ఆంధ్రప్రదేశ్: వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఎవరు దాడి చేశారు? ఎందుకు

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
వైసీపీకి చెందిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి జరిగింది. ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి.
జి.కొత్తపల్లిలో వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్‌ని శనివారం తెల్లవారుజామున కొందరు హత్య చేశారు. దీంతో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉదయాన్నే ఎమ్మెల్యే ఆ గ్రామానికి చేరుకున్నారు.
ఆ సమయంలో గంజి ప్రసాద్ అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో కొందరు ఏకంగా ఎమ్మెల్యే మీద దాడికి పాల్పడ్డారు. పోలీసులు వారించినా ఆగకుండా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారు.
దాంతో ఎమ్మెల్యే వెంకట్రావుని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి బయటపడ్డారు.

ఫొటో సోర్స్, ugc
స్థానిక రాజకీయాలే హత్యకు కారణమా
ద్వారకా తిరుమల మండలంలోని జి.కొత్తపల్లిలో స్థానిక కారణాలతో చాలాకాలంగా వర్గపోరు సాగుతోంది. వైసీపీలో నాయకుడిగా ఉన్న గంజి ప్రసాద్‌తో, ఓ ఎంపీటీసీకి విబేధాలున్నాయని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు.
గంజి ప్రసాద్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకి సన్నిహితంగా ఉండేవారని గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పి.రాము బీబీసీతో చెప్పారు.
అయితే, తన అనుచరుడినే హత్యకు గురికాకుండా కాపాడలేకపోయారనే అభిప్రాయంతో ఎమ్మెల్యేపై కొందరు దాడికి ప్రయత్నించినట్టు రాము చెప్పారు.
గంజి ప్రసాద్‌ని కొందరు దుండగులు గ్రామ సమీపంలోని పొలాల్లో నరికి చంపారు. దాంతో ఆయన అనుచరులు ఆగ్రహోదక్తులయ్యారు. ఈ హత్యకు గ్రామంలోని రెండో వర్గం కారణమనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఫొటో సోర్స్, ugc
ఎమ్మెల్యేపై ఆగ్రహం
హత్య సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఆ గ్రామానికి బయలుదేరారు. ద్వారకా తిరుమల మండలంలో వైసీపీ నాయకుడిగా ఉన్న వ్యక్తి హత్యకు గురికావడంతో ఎమ్మెల్యే హడావిడిగా అక్కడికి చేరుకున్నారు.
గ్రామంలో తమ నాయకుడి మరణంతో కోపంతో ఉన్న కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ గంజి ప్రసాద్‌కి తగిన రీతిలో అండదండలు అందించలేదంటూ ఆరోపించారు.
ఈ హత్యకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలని కూడా కొందరు నిలదీశారు. ఆ క్రమంలో కొందరు దురుసుగా ప్రవర్తించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు యత్నించినా ఆగలేదు.

ఫొటో సోర్స్, ugc
‘గ్రామంలో పరిస్థితి అదుపులో ఉంది’
గంజి ప్రసాద్ హత్యపై ద్వారకా తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానితులకు సంబంధించి కుటుంబ సభ్యులతో పాటుగా స్థానికుల నుంచి వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తామని అంటున్నారు.
మరోవైపు ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన వారిని అడ్డుకున్నామని ద్వారకా తిరుమల పోలీసులు బీబీసీకి తెలిపారు. ఎమ్మెల్యేపై దాడికి దిగిన వారిపై కూడా చట్టపరమైన చర్యలుంటాయని పేర్కొన్నారు.
గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, అదనపు పోలీసు సిబ్బందిని తరలించామని అన్నారు.
ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి విశ్వరూప్ ఏమన్నారంటే
ద్వారకా తిరుమల మండలంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి యత్నించడం సరికాదని ఏలూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు.
బీబీసీతో ఆయన మాట్లాడుతూ... "ఈ ఘటన దురదృష్టకరం. పూర్వాపరాలు తెలుసుకుంటున్నాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. దౌర్జన్యకర చర్యలను సహించేది లేదు. స్థానిక నాయకుడి హత్యకు కారకులను పట్టుకుంటాం. హత్యా రాజకీయాలను కొనసాగనివ్వం. ఎమ్మెల్యేపై దాడికి యత్నించడాన్ని కూడా ఖండిస్తున్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ గురించి ప్రశాంత్ కిశోర్ ఏం చెప్పారు
- వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?
- విదేశాంగ మంత్రి జైశంకర్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?
- కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'
- మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













