కరోనావైరస్ ఫోర్త్ వేవ్: ఒకే వ్యక్తిలో 505 రోజులు కొనసాగిన కోవిడ్-19 ఇన్ఫెక్షన్.. ప్రమాదకర వేరియంట్లు ఇలానే పుడతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిషెల్ రాబర్ట్స్
- హోదా, బీబీసీ హెల్త్ ఎడిటర్
అతిఎక్కువ రోజులు కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌తో బాధపడినట్లుగా భావిస్తున్న కేసును బ్రిటన్‌లో డాక్టర్లు గుర్తించారు. 505 రోజులకుపైనే అంటే 16 నెలలకుపైనే సదరు వ్యక్తిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
సదరు వ్యక్తికి కొన్ని ఇతర అనారోగ్యాలు కూడా ఉన్నాయి. 2021లో ఆసుపత్రిలోనే ఆ వ్యక్తి మరణించారు. ఇలా సుదీర్ఘ కాలం ఇన్ఫెక్షన్ కొనసాగడం చాలా అరుదని లండన్‌లోని వైద్యులు వెల్లడించారు.
చాలా మందిలో ఇన్ఫెక్షన్ సాధారణంగానే తగ్గిపోతుంది. కానీ ఆ వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉండటంతో చాలా రోజులపాటు వైరస్‌తో పోరాడాల్సి వచ్చింది.
కోవిడ్-19పై అవగాహన పెంచేందుకు, దాని వల్ల కలిగే ముప్పును అంచనా వేసేందుకు ఇలాంటి ఎడతెగని ఇన్ఫెక్షన్లపై అధ్యయనం అవసరమని వైద్యులు చెబుతున్నారు.
2020 ప్రారంభంలోనే ఆ వ్యక్తికి కరోనావైరస్ సోకింది. పీసీఆర్ పరీక్ష చేయడంతో కోవిడ్-19 సోకినట్లు నిర్ధరణ అయింది.
దాదాపు 72 వారాలపాటు సదరు వ్యక్తి ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కొన్నిసార్లు ఆసుపత్రుల్లో కూడా చేరారు.

ఫొటో సోర్స్, PA Media
దాదాపు 50 సార్లు సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు. అన్నిసార్లు పాజిటివ్ వచ్చింది. అంటే శరీరంలో అన్నిరోజులు ఇన్ఫెక్షన్ ఉన్నట్లే.
ఈ విషయంపై కింగ్స్ కాలేజీ లండన్, గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ సమగ్ర అధ్యయనం చేపట్టాయి. దీంతో ఈ కేసులో మళ్లీమళ్లీ ఇన్ఫెక్షన్ సోకలేదని, ఒకే ఇన్ఫెక్షన్ ఇన్ని రోజులు కొనసాగిందని నిర్ధారణకు వచ్చారు.
యాంటీ-వైరల్ ఔషధాలు ఇచ్చినప్పటికీ సదరు వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపలేదు.
దీన్ని లాంగ్ కోవిడ్ అని చెప్పలేం. లాంగ్ కోవిడ్ అంటే శరీరం నుంచి వైరస్ వెళ్లిపోతుంది. కానీ, లక్షణాలు అలానే ఉంటాయి.
‘‘ఆ వ్యక్తికి గొంతు నుంచి స్వాబ్ సాయంతో నమూనా సేకరించి పరీక్షలు చేపట్టాం. ఒక్కసారి కూడా నెగెటివ్ రాలేదు. జన్యుపరమైన పరీక్షల సాయంతో ఇది ఒకే ఇన్ఫెక్షన్‌గా నిర్ధారించాం. దీని కోసం వైరస్ జన్యు సమాచారాన్ని విశ్లేషించాం’’అని అధ్యయనం చేపట్టిన వారిలో ఒకరైన డాక్టర్ లూక్ బ్లగ్డన్ స్నెల్ చెప్పారు.
ఇలా సుదీర్ఘ కాలం ఇన్ఫెక్షన్ కొనసాగిన కేసులు చాలా ముఖ్యమైనవని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి కేసులు కొత్త వేరియంట్లు పుట్టడానికి కారణం కావొచ్చు. అయితే, ఈ కేసు విషయంలో అలా జరగలేదు.
‘‘ఇంతకాలం శరీరంలో వైరస్ ఉందంటే, అది ఇంకా శరీర పరిస్థితులకు అలవాటు పడలేదని అర్థం. దీని వల్ల కొత్త మ్యుటేషన్లు వచ్చే ముప్పుంది’’అని స్నెల్ చెప్పారు.
‘‘ఇలా దీర్ఘకాలం ఇన్ఫెక్షన్ కొనసాగిన కేసుల్లో మేం ఆందోళనకర మ్యుటేషన్లను గుర్తించాం’’అని ఆయన చెప్పారు.
తాము పరిశోధన చేపట్టిన ఇలాంటి తొమ్మిది దీర్ఘకాల కోవిడ్-19 కేసుల్లో ఎలాంటి ప్రమాదకరమైన వేరియంట్ కనిపించలేదని ఆయన చెప్పారు.
దీర్ఘకాలం ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం చాలా తక్కువ.
ఇవి కూడా చదవండి:
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో ఎందుకు పోల్చారు? 'భారత రత్న' ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేశారు?
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











