ADHD: అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ అంటే ఏంటి... ఈ సమస్య ఉన్న పిల్లలను గుర్తించడమెలా?

ఏడీహెచ్‌డీ

ఫొటో సోర్స్, Thinkstock

    • రచయిత, శిరీష పాటిబండ్ల
    • హోదా, బీబీసీ కోసం

ఉగాదికి నా స్నేహితురాలు సుమ తన భర్త, పిల్లలతో కలిసి ఇంటికి వచ్చింది. మేం పన్నెండేళ్ల తర్వాత కలిశాం. అందునా పండక్కి. ఎప్పుడో తనకు కూతురు పుట్టినప్పుడు చూడ్డానికి వెళ్ళాను. ఉద్యోగాలు ఉత్తర-దక్షిణ భారతాలకు విసిరేశాయ్ మమ్మల్ని. మళ్లీ ఇదే కలవడం.

ఈ మధ్యే కొత్త ఇల్లు కట్టుకున్నాం. మొదటి ఉగాది ఇంట్లో... చాన్నాళ్లకు కలవబోతున్న ఇష్టసఖి. ఇహ నా ఆనందానికి, హడావిడికి అంతులేకుండా పోయింది.

ఇద్దరు పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు. చిన్నోడిని ముద్దాడాలని గుమ్మంలోనే చేతులు చాపాను. తప్పించుకుని పక్కనుండి దూరి ఇంట్లోకి పరిగెత్తాడు. "మా వాడంతే, కొత్తా-పాతా ఏమీ ఉండదు" అంటూ ఇంట్లోకి నడిచింది సుమ. గుమ్మం దగ్గర్నుండే పరిశీలనగా చూస్తూ లోపలికొచ్చారు వాళ్ళయనా-కూతురు.

"కొన్ని మంచి నీళ్ళిస్తారా ఆంటీ" అంటూ వైనంగా సోఫాలో కూర్చుంది. సవ్య, దాదాపు సుమ అంత పొడవుంది. పేరుకు తగ్గట్టుగానే ఉందనుకుంటూ వంటగది వైపు నడిచాను.

ఒక్క క్షణం షాక్ తగిలినట్లయింది అక్కడ జరిగేది చూసి. టేబుల్ మీద కూల్ డ్రింక్ బాటిల్‌ను పక్కనే ఉన్న అక్వేరియంలోకి ఒంపుతూ సమీర్! అదే...సుమ కొడుకు. ఏమనాలో అర్థం కాలేదు. మరీ చిన్న పిల్లాడేమీ కాదే.. ఇదేం పని. బాబోయ్ అనుకుంటున్నానా.. .వెనకాలే వచ్చింది సుమ.

"వీడంతేనే, ఒక దగ్గర ఉండడు. సమీర్ కాదు, సుడిగాలి అని పెట్టాల్సింది పేరు. ఒక దగ్గర ఉండడు. చూడు, ఎప్పుడూ ఒక తాజా గాయం ఉంటుంది ఒంటిమీద. బాగా హైపర్ యాక్టివ్" అంది.

"మరెక్కడైనా చూపించావా" విసుగ్గా అన్నాను.

"అదేంటి అలా అనేసావ్?! అమ్మమ్మ తాతయ్యల గారాబం వల్ల కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాడంతే. వాడికే జబ్బు లేదు. నీ డాక్టర్ కళ్లతో చూడకు, ప్లీజ్" చిన్నబుచ్చుకుంది సుమ.

"అయ్యో, మరోలా అనుకోకు" అని టాపిక్ మార్చి హాల్లోకి తీసుకొచ్చాను. నా పిల్లలు ఇద్దరూ సవ్య, సమీర్ కంటే చిన్న వాళ్ళు. అంతా హాల్లో కూర్చుని ఆడుతూ-మాట్లాడుతూ ఉన్నా, రివ్వు రివ్వున ఇంట్లోకి-బయటికీ తిరుగుతున్న సమీర్‌ని ఓ కంట గమనిస్తూనే ఉన్నాను.

రోజువారీ పనులు కూడా నిర్లక్ష్యంగా చేయడం ఈ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణం
ఫొటో క్యాప్షన్, రోజువారీ పనులు కూడా నిర్లక్ష్యంగా చేయడం ఈ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణం (ప్రతీకాత్మక చిత్రం)

తెలుసుకోవాల్సిన విషయం

భోజనాలు, ముచ్చట్లు అయ్యాయి. అలాగే సాయంత్రమూ అయ్యింది. తండ్రులూ-పిల్లలూ బయట ఆడుకుంటుంటే తల్లులిద్దరమూ టీ పెడదామని లోపలికొచ్చాం. తను నొచ్చుకున్నా తన మేలు కోరి చెప్పక తప్పదని నోరు విప్పాను అప్పుడు.

"సుమా... నాకు తెలుసు నీకు వినడానికి ఇబ్బందిగా ఉంటుందని, పండగ పూట ఇలాంటి బాధ పెట్టిందేమిటి అనుకోకు. సావధానంగా విను. డాక్టర్ను కాబట్టే చెబుతున్నా. పొద్దునేదో విసుగ్గా అన్నమాట నిజమే. కానీ, ఒక పూటంతా గమనించి చెప్తున్నా...సమీర్‌కు పిల్లల డాక్టరు, పిల్లల సైకాలజిస్ట్ అవసరం ఉంది. ఒక్కసారి పరీక్షలు చేయిస్తే పోయేదేం లేదు కదా."

వీడియో క్యాప్షన్, మానసిక ఆరోగ్యం: మీకు దిగులుగా ఉంటోందా... గుండె దడ పెరుగుతోందా?

చాలామంది ఈ రోజుల్లో చాలా తేలికగా వాడేస్తున్న పదాలు

  • ఆవిడకు ఓ.సి.డి.
  • వాడు కొంచెం మూడీ
  • ఈ పిల్లాడు ఏడీహెచ్‌డీ లా చేస్తుంటాడు.
  • నాకు డిప్రెషన్ వస్తుంది..ఇలా...

కానీ, అసలు సమస్య వచ్చినప్పుడు మాత్రం గుర్తించలేకపోతారు. ఎవరైనా గుర్తిస్తే ఒప్పుకోలేరు. వైద్యం వైపు మొగ్గు చూపరు. నలుగురికీ తెలియకూడదని జాగ్రత్త పడుతుంటారు.

ఉదాహరణకు, ఒక ఏడీహెచ్‌డీ పిల్లవాడు ఎలా ఉంటాడంటే-

  • ప్రతి చిన్న వస్తువు మర్చిపోవడం, తరచుగా పోగొట్టుకోవడం
  • ఎక్కువ మాట్లాడటం
  • పగటి కలలు కనడం/ఎప్పుడూ ఊహల్లో ఉండడం
  • ఎక్కువగా ఎగురుతూ, దూకుతూ ఉండటం
  • అందువల్ల తరచుగా ప్రమాదాలకు గురవ్వడం, లేదా ఎదుటివారిని ఇబ్బందులపాలు చేయడం
  • రోజువారీ పనులు కూడా నిర్లక్ష్యంగా చేయడం
  • ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్లీ చేయడం
  • ఏదైనా చర్య వల్ల జరిగే పర్యవసానాలు వయసుకు తగ్గంతగా తెలియకపోవడం.

ఇలాంటి లక్షణాలు ఏ పిల్లల్లో తరచూ కనిపిస్తాయో వాళ్ళని మరింత నిశితంగా గమనించాలి. ఒక పద్ధతి ప్రకారం బేరీజు వెయాలి.

"అవును పద్దూ...నువ్వు చెప్పినవన్నీ సమీర్ గురించేలా ఉంది వింటూ ఉంటే, ఇంకా ఎక్కువే చేస్తాడు కూడా. అసలెందుకిలా చేస్తున్నాడు?" అడిగింది ఆందోళనగా సుమ.

ఈ ఏడీహెచ్‌డీ బడి వయసు పిల్లల్లో కనిపించే ప్రవర్తన లోపాల్లో ముఖ్యమైనది, తరచుగా కనిపించేది. ప్రధానంగా... శ్రద్ధ, కుదురు ఉండకపోవడం, ఎక్కువ ఆవేశపూరితంగా ఉండడం, స్వీయ నియంత్రణ లేకపోవడం, ఎదుటివారి ఆసక్తి గమనించకుండా అతిగా మాట్లాడడం, చేతులు-కాళ్లు అతిగా ఆడించటం ఏడీహెచ్‌డీ పిల్లల లక్షణాలు.

ఇలాంటి పిల్లలు పెద్దయ్యే కొద్దీ మొండిగా తయారవ్వడం, పరీక్షల్లో తక్కువ మార్కులు, ఇతర వ్యాపకాల్లో కూడా ఇష్టం చూపకపోవడం, స్నేహితులతో తరచూ గొడవ పడటం లాంటివి చేస్తుంటారు.

పెద్దవాళ్లయ్యాక సైతం ఒక దగ్గర ఒక ఉద్యోగం చేయలేరు. చుట్టూ ఉన్న వారితో సత్సంబంధాలు కలిగి ఉండరు. ఎప్పుడూ ఆత్మన్యూనతా భావంతో ఉంటారు. మగ పిల్లలైతే సంఘ వ్యతిరేక చర్యలు చేయడం, లేకపోతే తాగుడు లాంటి దురలవాట్ల పాలవడం కూడా జరుగుతుంది.

ఈ సమస్య ఉన్న పిల్లలు కొందరు అతి చురుకుగా కనిపిస్తారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ సమస్య ఉన్న పిల్లలు కొందరు అతి చురుకుగా కనిపిస్తారు (ప్రతీకాత్మక చిత్రం)

కారణాలేంటి?

కొంతమంది పిల్లల్లో ఏడీహెచ్‌డీ రావడానికి జన్యు సంబంధమైన కారణాలుంటాయి. కొందరిలో మెదడు ఆకృతిలోనే తేడాలుంటాయి. ఇది కూడా ఒకరకంగా జన్యు నిర్దేశితమైనదే. తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం, ధూమపానం లాంటివి చేయడం, అధిక రక్తపోటు, కాన్పు కష్టమవడం కూడా పిల్లల్లో ఏడీహెచ్‌డీ రావడానికి కొన్ని కారణాలు.

అలాగే పుట్టగానే ఏడవని పిల్లలు, మరేదైనా కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న పిల్లలు కూడా ఇలా అవ్వొచ్చు. అరుదుగా ఏ కారణమూ లేకుండా కూడా ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు.

"అయ్యో, నా కొడుక్కే ఎందుకిలా జరగాలి?!" దుఃఖపడి పోయింది సుమ.

"సమీర్ ఒక్కడే అలా లేడు సుమా... ప్రాంతాన్ని బట్టి అక్కడి అభివృద్ధిని బట్టి కాస్త అటూ ఇటూగా 10% మంది బడి పిల్లల్లో ఏడీహెచ్‌డీ ఉంటుంది. అలాగే తీవ్రతలో కూడా చాలా రకాలు ఉండొచ్చు. కొందరిలో ఒత్తిడి, ఆందోళన, ఫిట్స్ జబ్బు లాంటివి వాటితో కలిసి ఉండవచ్చు కూడా. కాబట్టి ప్రతి పదిమంది పిల్లల్లో ఒకరికి ఈ సమస్య ఉంది.

ఆడపిల్లలూ - మగపిల్లలూ అని తేడా కూడా ఏమీ లేదు. కాకపోతే కాస్త విపరీత ప్రవర్తన, దురుసుతనం వల్ల మగపిల్లల్లో ఎక్కువ శాతం సులభంగా గుర్తు పట్టవచ్చు.

సైకాలజిస్టులు ఏడీహెచ్‌డీ ని మూడు రకాలుగా విభజిస్తారు.

1. ఎక్కువ చంచలత - ఎక్కువ శాతం అమ్మాయిల్లో

2. హైపర్ యాక్టివ్-ఇంపల్సివ్ రకం: అబ్బాయిల్లో ఎక్కువ.

3. కంబైన్డ్ రకం: అబ్బాయిల్లోనే.

ఏడీహెచ్ డీ సమస్య ఉన్న పిల్లలు హైపర్ యాక్టివిజం వల్ల తరచూ గాయాల పాలవుతుంటారు

ఫొటో సోర్స్, GETTY/VEJAA

ఫొటో క్యాప్షన్, ఏడీహెచ్ డీ సమస్య ఉన్న పిల్లలు హైపర్ యాక్టివిజం వల్ల తరచూ గాయాల పాలవుతుంటారు (ప్రతీకాత్మక చిత్రం)

ఏం చేయాలి?

పన్నెండేళ్లలోపు పిల్లలు, ఆరు నెలలకన్నా ఎక్కువ కాలంగా ఇలాంటి లక్షణాలతో ఉండి, ఇంట్లోవారే కాక బయటివారు కూడా సమస్యను గుర్తించి చర్చిస్తున్నట్లయితే అది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయమే.

"ముందు నువ్వు సమీర్ ను అనుభవజ్ఞులైన సైకాలజిస్టుకు చూపించు. వాళ్లు, పిల్లాడి సమస్య ఏ కోవకు చెందినది-ఎంత తీవ్రమైనది, ఇతర సమస్యలు కూడా ఏమైనా ఉన్నాయా?, అని చెప్పగలరు.

తర్వాత కారణమేంటో అన్వేషిద్దాం. జన్యు సంబంధిత కారణాలైతే మందులు బాగా పని చేస్తాయి కూడా. కాని పక్షంలో కొంత మందులు, కొంత బిహేవియర్ థెరపీలు, కొంత సైకో సోషల్ థెరపీలు ఉపయోగపడతాయి. తెలియక ఇప్పటివరకూ ఆలస్యం చేశావు. వాడికి పదేళ్లొచ్చేశాయి. ఇంకా తాత్సారం చేస్తూ పోతే సమీర్ ప్రవర్తన మరింత జటిలమవుతుంది.

వీడియో క్యాప్షన్, "మా బాబుకు ఆటిజం ఉందని చెప్పడానికి డాక్టర్లే భయపడ్డారు"

అవగాహనాలేమి

మన దేశంలో ఇప్పటికీ మానసిక రుగ్మతల పట్ల, పిల్లల ప్రవర్తన లోపాల పట్ల కనీస అవగాహన లేదు. పైపెచ్చు చాలా చిన్న చూపు. అందువల్ల మనం ఒప్పుకోవడానికి భయపడతాం. ఈ భయం మనల్ని గుమ్మం దాటనీయదు, పరిష్కారం వెతకనీయదు. అందువల్ల నష్టపోయేది చివరకు మనం-మన పిల్లలే" అని ముగించాను.

స్నాక్స్-టీ అయ్యాక బయల్దేరడానికి సిద్ధమయ్యారు..టాటా కూడా చెప్పకుండా పరుగెత్తి కారెక్కిన సమీర్ వైపు నావైపు మార్చి మార్చి చూస్తుందిగానీ దుఃఖం దాగడంలేదు సుమ ముఖంలో.

గట్టిగా కౌగిలించుకుని, వెన్నుతట్టి చెప్పాను తన చెవిలో…. ఈ ఉగాదిలాంటిదే జీవితం, కష్టసుఖాల కలగూర… చేదు ఉంటేనే తీపి విలువ తెలిసేది."

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)