పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. మరొకర్ని పెళ్లి చేసుకున్న వధువు

మల్కాపూర్‌పాంగ్రా గ్రామంలో పెళ్లి

పెళ్లి మండపానికి వరుడు ఆలస్యంగా వచ్చాడని అతనితో వివాహానికి నిరాకరించింది వధువు. ఆ తర్వాత ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లికుమారుడికి కూడా మరో అమ్మాయితో వివాహం జరిగింది.

మహారాష్ట్రలోని సింద్‌ఖేడ్రజా తాలూకాలోని మల్కాపూర్‌పాంగ్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సింద్‌ఖేడ్రజా తాలూకాలోని కండారీ గ్రామానికి చెందిన యువకుడితో మల్కాపూర్‌పాంగ్రా గ్రామానికి చెందిన యువతికి వివాహం కుదిరింది.

పెళ్లి ముహుర్తం ఏప్రిల్ 23గా నిర్ణయించారు. ఈ మేరకు పెళ్లి ఏర్పాట్లు చేశారు.

వివాహం

ముహుర్త సమయానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి మండపానికి అతిథులు చేరుకున్నారు.

కానీ, వరుడు మండపానికి రాలేదు. ఆయన స్నేహితులు తాగి, బ్యాండ్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి కొడుకు కూడా వారితో కలిసి స్టెప్పులేశారు.

దాంతో మధ్యాహ్నానికే మల్కాపూర్‌పాంగ్రా గ్రామానికి చేరుకున్న వరుడు... బారాత్ ముగించుకొని పెళ్లి మండపానికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు అయింది.

ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందంటూ వరుడి తరఫు వారిని వధువు తరఫు వారు ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. కాసేపటికి ఈ గొడవ ఓ కొలిక్కి వచ్చింది.

కానీ, ఆ తర్వాత వధువు, తాను ఈ పెళ్లి చేసుకోలేనంటూ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

దీంతో వరుడు, పెళ్లి చేసుకోకుండానే వెళ్లిపోయాడు.

వివాహం

ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లి

వధువు తండ్రి మరుసటి రోజే దుసర్‌బీడ్‌కు చెందిన మరో యువకుడితో తన కుమార్తెకు వివాహం జరిపించారు.

ఈ పెళ్లి జరిగిన తర్వాత కండారీ నుంచి మల్కాపూర్ గ్రామానికి వచ్చిన పెద్దలు ఈ పెళ్లి ఎలా చేస్తారని అమ్మాయి తరఫు వారిని నిలదీశారు.

ఆగిపోయిన పెళ్లి కుమారుడి తరఫున అమ్మాయికి ఇచ్చిన ఆభరణాలు, చీరలు వెనక్కి ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య వివాదం సద్దుమణిగింది.

తర్వాత డ్యూల్‌గాన్ కోల్‌కు చెందిన ఒక అమ్మాయితో ఆ వరుడి వివాహం కూడా జరిగింది.

వీడియో క్యాప్షన్, పెళ్లై 91 ఏళ్లు.. వీళ్లు సంతోషంగా ఉండటానికి కారణాలు ఏంటంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)