ఆర్కిటిక్‌ ప్రాంతంపై హక్కులెవరికి ఉన్నాయి? అక్కడ ఆయిల్, గ్యాస్ ఎవరైనా తవ్వుకోవచ్చా

ఆర్కిటిక్‌లో ఆయిల్, గ్యాస్ తవ్వకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్కిటిక్‌లో ఆయిల్, గ్యాస్ తవ్వకాలు

ఆర్కిటిక్‌ ప్రాంతంలో చమురు, సహజవాయు నిక్షేపాల కోసం ఇంధన కంపెనీలు తవ్వకాలు జరపొచ్చా అనే విషయంలో కోర్టు కేసు ఒకటి నడుస్తోంది.

నార్వే ప్రభుత్వం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో పర్యావరణ ఉద్యమకారులు 'యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్'(ఈసీహెచ్ఆర్)ను ఆశ్రయించారు.

ఆర్కిటిక్ ప్రాంతంలో ఎంతమేర సహజ వనరుల తవ్వకాలు జరపొచ్చనే విషయంలో స్పష్టత ఇచ్చే కేసుగా దీన్ని చూడొచ్చు.

ఆర్కిటిక్ ప్రాంతం ఎవరికి చెందుతుంది? అక్కడ చమురు, సహజవాయు నిక్షేపాలు ఎంత ఉన్నాయి ?

అమెరికా జియోలాజికల్ సర్వే అంచనాల ప్రకారం.. 16 కోట్ల బ్యారళ్ల చమురు, భూమిపై ఇంకా వెలికితీయని గ్యాస్‌లో 30 శాతం ఆర్కిటిక్ వలయంలోనే ఉన్నాయి.

నార్వే, రష్యా, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, అమెరికా, కెనడా, డెన్మార్క్(గ్రీన్‌లాండ్‌ను కలిగి ఉన్న దేశం)లకు ఆర్కిటిక్ సర్కిల్‌లో ప్రాదేశిక జలాలు, ప్రాదేశిక భూభాగం ఉన్నాయి.

ఆర్కిటిక్ ప్రాంతంలో అత్యధికం సముద్రం.. ఆర్థికాభివృద్ధి చర్యల నుంచి అక్కడి పర్యావరణాన్ని రక్షించేందుకు అంటార్కిటిక్ ప్రాంతంలో ఉన్నట్లు ఆర్కిటిక్‌లో అంతర్జాతీయ ఒప్పందాలేమీ లేవు.

భూతాపం కారణంగా ఆర్కిటిక్‌ ఉత్తర ప్రాంతంలో మంచు కరగడం వల్ల తవ్వకాలు మరింత సులభమైపోయాయి.

ఆర్కిటిక్ సర్కిల్‌లో దేశాలు
ఫొటో క్యాప్షన్, ఆర్కిటిక్ సర్కిల్‌లో దేశాలు

నార్వే కోర్టు కేసు ఏమిటి?

పశ్చిమ యూరప్‌లో చమురు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం నార్వే. ఆర్కిటిక్ వలయంలోని బారెంట్స్ సముద్రంలో చమురు, సహజవాయు నిక్షేపాల తవ్వకాల కోసం 2016 నుంచి నార్వే అనుమతులు ఇస్తోంది.

2021లో నార్వే యువతీయువకులు ఆరుగురు, రెండు పర్యావరణ పరిరక్షణ బృందాలు 'గ్రీన్‌పీస్ నార్డిక్', 'యంగ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద ఎర్త్‌' కలిసి ఈసీహెచ్ఆర్‌లో నార్వే ప్రభుత్వ విధానాలపై కేసు వేశారు.

''వాతావరణ సంక్షోభ సమయంలో కొత్తగా తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో నార్వే మనుషుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లయింది'' అంటూ పర్యావరణ ఉద్యమకారులు కోర్టులో తమ వాదనలు వినిపించారు.

ఆర్కిటిక్‌ ప్రాంతంలో డ్రిల్లింగ్ జరపడం వల్ల ధ్రువపు మంచు ఫలకాలు కలుషితమై తొందరగా కరిగిపోయే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.

జీవించే హక్కును పరిరక్షించే 'యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్'లోని ఆర్టికల్ 2, కుటుంబ, గృహస్థ జీవితాన్ని పరిరక్షించే హక్కు కల్పించే ఆర్టికల్ 8ని వీరు ఈ సందర్భంగా ఉటంకించారు.

పర్యావరణ ప్రచారకర్త మియా చాంబర్లయిన్ దీనిపై మాట్లాడుతూ.. ''ఫిర్యాదు చేయడం వల్ల ఈ విపత్కర డ్రిల్లింగ్‌ను ఆపే అవకాశం ఉంటుంది'' అని అన్నారు.

వీడియో క్యాప్షన్, పెరిగిన పెట్రోల్ ధరలతో తల్లడిల్లుతున్న జీవితాలివి

నార్వే ఉత్తర ప్రాంతంలో నివసించే స్థానిక సమీ తెగకు చెందిన ఎన్విరాన్‌మెంట్ యాక్టివిస్ట్ లాసె ఎరిక్సన్ జోయర్న్ రాయిటర్స్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. డ్రిలింగ్ వల్ల ఆర్కిటిక్ ప్రాంత మత్స్యకారులపై ప్రభావం పడుతుందని, వారి జీవన విధానానికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు.

నార్వేలోని మూడు కోర్టులు వీరి కేసును తిరస్కరించాయి. అయితే, ఈసీహెచ్ఆర్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ నార్వే ప్రభుత్వ స్పందనను కోరింది.

దాంతో నార్వే ప్రభుత్వం.. 'వాతావరణ మార్పుల ప్రభావాన్ని నివారించేందుకు జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు నార్వే సహకరిస్తోంది, 2050 నాటికి కర్బన ఉద్గార శూన్యత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది' అని ఈసీహెచ్‌ఆర్‌కు తెలిపింది.

పునరుత్పాదక ఇంధనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ముందే ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి తగ్గించడమనేది నార్వే సమాజానికి నష్టం కలిగిస్తుందని ఆ ప్రభుత్వం చెప్పింది.

యూరోపియన్ యూనియన్ అంతటా ఇలాంటి ఉదంతాలలో ఒక ఉదాహరణగా ఉండేలా ఈ కేసులో తీర్పు ఇవ్వాలనుకుంటోంది ఈసీహెచ్ఆర్. ఇందుకు మరికొన్ని నెలలు పట్టొచ్చు.

చమురు తవ్వకాలు

ఫొటో సోర్స్, EPA

ఆర్కిటిక్‌లో ఇంకా ఎవరు డ్రిల్లింగ్ జరుపుతున్నారు..

రష్యా కంపెనీలు గత దశాబ్ద కాలంగా ఆర్కిటిక్ ప్రాంతంలో పనిచేస్తున్నాయి. రెండేళ్ల కిందట ఆర్కిటిక్ సముద్రంలో భారీ ఎత్తున చమురు ఒలికిపోయింది.

1989లో అలస్కాలో ఎక్సాన్ వాల్డెజ్ ఆయిల్ స్పిల్ ఘటన తరువాత కూడా ఉత్తర అలస్కాలో చమురు, సహజవాయు తవ్వకాలకు అమెరికా ప్రతిపాదిస్తోంది.

ఆర్కిటిక్ ప్రాంతంలో దేశాలకు ఏఏ హక్కులుంటాయి?

ఆర్కిటిక్ వలయంలో ప్రాదేశిక భూభాగం ఉన్న అన్ని దేశాలకూ వారి తీరానికి సమీపాన సముద్రపు అడుగు భాగంపై హక్కులుంటాయి.

తీరం నుంచి 370 కిలోమీటర్లు(200 నాటికల్ మైళ్లు) వరకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈ ఆర్థిక మండళ్లలో చేపల వేట, నిర్మాణాలు, సహజ వనరుల తవ్వకాలకు వారికి హక్కు ఉంటుంది.

తమ దేశానికి చెందిన భూభాగం సముద్రంలోకి ఇంకా ఉందని నిరూపించుకోగలిగితే దేశాలు ఈ జోన్‌ను మరింత దూరం పెంచుకోవచ్చు.

ఉత్తర ధ్రువం మీదుగా సముద్రగర్భంలో 1,721 కిలోమీటర్ల పొడవున ఉన్న లోమోనోసోవ్ రిడ్జ్ అని పిలిచే పర్వత శ్రేణి ఎవరికి చెందుతుందనే విషయంలో వివాదం ఉంది.

కెనడా, రష్యా, గ్రీన్‌లాండ్‌లు ఈ పర్వత శ్రేణి తమ సొంతమని క్లెయిమ్ చేసుకుంటున్నాయి.

ఈ పర్వత శ్రేణి ఎవరిదని తేలుతుందో వారు 55,000 చదరపు మైళ్ల(142449.35 చదరపు కిలోమీటర్లు) సముద్రాన్ని కూడా క్లెయిమ్ చేసుకోగలగుతారు.

ఉత్తర ధ్రువం వద్ద సముద్ర గర్భంలో రష్యా 2007లో తన జెండా పాతడంతో ఆర్కిటిక్ ప్రాంత ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి.

ఆర్కిటిక్ ప్రాంతంలో దేశాలకు ఉండే హక్కులు

పర్యావరణ ఉద్యమకారులు ఇలాంటి కేసులను గతంలో గెలిచారా?

ప్రభుత్వాలను హరిత మార్గం పట్టించేందుకు పర్యావరణ ఉద్యమకారులు కోర్టులను ఉపయోగించుకోవడం పెరుగుతోంది.

గత ఏడాది నెదర్లాండ్స్‌లోని ఓ కోర్టు ఇంధన సంస్థ 'రాయల్ డచ్ షెల్'ను 2019లో ఆ సంస్థ వల్ల వెలువడిన ఉద్గారాల కంటే 2030 నాటికి 45 శాతం తగ్గాలని ఆదేశించింది.

'ఫ్రెండ్స్ ఆఫ్ ద ఎర్త్' పర్యావరణ సంస్థ ఈ కేసు వేసింది.

అమెజాన్ వర్షారణ్యాలలో వృక్షాల నరికివేతను తక్షణం నిలిపివేయాలని కొలంబియా సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)