బర్ఖా దత్: ‘మా నాన్న కనీసం ఆసుపత్రిలో చనిపోయారు, వేలాది మంది రోడ్ల మీదే ప్రాణాలొదిలారు’

ఫొటో సోర్స్, BARKHA DUTT
గత ఏడాది వేసవిలో భారత్‌లో కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ సృష్టించిన విలయంపై రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్ట్ బర్ఖా దత్ కూడా 2021 ఏప్రిల్‌లో తన తండ్రిని ఈ మహమ్మారికే కోల్పోయారు.
తన జీవితంలో కోవిడ్ మిగిల్చిన విషాదం, తనలాగే తండ్రులను కోల్పోయిన కుమార్తెల కన్నీటి గాథలను ఆమె వివరిస్తున్నారు.

నేను సంగీతం వినడం మానేసి ఏడాదైంది. కోవిడ్ సెకండ్ వేవ్‌లో మా తండ్రి మరణించి ఏడాదైంది.
కొన్ని రోజుల కిందట మంద్రంగా వినిపించిన ఒక సుపరిచిత రాగం కూడా కుదుపులా అనిపించింది.
గ్వాంటనమేరా గ్వజీరా గ్వాంటనమేరా..
దేశభక్తి, నిరసన, మార్పు, రొమాన్స్ వంటి విభిన్న ప్రేరణలను కలిగించే ఈ క్యూబా జానపద గీతం విన్నప్పుడు నా చేయి వణికింది.
చేయే కాదు శరీరం లోపలా వణుకుతున్నాను.
జ్ఞాపకాలు మృగంలా మారొచ్చు..
నా సోదరికి, నాకు.. మా జీవితంలో అనేక మైలురాళ్లను గుర్తించిన నాన్న పాట. మేం పిల్లలుగా ఉన్నప్పుడు అరిగిపోయిన క్యాసెట్లలో ఈ పాటను లెక్కలేనన్నిసార్లు విన్నాం. ఆ తరువాత టీనేజ్‌లో ఎనిమిది ట్రాక్‌ల సిస్టమ్‌లో వినేలా మెరుగుపర్చిన తరువాత దీన్ని విన్నాం. కాలేజ్ రోజుల్లో సీడీల్లో విన్నాం. చివరకు నాన్న డెస్క్‌టాప్‌లో ఈ పాట విన్నాం.
మనవలు, మనుమరాళ్లు, కుక్కలు, టూల్ కిట్‌లు, చిందరవందరగా ఉండే వైర్లు, కెటిల్స్, స్పీకర్లు, కాఫీ మేకర్లు, స్నేహితుల కోసం రిపేర్ చేసే చిన్నచిన్న యంత్రాలు ఆయన చుట్టూ ఉండేవి.

ఫొటో సోర్స్, BARKHA DUTT
ఎస్‌పీ దత్... స్నేహితులు, కుటుంబసభ్యులు ఆయన్ను స్పీడీ అని పిలుచుకునేవారు.
మన ఆరోగ్య వ్యవస్థను చితకబాది లొంగదీసుకున్న వైరస్ బారిన పడిన వేలాది మందిలో స్పీడీ కూడా ఒకరు.
2021 ఏప్రిల్ నిజానికి క్రూరమైన నెల.. ఆక్సిజన్ కొరత, బెడ్‌లు ఖాళీ లేక ఆసుపత్రులు గేట్లు మూసేయడంతో వీధుల్లోనే రోగులు మరణించారు.. టీకాలు ఆలస్యమయ్యాయి.. కానీ, ఎన్నికలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరిగాయి.
వ్యవస్థలు కుప్పకూలడంతో తండ్రులను కాపాడుకోలేని దుస్థితి. అలాంటి పరిస్థితుల్లో నాలాంటి కుమార్తెలు ఒకరినొకరం ఆశ్రయించడం తప్ప ఏమీ చేయలేకపోయాం.
ముంబయిలో సమృద్ధి సక్సేనా తన తండ్రిని కాపాడుకోవడానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ సంపాదించే విషయంలో నేనేమైనా సాయం చేయగలనేమో అని నన్ను సంప్రదించారు.
సమృద్ధి తండ్రి అరుదైన నాడీక్షీణత వ్యాధితో బాధపడుతున్నారు.
పట్నా నుంచి మనీషా కూడా తన తండ్రి ప్రాణాల విషయంలో ఆందోళన చెందుతూ నాకు ఫోన్ చేశారు. ఆమె 53 ఏళ్ల తండ్రి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఆక్సిజన్ నిండుకుంటుండడంతో మనీషా నాకు ఫోన్ చేశారు.
బెంగళూరుకు చెందిన భరిణి నన్ను ఓ మాట అడిగారు.. ''నేను ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి?''
భరిణి తన తల్లిదండ్రులను ఒక ప్రమాదంలో కోల్పోయారు. ఇప్పుడు తన పెంపుడు తల్లి కోవిడ్‌తో మరణించారు.
జర్నలిస్ట్ స్తుతి ఘోష్, నేను ఒక రకమైన అపరాధభావంలో ఒకరినొకరు ప్రతిబింబించాం.
ఇద్దరం మా తండ్రులను కాపాడుకోలేకపోయాం. అయితే, కనీసం వారిని ఆసుపత్రిలో చేర్చగలిగాం. కానీ, అదే సమయంలో వేలాది మంది ఇతర భారతీయులు ఆసుపత్రులలో బెడ్లు దొరక్క రోడ్లపైనే చిక్కుకుపోయారని తెలిసి అపరాధ భావం వెంటాడింది.
నా తండ్రిలాగే ఆమె తండ్రి కూడా కోవిడ్ నుంచి గట్టెక్కలేకపోయారు. అయితే, సమృద్ధి దుఃఖం రోజులు, వారాలు గడిచేకొద్దీ కోపంగా మారింది. అవమానకరంగా మరణించడం, ప్రభుత్వ లెక్కల్లో లేకపోవడం వంటివి ఆమెలో కోపాన్ని రగిల్చాయి.

ఫొటో సోర్స్, EPA
కుమార్తెలుగా, పౌరులుగా మేం దీనస్థితిలో ఉన్నాం. నాన్న చనిపోవడానికి ముందు వరకు మేం ఎప్పుడూ మా అమ్మ ప్రభాదత్‌ను అత్యంత విలువైన మనిషిగా భావించేవాళ్లం. నా 13 ఏళ్ల వయసులోనే బ్రెయిన్ హెమరేజ్ కారణంగా ఆమె చనిపోయారు. ఇండియాలో మొట్టమొదటి వార్ కరస్పాండెంట్‌గా గుర్తింపు పొందిన ఆమె 40 ఏళ్లకే చనిపోయారు.
కళ్లెదురుగా ఉండేవారిని తేలిగ్గా తీసుకుంటాం. నాన్ననూ అలాగే చూసేవాళ్లం. కోవిడ్‌తో ఆయన చనిపోయాక తెలిసింది.. నా ఉనికికే ఆయన కేంద్ర బిందువని.
2021 ఏప్రిల్‌లో మా నాన్నకు కోవిడ్ అని తెలిసేటప్పటికి నేను ముంబయిలోని ఒక స్మశానంలో ఉన్నాను. అక్కడ అప్పటికి వీల్ చెయిర్‌లో ఉన్న ఓ వృద్ధుడు తన భార్యకు అంతిమ వీడ్కోలు పలుకుతున్నారు.
అప్పటికే కోవిడ్ నా జీవితంగా మారిపోయింది. మొదటి వేవ్ సమయంలో నేను 30 వేల కిలోమీటర్లకు పైగా దూరం రోడ్డు మార్గాన ప్రయాణించాను. అంతకంటే ప్రాణాంతకమైన రెండో వేవ్‌లో విమానాల్లో, రోడ్డు మార్గంలో వేలాది కిలోమీటర్లు ప్రయాణించాను.
మరణం, నిస్పృహల చరిత్ర లిఖిస్తున్నాను నేను.. కానీ, నా ఇంటికే మరణవార్త వచ్చింది.
ప్రైవేట్ అంబులెన్సులో నాన్నను ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న నా నిర్ణయం జీవితాంతం నన్ను వెంటాడుతుంది.

ఫొటో సోర్స్, Reuters
పారామెడికల్ సిబ్బంది, స్ట్రెచర్ వంటివేమీ లేని డొక్కు వ్యాన్ అది. డ్రైవర్ తప్ప అందులో ఎవరూ లేరు. నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నపిల్లాడిలా నాన్న పడుకున్న వినైల్ బెంచ్ కింద ఉన్న ఆక్సిజన్ సిలిండర్ కూడా పనిచేయలేదు.
ఆసుపత్రికి చేరుకునే సమయానికి పోలీస్ చెకింగ్‌ల కారణంగా అక్కడున్న వందలాది అంబులెన్స్‌లలాగే మా అంబులెన్స్ వేగమూ తగ్గింది. నాన్న పరిస్థితి మరింత క్షీణించింది.
అయితే, ఆసుపత్రి నుంచి నాన్నను స్మశానానికి తీసుకెళ్లేటప్పటికి ఇదంతా మారింది.. ఇప్పుడాయన చనిపోయారు. ఏదోరకంగా ఒక ప్రొఫెషనల్ అంబులెన్స్ సంపాదించాం. శవాన్ని తీసుకెళ్తున్న వాహనంలోని స్ట్రెచర్ గోధుమ రంగులో తళతళలాడుతోంది. కొత్త లెదర్, సీటు ఎత్తు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానిపై లేత గోధుమ రంగులోని జిప్ బ్యాగ్‌లో నాన్న ఉన్నారు.
ఇప్పుడు అదంతా జ్ఞాపకాలలోంచి చెరిపేయాలనుకుంటున్నాం. దుఃఖం కలిగించే స్మృతులను నిరోధించలేక నిరాశ చెందుతున్నాం.
కానీ, మామూలు కట్టు కట్టినంత మాత్రాన ఈ లోతైన గాయం నయం కాదు.
ఈ క్షతగాత్ర దేశపు సమష్టి జ్ఞాపకాల నీడలు చాలా పొడవున విస్తరించి ఉన్నాయి. నేను ఇప్పటికీ నా తండ్రి గదిలో అడుగు పెట్టలేకపోతున్నాను. అక్కడ ఆయన మంచం ఎగువన పైకప్పు నుంచి కింద వరకు మూడు రైలు ట్రాకులు ఉంటాయి. ఆయన స్వయంగా తయారుచేసుకున్న ట్రైన్ల కోసం ఏర్పాటు చేసుకున్న ట్రాక్‌లవి.
నాన్నకు సైన్స్ అంటే ఇష్టం. ఆయన స్కూల్‌లో చదువుతున్నప్పుడే రాకెట్ బొమ్మ తయారుచేసిన తెలివైన విద్యార్థి.
యువకుడిగా ఉన్నప్పుడు ఆయన క్యాడ్బరీ చాక్లెట్ల కోసం వెండింగ్ మెషీన్ తయారుచేశారు. ఆ తరువాత 'స్పీడ్‌షైన్' పేరుతో బూట్లు పాలిష్ చేసే యంత్రాలను తయారుచేశారు.
'నయం కానిది దేన్నైనా మనం భరించకతప్పదు' అని సైన్స్ చెబుతుంది అనేవారు ఆయన ఎప్పుడూ.
కోవిడ్ పాజిటివ్ అని తెలిసినప్పుడు కూడా ఆయన ఇదే మాట చెప్పారు.
కానీ, ఆయన చెప్పింది తప్పు.
ఇండియా కనుక వ్యాక్సీన్లను ముందే అందుబాటులోకి తెచ్చి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవేమో. ప్రభుత్వం తొలుత 2021 జనవరి 10న సుమారు కోటి డోసుల వ్యాక్సీన్లకు ఆర్డరిచ్చింది. ఇది కనీసం రాజధాని దిల్లీలోని వయోజనులకు మొదటి డోసు ఇవ్వడానికి కూడా చాలదు.
వేలాది మంది భారతీయులలాగే నా తండ్రి కూడా ఇదంతా భరించాల్సి ఉండేది కాదు.
ఆయన చనిపోయి ఉండాల్సింది కాదు.
(బర్ఖా దత్ అవార్డులు గెలుచుకున్న టీవీ జర్నలిస్ట్, యాంకర్, రచయిత. తాజాగా ఆమె 'హ్యూమన్స్ ఆఫ్ కోవిడ్: టు హెల్ అండ్ బ్యాక్' పుస్తకం రాశారు)
ఇవి కూడా చదవండి:
- డోలో-650 ఎలా పుట్టింది? 30 ఏళ్ల నుంచి ఉన్నా ఇప్పుడే ఎందుకింత పాపులర్ అయింది?
- ‘నాకు కరోనా వచ్చి ఏడాదైంది.. కానీ ఇప్పటికీ వాసన చూడలేకపోతున్నా’
- ‘ఈమె కావాలనే కోవిడ్ బారిన పడ్డారు’, ఆ తర్వాత ఏమైందంటే...
- కరోనా వ్యాక్సీన్‌తో నరాల బలహీనత తగ్గుతుందా.. కదల్లేని ఈయన టీకా వేసుకున్నాక ఎలా నడుస్తున్నారు
- భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ముగ్గురు బ్రిటిష్ మహిళల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













