జానీ డెప్: 'నా పెళ్లాం నన్ను తిట్టేది, కొట్టేది': మాజీ భార్యపై రూ.380 కోట్ల పరువు నష్టం కేసు వేసిన హాలీవుడ్ హీరో

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హాలీ హాండెరిక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్య ఆంబర్ హెర్డ్‌ను చంచలమైన భార్యగా, తనను హింసించిన, అవమానించిన వ్యక్తిగా చిత్రీకరించటానికి ప్రయత్నించారు.
ఆంబర్ హెర్డ్ (35 ఏళ్లు) తను గృహ హింస బాధితురాలినంటూ రాసిన ఒక వ్యాసం మీద జానీ డెప్ (58 ఏళ్లు) 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 380 కోట్ల) పరువునష్టం దావా వేశారు.
తాను ఏరకంగానూ హింసించలేదని డెప్ తెలిపారు. డెప్ మీద ఆంబర్ 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 760 కోట్ల) పరువునష్టం క్లెయిమ్ చేస్తూ ఎదురు కేసు వేశారు.
ఆంబర్ వైపు నుంచి 'తీవ్ర ద్వేషం' తను చవిచూశానని డెప్ తన వాంగ్మూలంలో చెప్పారు. ఆయన రెండు రోజుల పాటు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆంబర్ తరఫు న్యాయవాదులు బుధవారం నాడు క్రాస్-ఎగ్జామినేషన్ ప్రారంభించారు.
డెప్ వాంగ్మూలం గురువారం మళ్లీ మొదలవుతుంది.
తమ ఇద్దరి మధ్య తొలి ఏడాది ప్రణయం చెడిపోయిన తర్వాత తరచుగా వాగ్వాదాలు జరుగుతుండేవని డెప్ చెప్పారు. ఆంబర్ తరచుగా ''వ్యంగ్యంగా, అవమానకరంగా, దౌర్జన్యంగా, హింసాత్మకంగా, విషపూరితంగా తిట్లు తిట్టే''వారని, అప్పుడప్పుడు హింసకు పాల్పడేవారని పేర్కొన్నారు.
''అది ఒక చెంపదెబ్బతో మొదలుకావచ్చు. టీవీ రిమోట్‌ను నా తల మీదకు విసరటంతో మొదలుకావచ్చు. వైన్ గ్లాసును నా ముఖం మీదకు విసరటంతో మొదలుకావచ్చు'' అని డెప్ చెప్పుకొచ్చారు.
''ఆమెకు ఘర్షణ కావాలి. ఆమెకు హింస కావాలి'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మాజీ దంపతులకు సంబంధించిన కొన్ని ఆడియో రికార్డులను బుధవారం నాడు జ్యురీకి వినిపించారు. అందులో.. డెప్‌తో తాను 'భౌతిక కొట్లాట'ను మొదలుపెట్టినట్లు ఆంబర్ అంగీకరించటం వినిపిస్తుంది.
ఆంబర్‌తో తాను కలిసి నివసించిన ఫ్లాట్‌లో ఒకసారి బెడ్ మీద తను పడుకునే వైపు 'మానవ మలం' కనిపించిన సంఘటనను జానీ డెప్ గుర్తుచేసుకున్నారు.
''అది ఎంత వికారంగా, ఎంత వైపరీత్యంగా ఉందంటే.. నేను నవ్వటం తప్ప మరేం చేయలేకపోయాను'' అన్నారు.
ఆ సంఘటనలో బెడ్ మీద తాను కానీ, తన స్నేహితులెవరైనా కానీ మానవ మలాన్ని వేయలేదని.. ఆంబర్ 2018లో బ్రిటన్‌లో డెప్ మీద పరువునష్టం దావా కేసులో వాంగ్మూలం ఇస్తూ చెప్పారు. ఆ ఆలోచనే అసహ్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం వర్జీనియాలో జరుగుతున్న కేసు విచారణలో.. జానీడెప్, ఆంబర్ హెర్డ్ సంబంధానికి సంబంధించి పరస్పరం తీవ్ర విరుద్ధంగా ఉన్న రెండు వాదనలు విన్నారు.
ఆంబర్ హెర్డ్ తరఫు న్యాయవాదులు.. జానీ డెప్ శారీరకంగా, లైంగికంగా వేధించే భాగస్వామి అని, అతిగా మాదకద్రవ్యాలు తీసుకుంటారని, మితిమీరి మద్యం సేవిస్తారని చిత్రీకరించటానికి ప్రయత్నించారు.
ఈ అంశంపై జానీ డెప్ బుధవారం తన వాంగ్మూలంలో వివరించారు. తన వెన్నెముక గాయానికి రాక్సికోడోన్ తీసుకున్న తర్వాత ప్రిస్క్రిప్షన్ ఓపియోయిడ్స్ తీసుకోవటం తనకు వ్యసనంగా మారిందని చెప్పారు.
ఆ డ్రగ్స్ నుంచి బయటపడటానికి తాను ప్రయత్నిస్తున్నపుడు.. ఎదురయ్యే లక్షణాలకు (విత్‌డ్రాయల్ సింప్టమ్స్) ఉపశమానాన్నిచ్చే ఔషధాలను ఆంబర్ హెర్డ్ తనకు ఇవ్వకుండా ఆపివేసేవారని, తర్వాతి డోస్ తీసుకునే టైం ఇంకా రాలేదని చెప్పేవారని డెప్ పేర్కొన్నారు.
తాను ఏడుస్తూ నేలమీద పొర్లుతూ ప్రాధేయపడ్డానని చెప్పారు. ''ఇది చెప్పటం, దీనిని అంగీకరించటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నా జీవితంలో అత్యంత హీనమైన దశ అది'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
నిన్న తడబడుతూ.. నేడు వడివడిగా...
డేవిడ్ సిలిటో, బీబీసీ న్యూస్, వర్జీనియా
జానీ డెప్ రెండో రోజున విట్‌నెస్ స్టాండ్‌లో కుదురుకుంటూ.. కోర్టులో తన మాజీ భార్య ఆంబర్ హెర్డ్ కూర్చునివున్న వైపు ఒక్క క్షణం చూపు మరల్చారు.
కోర్టులో విచారణ కొనసాగుతున్నంత వరకూ ఆమె తదేకంగా వీక్షిస్తూ కూర్చున్నారు. తమ మధ్య సంబంధం గురించి జానీ డెప్ తన అభిప్రాయాలను చెప్తున్నపుడు మధ్యమధ్యలో ఆమె పాయింట్లు రాసుకున్నారు. ఈ సంబంధం హింసాత్మకంగా, వేధింపులతో నిండిన సంబంధమని ఆంబర్ ఇంతకుముందు అభివర్ణించారు.
జానీ డెప్ వాంగ్మూలం ఇచ్చే మొదటి రోజున.. ఆరంభంలో ఆయన సమాధానాలు కాస్త సంశయంగా, సరైన పదాల కోసం దీర్ఘంగా ఆలోచిస్తూ సాగాయి.
రెండో రోజున వాంగ్మూలంలో డెప్ మరింత ధారాళంగా మాట్లాడారు. తమ వివాహం ఎలా విచ్ఛిన్నమైందీ, ఆమె ప్రవర్తన నియంత్రించేవిధంగా, అవమానించే విధంగా తయారైందని తను ఎలా భావించిందీ వివరించారు.
''అది అంతులేని తిట్లు దండకం. నన్ను ఒక మూర్ఖుడిగా భావిస్తూ తిట్టటం. నేను గొంతు విప్పటానికి అనుమతి ఉండేది కాదు'' అని చెప్పారు.
ఈ సంబంధంలో బాధను తట్టుకోవటానికి మద్యపానం తనకు ఒక మార్గమయ్యిందన్నారు. ఆంబర్ తనను కొట్టేవారని, తాను ఎప్పుడూ కొట్టలేదని డెప్ చెప్పారు. తాను పక్కకు తప్పుకునేవాడినని, తామిద్దరం ప్రయాణించేటపపుడు తప్పించుకోవటానికి స్థలం కోసం అదనపు గదులను బుక్ చేసేవాడినని చెప్పుకొచ్చారు.
ఆంబర్ హెర్డ్ వైపు కథ ఇంకా చెప్పాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆంబర్ హెర్డ్ తరఫు న్యాయవాది బెన్ రాటెన్‌బోర్న్ తన క్రాస్ ఎగ్జామినేషన్‌లో.. ఈ కేసుకు కారణమైన 2018 నాటి వ్యాసంలో జానీ డెప్ పేరును ప్రస్తావించలేదనే విషయాన్ని డెప్ ధృవీకరించేలా చేశారు.
''ఒక వ్యాసం రాస్తూ అందులో ఒకరి పేరు చెప్పకుండా వారిని వేలెత్తి చూపించటం చాలా ఈజీ అని నేను అనుకుంటున్నా. ఇలా రాయటానికి చాలా దొంగదారులున్నాయి'' అని డెప్ బదులిచ్చారు.
ఆ వ్యాసం రాయటానికి రెండేళ్ల ముందు 2016 మేలో ఇచ్చిన ఒక రిస్ట్రెయినింగ్ ఆర్డర్‌లో.. డెప్ తనపై దాడి చేశారంటూ ఆంబర్ చేసిన ఆరోపణల మీద ఎందుకు కేసు వేయలేదని కూడా ఆ న్యాయవాది డెప్‌ను ప్రశ్నించారు.
''దాని మీద పోరాటం చేయవద్దని నా న్యాయవాది నాకు సలహా ఇచ్చారు'' అని జానీ డెప్ చెప్పారు.
ఈ పరువునష్టం దావా ఇప్పుడు రెండో వారానికి చేరుకుంది.
దీనికిముందు.. ఈ మాజీ దంపతుల మాజీ థెరపిస్ట్, డెప్ ఓపియేట్స్ నుంచి బయటపడుతున్నపుడు ఆయనకు చికిత్స చేసిన వైద్య సిబ్బంది నుంచి సాక్ష్యాలను విన్నది. జానీ డెప్, ఆంబర్ హెర్డ్‌లు 'పరస్పర వేధింపు'లకు పాల్పడ్డారని వారి మాజీ థెరపిస్ట్ చెప్పారు.
పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్, నటులు జేమ్స్ ఫ్రాంకో, పాల్ బెటనీలు ఈ కేసులో తర్వాత సాక్షులుగా హాజరుకానున్నారు. ఈ కేసు విచారణ మరో నెల రోజుల పాటు సాగుతుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..
- బాసా: క్యాట్ ఫిష్ వర్గానికి చెందిన ఈ చేప ఆరోగ్యానికి ప్రమాదమా, అన్ని రెస్టారెంట్లలో ఇదే ఎందుకు ఉంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








