ఎక్సర్‌సైజ్ స్నాక్స్: జిమ్‌కి వెళ్లడం ఇష్టం లేదా? అయితే, నిపుణులు చెబుతున్న ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

ఎక్సర్‌సైజ్ స్నాక్స్, ఎక్సర్‌సైజ్, ఆరోగ్యం, హెల్త్ టిప్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లూసీ హూకర్
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఫిట్‌గా ఉండడమెలా అని అడిగితే... జిమ్‌లో చేరండి, కొండలెక్కి దిగండి.. లేదంటే పరుగెత్తండి వంటి మాటలు వినే ఉంటారు. ఫిట్‌గా ఉండాలంటే మనం ఎంతో శ్రమించాలని, ఒళ్లంతా చెమటలు పట్టేలా వ్యాయామాలు చేయాలని ఎవరో ఒకరు మనకు నిరంతరం చెబుతూనే ఉంటారు.

కానీ, మీ బిజీ లైఫ్ వల్ల దానికి తగిన సమయం లేకపోతే.. లేదా అటువైపు ఆసక్తి లేకపోతే ఏం చేయాలి?

దీనికి జో బ్లాడ్జెట్ దగ్గర ఒక సమాధానం ఉంది. అదే 'ఎక్సర్‌సైజ్ స్నాక్స్'.

వీటిని మీరు పెద్దగా శ్రమ పడకుండానే, మీ దినచర్యలో భాగంగా మార్చుకోవచ్చు.

యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్, ఎక్సర్‌సైజ్ అండ్ హెల్త్'లో సీనియర్ రీసర్చ్ ఫెలో అయిన బ్లాడ్జెట్.. చిన్నచిన్న కదలికలు ఆరోగ్యంపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతాయనే అంశంపై పరిశోధనలు చేశారు.

''తీవ్రమైన వ్యాయామం చేయడం, అంటే ఆయాసం వచ్చేలా శ్రమించడం, గుండె వేగాన్ని పెంచడం, చాలా మంచిదే. కానీ, అది మీ ఆరోగ్య ప్రయాణంలో ఒక భాగం మాత్రమే'' అని ఆమె బీబీసీ రేడియో 4 పాడ్‌కాస్ట్ 'వాట్స్ అప్ డాక్స్?' కార్యక్రమంలో అన్నారు.

ఎక్సర్‌సైజ్‌కు ప్రత్యేకమైన దుస్తులు లేదా జిమ్ మెంబర్‌షిప్ అవసరం లేకుండానే మీరు ఎలా ఫిట్‌గా ఉండవచ్చో ఆమె ఇక్కడ వివరిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎక్సర్‌సైజ్, ఆరోగ్యం, హెల్త్ టిప్స్

ఫొటో సోర్స్, Getty Images

1.రోజువారీ పనుల్లోనే చిన్నపాటి వ్యాయామాలు..

మీ రోజువారీ పనుల్లోనే ఈ "ఎక్సర్‌సైజ్ స్నాక్స్"ని జోడించడానికి చాలా మార్గాలు ఉన్నాయని బ్లాడ్జెట్ చెబుతున్నారు.

శాస్త్రీయ పరిభాషలో ఆమె దీనిని "విగరస్ ఇంటర్మిటెంట్ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ" (వీఐఎల్‌పీఏ-విల్పా) అని పిలుస్తున్నారు. అంటే, మనం రోజూ చేసే పనుల్లోనే కాస్త ఎక్కువ శ్రమను లేదా వేగాన్ని జోడించడం.

"మీ దైనందిన జీవితంలోనే మిమ్మల్ని మీరు కాస్త ఎక్కువగా కష్టపెట్టేలా చేసే అవకాశాలను వెతుక్కోవడమే దీని ఉద్దేశం" అని ఆమె అంటారు.

ఆమె సూచించిన కొన్ని చిట్కాలు...

లిఫ్ట్‌తో పాటు కొన్ని మెట్లు ఎక్కడం: ఉదాహరణకు మీరు 12వ అంతస్తుకు వెళ్లాల్సి ఉంటే, అంతదూరం మెట్లు ఎక్కడం కష్టం కావొచ్చు. కాబట్టి రెండు అంతస్తులు మెట్లు ఎక్కి, ఆ తర్వాత లిఫ్ట్ ఎక్కండి.

బస్సు కాస్త ముందుగానే దిగడం: ఆఫీసుకి సైకిల్ మీద వెళ్లడం మంచిదే. కానీ, మీరు బస్సులో వెళ్లాల్సి వస్తే ఒక స్టాప్ ముందే దిగి, మిగిలిన దూరాన్ని వీలైనంత వేగంగా నడవండి. దీనికోసం ప్రత్యేకమైన జిమ్ దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదు.

నడక వేగాన్ని పెంచడం: మీరు ఇప్పటికే వాకింగ్‌కి వెళ్తుంటే, ఒక రెండు వీధిదీపాల స్తంభాల మధ్య దూరాన్ని వేగంగా నడవడానికి ప్రయత్నించండి.

ఒకవేళ మీరు ప్రస్తుతం పెద్దగా వ్యాయామం చేయకపోయినా, రోజుకు కేవలం మూడు లేదా నాలుగుసార్లు, ఒక్కో నిమిషం చొప్పున వేగంగా కదిలితే చాలు. ఇది గుండె జబ్బుల ముప్పును తగ్గించడమే కాకుండా ఆయుష్షుపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

ఎక్సర్‌సైజ్, ఆరోగ్యం, హెల్త్ టిప్స్

ఫొటో సోర్స్, Getty Images

2.కేవలం జిమ్ సెషన్లపైనే ఆధారపడకండి..

మీరు ఇప్పటికే క్రమంగా జిమ్‌కి వెళ్తున్నా లేదా వారానికి ఒకసారి ఫుట్‌బాల్ ఆడుతున్నా.. ఇక చాలు అనే గర్వాన్ని పక్కన పెట్టేయండి. మనలో చాలా మందిని 'యాక్టివ్ కౌచ్ పొటాటోస్' అని బ్లాడ్జెట్ పిలుస్తుంటారు.

కచ్చితంగా ఆ వ్యాయామాలు మంచివే అంటున్నారామె. కానీ, రోజంతా ఆఫీసులో స్క్రీన్ ముందు కూర్చుని పనిచేయడం లేదా సాయంత్రం సోఫాలో వాలిపోవడాన్ని అవి భర్తీ చేయలేవు.

"జిమ్‌లో గడిపే ఆ ముప్పై నిమిషాలు మీ రోజులో చాలా తక్కువ భాగం మాత్రమే. మరి మిగిలిన ఇరవై మూడున్నర గంటల సంగతి ఏమిటి?" అని అడుగుతున్నారు బ్లాడ్జెట్.

ఒకవేళ మీరు కూడా రోజంతా ఒకచోట కూర్చొనేవారైతే, ఆమె ఇచ్చే సలహాలివే:

నిలబడటం: మీ డెస్క్ దగ్గర కూర్చొని పనిచేసేటప్పుడు మధ్యమధ్యలో లేచి నిలబడటం తరచుగా చేస్తుండండి.

నడకకు వెళ్లడం: లంచ్ బ్రేక్‌లో సగం సమయం ఫోన్ చూడటానికే కాకుండా, కాస్త అటూ ఇటూ నడవడానికి కేటాయించండి.

నడుస్తూ మీటింగ్స్: ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు లేదా సహోద్యోగులతో చర్చించేటప్పుడు ఒకేచోట కూర్చోకుండా 'వాక్ అండ్ టాక్' పద్ధతి పాటించండి.

ఎక్కువసేపు కూర్చోకపోవడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి.

''ప్రతి 15 లేదా 30 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడి, శరీరాన్ని కాస్త అటు ఇటు కదిలించి, మళ్లీ కూర్చోగలరా?" అని బ్లాడ్జెట్ అడుగుతున్నారు.

అయితే, దీనర్థం జిమ్‌కు వెళ్లడం మానేయాలని కాదు.

ఆరోగ్యం విషయంలో ఒక క్రమపద్ధతి ఉంటుంది. గుండె వేగాన్ని పెంచే తీవ్రమైన వ్యాయామాలు అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయని, ఆ తర్వాత సాధారణ నడక వంటివి ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయని ఆమె వివరిస్తున్నారు.

ఎక్సర్‌సైజ్, ఆరోగ్యం, హెల్త్ టిప్స్

ఫొటో సోర్స్, Getty Images

3.మీరు నిశ్చలంగా ఉండే సమయాన్ని తగ్గించుకోండి..

సాధారణ ఆరోగ్య సూత్రాలు మనం ఎంత ఎక్కువ వ్యాయామం చేయాలి అనే అంశంపైనే దృష్టి పెడతాయి. కానీ, బ్లాడ్జెట్ దీనికి భిన్నంగా ఆలోచించాలని చెబుతున్నారు. అంటే, మనం కదలకుండా ఉండే సమయాన్ని ఎంతవరకు తగ్గించగలం అనే కోణంలో చూడమంటున్నారు.

కెనడా, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

మీరు రోజుకు 8 గంటలు నిద్రపోతారని అనుకుంటే, మీరు మేల్కొని ఉండే మిగతా 16 గంటల సమయంలో కనీసం సగం భాగం, అంటే మరో 8 గంటలు ఏదో ఒక కదలికలో ఉండాలి.

బ్లోడ్జెట్ మరికొన్ని సూచనలు ఇస్తున్నారు:

కదులుతూనే ఉండండి: రోజులో కదలకుండా కూర్చునే సమయం 8 గంటల కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. ఆ సమయాన్ని ఎంత తగ్గిస్తే మీ ఆరోగ్యానికి అంత మంచిది.

పిల్లలను స్వేచ్ఛగా వదలండి: ఆస్ట్రేలియాలోని నిపుణుల సలహా ప్రకారం, ప్రీ-స్కూల్ పిల్లలను గంట కంటే ఎక్కువ సేపు కట్టడి చేయవద్దు. అంటే, పుష్‌చైర్ లేదా కార్ సీటులో కదలకుండా ఉంచకూడదు. వర్షాకాలంలో బయటకు వెళ్లడం కుదరకపోతే, ఇంట్లోనే బెలూన్లతో ఆడుకోనివ్వండి.

ఇంటి పనులను ఇష్టంగా చేయండి: కిరాణా సామగ్రి మోయడం, గార్డెన్‌లో గడ్డి కత్తిరించడం, ఇల్లు సర్దడం వంటివి కూడా శరీరానికి మంచి కదలికను ఇస్తాయి. మీ శారీరక బలాన్ని, సమతుల్యతను పెంచుతాయి.

ఎంత వ్యాయామం చేస్తే సరిపోతుంది అనడానికి ఒక నిర్దిష్టమైన నియమమేదీ లేదంటున్నారు బ్లాడ్జెట్.

మీరు ఎంత ఎక్కువ కదిలితే, అంత ఆరోగ్యం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)