శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస: ‘భూతవైద్యులు చెప్పారని లాక్‌డౌన్ విధించుకుని, హిజ్రాలతో పూజలు’ చేయించిన గ్రామంలో ఇప్పుడేం జరుగుతోంది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం..
భూత వైద్యులు చెప్పిన పూజలు చేసుకుంటామని ఊరిని లాక్ డౌన్ చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస గ్రామస్ధులు. గ్రామంలో బడి, గుడి, సచివాలయం అన్ని కూడా లాక్ అయ్యాయి. గ్రామంలోకి ఎవరు రాకుండా, గ్రామం నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా గ్రామంలోని దారులను ముళ్ల కంచెలు, మొక్కలు దారులకు అడ్డంగా వేశారు. అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది? ఎందుకు లాక్ డౌన్?
"దేశమంతా అన్ లాక్...ఈ గ్రామంలో లాక్ డౌన్"
కరోనా పోయి దేశమంతా అన్ లాక్ అవుతుంటే...శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస అనే గిరిజన గ్రామంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నెల 17 వ తేదీ నుంచి 25 వరకు ఊరిలో గ్రామస్తులే స్వీయ లాక్ డౌన్ విధించుకున్నారు. విజయనగరం, ఒడిశాకు చెందిన కొందరు మంత్రగాళ్లు ఇలా చేస్తే ఊరికి మంచిదని చెప్పారని.. అందుకే చేస్తున్నామని గ్రామస్థులు చెప్పారు.
"ఈనెల మొదటి వారంలో గ్రామస్ధులమందరం ఊరి గుడి వద్ద సమావేశం పెట్టుకున్నాం. ఆ సమావేశంలో ఊరికి పట్టిన కీడు పోవాలంటే ఏం చేయాలని చర్చించాం. అందులో భాగంగా ఎవరైనా భూత వైద్యులను సంప్రదిస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చాం. దాంతో విజయనగరం, ఒడిశాలలో కొందరు భూతవైద్యులు, మంత్రగాళ్లు అని చెప్పుకునే వాళ్ళని సంప్రదించాం. వారు మా ఊరు వచ్చి చూస్తామని చెప్పారు. ఆ తర్వాత రెండు వారాలకి కొందరు మా గ్రామానికి వచ్చారు. మా గ్రామమంతా చుట్టూ తిరిగి ఇక్కడ కొన్ని క్షుద్రశక్తులు ఉన్నాయని వాటికి శాంతి పూజలు చేయాలని చెప్పారు."అని వెన్నెలవలస గ్రామానికి చెందిన శ్రీను చెప్పారు.
ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరిగింది..?
వెన్నెలవలస గ్రామంలో గత మూడు నెలల కాలంలో ఐదుగురు మరణించారు. అయితే వీరంతా ఎటువంటి అనారోగ్యం లేకుండా మరణించారని, గ్రామానికి ఏదో కీడు జరుగుతోందని భావించి గ్రామస్థులు అందోళనకు గురైయ్యారు. దాంతో భూత వైద్యులను సంప్రదించారు.
"గ్రామంలో క్షుద్రశక్తులు ఉన్నాయని చెప్పగానే భయపడిపోయాం. ఇప్పటికే వరుసగా ఏ కారణం లేకుండా చనిపోతున్నారు. భూత వైద్యులు కూడా ఊరికి ఇంకా అరిష్టం జరిగే ప్రమాదముందని చెప్పారు. దాంతో ఊర్లో వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉందని, పూజలు చేయాలని చెప్పుకున్నాం. పూజల కోసం కొన్ని సరుకులు కొన్నారు. అలాగే పూజలు చేసేందుకు ఫీజు కూడా అడిగారు. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ పూజలు చేయాలని చెప్పారు. ఫీజు ఇస్తామని, పూజలు చేయమని చెప్పాం" అని భూత వైద్యులను కలిసేందుకు వెళ్ళిన వారిలో ఒకరైన మహేష్ చెప్పారు.
'పూజల కోసం చందాలు'
భూత వైద్యులు చెప్పిన పూజలు చేయడం కోసం గ్రామంలో అందరు ఒక మాటపైకి వచ్చి లౌక్ డౌన్ విధించుకున్నారు. అందులో భాగంగానే గ్రామంలోకి రాకపోకలను బంద్ చేశారు. పాఠశాల, గుడి, అంగన్ వాడీ కేంద్రం, సచివాలయంలను కూడా మూసేశారు. తొమ్మిది రోజులు కావలసిన నిత్యావసర సరుకులను తెచ్చుకున్నారు గ్రామాల నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా నిబంధన విధించుకున్నారు. సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులను గ్రామానికి రావద్దని హెచ్చరించారు. రాత్రి వేళల్లో పూజలు చేయడం మొదలు పెట్టారు. ఈ గ్రామంలో రాత్రి వేళ్లల్లో పూజలు నిర్వహిస్తున్న విషయం తెలిసి భయాందోళనలకు గురైన చుట్టుపక్కల గ్రామస్ధులు పోలీసులు ఫిర్యాదు చేశారు.
'కంచెలు తొలగింపు... కౌన్సెలింగ్'
సరుబుజ్జిలి మండలం అముదాలవలస సర్కిల్ పోలీసులు పరిధిలోకి వస్తుంది. ఈ సంఘటనలపై బీబీసీ అముదాలవలస సీఐ పైడయ్యతో మాట్లాడింది.
"19.04.22న ఈ పూజల విషయం తెలిసి, సరుబుజ్జిలి పోలీసులను అక్కడకు పంపిచాను. గ్రామంలోకి ఎవరూ రాకుండా వేసి ఉన్న కంచెలను తొలగించాం. ఐదుగురు హిజ్రాలను తీసుకుని వచ్చి గ్రామంలో పూజలు చేసి... గ్రామంలో రాకపోకలను బంద్ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో పూజలు జరిగిన మాట వాస్తవమే కానీ అవి క్షుద్రపూజలు కాదని, కొందరు హిజ్రాలను తీసుకుని వచ్చి భూత వైద్యులు చెప్పిన విధంగా పూజలు మాత్రమే చేశామని గ్రామస్తులు తెలిపారు. ఇటువంటి పూజలు చేయడం, గ్రామంలోకి రాకపోకలు అడ్డుకోవడం మంచిది కాదని కౌన్సిలింగ్ ఇచ్చాం. గ్రామస్తులు అందరితో భూత వైద్యులమని చెప్పుకునే వారి మాటలు నమ్మకండి అని ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచించాం" అని సీఐ పైడయ్య బీబీసీకి తెలిపారు.
గ్రామంలోకి ఎవరైనా వస్తే...వారికి కూడా కీడు కలుగుతుందనే ఉద్దేశంతోనే గ్రామంలో లాక్ డౌన్ విధించామని గ్రామస్థులు తమకి తెలిపినట్లు పోలీసులు చెప్పారు.

'ఇటువంటి గ్రామాల్లో అధికారులు చైతన్యం తీసుకురావాలి'
స్వీయ లాక్ డౌన్ విధించుకుని భూత వైద్యులు చెప్పారంటూ గ్రామంలో ఏవేవో పూజలు చేయడం అనాగరిక చర్య అని, దీనికి స్థానికంగా పనిచేసే అధికారులే బాధ్యత వహించాలని హేతువాదులు అంటున్నారు. వెన్నెలవలస సంఘటనపై బీబీసీతో హేతువాది, ఉపాధ్యాయురాలు గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడారు.
"వెన్నెలవలస గిరిజన గ్రామమే కానీ మరీ ఇంటీరియర్ ఏజెన్సీ అయితే కాదు. అటువంటి చోట కూడా లాక్డౌన్ విధించుకుని దెయ్యాలు, భూతాలు పేరిట పూజలు చేయడం అంటే మన సమాజంలో ఎటువంటి జ్ఞానం వ్యాప్తి చెందుతుందో అర్థమవుతోంది. ఆ గ్రామంలో బడి, సచివాలయం ఇవన్నీ ఉన్నప్పటికీ వారు ఎవరూ కూడా గ్రామస్తులకు అవగాహన కల్పించక పోవడం బాధకరం. తొమ్మిది రోజుల లాక్ డౌన్ విధించుకుంటే, అది వెలుగులోకి రావడానికి ఆలస్యం కావడం అంటే ఎవరూ నోరు మెదపలేదు అని అర్థమవుతోంది. ఇటువంటి గ్రామాలపై ప్రభుత్వం దృష్టి సారించి అక్కడున్న వారిని చైతన్యపరిచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందుకు హేతువాదులుగా అవసరమైన సహకారం మేము అందిస్తాం" అని గూడూరు సీతామహాలక్ష్మి చెప్పారు.
వెన్నెలవలసలో ప్రస్తుతం ఏం జరుగుతోంది?
మీడియాలో కథనాలు రావడం, పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం.. తదితర పరిణామాలతో గ్రామంలో ప్రస్తుతం రాకపోకలకు ఇబ్బంది లేదు. దారులకు అడ్డంగా వేసిన కంచెలను తొలగించారు. అయితే ఈ విషయంపై మరింత సమాచారం తెలుసుకునేందుకు ఎవరైనా వెళ్తే గ్రామస్తులు మాట్లాడటం లేదు. పూజలు చేస్తున్నారా లేదా అని అడిగితే వెన్నెలవలస గ్రామస్ధులు సమాధానం చెప్పడం లేదు. పోలీసులు అడిగితే మాత్రం పూజలేవి చేయడం లేదని చెప్తున్నారు. కానీ భూత వైద్యులు చెప్పారంటూ పూజలు చేసిన రాళ్ళు, ఇతర వస్తువులు అన్నీ అలాగే ఉన్నాయని, వాటిని తొలగించలేదని వెన్నెలవలసపై నుండి రాకపోకలు సాగించే సమీప గ్రామస్ధులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- బోరిస్ జాన్సన్- నరేంద్ర మోదీ చర్చలు: స్కాచ్ విస్కీ ధర తగ్గుతుందా? స్చేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఏముంటాయి
- కాకాణి Vs అనిల్: 1960ల నుంచీ నెల్లూరు రాజకీయాల్లో వర్గ పోరు చరిత్ర ఇదీ..
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- ఇళయరాజా: నరేంద్ర మోదీని అంబేడ్కర్‌తో ఎందుకు పోల్చారు? 'భారత రత్న' ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేశారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















