సాగర గర్భాల్లో ఐదు అద్భుత నగరాలు

ఫొటో సోర్స్, ANDREAS SOLARO/AFP via Getty Images
''కెరటాల అడుగున.. కనుచూపు మరుగున.. నిదురపోతున్నది ద్వారక...'' అంటూ పాట కట్టారో సినీ కవి.
మహాభారత పురాణ కాలానికి చెందిన శ్రీకృష్ణుడు మధుర నుంచి వెళ్లిన ద్వారకా నగరం.. ఇప్పుడు గుజరాత్ తీరంలో జామ్ నగర్ జిల్లాలో అరేబియా సముద్రంలో మునిగి ఉందని భావిస్తుంటారు. అక్కడ నీటి అడుగున నగర శిథిలాలు కూడా కనిపిస్తుంటాయి.
ఒక్క ద్వారకా నగరమే కాదు.. ప్రపంచంలో అలా సముద్ర జలాల్లో నదుల వరదల్లో మునిగిపోయిన నగరాలు, పట్టణాలు చాలానే ఉన్నాయి. జలాశయాలు, ఆనకట్టలు కట్టటానికి నీట ముంచేసే పల్లెలకైతే ఇక లెక్కేలేదు.
గ్రీకు పురాణ కాలం నాటి అట్లాంటిస్ నగరం మొదలుకుని.. నిన్నమొన్నటి వరకూ జనంతో కళకళలాడిన ఎన్నో నగరాలను సముద్రపుటలలు కబళించాయి.
ఇలా నగరాలు నీట మునగటానికి ప్రకృతి ప్రకోపమో, సముద్రం ఉప్పొంగటమో, జలాశయాల్లో ముంచేయటమో.. అనేక కారణాలున్నాయి.
అందులో ముఖ్యమైన ఐదు నగరాలు, జలగర్భంలో వాటి అద్భుత సౌందర్యాలు, చెక్కుచెదరని కట్టడాలు, నిలువెత్తు విగ్రహాలను చూద్దాం రండి.

ఫొటో సోర్స్, ANDREAS SOLARO/AFP via Getty Images
బాయా - ఇటలీ
ప్రాచీన రోమన్లు పార్టీలు చేసుకునే ఓ అందమైన నగరం ఇటలీలోని బాయా. వేడి నీటి చెలమలు, ఆహ్లాదకరమైన వాతావరణం, విలాసవంతమైన భవనాలతో కళకళలాడుతుండేది ఈ నగరం.
జూలియస్ సీజర్, నీరో వంటి నాటి రోమన్ చక్రవర్తులకు ఈ నగరంలో విలాసవంతమైన వేసవి విల్లాలుండేవి. హాద్రియాన్ చక్రవర్తి క్రీ.శ. 138లో ఈ నగరంలోనే చనిపోయారు.
ఈ బాయా నగరంలో వేడి నీటి ఊటలను పుట్టించిన అగ్నిపర్వత విస్ఫోటనం వల్లనే.. ఈ నగరం నీట మునిగింది.
నేపుల్స్ సమీపంలోని ఒక మహా అగ్నిపర్వతం కాంపై ఫ్లెగ్రీ (ఫ్లెగ్రియాన్ ఫీల్డ్స్) మీద ఈ నగరాన్ని నిర్మించారు.
కాలక్రమంలో సంభవించిన 'బ్రాడీసీజం' అనే భౌగోళిక ప్రక్రియ వల్ల ఈ నగరం కింది భూమి నాలుగు నుంచి ఆరు మీటర్ల వరకూ కుంగిపోవటంతో నగరం నీటిలో మునిగిపోయింది.
భూగర్భంలోని మాగ్మా గది హైడ్రోథర్మల్ ప్రక్రియ వల్ల ఖాళీ అవటంతో.. పైనున్న నేల కుంగిపోవటాన్ని 'బ్రాడీసిజం' అంటారు.
అలా నీటిలో మునిగిపోయిన బాయా నగర ప్రాంతాలను 2002లో 'మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా'గా ప్రకటించారు స్థానిక అధికారులు. అంటే సముద్రం లోపలికి వెళ్లి ఈ నగర శిథిలాలను చూడాలంటే.. కేవలం లైసెన్స్ ఉన్న డైవర్లు, అది కూడా స్థానిక గైడ్ సాయంతో మాత్రమే డైవింగ్ చేయటానికి అనుమతి ఉంటుంది.

ఫొటో సోర్స్, FRANCOIS GUILLOT/AFP via Getty Images
థోనిస్-హెరాక్లియాన్ - ఈజిప్ట్
ప్రాచీన ఇతిహాసాల్లో తరచుగా వినిపించే నగరాల పేర్లలో థోనిస్-హెరాక్లియాన్ ఒకటి. గ్రీకు వీరుడు హెర్క్యులస్ ఈజిప్టులో మొదటిసారి అడుగు మోపింది ఈ నగరంలోనేనని చెప్తుంటారు. ప్రఖ్యాత ట్రోజన్ సమరానికి ముందు ప్రేమజంట పారిస్, హెలెన్‌లు కూడా ఈ నగరాన్ని సందర్శించారు.
ఈ నగరం అసలు ఈజిప్షియన్ పేరు థోనిస్. హెరాక్లియాన్ అనేది హెర్క్యులస్‌కు గ్రీకు పేరు.
నైలు నది పశ్చిమ ముఖద్వారంలో ఉండే ఈ నగరం ఓ సంపన్నమైన ఓడరేవుగా విలసిల్లింది. మధ్యధరా ప్రాంతమంతటి నుంచీ సరకులు ఈ రేవు గుండా సంక్లిష్టమైన కాలువల వ్యవస్థల మీదుగా ప్రయాణించేవి. ఈ నీటిలో 60 నౌకల శిథిలాలు, 700కు పైగా లంగర్లు బయటపడటమే దీనికి నిదర్శనం.
ఈ జలగర్భ నగరం నుంచి వెలికితీసిన అత్యంత విలువైన కళాఖండాల్లో 'డిక్రీ ఆఫ్ సాయిస్' ఒకటి.
రెండు మీటర్ల నిడివి గల ఈ నల్లరాతి పలక మీద క్రీ.పూ. నాలుగో శతాబ్దానికి చెందిన చిత్రలిపి చెక్కి ఉంది. ఆ కాలపు ఈజిప్టు పన్ను వ్యవస్థకు సంబంధించిన కీలక వివరాలను ఈ రాతి పలక వెల్లడించింది. అంతేకాదు.. థోనిస్ - హెరాక్లియాన్ అనేవి రెండూ ఒకే నగరమని కూడా నిర్ధారించింది.

ఫొటో సోర్స్, Anthony Devlin/Getty Images
డెర్వెంట్ - ఇంగ్లండ్
ఇంగ్లండ్‌లోని డెర్వెంట్ పట్టణాన్ని.. ఉద్దేశపూర్వకంగానే నీట ముంచారు. లేడీబోవర్ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయటం కోసం ఈ పనిచేశారు.
డెర్బీ, లీసెస్టర్, నాటింఘామ్, షెఫీల్డ్ వంటి నగరాలు 20వ శతాబ్దం మధ్యకాలంలో భారీగా విస్తరించాయి. ఆ నగరాల్లో పెరుగుతున్న జనాభాకు నీటి సరఫరా కూడా పెంచాల్సిన అవసరం వచ్చింది. అందుకోసం ఒక ఆనకట్టను, ఒక జలాశయాన్ని నిర్మించాల్సి వచ్చింది.
తొలుత.. డెర్వెంట్ నగరాన్ని రక్షించటం కోసం లోయలో ఎగువ భాగాన హోడెన్, డెర్వెంట్ అనే రెండు జలాశయాల్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ అవి రెండూ సరిపోవని, మూడో జలాశయం కూడా అవసరమని త్వరలోనే తేలిపోయింది.
ఆ మూడో జలాశయ నిర్మాణం పని 1935లో మొదలైంది. పదేళ్లు తిరిగేసరికి 1945లో డెర్వెంట్ నగరం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
ఎండలు మండే వేసవి కాలాల్లో లేడీబోవర్ రిజర్వాయర్‌లోని నీటి మట్టాలు బాగా తగ్గి, డెర్వెంట్ నగర శిథిలాలు బయటపడతాయి. అప్పుడు సందర్శకులు ఈ శిథిలాల మధ్య తిరుగుతూ వీక్షిస్తుంటారు.

ఫొటో సోర్స్, JUAN MABROMATA/AFP via Getty Images
విల్లా ఎపిక్యూన్ - అర్జెంటీనా
ఈ విల్లా ఎపిక్యూన్ తటాక రిసార్టు పాతికేళ్ల పాటు నీటిలో మునిగిపోయి.. మళ్లీ 2009లో తేలింది.
ఎపిక్యూన్ ఉప్పునీటి సరస్సు ఒడ్డున 1920లో ఈ రిసార్టు పట్టణానికి పునాదులేశారు. ఔషధ గుణాలున్నాయని భావించే ఈ సరస్సులో స్నానం చేయటానికి వచ్చే టూరిస్టులు విల్లా ఎపిక్యూన్‌కు క్యూకట్టేవారు.
ఈ సరస్సు సహజంగానే వరద నీటితో నిండేది. అంతే సహజంగా ఎండిపోయేది. కానీ 1980 నుంచీ అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్ల పాటు విపరీతంగా వాన కురవటంతో సరస్సులో నీటి మట్టం పెరగటం మొదలైంది.
దీంతో నగరానికి అదనపు భద్రత కల్పించటం కోసం అర్ధచంద్రాకారంలో గోడను నిర్మించారు.
కానీ 1985 నవంబరులో వచ్చిన తుపానుతో.. ఈ సరస్సు ఉప్పొంగి ఆనకట్ట బద్దలైంది. ఈ నగరం పది మీటర్ల లోతున్న ఉప్పు నీటిలో మునిగిపోయింది.
అయితే 2009 నుంచి ఈ నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. విల్లా ఎపిక్యూన్ మళ్లీ వెలుగు చూస్తోంది.

ఫొటో సోర్స్, peeterv/Getty Images
పోర్ట్ రాయల్ - జమైకా
పోర్ట్ రాయల్ అనేది ఇప్పుడు మబ్బుగా ఉండే ఓ చేపలవేట గ్రామం. కానీ 17వ శతాబ్దంలో ఈ నగరం ఓ వెలుగు వెలిగింది. 'భూమ్మీద మహా చెడ్డ నగరం' అని దీనికి పేరుండేది. అక్కడ అలాంటి సముద్రపు దొంగలుండేవారు.
నాటి 'నూతన ప్రపంచా'నికి - అంటే అప్పుడే కనుగొన్న అమెరికా ఖండాలతో కూడిన పశ్చిమార్థగోళానికి (బానిస వ్యాపార సమయంలో సైతం) కీలకమైన వాణిజ్య కేంద్రంగా ఉన్న పోర్ట్ రాయల్ వేగంగా పెరిగిపోయింది.
1662లో ఇక్కడ 740 మంది నివసిస్తుంటే.. 1692 నాటికి వారి సంఖ్య 6,500 - 10,000 వరకూ పెరిగిపోయిందని అంచనా.
ఈ జనం ఇటుకలు లేదా కట్టెలతో కట్టిన ఇళ్లలో ఉండేవారు. చాలా ఇళ్లు నాలగంతస్తుల వరకూ ఉండేవి.
1692 జూన్ 7వ తేదీన మధ్యాహ్నం కావస్తుండగా.. ఓ భారీ భూకంపం, ఆ వెనువంటనే ఓ పెను సునామీ పోర్ట్ రాయల్ మీద విరుచుకుపడ్డాయి.
ఈ నగరంలో మూడింట రెండు వంతుల భాగం నీటిలో మునిగిపోయింది. అలా మునిగిన ప్రాంతాల్లో తీరం వెంట ఉన్న గోదాములు ఎక్కువగా ఉన్నాయి.
ఆ రోజు 2,000 మంది చనిపోయారని అంచనా. అంతకన్నా చాలా ఎక్కువ మంది గాయాలపాలయ్యారు.
ఇక్కడ నీటిలో డైవ్ చేసి.. మునిగివున్నా పరిరక్షిస్తున్న నగర శిథిలాలను, వందలాది శిథిల నౌకలను వీక్షించవచ్చు. కాకపోతే అందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తెచ్చుకోవాలి.
ఇవి కూడా చదవండి:
- ‘నేను మా ఇంటికి రావాలంటే గుర్తింపు కార్డు చూపించాలి.. బంధువులు వస్తే ముందుగా సెక్యూరిటీకి చెప్పాలి’
- కేజీ చికెన్ 1000, ఒక్కో గుడ్డు 35.. కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 - ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- #TheKashmirFiles: జమ్మూలో స్థిరపడిన కశ్మీరీ పండిట్లు ఏమంటున్నారు?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












