చార్లెస్ డార్విన్ రాసిన నోట్‌బుక్స్ 22 ఏళ్ల క్రితం అనూహ్యంగా మాయమయ్యాయి.. ఇప్పుడు అంతే విచిత్రంగా దొరికాయి

ఫొటో సోర్స్, CAMBRIDGE UNIVERSITY LIBRARY
బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైబ్రరీలో, అందరూ తిరిగే ప్రదేశంలోని నేలపై గులాబీ రంగులో ఒక కాగితపు సంచి ఉండటం గుర్తించారు.
ఆ కాగితపు సంచిలో రెండు నోట్‌బుక్స్ ఉన్నాయి.
అవి బ్రిటిష్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ రాసిన నోట్‌బుక్స్. 22 ఏళ్ల క్రితం అవి కనిపించకుండా పోయాయి.
నోట్‌బుక్స్‌తో పాటు గోధుమ రంగు ఎన్వలప్‌లో ఒక నోట్ లభించింది.
ఆ నోట్‌లో ''లైబ్రేరియన్ హ్యాపీ ఈస్టర్ ఎక్స్'' అని రాసి ఉంది. పుస్తకాలను కవర్‌తో చుట్టి నీలం రంగు డబ్బాలో ఉంచారు. ఆ డబ్బాను గులాబీ రంగు కాగితపు సంచిలో పెట్టారు.

ఫొటో సోర్స్, CAMBRIDGE UNIVERSITY LIBRARY
''నాకు చాలా సంతోషంగా ఉంది. అవి సురక్షితంగా, మంచి స్థితిలో ఉన్నాయి. తిరిగి సొంతగూటికి వచ్చేశాయి'' అని లైబ్రేరియన్ జెస్సికా గార్డ్‌నర్ నవ్వుతూ అన్నారు.
లక్షల డాలర్ల విలువ చేసే ఈ పుస్తకాలను ఎవరు కొట్టేశారో, మార్చి 9వ తేదీన మళ్లీ వీటిని లైబ్రరీకి ఎవరు చేర్చారో ఇంకా పోలీసులకు మిస్టరీగానే మిగిలిపోయింది.
పుస్తకాలు లభ్యమైనట్లు ఈ వారంలోనే పోలీసులు ప్రకటించారు.

ఫొటో సోర్స్, CAMBRIDGE UNIVERSITY LIBRARY
పరిణామ సిద్ధాంతానికి సంబంధించిన ప్రాథమిక ఆలోచనలు
1830 దశకం చివరలో డార్విన్ ఆ పుస్తకాలు రాశారు. ఆ సమయంలోనే ఆయన గాలాపాగోస్ ద్వీపం నుంచి తిరిగివచ్చారు. ఈ ద్వీపం ఈక్వెడార్ తీరానికి దాదాపు 1000 కి.మీ దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్ర అగ్నిపర్వత సమూహానికి చెందినది.
నోట్‌బుక్‌లోని ఒక పేజీలో డార్విన్ ఒక వృక్షానికి సంబంధించిన పటాన్ని గీశారు. పరిణామ క్రమ సిద్ధాంతాన్ని రూపొందించడంలో ఈ పటం ఆయనకు సహాయపడింది. 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం తర్వాత ఆయన అద్భుత ఆవిష్కరణ అయిన 'ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్'కు ఇదే ప్రధాన సిద్ధాంతంగా మారింది.
''భూమిపై జీవం, పర్యావరణ శాస్త్రాలకు సంబంధించి 'థియరీ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ అండ్ ఎవల్యూషన్' అనేవి బహుశా చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు. ఈ నోట్‌బుక్‌లలోనే ఆ సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. సైన్స్ చరిత్రలోనే ఇవి చాలా కీలకమైన గొప్ప పత్రాలు'' అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని హిస్టరీ, ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ జిమ్ సెకోర్డ్ వివరించారు.

ఫొటో సోర్స్, CAMBRIDGE UNIVERSITY LIBRARY
22 ఏళ్ల క్రితం మాయం
2000 సంవత్సరం నవంబర్‌లో చివరిసారిగా ఈ నోట్‌బుక్‌లను చూశారు. ఫొటో తీయడం కోసం లైబ్రరీలోని వాటి స్థానం నుంచి బయటకు తీశారు. అప్పుడు వాటిని చూశారు.
రెండు నెలల తర్వాత సాధారణ తనిఖీల సందర్భంగా లైబ్రరీలో ఆ నోట్‌బుక్‌లు ఎక్కడా కనిపించడం లేదని సిబ్బంది కనుగొన్నారు.
అయితే, వాటిని లైబ్రరీలోనే మరెక్కడో పెట్టి ఉంటారని తొలుత భావించారు. మొత్తంగా 200 కి.మీ పొడవుండే లైబ్రరీ అరల్లో 10 మిలియన్లకు పైగా పుస్తకాలు, మ్యాపులు, గ్రంథాలు ఉంటాయి. ఇంతపెద్ద గ్రంథాలయంలో వాటి చోటు మారిపోవడం సాధ్యమే అని వారు నమ్మారు.
కానీ సంవత్సరాల పాటు వెతికినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో లైబ్రేరియన్ గార్డ్‌నర్ అవి దొంగతనానికి గురయ్యాయని నిర్ధారణకు వచ్చారు.
2020లో పోలీసులను సంప్రదించి, ఇంటర్‌పోల్‌కు ఈ సమాచారం ఇచ్చారు.
అయితే, రెండేళ్ల తర్వాత ఆ పుస్తకాలు ఆశ్చర్యకరరీతిలో మళ్లీ కనిపించాయి.

ఫొటో సోర్స్, CAMBRIDGE UNIVERSITY LIBRARY
ఎవరు? ఎందుకు? ఎలా?
ఆ నోట్‌బుక్‌లను పరిశీలించిన, అవి ప్రామాణికమైనవే అని నిర్ధారించిన అనేక మంది పండితులు, నిపుణుల్లో సెకార్డ్ కూడా ఒకరు.
''డార్విన్ పుస్తకాలు రాసేటప్పుడు అనేక రకాల ఇంకులు వాడతారు. ఉదాహరణకు, జీవన వృక్షం గీసిన పేజీలో బ్రౌన్, గ్రే ఇంకులు ఉన్నాయి. అలాంటప్పుడు, ఇన్ని రకాల మార్పులు చేసి నకిలీవి తయారు చేయడం చాలా కష్టం'' అని ఆయన బీబీసీకి వివరించారు.
అందులోని పేజీల సంఖ్య కూడా సరిగ్గా సరిపోయిందని గార్డ్‌నర్ చెప్పారు.
ఇంతకాలం అవి ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎవరు తీసుకెళ్లారు? ఎందుకోసం తీసుకెళ్లారు? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు.

ఫొటో సోర్స్, CAMBRIDGE UNIVERSITY LIBRARY
సెక్యూరిటీ కెమెరాల ద్వారా మనకు క్లూ లభించి ఉండొచ్చు. కానీ పుస్తకాలు లభించిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు లేవు. మరిన్ని వివరాలు సేకరించడం కోసం పోలీసులు ఇప్పుడు చుట్టుపక్కల భవనాల్లోని సీసీటీవీ ఫుటేజీని తప్పకుండా పరిశీలించాలి.
''మా దర్యాప్తు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. మేం కొన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం. ఈ కేసులో ఏదైనా సమాచారం తెలిసిన వారు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా అందరినీ కోరతాం'' అని పోలీసులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అల్ ఖైదా చీఫ్ అల్-జవహిరి: 'అల్లా-హు అక్బర్' అని నినదించిన కర్ణాటక ముస్లిం యువతిపై ప్రశంసలు
- వైఎస్ జగన్ కూడా ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారా? ఏపీలో క్యాబినెట్ మంత్రులందరి రాజీనామాలు తప్పవా?
- రాహుల్ గాంధీకి తన ఆస్తి మొత్తం రాసిచ్చేసిన 79 ఏళ్ల పుష్ప ముంజియాల్ ఎవరు?
- పాకిస్తాన్లో దేశద్రోహం అంటే ఏంటి, ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహి అని నిరూపణ అయితే ఏం శిక్ష విధిస్తారు?
- డ్రగ్స్ కేసుల్లో ఇప్పటివరకు ఎవరినైనా శిక్షించారా, ఈ నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












