పోర్న్ వీడియోలను పార్లమెంటులో చూశారని బ్రిటన్ ఎంపీ నీల్ పరీశ్‌పై ఆరోపణలు... అసలేమిటీ వివాదం

ఫొటో సోర్స్, Pool
ప్రతినిధుల సభలో అశ్లీల దృశ్యాలు చూసినట్లు బ్రిటన్ ఎంపీ నీల్ పరీశ్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే, పొరపాటున ఆ వీడియోలను తెరిచానని ఆయన చెబుతున్నారు.
ఆయన పోర్న్ చూస్తుండగా తాము చూశామని ఆయనకు సమీపంలో కూర్చున్న ఇద్దరు మహిళా ఎంపీలు ఫిర్యాదుచేశారు.
కన్సర్వేటివ్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంట్ స్టాండర్డ్స్ కమిషనర్ క్యాథరిన్ స్టోన్ విచారణ చేపడుతున్నారు.
ఎంపీల నిబంధనావళి ఆయన ఉల్లంఘించినట్లు రుజువైతే, సభకు ఆయన క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది. ఆపై ఆయన్ను సస్పెండ్ చేయొచ్చు. లేదా అనర్హత వేటు కూడా వేయొచ్చు.
ఈ ఆరోపణలపై ఆయనతో బీబీసీ మాట్లాడింది. తను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, దర్యాప్తు పూర్తయ్యే వరకు దీనిపై తాను మాట్లాడబోనని అన్నారు.

ఫొటో సోర్స్, UK Parliament
‘‘ఇది తలవంపులు తెచ్చే ఘటనే. నాకు మాత్రమే కాదు. నా భార్య, కుటుంబం అందరూ ఆందోళన పడుతున్నారు. అదృష్టవశాత్తు ఈ విషయంలో నా భార్య నాకు అండగా నిలుస్తున్నారు. నేను ఆమెకు ధన్యవాదాలు చెప్పాలి’’అని ఆయన అన్నారు.
పొరపాటున ఆ దృశ్యాలను తెరిచారా? అని ప్రశ్నించినప్పుడు ‘‘విచారణ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను’’అని ఆయన అన్నారు.
మరోసారి కూడా పొరపాటున తెరిచారా అని ప్రశ్నించినప్పుడు ‘‘అవును. అయితే, దర్యాప్తులో ఆ విషయం తెలుస్తుంది’’అని ఆయన చెప్పారు.
దోషిగా నిరూపణ అయితే, రాజీనామా చేస్తానని పరీశ్ అన్నారు. తన వల్ల కలిగిన ఇబ్బందికి ఆయన క్షమాపణలు చెప్పారు.
అయితే, ఎంపీగా, పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా ఆయన కొనసాగుతారని ఆయన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. కానీ, ఆయన రాజీనామా చేయాలని మహిళా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.
ఎలా బయటకు వచ్చింది?
ప్రతినిధుల సభలో తన పక్కన కూర్చున్న ఒక ఎంపీ అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని ఓ మహిళా మంత్రి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సెలెక్ట్ కమిటీ సమావేశాల్లోనూ ఆయన పోర్న్ చూడటాన్ని తాను చూశానని ఆమె చెప్పినట్లు ద టైమ్స్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది.
మరో మహిళా ఎంపీ కూడా ఆయన పోర్న్ చూడటాన్ని గమనించానని సభకు తెలియజేశారు. అయితే, తను ఆ దృశ్యాన్ని వీడియోగా రికార్డు చేయలేకపోయానని ఆమె చెప్పారు.
వీరిద్దరూ పరీశ్ గురించే ఆ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఈ ఆరోపణలపై విచారణ చేపట్టాలని తనకు తాను గానే ఆయన సభకు సూచించారు.
వెర్టన్ అండ్ హోనిటన్‌ల నుంచి ఎంపీగా కొనసాగుతున్న పరీశ్.. పర్యావరణం, ఆహారం, గ్రామీణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా ఉన్నారు.
ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నప్పటికీ, ఆయన ఈ పదవుల్లో కొనసాగొచ్చు.
‘‘తలవంపులు తెచ్చేలా’’
పరీశ్ భార్య స్యూ పరీశ్ ద టైమ్స్‌తో మాట్లాడారు. ‘‘ఈ ఆరోపణలు తలవంపులు తెస్తున్నాయి. నా భర్త చాలా మంచివారు’’అని ఆమె చెప్పారు.
పోర్న్‌కు ఆయనేమీ బానిసకాదని, ఎందుకు మహిళలు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదని ఆమె అన్నారు.
మరోవైపు ఈ విషయంపై విచారణ చేపట్టాలని పార్లమెంటు ఫిర్యాదులు, సాధకబాధకాల విభాగానికి కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ విప్ క్రిస్ హీటన్ హ్యారిస్ సూచించారు.
ప్రభుత్వానికి ఈ విషయం ఎప్పటినుంచో తెలుసని, దీన్ని కప్పుపుచ్చేందుకు కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నిస్తోందని లేబర్ పార్టీ నాయకురాలు థంగం దెబొనైర్ ఆరోపించారు.
తక్షణమే అన్ని పదవులకూ రాజీనామా సమర్పించాలని పరీశ్‌కు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆదేశాలు జారీచేయాలని లిబరల్ డెమొక్రాట్ డిప్యూటీ లీడర్ డెయిసీ కూపర్ డిమాండ్ చేశారు.
నీల్ పరీశ్ ఎవరు?
65ఏళ్ల పరీశ్ 2010 నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 1999 నుంచి 2009 మధ్య ఆగ్నేయ ఇంగ్లండ్ నుంచి యూరోపియన్ పార్లమెంటుకు ఎంపీగా కొనసాగారు.
కుటుంబంతోపాటుగా వ్యవసాయం చేసేందుకు 16 ఏళ్లకే ఆయన స్కూల్ మానేశారు. 2000లో జింబాబ్వే పార్లమెంటరీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లారు.
2016లో ఆయన బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించారు. డేవిడ్ కామెరూన్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్వలింగ సంపర్కుల వివాహాల బిల్లును కూడా ఆయన వ్యతిరేకించారు.
పరీశ్‌కు ఇద్దరు పిల్లలు, ఇద్దరు మనుమళ్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ గురించి ప్రశాంత్ కిశోర్ ఏం చెప్పారు
- వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?
- విదేశాంగ మంత్రి జైశంకర్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?
- కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'
- మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














