పోరాటం చేసేవారు. వారి సామ్రాజ్య విస్తరణ తొలినాళ్లలో బలమైన నౌకాదళం అవసరమని, నౌకాయుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని వారికి అనిపించలేదు'' అని ఫ్రాన్సెస్కా వివరించారు.
కానీ కార్తేజ్‌కు భారీ వాణిజ్య నౌకల శ్రేణులు ఉండేవి. వాటిని వేగంగా సైనిక అవసరాలకు మళ్లించగలిగేవారు.
ఇరుపక్షాల వారికీ.. నౌకల ముందు భాగాన కంచు ముక్కులు ప్రధాన నౌకాదళ ఆయుధాలుగా ఉండేవి. వందల కిలోల బరువుండే ఆ నౌక ముక్కులతో ప్రత్యర్థి నౌకలను ఢీకొట్టేవారు. అప్పుడు శత్రువు నౌక తుత్తినియలవుతుంది. శత్రువు నౌకను ముంచివేసే లక్ష్యంతో ఇలాంటి దాడులు చేస్తారు. శత్రువు నౌక తెడ్లను స్తంభింపజేయటానికి కూడా ఈ నౌక ముక్కులతో ఢీకొడతారు. నౌక కదలకుండా నిలిచిపోయిన తర్వాత సైనికులు ఆ నౌక మీదకు వెళ్లి అందులోని సరకులను దోచుకుని నౌకను ధ్వంసం చేస్తారు.
సంవత్సరాల తరబడి సాగిన యుద్ధం కార్తేజియన్లు, రోమన్లు ఇరువురుకీ తీవ్ర నష్టం వాటిల్లజేసింది. ''ఇరువైపులా ప్రాణనష్టం, ఆర్థిక నష్టం భారీగా జరిగింది. యుద్ధం చివరి దశలో రోమ్ కొత్త నౌకలు తయారు చేయటానికి తన దేశంలోని ధనవంతుల నుంచి అప్పులు తీసుకోవాల్సి వచ్చింది'' అని ఫ్రాన్సెస్కా చెప్పారు.

ఫొటో సోర్స్, Jarrod Jablonski/Soprintendenza del Mare
ఆ యుద్ధంలో ఆఖరి పోరాటం సిసిలీ పశ్చిమ తీరంలోని ఏగేడియన్ దీవుల పరిసరాల్లో జరిగింది. కార్జేజ్ సైనికులకు చాలా అవసరమైన సరకులను తీసుకెళుతున్న నౌకలను రోమన్లు అడ్డుకుని మోంటి ఎరీస్ వద్ద చుట్టుముట్టారు. అలసిపోయిన కార్తేజ్ సైన్యానికి లొంగిపోవటం తప్ప వేరే దారి లేకుండాపోయింది. సిసిలీ రోమ్ సొంతమైంది.
గాలి బలం, దాని దిశ సహా చాలా అంశాలు రోమ్ విజయానికి దోహదపడ్డాయని ఫ్రాన్సెస్కా తెలిపారు. ఒకవేళ ఆ యుద్ధంలో రోమన్లు కాకుండా కార్జేజియన్లు గెలిచివున్నట్లయితే ప్రపంచ చరిత్ర చాలా భిన్నంగా ఉండేదంటారు.
''రోమ్ ఇటలీ ద్వీపకల్పానికి మాత్రమే పరిమితమై ఉండేది. మధ్యధరా ప్రాంతం చుట్టూ కార్తేజ్ మరిన్ని వలస రాజ్యాలను నెలకొల్పి ఉండేది. తూర్పున పర్షియా సామ్రాజ్యం వరకూ విస్తరించి ఉండేది'' అని ఆమె అంచనా వేశారు. ''ఒకవేళ వారు బలహీనపడి ఉండకపోతే వారు తమ ప్రాబల్యాన్ని ఉత్తర దిశగా బ్రిటన్ వరకూ కూడా విస్తరించుకోగలిగి ఉండేవారు'' అన్నారామె.

ఫొటో సోర్స్, Salvo Emma/Soprintendenza del Mare
రక్తవర్ణపు రాళ్లు...
ప్రపంచ గతిని మార్చేసిన ఈ యుద్ధానికి సంబంధించిన ప్రాధమిక సమాచారానికి ఓ సహస్రాబ్దం వరకూ గ్రీకు చరిత్రకారుడు పోలిబియస్ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో రాసిన రచన మాత్రమే ఆధారంగా ఉండేది. అయితే ఆయన రాసిన వాటిలో.. ఈ యుద్ధం సరిగ్గా ఎక్కడ జరిగింది అనేటటువంటి కొన్ని కీలక అంశాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. ''ఏగేడియన్ దీవుల దగ్గర జరిగిందనే కథనం మాత్రమే మనకు దొరికింది కానీ కచ్చితమైన స్థలాన్ని అది చెప్పలేదు'' అని ఫ్రాన్సెస్కా పేర్కొన్నారు.
జనబాహుళ్యంలో వినిపించే ఇతిహాసం ప్రకారం.. ఏడేడియన్ దీవుల్లో అతిపెద్ద దీవి అయిన ఫావిగ్నానా దీవవిలో కాలా రోసా మరుగు దగ్గర ఈ యుద్ధం జరిగింది. ఈ మరుగులోని రాళ్లకు ముదురు ఎరుపు రంగు రావటానికి కారణం.. ఆ యుద్ధంలో చనిపోయిన కార్తేజియన్ల రక్తంతో అవి తడిసి ముద్దవటమేనని చెప్తుంటారు. అందుకే ఆ మరుగుకు కాలా రోసా అనే పేరు కూడా వచ్చిందంటారు. నిజానికి ఆ రాళ్లకు ఆ రంగు రావటానికి వాటి మీది ఎరుపు ఆల్గే కారణం. ''ఆ కథకు భూమిక లేదు'' అని ఫ్రాన్సెస్కా వివరించారు.
అయితే ఆ యుద్ధం ఫావిగ్నానా దీవిలో జరిగిందనే మాటతో టుసా ఏకీభవించలేదు. అందుకు ఆ దంతవైద్యుడి ఇంట్లో దొరికన నౌక ముక్కు కూడా కొంతవరకూ కారణం. ఫావిగ్నానా దీవికి ఉత్తరంగా ఉన్న లెవాంజో అనే మరో దీవి తీర సముద్రంలో ఆ నౌక ముక్కు దొరికిందని ఆ దంతవైద్యుడు టుసాకు చెప్పారు.
లెవాంజో దీవి మీద ఉత్తర ప్రాంతంలో కాపో గ్రొస్సో అనే స్థలం దగ్గర దాదాపు 100 యాంకర్లు అన్నీ పద్ధతి ప్రకారం అమర్చినట్లు కనిపిస్తాయని ఒక డైవర్ చెప్పారు. ఈ రెండు ఉదంతాలూ పొసిగినట్లు టుసాకు అనిపించింది.
''పడవలు సాధ్యమైనంత త్వరగా ప్రయాణం ప్రారంభించటానికి తాళ్లను కత్తిరించినట్లుగా అనిపిస్తుంది' అని టుసాతో పాటు ఈ అన్వేషణలో పాల్గొన్న స్లావతోర్ ఎమ్మా చెప్పారు.

ఫొటో సోర్స్, Salvo Emma/Soprintendenza del Mare
కార్జేతియన్లు సమీపంలోకి వచ్చిన తర్వాత వారి మీద దొంగచాటుగా దాడి చేయటానికి వీలుగా.. రోమన్లు లెవాంజో పర్వత శిఖరాల వెనుక నక్కి ఉండవచ్చు.
ఈ కథనాల స్ఫూర్తితో టుసా బృందం 2000 దశకం ఆరంభంలో లెవాంజో సమీపంలో జలగర్భ తవ్వకాలు ప్రారంభించింది. అక్కడ లంగర్లున్న ప్రాంతాన్ని, లంగర్లను గుర్తించారు. అంతేకాదు ఆ విఖ్యాత యుద్ధానికి సంబంధించిన లెక్కలేనన్ని అవశేషాలను కూడా వెలికితీయటం మొదలుపెట్టారు.
మధ్యధరా పరిసరాల్లో సముద్ర పురాతవ్వకాల కోసం పనిచేసే ఆర్‌పీఎం నాటికల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ అందించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ అన్వేషణలో చాలా ఉపయోగపడింది.
అత్యాధునిక మల్టీబీమ్ సోనార్‌ను ఏర్పాటుచేసిన హెర్క్యులస్ అనే పేరున్న బోటు సాయంతో ఈ అన్వేషణ సాగింది. బోటు కింద ఉన్న నీటిలోకి ఆ సోనార్ శబ్ద తరంగాలను పంపిస్తుంది. ఆ శబ్ద తరంగాలు తిరిగి వెనక్కువచ్చినపుడు వాటిని కొలవటం ద్వారా సముద్రగర్భ ఉపరితల స్వరూపం మ్యాప్‌ను రూపొందించటం సాధ్యపడుతుంది. ఈ మ్యాప్ వివరాలను మరింత మెరుగుపరచటం కోసం.. యూనివర్సిటీ ఆఫ్ మాల్టా అభివృద్ధిచసిన ఒక అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (ఏయూవీ) సాయం తీసుకున్నారు. అది సముద్రగర్భానికి దగ్గరగా వెళ్లి.. నౌక శిథిలాలను సూచించగల చిన్నచిన్న తేడాలను కూడా ప్రస్ఫుటంగా పట్టిస్తుంది.
అలాంటి ప్రాంతాలను గుర్తించిన తర్వాత.. రోమోట్‌గా ఆపరేట్ చేయగలిగిన ఒక వాహనాన్ని (ఆర్ఓవీ) ఆ ప్రాంతం దగ్గరికి పంపించి సముద్రగర్భ పర్యావరణాన్ని ఫొటోలు తీస్తారు. ఆ ఫొటోల సమాచారం సాయంతో డైవర్లు.. నౌకల, ప్రాచీన శిథిలాలు ఉన్న ప్రాంతాలకు చేరుకుంటారు.

ఫొటో సోర్స్, Salvo Emma/Soprintendenza del Mare
ఈ టెక్నాలజీని ఉపయోగించటంతో పురావస్తు పరిశోధన చాలా వేగవంతమైంది. ''ఒక ఆర్‌ఓవీ రోజంతా కూడా అంతకన్నా ఎక్కువ సేపు కూడా జలగర్భంలో ఉండి కంట్రోల్ రూమ్‌కు నిరంతరం వీడియో ఫీడ్ పంపించగలదు. ఒక రోజులోనే కొన్ని కిలోమీటర్ల పరిధిలో తిరుగుతూ పనిచేయగలదు'' అని చెప్పారు ఆర్‌పీఎం నాటికల్ ఫౌండేషన్ సారథి జేమ్స్ గూల్డ్. అదే మానవ డైవర్లు అయితే ఒకసారి కేవలం ఒక గంట సేపు మాత్రమే సముద్రగర్భంలో పనిచేయగలరు. ఎక్కువ దూరం కూడా కవర్ చేయలేరు.
ఈ పరిశోధన ద్వారా టుసా బృందం ఇప్పటివరకూ 25 నౌకముక్కలను కనిపెట్టింది. ఆ నౌకముక్కుల్లోని చెక్క శిథిలమైపోగా కేవలం కంచు తొడుగులు మాత్రమే మిగిలాయని గూల్డ్ నాతో చెప్పారు. చిత్రంగా.. ఈ కంచు తొడుగుల లోపల నాణేల వంటి చిన్నచిన్న వస్తువులు నిండివుండటాన్ని డైవర్లు గమనించారు. ఇది ఆక్టోపస్‌ల పని అంటారు గూల్డ్. ఆక్టోపస్‌లకు నాణేల వంటి చిన్నచిన్న వస్తువులను సేకరించి తమ ఇళ్లలో దాచుకునే అలవాటు ఉంటుందని, శిథిల నౌకముక్కుల తొడుగులను ఆవాసాలుగా చేసుకున్న ఆక్టోపస్‌లు తమ చేతికి అంటే.. టెంటకిల్స్‌కు అందిన చిన్నచిన్న నాణేలు వస్తువులను తెచ్చి వాటి నివాసాల్లో దాచుకుని ఉంటాయని ఆయన వివరించారు.
ఈ కంచు నౌకముక్కుల మీద పేర్లు రాసి ఉన్నాయి. రోమన్ నౌకముక్కుల శిథిలాల మీద.. అధికారుల వంటి వారి పేర్లు రాసివున్నాయి. వీటిద్వారా ఆ కాలపు రోమ్ రాజ్యంలో పరిపాలనా తీరును చరిత్రకారులు అర్థం చేసుకోవటానికి కూడా వీలుకలుగుతోంది.
ఇక కార్తేజ్ నౌకముక్కుల మీద ఎక్కువగా బాల్ దేవుడి పేర్లు, రోమన్ల మీద శాపాలు రాసి ఉండటం కనిపిస్తోంది. కొన్నిటి మీద ముఖ్యమైన వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయని ఫ్రాన్సెస్కా తెలిపారు.
ఈ కంచు నౌకముక్కలతో పాటు యుద్ధంలో ఇరుపక్షాల వారూ ఉపయోగించిన దాదాపు 40 శిరస్త్రాణాలను కూడా పురాశాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక హెల్మెట్‌లోని అవశేషాలను డీఎన్ఏ పరీక్షకు పంపించినట్లు గూల్డ్ చెప్పారు. దీనిద్వారా అప్పడు పోరాడిన మనుషుల గురించి మరిన్ని వివరాలు తెలియవచ్చునని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Soprintendenza del Mare
ఆ యుద్ధంలో వడిశల ద్వారా ప్రయోగించిన బాణాల సీసపు ముక్కులను కూడా గూల్డ్ మాకు చూపించారు. అవి ఒక్కోటి .30 కాలిబర్ తూటా అంత బరువున్నాయి. అవి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఉండొచ్చు.
నౌకల్లో సిబ్బంది ఉపయోగించిన కూజాలు, ఆహార వినియోగానికి ఉపయోగించిన గృహోపకరణాలు కూడా పెద్ద సంఖ్యలో బయటపడ్డాయి. ''క్రీస్తు పూర్వం మూడో శతాబ్దపు ప్రపంచాన్ని మరింత మెరుగ్గా వివరించే చాలా అంశాలు మాకు లభిస్తున్నాయి'' అని ఫ్రాన్సెస్కా పేర్కొన్నారు.
''ప్రపంచంలో ఈ రకంగా శాస్త్రీయంగా నిక్షిప్తమైన తొలిన నౌకాయుద్ధ స్థలమిది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా అన్వేషించటానికి కనీసం మరో 20 ఏళ్లు పడుతుంది'' అన్నారామె.
విచారకరమైన విషయం ఏమిటంటే.. తన పరిశోధన, అన్వేషణ తుది ఫలతాలను సెబాస్టియానో టుసా చూడలేరు. ఆయన 2019లో యునెస్కో సదస్సుకు హాజరయేందుకు వెళుతూ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 302 విమాన ప్రమాదంలో చనిపోయారు. చిత్రమేమిటంటే.. మార్చి 10వ తేదీన ఆ ప్రమాదం జరిగింది. ఏగేటస్ యుద్ధం కూడా అదే రోజున జరిగిందని భావిస్తారు''
టుసా జీవితాన్ని, ఆయన కృషిని సెలబ్రేట్ చేస్తూ సొప్రిన్‌టెన్‌డెన్జా డెల్ మారి ఈ ఏడాది ఫవిగ్నానా, పాలెర్మోలలో ఎగ్జిబిషన్లను ప్రారంభించింది. ఆయన వర్ధంతి రోజును 'సిసిలీ సాంస్కృతిక వారసత్వ దినం'గా ప్రకటించారు. దీవిలోని మ్యూజియంలు, గ్యాలరీలు, లైబ్రరీలకు ఉచితంగా ప్రవేశం కల్పించారు.
ఇవి కూడా చదవండి:
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- అజయ్ దేవ్‌గణ్-కిచ్చా సుదీప్: హిందీ జాతీయ భాషా? భారతదేశంలో అధికార భాషలు ఏవి?
- ‘నాకు క్యాన్సర్, ఫోర్త్ స్టేజ్.. ఎప్పుడు చనిపోతానో తెలుసు. ఇప్పుడు జీవించాలనుకుంటున్నా..’
- పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. మరొకర్ని పెళ్లి చేసుకున్న వధువు
- రోజుకు మూడు పూటలూ తినాలా? రెండు భోజనాల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








