జీరో-కోవిడ్ స్ట్రాటజీ: కరోనా కేసులు, మరణాలు అమెరికా, బ్రిటన్‌ల కంటే చైనాలోనే తక్కువా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కాయ్ వాంగ్, వాన్యుయాన్ సాంగ్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
ప్రపంచంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఉన్న అతి కఠినమైన విధానాలలో చైనా పాటించే జీరో-కోవిడ్ స్ట్రాటజీ కూడా ఒకటి.
కానీ ఇటీవల ఇన్ఫెక్షన్లలో నమోదవుతోన్న పెరుగుదల ఈ స్ట్రాటజీ గురించి పునరాలోచించేలా చేస్తోంది.
తాజా వేవ్ తీవ్రత ఎంత?
దేశవ్యాప్తంగా రోజూవారీ కేసుల్లో తాజా పెరుగుదలకు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంటే కారణం.
ఈశాన్యంలోని జిలిన్ ప్రావిన్సు మొత్తంతో పాటు, దక్షిణాన ఉన్న టెక్ హబ్ సిటీ షెన్‌జెన్‌లోని లక్షలాది మంది ప్రజలకు లాక్‌డౌన్ పాటించాలనే ఆదేశాలు అందాయి.
షాంఘైలాంటి ఇతర నగరాలు కూడా ప్రయాణాలపై ఆంక్షలు విధించడం ద్వారా కరోనా నిబంధనలను కఠినతరం చేశాయి.

చైనా వ్యాప్తంగా తాత్కాలిక ఆసుపత్రులతో పాటు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
అయితే అమెరికా, యూరప్‌లతో పోలిస్తే ఇక్కడ ఇన్ఫెక్షన్ రేట్లు తక్కువగానే ఉన్నాయి.
మార్చి 24కు ముందు వారంలో చైనాలో మొత్తం 14,000లకు పైగా కొత్త కేసులు ఉండగా... అదే సమయంలో యూకేలో 6,10,000 కొత్త కేసులు నమోదయ్యాయి.
చైనా పాలసీ ఎలా మారుతోంది?
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ చైనా కఠినమైన జీరో-కోవిడ్ వ్యూహాన్ని కొనసాగించడం కష్టంగా మారుతోంది.
అయినప్పటికీ, దానికి సంబంధించిన ప్రధాన అంశాలు అమల్లోనే ఉన్నాయి.
- చైనాకు రాకపోకలపై కఠిన పరిమితులు ఉన్నాయి. అంతర్గత ప్రయాణాలపై కూడా నిబంధనలు అమలు అవుతున్నాయి.
- చైనాలో ప్రవేశించడానికి అనుమతులు ఉన్న విదేశీ ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహించి, ప్రభుత్వం నిర్వహిస్తోన్న హోటళ్లలో కనీసం రెండు వారాల పాటు క్వారంటైన్‌కు పంపుతారు. ఆ తర్వాత వారిని మరోసారి పర్యవేక్షిస్తారు.
- సాధారణ కమ్యూనిటీల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతుంటాయి. ఇందులో కరోనా బారిన పడినట్లు తేలిన స్థానికులను వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు. అవసరమైతే ఆ ఏరియాను లాక్‌డౌన్‌లో ఉంచుతారు.
- ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు, మిగిలిన అత్యవసర సేవలకు సంబంధించిన వ్యాపారాలు తప్ప మిగతావన్నీ మూసివేశారు.
- పాఠశాలలు మూతబడ్డాయి. ప్రజా రవాణాను నిలిపివేశారు. దాదాపు అన్ని వాహనాల రాకపోకలపై నిబంధనలు విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్నందున దానికి కొన్ని నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించారు.
- తేలికపాటి లేదా స్వల్ప లక్షణాలున్న వారు ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేదు. కానీ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఒంటరిగా ఉండాలి.
- క్వారంటైన్ పీరియడ్ నియమాలను కూడా తగ్గించారు.
- నగరవ్యాప్తంగా నిర్ధరణ పరీక్షలు ఇకముందు నిర్వహించరు. కానీ స్థానిక కమ్యూనిటీ పరీక్షా కేంద్రాలు విధులు నిర్వహిస్తూనే ఉంటాయి.
- దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లలోనూ, ఆన్‌లైన్లలోనూ స్వీయ పరీక్షా కిట్లను అందుబాటులో ఉంచారు. ఇందులో పాజిటివ్‌గా తేలినవారు పీసీఆర్ పరీక్షకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా జీవో కోవిడ్ పాలసీ ఎంతవరకు విజయవంతం అయింది?
తాజా వేవ్ కంటే ముందు కరోనాను నిలువరించడంలో చైనా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతమైంది.
2019 చివరి నుంచి చైనాలో 4600 పైగా కరోనా మరణాలు నమోదవ్వగా, అమెరికాలో 9,70,000లకు పైగా, యూకేలో 1,60,000లకు పైగా మరణాలు సంభవించాయి.
అంటే చైనా భూభాగంలో పది లక్షల మందికి 3 మరణాలు నమోదు కాగా... అమెరికాలో 2,922 మంది, యూకేలో 2, 402 మంది మృత్యువాత పడ్డారు.

మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఓవరాల్‌గా చూస్తే చైనాలో నమోదైన కేసులు కూడా తక్కువే.
అయితే కరోనా అధికారిక లెక్కల కచ్చితత్వంపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ నమోదైన కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగానే ఉంది.
చైనా జనాభాలో దాదాపు 88 శాతం మంది పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్నారు. అయినప్పటికీ, జీరో కోవిడ్ పాలసీని ఇప్పటికీ పాటిస్తోన్న దేశం చైనా మాత్రమే.
వ్యాక్సినేషన్ రేటు మెరుగ్గా ఉండటంతో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సింగపూర్ దేశాలు 2021 చివర్లో తమ కఠినమైన విధానాలను కాస్త సడలించాయి.
డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా ఆ మూడు దేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. కానీ యూరప్, అమెరికాతో పోల్చితే ఇక్కడి కేసులు చాలా తక్కువగానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:
- మహిళల శారీరక, మానసిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారాలు సాధ్యమేనా... ఫెమ్టెక్ అంటే ఏంటి?
- 'బతికి ఉండగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి' - రష్యా సైనికులకు యుక్రెయిన్ హెచ్చరిక
- ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్‌లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
- కిమ్ జోంగ్ ఉన్ యాక్షన్ హీరోలా ఎందుకు మారారు? ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టారు?
- యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోయిందా? లేక వ్యూహం మార్చుకుంటోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













