‘ఈమె కావాలనే కోవిడ్ అంటించుకున్నారు’, ఆ తర్వాత ఏమైందంటే...

హనా హొర్కా

ఫొటో సోర్స్, JAROMÍR ZAJDA ZAJÍČEK

ఫొటో క్యాప్షన్, హనా హొర్కా
    • రచయిత, బెన్ టోబియాస్
    • హోదా, బీబీసీ న్యూస్

చెక్ రిపబ్లిక్‌కు చెందిన జానపద గాయని హనా హొర్కా కోవిడ్ బారిన పడి మరణించారు.

ఆమె కోవిడ్ వ్యాక్సీన్ తీసుకోలేదు. ఆమెకు కోవిడ్ సోకిన రెండు రోజుల తర్వాత కోలుకుంటున్నారన్న సమయంలో ఆదివారం మరణించారు.

ఆమె కొడుకు, తండ్రికి వైరస్ సోకినప్పుడు కావాలనే వారికి దగ్గరగా మెలగడంతో ఆమెకు కూడా కోవిడ్ సోకినట్లు ఆమె కుమారుడు జాన్ రెక్ చెప్పారు.

కరోనా సోకిన సమయంలో తన తల్లి మాత్రం తమ నుంచి దూరంగా ఉండేందుకు అంగీకరించలేదని చెప్పారు. దాంతో, ఆమె కూడా వైరస్ బారిన పడ్డారు.

"మాకు పాజిటివ్ రావడంతో ఆమె కనీసం ఒక వారం రోజులు విడిగా ఉండాల్సింది. కానీ, ఆమె పూర్తి సమయాన్ని మాతోనే గడిపారు" అని చెప్పారు.

హనా భర్త, కుమారుడు ఇద్దరూ వ్యాక్సీన్ తీసుకున్నారు. కానీ ఆమె మాత్రం మొదటి నుంచి వ్యాక్సీన్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

హనా హొర్కా కొడుకుతో కలిసి

ఫొటో సోర్స్, FAMILY PHOTO

ఫొటో క్యాప్షన్, కొడుకుతో హనా హొర్కా

ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం

చెక్ రిపబ్లిక్‌లో సినిమాలు, బార్లు, ఇతర సాంస్కృతిక కేంద్రాలకు వెళ్లాలంటే వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లు ఆధారాలు కానీ, లేదా ఇటీవల వైరస్ బారిన పడి కోలుకున్నట్లు పత్రాలు కానీ చూపించడం తప్పనిసరి.

అంటే టీకాలు తీసుకున్న వారిని, కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిని మాత్రమే ఇలాంటి ప్రదేశాల్లోకి రానిస్తారు.

"అసోనాన్స్ అనే జానపద బృందంలో హనా హొర్కా సభ్యురాలు. ఇలాంటి కేంద్రాలకు వెళ్లకుండా తనను ఆపకూడదనే ఉద్దేశంతోనే ఆమె కోవిడ్ బారిన పడాలని కోరుకున్నారు" అని ఆమె కొడుకు చెప్పారు.

ఆమె మరణానికి రెండు రోజుల ముందు ఆమె కోలుకున్నట్లు సోషల్ మీడియాలో రాశారు.

"ఇక ఒక థియేటర్, సోనా, కచేరీ ఉంటాయి" అని ఆమె రాశారు.

"ఆమె చనిపోవడానికి ముందు కూడా ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. వాకింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంతలో ఆమెకు నడుం నొప్పి విపరీతంగా రావడంతో, బెడ్ రూమ్‌లో నడుం వాల్చేందుకు వెళ్లారు."

"మరో 10 నిమిషాల్లో అంతా అయిపోయింది. ఆమె ప్రాణాలు ఇక లేవు" అని ఆమె కొడుకు చెప్పారు.

ఆమె వ్యాక్సీన్ తీసుకోనప్పటికీ టీకాల గురించి ప్రచారంలో ఉన్న కుట్ర సిద్ధాంతాలను ఆమె నమ్మలేదని ఆయన చెప్పారు.

"వ్యాక్సీన్ తీసుకోవడం కంటే కూడా కోవిడ్ వైరస్‌తో పోరాడటం ఉత్తమం" అని ఆమె అనుకున్నారు.

అయితే, ఆమె భావోద్వేగాలకు లోనవుతారని టీకాల గురించి ఆమెతో చర్చించలేదని అన్నారు.

కానీ ఇప్పుడు వ్యాక్సీన్ పట్ల విముఖత చూపేవారిని టీకాలు తీసుకునేందుకు ఒప్పించవచ్చనే ఉద్దేశ్యంతో తమ అనుభవాన్ని పంచుకుంటున్నట్లు జాన్ రెక్ చెప్పారు.

కోవిడ్ టీకా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్ టీకాలకు వ్యతిరేకంగా నిరసనలు

ప్రజలను వ్యాక్సీన్ తీసుకోవడానికి ఒప్పించేందుకు గ్రాఫులు, గణాంకాల కంటే కూడా నిజ జీవిత ఉదాహరణలు శక్తివంతంగా పని చేస్తాయి. సంఖ్యలతో సానుభూతి చూపించలేం" అని అన్నారు.

1.7 కోట్ల జనాభా ఉన్న చెక్ రిపబ్లిక్‌లో బుధవారం 28,469 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ కేసుల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు నిర్వహించడం లాంటి చర్యలను ప్రవేశపెట్టింది.

కొన్ని వర్గాల వారికి వ్యాక్సిన్లను తప్పనిసరి చేసే ప్రణాళికలను కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సీన్లను తప్పనిసరి చేసే నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల మొదట్లో, ప్రేగ్‌లో, ఇతర నగరాల్లో కొన్ని వేల మంది ప్రదర్శనలు నిర్వహించారు.

చెక్ రిపబ్లిక్‌లో సుమారు 63 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. యూరోపియన్ యూనియన్‌లో సగటున 69% వ్యాక్సినేషన్ పూర్తయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)