పామును కిరీటంగా ధరించిన 4500 ఏళ్ల పురాతన దేవతా విగ్రహం.. పొలంలో రైతుకు దొరికింది

'అనత్' దేవతా విగ్రహం

ఫొటో సోర్స్, BBC/RUSHDI ABUALOUF

ఫొటో క్యాప్షన్, ‘అనత్’ దేవతా విగ్రహం
    • రచయిత, యాలాండే నెల్
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలెం

గాజా తీరంలో 4500 ఏళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం బయటపడింది. అందం, ప్రేమ, యుద్ధ దేవతగా పిలిచే క్యానానైట్ దేవతామూర్తి సున్నపురాయి విగ్రహాన్ని తాజాగా కనుగొన్నారు.

జోర్డాన్ నదికి పశ్చిమాన పురాతన పాలస్తీనా ప్రాంతానికి చెందిన వారిని క్యానానైట్లుగా పిలుస్తారు.

అది 4500 ఏళ్ల నాటి కాంస్య యుగానికి చెందిన క్యానానైట్ల దేవత 'అనత్' తల అని పాలస్తీనా పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు.

గాజా తీరానికి దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతంలోని భూమిని తవ్వుతోన్న రైతుకు ఈ దేవతా విగ్రహం దొరికింది.

యుద్ధంతో దేవత అనుబంధాన్ని ముడిపెడుతూ కొంతమంది గాజా ప్రజలు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

హమాస్ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్, గాజా మిలిటెంట్ గ్రూపుల మధ్య ఇటీవలి సంవత్సరాలలో జరిగిన వివాదాలలో వరుస విధ్వంసాలను గాజా ప్రజలు చూశారు.

అయితే, విజయవంతమైన పురాతన నాగరికత వాణిజ్యంలో గాజా తీరం ఏవిధంగా భాగమైందో ఈ విగ్రహం మరోసారి గుర్తుచేసింది.

గాజాలో దేవతా విగ్రహం

22 సెం.మీ ఎత్తు ఉన్న ఈ ప్రతిమలో దేవత ముఖం, ఆమె తలపై ధరించిన పాము కిరీటం స్పష్టంగా కనబడుతోంది.

''యాదృచ్ఛికంగా ఇది దొరికింది. బురదతో ఉండటంతో కడిగాను. ఇది ఏదో చాలా విలువైన ప్రతిమ అని ముందుగా అనుకున్నాం. కానీ, దీనికి ఇంతగొప్ప పురావస్తు విలువ ఉందని మాకు తెలియదు. ఇది మా పొలంలో దొరకడం గర్వంగా భావిస్తున్నాం. ఈ విషయంలో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా'' అని బీబీసీతో రైతు నిదాల్ అబు ఈద్ అన్నారు. పొలాన్ని సాగు చేస్తుండగా ఆయనకు ఈ విగ్రహం దొరికింది.

అత్యంత ప్రసిద్ధి చెందిన క్యానానైట్ల దేవతల్లో ఒకరైన 'అనత్' విగ్రహాన్ని ఇప్పుడు గాజాలోని చరిత్రత్మాక మ్యూజియం 'ఖజర్ అల్-బష్రా'లో ఉంచారు.

గురువారం విలేఖరుల సమావేశంలో ఈ ప్రతిమను ఆవిష్కరిస్తూ ... ''ఈ విగ్రహం కాలాన్ని తట్టుకొని నిలిచింది. నిపుణులు దీన్ని జాగ్రత్తగా పరీక్షించారు'' అని పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖకు చెందిన జమాల్ అబు రిడా అన్నారు.

ఇది ఒక రాజకీయ చర్చకు దారి తీసిందని ఆయన వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, జపాన్‌లోని 'కరుణ దేవత' భారీ విగ్రహానికి కరోనా మాస్క్

''ఇలాంటి ఆవిష్కరణలు పాలస్తీనా నాగరికత, దాని చరిత్రను రుజువు చేస్తాయి. ఈ చరిత్రను ఎవరూ తప్పుపట్టలేరు, కాదనలేరు. ఇదే పాలస్తీనా ప్రజల పురాతన క్యానానైట్ల నాగరికత'' అని ఆయన వివరించారు.

గాజా నగరానికి ఇళ్లు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం కోసం, 'టెల్ అల్-సకాన్' అనే పెద్ద క్యానానైట్ పట్టణ అవశేషాలను నాశనం చేశారని గతంలో హమాస్‌పై ఆరోపణలు వచ్చాయి. హమాస్ ఒక ఇస్లామిస్ట్, మిలిటెంట్ సంస్థ.

2013లో ఒక మత్స్యకారునికి మనిషి పరిమాణమంతటి పురాతన గ్రీకు దేవుడు 'అపోలో' కంచు విగ్రహం దొరికింది. కానీ, ఆ తర్వాత అది కనిపించకుండా పోయింది.

అయితే, అయిదో శతాబ్దం నాటి బైజాంటైన్ చర్చిని ఈ ఏడాదే హమాస్ పున:ప్రారంభించింది. దీన్ని పునరుద్ధరణ ప్రాజెక్టులో విదేశీ దాతలు సహాయం చేశారు.

గతంలో ఉత్తర గాజాలో రోమన్ కాలం నాటి 31 సమాధులు బయటపడ్డాయి.

ఇటువంటి పురాతన ప్రాంతాలు, విదేశీ పర్యటకులను ఆకర్షిస్తాయి. కానీ, నిజానికి ఇక్కడ పర్యాటక పరిశ్రమ లేదు.

భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపిస్తూ ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలు ఇక్కడికి ప్రజల రాకపోకలను నియంత్రిస్తాయి. కానీ, ఈ తీరంలో 23 లక్షల పాలస్తీనియన్లు నివసిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీకాకుళం: భారతమాత గుడిలో నిత్య పూజలు, మొక్కుబడులు, ఉత్సవాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)